
గూడూరు సీతారాం కథా, సాహిత్యం..స్మరణీయం
నవంబర్ 7, 2020 న తెలంగాణ జాగృతి నిర్వహించిన జూమ్ సభలో ప్రముఖ సాహితీవేత్త నిజాం వెంకటేశం మాట్లాడారు. పి.వి నరసింహ రావు సంస్మరణ సంవత్సరంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నది మీకు తెలిసిందే. నిజాం వెంకటేశం తన సుదీర్ఘ ప్రసంగంలో గూడూరు సీతారాం ప్రతిభను సోదాహరణంగా వివరించారు. నాటి కరీంనగర్ జిల్లాకు చెందిన గూడూరు ఒక తరానికి ప్రతినిధి అని ఆయన అన్నారు. కార్యక్రమానికి తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం అధ్యక్షులు కాంచనపల్లి గో.రా.సంచాలకులుగా వ్యవహరించారు. తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీనాచారి సమన్వయం చేశారు.

కాళోజీ ఫౌండేషన్, వరంగల్ ఆధ్వర్యంలో కాళోజీ వర్ధంతి సందర్భంగా హన్మకొండలోని కాళోజీ విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టినవంటి కాళోజీ రామేశ్వరరావు షాద్ పురస్కారాన్ని కాళోజీ సోదరులకు అత్యంత సన్నిహితులైనటువంటి జనాబ్ తాజ్ ముష్తర్ గారికి కాళోజీ విగ్రహం దగ్గర అందజేశారు. అనంతరం సాయంత్రం జూమ్ అంతర్జాల వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఇస్తున్న టువంటి కాళోజీ స్మారక పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య గారికి అందజేశారు. కవులు సిరాజుద్దీన్, దర్భశయనం శ్రీనివాసాచార్య, జనాబ్ ముష్తర్, వఝలశివకుమార్, కోడూరి విజయ్ కుమార్, వారాల ఆనంద్, సంగినేని రవీంద్ర, రాఘవులు, బాల బోయిన రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

గీత రచనపై గీతకారుడి పాఠాలు
తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘గీత రచనపై గీతకారుడి పాఠాలు’ అనే శీర్షిక తో ప్రముఖ గీతాకారులు, జాతీయ పురస్కార గ్రహీతలు డా. సుద్దాల అశోక్ తేజ ప్రసంగించారు. ముఖ్య అతిథి గా జాతీయ అరసం నేత, రాష్ట్ర అరసం మాజీ ప్రధాన కార్యదర్శి వేల్పుల నారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం అరసం ప్రధాన కార్యదర్శి డా.రాపోలు సుదర్శన్ అధ్యక్షత వహించారు.
అశోక్ తేజ తమ ప్రసంగం లో పాట అంటే లయాత్మక, అర్థవంతమైన వాక్యం అని, పాట యొక్క పల్లవి గెరిల్లాలా ముట్టడించాలి, పాట మొదటి వాక్యమే గుండె మీద జాడించి కొట్టాలి, అక్షరాలతో లక్ష అణుబాంబు లను పేల్చవచ్చు. తేటదనం, సూటిదనం పాటకు రెండు కాళ్ళలాంటివి, పాట రాసేవాళ్ళు మేథావిలా చదవాలి, సామాన్యుడిలా రాయాలి అంటూ మొదలైనవి పాట రాయాలనుకునే ఔత్సాహికులకు తెలిపారు.
ఇంకా కార్యక్రమం లో తెలంగాణ అరసం కార్యనిర్వాహక కార్యదర్శి డా. పల్లేరు వీరాస్వామి, కార్యదర్శి కెవిఆర్, ఉపాధ్యక్షులు నిధి & కమల మొదలైన వారు పాల్గొన్నారు.