డాక్టర్. కాంచనపల్లి గోరా

భండారు అచ్చమాంబ 1870-1905 మధ్య కాలం లో జీవించిన రచయిత్రి .ఈమె తొలి తెలుగు కథారచయిత్రి గా విమర్శకులచే ఆమోదించబడింది . రచనా కాలం నాటి సామాజిక పరిస్థితుల ను ఒకరకం గా చీకటి రోజులు గా పెర్కోవచ్చు .

క్రీ.శ .1724 నుండి తెలంగాణ లో అసఫ్ జాహీల పాలన మొదలయింది .రాజ భాష గా పర్షియన్ స్థానం లో ఉర్దూ ప్రవేశించింది .స్థానిక ప్రజలను అణగద్రొక్కి డిల్లీ నుండి ఉద్యోగులను రప్పించడం తో ముల్కి ఉద్యమం తల ఎత్తింది .

రాజకీయ పరిస్థితులు ఇట్లా కొనసాగుతుంటే ఇక స్థానిక భాషా సాహిత్యాల సంగతి ఎట్లా ఉంటుంది ? పాలకుల్లో సాహిత్యస్పృహ అప్పుడప్పుడున్నా అది సమాంతర సాహిత్య ప్రతి ఫలనమైతే కాదు .

ఒకవంక సాంప్రదాయక పితృస్వామ్య వ్యవస్థ స్త్రీల నోరు మూ యించింది. స్త్రీలు చెప్పులు తొడుక్కోవడం కూడా తప్పని చెప్పిన కాలం అది .ఇట్లాంటి ఎన్నో అంక్షలు స్త్రీల మీద ఉన్నాయి .స్త్రీలను దళితులను విద్యకు దూరంగా ఉంచిన సమాజం అది .

ఈ నేపధ్యం నుండి ఒక స్త్రీ రచయిత్రి గా ముందుకు రావడం సమాజాన్ని ప్రభావితం చేసే రచనలు చేయడం ఆశర్యపోవలసిన విషయం .

కథలన్నీ దాదాపుగా పితృస్వామిక భావ పరిదినుండే కొనసాగుతాయి. కాగా ఇప్పటి సాహిత్య సామాజిక పరిణామాలను బట్టి చూస్తే మనకు అట్లా అనిపిస్తుంది కాని ,ఆ నాటికి అదెంతో ముందడుగు . వ్యక్తులను తీర్చిదిద్దడం ,జీవితం ప్రశాంతం గా కొనసాగాలంటే ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవడం లో ఉన్న ఆవశ్యకత దాదాపుగా ప్రతి కథలోనూ కనిపిస్తుంది .

‘గుణవతి యగు స్త్రీ’ అనే కథ లో ఒక యువకుడు తనకు కాబోయే భార్య గుణవతి గా ఉండాలని కోరుకుంటాడు . అందుకు కన్యలను మారు వేషం లో పరీక్ష చేస్తాడు .ఒక స్త్రీ ఆ పరీక్ష లో నెగ్గుతుంది .ఆమెను పెళ్లి చేసుకున్న తరువాత ఇంట్లో వేశ్య ను ఉంచి ఆమె సహనాన్ని పరీక్షిస్తాడు .ఆమె అక్కడా నెగ్గుతుంది .ఆమె గుణవతి అని అంగీకరించి భార్య గా ఆదరిస్తాడు .ఇట్లగా స్త్రీలను శంకించడం ,వేశ్యా లంపటత్త్వం ,మనకు సామాజిక లక్షణాలు గా కనిపిస్తాయి .

‘జానికమ్మ’ అనే కథలో కూడా ఇట్లాంటి స్త్రీ ఉదార గుణాన్నే చిత్రించింది. ఉత్తమురాలైన కన్య కు వివాహం చాలా సులభం గా అవుతుందని చెబుతుంది ఈ కథ . ఇది కథ అనడం కంటే ఒక జీవితం గురించిన వివరణ అనాలె.ఆనా టి కథా స్వరూపానికి, శిల్పానికి ఈ సంవిధానం ఓ మచ్చు తునక .

‘సత్పాత్ర దానము’ అనే కథ లో ఒక తల్లి తన కొడుకు కు అర్హులకే దానం చేయాలని సోదాహరణం గా చెబుతుంది .ఒక గుడ్డిమనిషి కి భోజనం పెడుతుంది కాని పావలా ఇవ్వదు. ఆ గుడ్డతని కొడుకు ఈ పావలా వల్ల సోమరి గా మారుతాడని ఆమెకు అర్థమవుతుంది .ఆ విషయం కొడుకుకు అర్థం చేయించి ఆ పావలా మరొక విద్యనభ్య సించె వ్యక్తికివ్వాలని చెబుతుంది .

సాధారణం గా స్త్రీ ప్రలోభి అని చాలా కథల్లో చిత్రిస్తుంటారు .ఆమె వల్ల నే ఆమె విపరీతమైన కోర్కె ల వల్ల నే భర్త లంచ గొండి గా మారాడని చాలా సందర్భాల్లో చదువుతాం . కాని అచ్చమాంబ ‘ధన త్రయోదశి’ కథ ఇందుకు భిన్నం . తన దరిద్రం తో లంచం వైపు మొగ్గే భర్త విజయలక్ష్మి అనే భార్య సత్ప్రవర్తన వల్ల తప్పు చేసే అవకాశం తిరస్కరిస్తాడు .యజమాని పెట్టె పరీక్షలో నెగ్గుతాడు .స్త్రీలు కుట్రదారులుగా హంతకులు గా చూపిస్తున్న ఈ నాటి టి .వి . సీరియల్ రచయితలకు అచ్చమాంబ ఇలాంటి కథలను చూపించాలి.

‘’భార్యా భర్తల సంవాదము’’ అనే మరో కథ లో సాధారణ స్త్రీ వలెనె నగల గూర్చి ప్రలోభపడే ఓ భార్య కు మంచి గుణాలే నిజమైన అలంకారాలని చెబుతాడు భర్త . అచ్చమాంబ మాటల్లోనే చూడండి,’’సద్గుణాలంకారములున్నచో యావజ్జన్మము సౌందర్యవంతము గావించుట యే గాక నీ మరణానంతరమందును దమ కాంతి వలన అనేక యుగముల వరకు నీ కీర్తిని జనులకెరింగింపగలవు. పరమ పతివ్రత యగు సీతాదేవి ఈ లోకమును విడిచి అనంత కాలమైనను ఆమె కీర్తి లోకమునందింకా ప్రసిద్దమే .సావిత్రీ దేవియు పరలోకమునకేగి బహుకాలమైనను ప్రజలామే కీర్తిని వేనోలుల గోనియాడుచునే ఉన్నారు . ఇందులకు కారణములు నే చెప్పిన సుగుణ భూషణములే ‘’.

‘’అద్దమును సత్యవతి యును’’ అనే కథ నవ్వు తెప్పిస్తుంది .సత్యవతి అనే పసిబాల అద్దం లో తన ప్రతిబింబాన్ని చూసి మరొక అమ్మాయి అని భ్రమించి చేసే అల్లరి తరువాత అది ప్రతిబింబమని అమ్మమ్మ వల్ల అర్థం చేసుకోవడం చదువరి కి నవ్వు తెప్పిస్తుంది .చివరికి ఈ చిన్ని కథ ఎంత తాత్వికం గా ముగుస్తుందో ఆచ్చమాంబ మాటల్లోనే చూడండి.’’ఈ జగమంతయు నొక యద్దమనియు ,మనము దాని వైపున కోపము గా చూచిన బ్రతిబింబము కోపముగా ,సంతోషముగా దాని గనిన సంతోషము గా కనిపించును ‘’.

‘’బీదకుటుంబం’’ అనే కథ లో స్త్రీ ఔన్నత్యమే చూపించారు.ఒక బీదరాలి సత్ప్రవర్తన వలన ఆమె ఆరుగురు సంతానం ఎట్లా బాగుపడ్డారో తెలిపిన కథ .రచయిత్రే ఇది నిజంగా జరిగిన కథ అని ఇంట్రో లో చెప్పారు . రచయిత్రి శ్యామలాంబ అనే స్నేహితురాలి వలన విని ఈ కథ రాసింది .ఇది ఆధునికులు చెప్పే అనుభవ వాదానికి చాలా దగ్గరగా ఉంది .

బాలల కథలో కూడా పెద్దవాళ్ళకు కావలసిన ప్రబోధం ఉంది .ఆ కాలం లో పిల్లల ఆటలు ఎట్లా ఉన్నాయో ఈ కథ తెలుపుతుంది .చిన్న పిల్లలలో అల్లరి లక్షణాలుంటే అందరూ చీత్కరించుకుంటారు. అట్లాంటి అల్లరి పిల్ల మంచిది గా మారడం పెద్దయాక కూడా బాల్య స్నేహితురాలి తో స్నేహం కొనసాగించడం ఇందులో కథాంశం .

‘’దంపతుల ప్రధమ కలహం’ అనే కథ ఇప్పటికీ ప్రాసంగికమే .అనురాగం తో ఉండవలసిన భార్యాభర్తలు అహం కారంతో ,తనమాట నెగ్గాలన్న భేషజం తో ఉంటె జరిగే దుష్ పరిణామమే ఈ కథ .ఇటువంటి భేషజం తోనే భర్త విడిపోయిన ఒక పెద్దావిడ తన కథ చెప్పడం తో లలిత అనే అహంకారపు భార్యకు ఙ్ఞానోదయం అవుతుంది .

భార్యలు విద్యావంతులైతే సహింపని భర్తలున్న సమాజం లో భార్య విద్యావంతురాలు కావాలని తపించే భర్త కథ స్త్రీ విద్య.భార్య విద్యావంతురాలయితే భర్త కు అల్పాయుషు అనే మూడ నమ్మకం లో ఉంటుంది .వాళ్ళ నాయనమ్మ చెప్పడం వల్ల ఆమె కు ఆ నమ్మకం కలుగుతుంది .భర్త తన శాస్త్రీయ వాదన తో ఆమె భ్రమలు పారద్రోలి ఆమెకు విద్య పైన ఆసక్తి కలిగిస్తాడు .

కథా కథనం తో రచయిత్రి పూర్తి గా గ్రాంధిక భాష వాడుతారు .అది చంపూ కావ్యం నుండి విడివడిన వచనమే అయినా సంస్కృత సమాసాలు గాని సుదీర్ఘ వచనాలు కాని మచ్చుకైనా కనిపించవు .అనేక సార్లు ఆనాటి సమాజం పూసలలో దారం లాగా కనబడుతుంది.రచయిత్రి తాను కథనం లో ప్రవేశించి మాట్లాడడం అ నాటి పద్ధతి . ఒక్కోసారి చదువరులారా అని సంబోధించి రచయిత్రే చెబుతుంటుంది .

ఒక కథలో తవ్వెడు వడ్లు అనే పదం వాడుతుంది .తవ్వెడు అనేది ధాన్యం కొలమానం .ఒక ముప్పది ఏండ్ల క్రితం వరకు సుమారుగా ఈ పదం తెలంగాణాలో వాడుకలో ఉంది . సోడు, తవ్వెడు, మానెడు, అడ్డెడు, కుంచెడు, లాంటి పదాలన్నే ధాన్యానికి కొలమానాలు గా వాడుతుండేవారు. కథలలో కొన్ని పాత్రలు వంద రూపాయల జీతం పొందే ఉద్యోగం చేస్తారు . అది ఆ కాలం లో చాలా పెద్ద ఉద్యోగం అన్నమాట .ఇంకా మరింత పాత కాలం నాయనమ్మల ప్రభావం యువతుల మీద ఎక్కువ గా ఉంటుంది . భర్తలు భార్యలకు ఆఙ్ఞలు ఇచ్చే వ్యక్తులు గా సంస్కరించే వ్యక్తులు గా ,గురువులు గా మార్గదర్శకులు గా కనిపిస్తారు .స్త్రీలు పూర్తి గా భర్త శ్రేయస్కాములు గా కనిపిస్తారు . .విధేయులు గా ఉంటారు .కొండొకచో అహంకరించిన స్త్రీ తరువాత పశ్చాత్తాపం తో క్షమాపణ తెలిపి భర్త కు విదేయురాలవుతుంది . ఇంకా వేశ్యా వృత్తిని కూడా సందర్భాన్ని బట్టి చిత్రించారు . ఇట్లా ఆ నాటి సమాజాన్ని అ ప్రయత్నం గా స్వాభావికం గా చిత్రించిన రచయిత్రి ప్రతి కథను సందేశాత్మకం చేసి ప్రాచీనులు చెప్పిన కావ్య లక్ష్యం సాధించారు . ఈ కథల్లో కవితాత్మక వ్యక్తీకరణ లు గూడా గమనించదగినవి జానికమ్మ కథలో ఆమె వర్ణన చూడండి.’’

‘’నది యొడ్డున నిలువబడి పశ్చిమ ఉత్తరము గా జూచిన సదా నల్లని పొగమంచు తో కప్పబడి ,యాకాశమంటువరకు వ్యాపించియున్న పర్వతములును ,అందు పైని సేతు వర్ణమయమై ,కారు మేఘములలోని మెరుపు తీగవలె తళుకు తళుకు మను దేవాలయమును ,పర్వతమును చీల్చుకొని వచ్చునటుల గోచరించు గౌతమి యు ,కన్నుల పండువు చేయుచుండును .ఊరి వెలుపల లంకలో బెరుగు పైరు పచ్చలును ,మామిడితోపులును , నిత్య పెళ్లి పందిళ్ళ యొక్కయు ,తోరణముల యొక్కయు ,సంతోషముల సమకూర్చుచుండెను.’’

ఈమె లోని అలంకారిక భాషకు ‘ధనత్రయోదశి కథలో మచ్చుకు ఒక ఉదాహరణ చూడండి.

‘’ఈ కుటీరము గొప్ప సాహుకార్ల రెండుమేదల నడుమ నుండే చెల్లెలు లక్ష్మీ దేవి నుత్శవము జూడవచ్చిన జ్యేష్ట దేవి మోము ను చూచెను .

ఇదే కథలో రచయిత్రి ఒక పాత్రను మెచ్చుకోలుగా ‘’ ఆహ విజయలక్ష్మీ, నీ సుగుణములిన్నియని వర్ణింప నా తరమా ,’’

అంటుంది

ఏమయినా ఆ కాలానికి ఈకథా సంచయం ఒక గొప్ప సందేశం .శిల్పరీత్యా గొప్ప ప్రయోగం . ఈ రచయిత్రి అల్పకాలం జీవించడం తెలంగాణా కు పెద్ద లోటు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com