మన దేశ గ్రామీణ జనాభాలో ఇప్పటికీ నూటికి 70 మంది భూమి మీద ఆధారపడి బతుకుతున్నారు. 1991 తర్వాత ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో సరళీకృత నూతన ఆర్థిక విధానాలు అమలు చేయడం ప్రారంభించాయి. దేశీయ ప్రైవేటు పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు ప్రభుత్వం ప్రజల భూములను బలవంతంగా తీసుకొని అప్పగించడం మొదలుపెట్టింది. సింగూరు, నందిగ్రామ్, కళింగ నగరాలు ప్రభుత్వం భూములను బలవంతంగా నా కుంటుంటే ప్రజలు తమ రోగాలకు తెగించి భూముల్ని కాపాడుకున్నారు.

సోంపేటలో తమ పంటభూముల్ని బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఇవ్వనందుకు వారిపై కాల్పులు జరిపి అణచివేయాలని చూసింది ప్రభుత్వం. ప్రజల నుండి పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడంతో తాత్కాలికంగా ఆ ప్రాజెక్టును నిలిపివేశారు. సోంపేట ప్రజా పోరాటానికి ఆకర్షితులైన సుప్రసిద్ధ కథా రచయిత శీలంశెట్టి కాంతారావు క్షేత్ర పర్యటన చేసి నిజానిజాలను గ్రహించి ఇది అభివృద్ధి కాదు విధ్వంసం అని నిర్ధారించి ఈ నవలను రాయడం జరిగింది.

అభివృద్ధి ముసుగులో విధ్వంసాన్ని సృష్టించడం మన పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకోసం ఎలాంటి కుతంత్రాల కైనా వెనుకాడరు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు థర్మల్ విద్యుత్తు, ఒక అణు విద్యుత్తు ప్రాజెక్టును కళింగాంధ్ర ప్రాంతమైన శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో నెలకొల్పడానికి జోరుగా సన్నాహాలు జరిగాయి. దేశంలోనే అత్యంత వెనుకబడిన కళింగాంధ్ర లో అన్ని రాజకీయ పక్షాల నేతలు విధ్వంసకరమైన ప్రాజెక్టులకు స్వాగతం పలుకుతుండటం అత్యంత విషాదం. ఈ పవర్ పంజా వెనుక బడా నేతల స్వార్థం రెక్కలు సాగి రెపరెపలాడుతూ ఉంటే లక్షలాది మంది జనం బలిపశువులుగా మారుతున్నారు. తరతరాలుగా నమ్ముకున్న భూమిని అధిక మొత్తాలు ఎరజూపిన పెట్టుబడిదారులకు త్యాగం చేసి నిర్వాసితులుగా మారనున్నారు. సముద్రంలో చేపల వేటే జీవనాధారంగా గల మత్స్యకారులు వలసలకు సిద్ధమవుతున్నారు.

తీరప్రాంతాలు కొండలు లేక మైదానం లాగా ఉండటం, జల వనరులకు కొరత లేకపోవడంవల్ల పరిశ్రమల ఏర్పాటుకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక నగరమైన విశాఖ పట్నం కు దగ్గరగా ఉండటం, ఉత్తర దక్షిణ భారతదేశాల ను కలిపే 5వ నెంబర్ జాతీయ రహదారి చెన్నై- హౌరా రైలు మార్గం అందుబాటులో ఉండటం వల్ల ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు వెలిశాయి.ఈ జాతీయ రహదారి పొడవునా 13 బల్క్ డ్రగ్ రసాయనిక కర్మాగారాలను ఏర్పాటు చేశారు. అలా సోంపేట ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించదలచుకున్నది సోంపేట మండలంలోని బీలలో. బీల సంవత్సరం పొడుగునా నీరు ఉండే జలవనరు. ఇది సోంపేట చుట్టూ ఉన్న ప్రజలకు, పశువులకు, పక్షులకు నీటిని అందించి జీవనాధారంగా నిలుస్తుంది. బీల నీటితో సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. రావలమట 1989 లో రుస్కుట్టి, బెంకిలి, కుత్తూరు ప్రాంతాల్లో 3 ఎత్తిపోతల పథకాల ద్వారా 750 ఎకరాలకు నీరు అందుతుంది. అక్కడి ప్రజలకు సాగునీరు, తాగునీరు కొరత తీరుస్తుంది. మాణిక్య ప్రాంతంలోని 500 జోడి ఎమ్మెల్యే మత్స్యకారుల కుటుంబాలు వలలో చేపలు పట్టి బతుకుతున్నాయి. ఇక్కడే పంటభూములు, జీవరాశులు, మామిడి తోటలు, కొబ్బరి తోటలు ఉన్నాయి. ఇక్కడికి దగ్గరిలోని తేలినలాపురం ప్రాంతానికి నైజీరియా నుండి వచ్చే 123 రకాల వలస పక్షులు వచ్చి ఇక్కడే దొరికే చేపలను ఆహారంగా తిని ఆరు నెలలు ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. బహుళ జీవ వైవిధ్యం తో కూడుకున్న ప్రాంతం ఇది.

సస్యశ్యామలంగా, జీవవైవిధ్యం తో ఉన్న బీల సముద్రానికి దగ్గర ఉండటంతో పారిశ్రామికాధిపతులు, బహుళజాతి సంస్థల కన్నుపడుతోంది. కోస్తా కారిడార్ అంతట విచ్చలవిడిగా అనుమతించిన పవర్ ప్లాంట్లతో అది త్వరలోనే చెత్త కుండి గా మారే ప్రమాదం ఉంది. పవర్ ప్లాంట్లను చల్లార్చడానికి నీరు కావాలి. అందుకే వాటిని సముద్రతీరంలో ఏర్పాటు చేయడం, సముద్రానికి దగ్గర్లో ఉన్న భూమి ప్లాంట్ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది. దాంతో బీలలో పవర్ ప్లాంట్ కట్టడానికి పావులు కదులుతాయి. ముందుగా సారవంతమైన నేల బంజరు భూమిగా రికార్డుల్లో చూపించబడుతుంది. జీవభద్ర, బీల భూమి రెండు వేల ఎకరాల్లో 960 ఎకరాలు గవర్నమెంట్ భూమి కాగా, మిగతాది ప్రజలది. ప్రజల నుండి భూమిని సేకరించడానికి దళారులు రంగంలోకి దిగుతారు. అలా వచ్చిన వాడే తాతారావు. గొంగళిపురుగు పెసర మొక్కలోని జీవ సారమంతా పీల్చి పారేసినట్లు, ఆ సంవత్సరగా ఊళ్ళో ఒక్కొక్కళ్ళను ఒక్కో రకంగా బుట్టలో వేసుకొని మెల్లమెల్లగా వాళ్ళ నేల భూములను తాతారావు ఆక్రమిస్తాడు. రొత్పుల చెరువుల పేర్లు చెప్పి భూమి కొన్న తాతారావు దాన్ని మరోలా రియల్ ఎస్టేట్ పిన్ని పేరిట రిజిస్టర్ చేస్తాడు. మంచి రేటు వస్తుందని అంతా ఎగబడి భూములు అమ్ముకుంటారు. దళారులు, అమ్మిన వారు అంతా జల్సాలకు పెరుగుతారు.

హైదరాబాద్ నుండి ప్రముఖ సామాజిక, పర్యావరణ వేత్త ప్రొఫెసర్ నందగోపాల్ రాకతో రహస్యం బయటపడుతోంది. అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టబోతున్నారని రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి, లోక్ సభ లోని ప్రతిపక్ష పార్టీ ఎంపీ ఇద్దరికీ అందులో వాటాలు ఉన్నాయని తెలుస్తోంది. పార్టీల పరంగా బద్ధశత్రువు లాంటివారు, ఆ ప్రాంతాన్ని వైరి వర్గాలుగా చీల్చిన వారు ఈ విషయంలో ఒక్కటై ప్రజలను మోసం చేయడానికి పూనుకున్నారని తెలుసుకుంటాడు‌. అయినా వాళ్లు థర్మల్ ప్లాంట్ వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఉద్యోగాలు పొందుతారని ప్రచారం చేయిస్తుంటారు.

కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ‌ ద్రవ్య సంస్థలను సంతోషపెట్టి మరిన్ని అప్పులు తెచ్చుకోవడానికి వాళ్లు సూచించిన ఓ బహుళజాతి సంస్థకు స్వామి పేట(సోంపేట) థర్మల్ ప్లాంట్ ను కట్టబెట్టాలనుకుంటుంది. వాళ్లకు నేరుగా ఇస్తే దేశంలో అలజడి రేగే ప్రమాదముందని గ్రహించి, బినామీ పేరు మీద కుబేలా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆ ప్రాజెక్టు ను అప్పజెబుతుంది. అందులో బహుళజాతిసంస్థల పర్యవేక్షణలో కొనసాగే ఆ పవర్ ప్లాంట్ లో ప్రతిపక్ష ఎంపీ, అధికార పార్టీ మంత్రి వాటాదారులు గా ఉంటారు.

ప్రపంచవ్యాప్తంగా పరిరక్షించాల్సిన చిత్తడి భూముల్లో ఒకటైన స్వామి పేట, చిత్తడి భూములను నాశనం చేసి అభివృద్ధి పేరిట థర్మల్ పవర్ ప్లాంట్ కట్టడం ఎంతవరకు సబబు? పవర్ ప్లాంట్ వల్ల కలిగే పర్యావరణ నాశనం ఈ క్రింది విధంగా వుంటుంది.

1. ప్రతిరోజు 40 వేల టన్నుల బూడిద 80 కిలోమీటర్ల దాకా వెదజల్లబడుతుంది‌‌. ఈ బూడిద పడినంత మేరకు భూముల్లో పంటలు పండవు. తిండి దొరకదు. జంతు జాల మనుగడ కష్టమే.విదేశీ పక్షులే కాదు, కాకులు, పిచ్చుకలు కనిపించవు. అపురూప జీవాలన్నీ అదృశ్యమవుతాయి.

2. ఉద్యోగాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి. ఉన్నత స్థాయి నిపుణులకే అవి స్వంతం

3. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరిట తమ లాభాల కోసం పారిశ్రామికవేత్తలు విద్యుత్ ప్లాంట్లు పెట్టుకోడానికి వస్తున్నారు.

4. ఇక్కడ పెడితే నీటికీ కరువు ఉండదు. విదేశాల నుండి బొగ్గు దిగుమతి చేసుకోవడానికి, కంపెనీ నుండి వెలువడే వ్యర్ధాలను సముద్రం ఉపయోగపడుతుంది.

5. దీనివల్ల మత్స్యకారుల జీవితాలు నాశనం అవుతాయి.

లాయిడ్ రాజశేఖర్, యువ లీడర్ మల్లీశ్వరి లు కలిసి కృష్ణారావు మాస్టర్ ఆధ్వర్యంలో బీల గ్రామాల ప్రజలను చైతన్యపరిచి పవర్ ప్లాంట్ నిర్మాణం అడ్డుకోవడానికి సంకల్పిస్తారు.

ఆ వూరి తాసిల్దార్, కలెక్టర్, రాజకీయ నాయకులు ఆ బీలను బంజరు భూమి గా చిత్రీకరిస్తారు. పనికిరాని ఆ భూముల్లో పవర్ ప్లాంట్ పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది, ప్రజల బతుకులు బాగు పడతాయని ప్రచారం చేస్తారు. బీల చుట్టూ ఉన్న గ్రామాలన్నింటిని దత్తత తీసుకుని ఇండ్లు, రోడ్లు, బడులు, ఆసుపత్రులతో అభివృద్ధి కార్యక్రమాలు ఉచితంగా చేస్తామని రెండు వ్యాన్ లలో కంపెనీ వాళ్లు వస్తారు. ప్రజల అభివృద్ధి కోసం, అంతర్జాతీయ గుర్తింపు కోసం అని చెప్పిన మంత్రి నాలుగు బస్సుల్లో ప్రాజెక్టులు ఇతర ప్రాంతాలను తిరిగి రమ్మని పంపుతాడు. ఇంతకు ముందు కట్టిన ఆ ప్రాజెక్టుల వల్ల అక్కడ ప్రజలు పడుతున్న బాధలు తెలుసుకున్న బీల ప్రజలు ఉద్యమించడానికి సంకల్పిస్తారు.

ఆర్ డి ఓ, తహసీల్దార్, కలెక్టర్లు వచ్చి గ్రామ సభలు పెట్టినా గ్రామస్తులు శాంతించలేదు. వాళ్లను ఎదిరించి మాట్లాడినందుకు నక్సలైట్లని చెప్పి, శాంతి భద్రతల రక్షణ కింద కృష్ణారావు మేష్టారుని, ఇతరులను ఎస్పి అరెస్టు చేయించగా, ప్రజలు తిరగబడడం తో లాఠీచార్జి జరిగింది. అందరి మీద పోలీసు కేసులు పెట్టి కృష్ణారావు మేష్టార్ని అరెస్టు చేస్తారు. ఇన్ని వ్యతిరేకతల మధ్య శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటవుతుంది. 144వ సెక్షన్ పెట్టి మూడు వేల మంది పోలీసులను దింపుతారు. కంపెనీ గుండాలు సరేసరి. ప్రజాగ్రహం ముందు వాళ్ళెవరూ నిలబడలేకపోతారు. లాఠీ ఛార్జ్ తో క్రూరంగా విరుచుకుపడిన పోలీసులను ఎదిరించకతప్పలేదు ప్రజలకు. పోలీసులు కుటిల రీతిలో కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీస్తారు. ఇది అసెంబ్లీలో గొడవకు దారి తీస్తుంది. మృతుల నష్టపరిహారం నిరాకరించినా, మేష్టారు ఆదేశం మేరకు తీసుకుంటారు. మృతదేహాల ఊరేగింపులో రెచ్చిపోయిన జనాలు ఎంపీ ఇంటిని, ఆయన ఆస్తులను ధ్వంసం చేస్తారు. ఈ ఉద్యమం వెనుక ఉన్న పెద్ద తలకాయ లను అడ్డు తొలగిస్తే తప్ప లాభం లేదని నిర్ణయించుకున్న నాయకులు, ముందు వారిని డబ్బులతో కొనుక్కుందామనుకుంటారు. లొంగకపోతే చంపాలనుకుంటారు. థర్మల్ ప్లాంట్ విషయం జటిలంగా మారిందని తెలుసుకున్న ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ విరమించే ప్రయత్నం చేస్తానని ప్రకటించాల్సి వస్తుంది. ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్తుంది.

తెలంగాణకు చెందిన ఒక రచయిత సోంపేట ను దర్శించి, ఆ క్షేత్ర పర్యటన లో తెలుసుకున్న విషయాలతో నవల రాయడానికి సంకల్పించడం అభినందించదగ్గ విషయం. నిజ నిర్ధారణ కమిటీ రిపోర్టులా కాకుండా దానికిచ్చిన నవలా రూపం, స్థానిక మాండలిక తను సంభాషణలలో జొప్పించిన విధానం బాగుంది. సామ్రాజ్యవాద దోపిడీ ని ఎదిరించే ఇలాంటి ఉద్యమాల చరిత్ర మిగతా వారికి ప్రేరణ కలిగించడానికి ఇలాంటి నవలలు దోహదం చేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com