–ఆచార్య పి.యశోదా రెడ్డి

పి.యశోదా రెడ్డి రాసిన మా వూరి ముచ్చట్లు కథల సంపుటి లోనిది ఈ కథ. తెలంగాణ జీవ భాషలో కొనసాగిన కథ ఇది. పల్లెసమీల సౌందర్యం, మానవ సంబంధాల లోని మాధుర్యం, మూఢ నమ్మవాలు, ప్రేమలు, అసూయలు చిత్రించిన కథ ఇది. పాండిత్య ప్రకర్ష, పరిశోధనా దక్షత కలిగిన యశోదా రెడ్డి నిసర్గ భాషా పాటవంతో ఎట్లా రచన చేయగలరో తెలిపే రచన ఇది.

 ఎచ్చమ్మతల్లి పురుట్లనె కాలంజేసింది. ఆ పిల్లపుట్టింది మూలనక్షత్రం. ఇగ ఆనక్షత్ర బలం కొద్ది కావల్శిన పని అయింది. ‘ఈ పిల్లపుట్టి నా లక్ష్మిని దిగమింగే’ నని తండ్రి కాశిరెడ్డి పిల్లను జూస్తె సీమలు, జెర్లు వాకినట్లు సీద రిచ్చుకుంటుండె. పాపం! ఆ పిల్లకు యాళ్ళ పాళ్ళ సూసెటోళ్ళు లేకపోతె ఆ పిల్లను గొంచవోయి రుక్కుణమ్మ వెంచుకొన్నది. ఆ పిల్ల పాలమూర్ల పెరిగింది. కాశిరెడ్డి ఉక్కుకడ్డి అసొంటి మనిషి. నడుస్తుంటే బూమినాదిచ్చేది. పల్క పెయ్యి, బారెడు ఎద,

కోసుకండ్లు, సూడసక్కని మనిషి. యశోదకు వొంకుల ఎంటికలు దప్ప అంతా తండ్రి పోవడే. తండ్రినోట్ల దుసిపడ్డట్లుంటది. బిడ్డదిక్కు మనసు రాయిజేసుకున్న కాశిరెడ్డికి ఎప్పుడో కలల భక్షాలుదిన్నట్లు బిడ్డ కండ్లల్లవడ్తే రాయివారిన మనసు ఎన్నముద్దోలే అయ్యేది. అడప దడప పేషీల కని మొకద్ధమల కని పాలమూరి కొచ్చినప్పు డల్లా బిడ్డను జూసి పోయెటోడు. అప్పుడు తనను బిల్సుక పోనికె వొచ్చిన జతగాండ్లను జూసి “అబ్బ! మానాయినొచ్చిండు, ఈ యాళ్ల గాజప్పలాట ఆడను. పొద్దుమూకి గూడ ఎన్నెలకుప్పలాటకు ఉద్దిని ఎవర్నన్న ఏరుకోండి” అని ఇంటి కెవరో కావల్సిన సుట్ట పాయన వొచ్చినట్లు చెప్పేది.

ఎప్పటితీర్గనె ఈ త్యాప గూడ కాశన్న పాలమూరి కొచ్చిండు. ఎచ్చమ్మ కిప్పుడు తొమ్మిదేండ్లు. ఎప్పటితీర్గ గాకుండ, ఈ సారి తండ్రొచ్చి స్తానం జేసిరాంగనే అద్దం బొట్టుపుల్ల, కుంకుమ తెచ్చి ఇచ్చింది. తండ్రి అద్దంల నామం దిద్దుకుంటుంటె ఎన్కనుండి వొచ్చి, “నాయినా!” అని బుజాలు పట్టుకొని యాళ్ళాడింది. తన మొకం పక్కకు బిడ్డ మొకం అచ్చం చిన్నకాశన్నోలె అద్దంల గానొచ్చింది. అదిజూసి తండ్రి కడ్పుల సేయి పెట్టితిప్పినట్లైంది. అమాతం చేతులుమల్సి బుజాల మీదికి బిడ్డను గుంజుకోని, తొడల మీదేసుకొని “ఎచ్చలూ! నా కన్నలూ!” అనుకుంట ముద్దిచ్చుకున్నడు.

ఎచ్చమ్మతల్లి సరస్వతమ్మ తద్దినం పుష్యమాసంలనే వస్తది. సంక్రాత్రి పండుగ ఆనాటికి రొండుదినాలు అటో ఇటో ఉంటది. ఇగ సంకురాత్రి నెల నిలపెట్టంగనే చెల్లెలు ముత్యాలమ్మ, మ్యానల్లుడు రఘునాథరెడ్డి ఊళ్ళ ఉన్న అల్లుడు ఎంకట్రెడ్డి అంతా ఆయింట్ల జేరుకునెటోళ్ళు. ఈ దినాలల్లనే పిల్లను ఎంటవెట్టుకొని పాలమూరినుండి రుక్కుణమ్మ గూడ బిజినపల్లెకు వొస్తుండె. బిజినపల్లెకు వొచ్చినప్పుడల్ల ముత్యాలమ్మ అన్నను జూసి “అన్నా! తల్లి గారింటి సమందం తెగదెంపులు జేయకు. మాయత్తగారింట్ల నామాట నెగెటందుకు నాతల్లి గారి బలం ఉండాలె. అందుకోసం నీపిల్లల్ల ఓదాన్ని నాకొడుక్కు ఇయ్యరాదా? నీ పిల్ల నా ఇంట్ల వడ్తె. యాడాది కోనాడు సీరె, సారె ఒడిబియ్యాలె గాకుండ మన పిల్లల సమందాలు జూస్కొని రొండు ఇండ్లోళ్ళకు రాకపోకలు నడుస్తవి. మీబావ బిఱ్ఱు కొంచెంతగ్గుతది” అని పీడిచ్చుక తింటుండె. ఆ పోరు పడలేక కాశిరెడ్డి “నీ పొట్కు ఎక్కువైందే ముత్తెం, సరే నీలి నిస్తలే” అని మాటిచ్చిండు. కాని మొన్న పాలమూరికి పొయ్యి వొచ్చి నప్పటినుండి ఎశోదనే కాశన్న కండ్లల్ల మెదల వట్టింది. ‘అరె మా ముత్యాల కొడుకు రాగనికి ఎచ్చమ్మను ఇయ్యాలె. నీలికి ఇంకో కాడ గట్టిజేస్త’ నని అనుకొన్నడు. అనుకున్నాడు అను కున్నట్లే పెద్ద గుఱ్ఱాన్ని ఎక్కి చెన్నారం వయినమై చెల్లెలు ముత్యాలమ్మ ఇంటికి పోయిండు.

ఎన్నడూ పిల్సినా రాని అన్న పెద్దగుఱ్ఱా న్నెక్కి పక్కడు పక్కడు మనుకుంట వోయి ఇంటికమాన్ ముంగల దిగంగనే రంతు గుర్తుపట్టి ముత్యాలమ్మ పాటకు లకునడ్సుకుంటొచ్చి “ఏందే అన్న! అంత బాగేనా!” అని అడిగింది. “అంతబాగే ముత్యాలు బావేడి? ఇంట్లకుపద, నీకోమాట జెప్పిపోవాలెనని వొచ్చిన” అని మాట్లాడుకుంట అన్నాచెల్లెండ్లిద్దరు భవంతిలకు వోయి కూసున్నరు. చెల్లెల్ని జాసి కాశిరెడ్డి “సూడు ముత్యాలు మొన్నత్యాప మనం అనుకున్నట్లు నీ కొడుక్కు నీలిని గాదు తల్లిలేనిపిల్ల ఎచ్చల్ను  ఇస్త. ఇంతకు నీవెంత నోసుకున్నవో గని నీ పూలు పుట్కలవడ్డ వనుకో” అన్నడు.

అన్న మాట ఇన్న ముత్యాలమ్మకు ఏమనాల్నో తెల్వలేదు. కొంచెం తట పటాయించింది. ‘పాడునక్షత్రం అని మూణ్ణెల్లప్పుడు తల్లిలేని పిల్లను ఎవ్వరు ఒల్ల మంటె ఒల్లం అన్నప్పుడు, మనుసు ఇర్గిన అన్ననే రుక్కుణమ్మకు సా క్కో మని ఇచ్చె గద. మరి ఇయాళ్ళ ఆ పిల్లను అన్నెట్ల దెస్తడు? ఆమెట్ల ఇస్తది? ఇస్తెమట్కు నే నెట్ల జేసుకొంట? వాళ్లెవరు? నేనెవరు? అని రెప్పపాటు సేపు ఆలోచనజేసింది. ఇంతట్లనె తేరుకొని, ఏనిగె అంత అన్న ఉండంగ నాకేంబయం. ఆ పోరి నా అన్న నెత్తురుకండ గా కుంటె మంది పిల్లనా? మా అన్న కాశన్నమాటకు ఎదురువలికే నాదుడు ఎవడుండడూ అంట? సూర్యుడుతనో డైతే సుక్కలన్నీ తన కుక్కలంట. ఊరి కైన మనిషి, మాలీ, పోలీస్, వతన్లు, సేతులున్న అన్న ముంగల కడమ సుట్టాలందరు కుక్కిన పేండ్లే గద. దేవుని దయ ఎట్లుందోగని ఏశి పుట్టినకాణ్ణుంచి నా కన్నంత దాని మీదనే ఉండె. మా దొర బయానికి కుయిక్కుమన లేదుగని. ఆనాడె పిల్లను దీస్కపోక పోయినాను. మా రాగనికి ఈడూ జోడు ముద్దుగుంటది. సీపీరికండ్ల నీలి కాటికకండ్ల ఏశి మీద దిగదుడ్పు కన్న పనికిరాదు. అని అనుకొని అన్నా, నీమాట ఎన్నడన్న కాదన్ననా? ఈ మాట మీబావచెవుల నిదానంగ ఏస్త. బరువు భారాలన్నీ నీవే. మాటమట్కు ఖాయం” అన్నది.

ఈసారి నెల్లాళ్ళుముందే ముత్యాలమ్మ తల్లిగారి ఊరికి పయినం గట్టి అన్నింట్ల పీట వెట్టింది. ఆడిపిల్ల వొచ్చి నెల్లాళ్ళు తనింట్ల గూసున్కం ఆవగింజంత ఇష్టం లేదు వొదినెకిష్టమ్మకు, ఇన్నాళ్ళు ఆడివిల్ల ఇంటికొచ్చిందంటె కిష్టమ్మ ఇగలేని బయంతోటి పై నిండ కండ్లు వెట్టుకోని మెలిగేది. ఈ త్యాప “మాకూ తల్లిగారిండ్లున్నవి గని గిన్ని వైనా లెరుగం తల్లీ! ఈ ముక్కు మీదికోపాల తోటి ఎవరేగుతరు అని రుస రుస లాడ్కం మొదలు పెట్టింది. ముత్యాలమ్మ భోజనానికి రాక తొలిగనె కంచుట్ల కోడికూర సగందీసి గుండుగిన్నె లేసి ఉట్టిమీదకి ఎక్కిచ్చేది. షష్టి వారాలు దీరి నెల్లాళ్ళు గడ్సినా అమ్మో! ఎంకీ నెయ్యి గెలుకకుండి అంట్లైత వని దుత్తకు దుత్త పెద్దగోలెంల దాసేది. ఇగ పాలదాయికాడ, నల్ల పెర్పుకాడ, కట్టుకావలుండేది. పిల్లకల్లు రాంగనె సన్నుబుడ్డెడు ముందే దీస్కొని పంటిదిక మిలికని చెప్పుతుంది. ఇవన్ని జూసి అరికాలిమంట నెత్తి కెక్కినగని, ఉగ్రాన్ని దిగమింగుకొని ‘ఉట్టి ఎన్నాళ్ళూగుతది ఊగని ఊగి ఊగి ఉన్న కాడ్కే వొస్తది” అని తమాయించుకొని, అన్నచెవుల వడకుండనే నడుపుకొచ్చింది.

ఇంతట్ల పాలమూరికెళ్ళి ఎచ్చమ్మ రానేవొచ్చింది. ఉంగురాలు దిరిగిన ఎంటికలు కండ్లమీద గుత్తులోలెవాల్తుంటె, పొట్టిజడేసుకొని ఒంటిముత్యం ఊగులాడె కిలావర్‌పూలు చెవులకు మెళ్ళకు ఎఱ్ఱరాళ్ళ పత్కంల గలిపి గుచ్చిన గోదుమాణి దండేసుకొని కిల కిలమను కుంటొచ్చింది. ఈ పిల్లరాంగనే ఇల్లు పచ్చతోరణాలు గట్టినట్లు బంతిపూలు పూసినట్లు ఎన్నెల గాసినట్లు కళ కళలాడింది. పిల్ల నిజానికి సక్కని చెక్కడపు బొమ్మకాదు. అయినా ఆ పిల్ల మొకంల కళ ఏందో గని ఒక్కసారిజూస్తే మళ్లా మళ్ల సూడబుద్దైతది. అది నగినప్పుడు కుడిదిక్కు సొట్టలువడే దాని పాలచెంపలు ముద్దులుగమ్మరిచ్చ బుద్దైతవి.

బిజినపల్లెల ఎచ్చమ్మ వాళ్ళిల్లు కంచెంత పెద్దది. లంకసొంటి ఆ పాత కొంపల మొన్ననె వాళ్ల నాయిన ఇంటికి దక్షిణపుదిక్కున ఒంకులు భవంతి లేపిండు. ఈ కొత్త భవంతి కచ్చేరి అయింది మొగోళ్లకు. ఆడ మూడు పొద్దులు అందరుజేరి ఊరి మీది ముచ్చట్లు, న్యాయాలు, తీర్పులు జర్పుకుంట ఉంటరు. అందుకోసం ఆదిక్కుకు పిల్లలు, ఆడోళ్లెవ్వరు వోరు. ఈ కొత్త బంకులకు పాతింటికి నడుమ ప్రారీవెట్టిన ఉత్తసోటుంది. ఆణ్ణే పెద్ద సేదురు బాయి ఉండది. ఇంటికొచ్చిన సుట్ట పక్కాలు, మొగోళ్ళు ఈడ్నే స్తానాలుజేస్తరు. దాని కానిచ్చి ఏసిన సప్రంలనే వొడ్లదంపుకం. అట్కులు గొట్కం గిట్ట జర్గుతవి. అవుతల పెద్ద పెరడుండది. ఈ ఉత్తసోటుకు ఆవల పెరిటికి నడుంగల దిడ్డి తలుపుండది. ఆ దిడ్డితలువు దాట్తే అడున్న పసులకొట్టాలు గడ్డివాములు గండ్లవడ్తవి. ఈడ రొండు మూడు యాప, చింత, తుమ్మ, మామిడి చెట్లున్నవి. ఇవన్నిటి కన్న సెప్పదగ్గది ఓ రేగిచెట్టుండది. ఇవన్ని ఒగెత్తు ఇగ ఆడున్న రేగిసెట్టు ఒగెత్తు. ఎన్ని సెట్లుంటేఏంది? రేగి పెట్టు కున్న ఖదరు ఆడ యా సెట్టుకులేదు. ఎందుకంటె ఆ నెలల పిల్లలకు గావల్సిన పండ్లిచ్చేది గా చెట్టొక్కటే. ఐతె పిల్లలనోట్ల గడ్డి గొట్టినట్లు ఆడ్కి పోకుండ ఆ దిడ్డి దరువాజుకు మూసచిక్కుతాలం తగిలిచ్చిన్రు. ఎందుకంటే పెరట్ల పాతగోడ లెన్కున్న పెద్దబాయిల మొన్న మొన్ననే రవుణమ్మ కోడలు చిన్నతాయారమ్మ వడి సచ్చిదయ్య మైందంట. ఇంగ అది ముందే బాపని దయ్యం, పడ్తె ఇడ్వదు. అది గాక అభంశుభం దీరక కోరికల్తోటిఉండె; ఇంగ అసొంటి దయ్యపు గాలి గీలి పిల్లలకు యాడ దాక్తుదో అనే బుగుల్తోటి ఆ దిడ్డితల్పు దెర్సకమే లేదు. గుడ్లుర్మితె కండ్లు మూసుకునే పిల్లలు ఆ దిక్కు జూసుకుంట గుట్కిళ్ళు మింగి మింగి చెట్టు మాటనే మర్శి ఊకున్నరు.

ఇంగిలీకం అసొంటి ఏశి వొచ్చినంక పిల్లలందరికి ఆటిడు పైంది. ఇంట్ల ఆడోళ్ళు సకినాలు జుట్టుకుంట, అరిసెల పిండిగొట్టుకుంట సొజ్జె ఇసురుకుంట, పేణీలకు శక్కెరజల్లుకుంట, పొలాప్ కొరకు కాకరొడ్లు పొతంజేపిచ్చుకుంట, ఆ యీ పను లల్లవడి పిల్లల మీదినిగురాని కొంచెం సళ్ళిడిసిన్రు. ఇంగ పిల్లలు గూడ ఏపుడు బియ్యం బెట్టు; చిట్టిలువలు బెట్టు, బెల్లప్పూసవెట్టు అని ఊకె తల్లుల ఎంటవడి ఏపుకం మానిన్రు. సిరిదిండ్ల మీద సింత మాని పల్కలు బల్పాలు పట్టుకొని, ఒంట్లు, ఓనుమాలు రాసుకుంట, సదువుకుంట తిర్గవట్టిన్రు. ఇట్లతీగెరాగాలు మాని నక్కుంట, ముర్సు కుంటున్న ఎడపిల్లలను జూసి, తల్లి నిడిస్తే పిల్లి గరుస్తదని తల్లిసంకకు అత్కపోయిన సంటి పిల్లలు గూడ దిగి తప్పు టడులు ఏస్కం మొదలు పెట్టిను.

-ఎచ్చమ్మ సన్న సుల్కు చేతుల పట్టుకోని పల్కమంచం ఎక్కి కూసోని పిల్లలకు పద్యాలు అంగ్రీజు నెలల పేర్లు నోటికి యాదిజేపిస్తుండది. పిల్లలందరికి ఎచ్చమ్మంటె గురి గుదిరింది. అప్పటికే పంజుమ్ జమాత్ చదువుతున్న రఘునాథరెడ్డికి తుర్కమే గని అంగిరీజ్ రాదు. ఈపోరి ఏశి మూతి గుండుగ పెట్టి అంగిరీజ్ సదువుతుంటే పెద్ద లాట్ సాబ్ బిడ్డోలె ఉండది. మరి ఈ సదువు నా కొస్తే బాగుండుననుకున్నడు. అయితే గా పోర్ని ఎట్లడ్గి నేర్చు కోవాలె, నాకంటే సిన్న గుండిమిడ్కెగదా, పోని, ఇప్పుడు నేర్చుకోకుంటె రేపు మాపటింతల మామ, ” అరె పిలగాండ్లు, మీరు నేర్చుకున్న కొత్త కొత్త పాఠాలు సదివి నాకు యినిపిచ్చుండి” అని అడ్గితె, ఏశి గీ అంగిరీజు సదువుతది. మరి నాకు రావంటె నెత్తి దించుకోవాల్సివస్తది. అబ్బ! ఈ పోరి యాడ నేర్పిందో ఇవన్ని ఎల్లిపాయెపటాకిరో నాయిన. ఎట్లైన ఉపాయంజేసి నేను అంగిరోజు నేర్సుకోవాలె, అనుకోని ఓ తంతు వన్నిండు.

పిల్లల్నందర్ని పిల్సి కూసోపెట్టుకోని ” అరె, తమ్మీ, తమ్మీ, సెల్లే, బుచ్చి, బుచ్చి ఇగసూడుండి! మీరందరు, అంగిరీజు నెలల పేర్లు తప్పువోకుండ పదిసార్లు సదివితే ఎండపూట మన ఊరెన్కి ర్యాగళ్ళకెల్లి వచ్చి శెనక్కాయెదెచ్చి పెడ్త నన్నడు. ఆమాట ఇని పిల్లలు “బావ బావ, అన్న ఇగో అప్పుడే గవి మా క్యాడొస్తవి? అగో ఎచ్చక్క లేదు పట్నం కెళ్ళి వొచ్చిన పుట్నంగింజ, దానికే వస్తవి. రాగన్న గివి రావుగని నీ వేపని జెస్తే అది జేస్తమే. నీవు పెద్దబాయికి ఈత గొట్టవోతె బెండు మోసుకొస్తం. పొడితువాలు బనీను పట్టుకోని నీ వచ్చెదాక బాయిగట్టుమీద ఎదిరిచూసుకుంట గూసుంటం. నీవు పొద్దుమూకి చెండాడె టప్పుడు తప్పిపోయి సెండు యా కంపతార్లల్ల వడ్డగని ఉర్కి పోయి తెస్తం. సెనక్కాయె తెచ్చి పెట్టే అని గీమాలుకుంట అడిగిన్రు పాపం.

ఇగ బావ ఎచ్చమ్మను జూసి “ఎచ్చా, నీవు సదువే సూతం” అని అడిగిండు. ఎచ్చలు నెత్తి అడ్డంగదిప్పుకుంట “నేను జదువను, అమ్మో! ఎంత ఉషారున్నవ్? నేను పదిసార్లు సదివేట్యాళ్లకు నోటికి యాదిజేస్తామనుకున్నావ్? నా కెరుకే నీ ఉపాయం; అట్లే సదువుత గని బావా! నాకు జాక్ అండ్ జిల్, లియో ది లయన్, టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ ఇంగా ఎన్నో అంగ్రీజ్ పద్యాలు వొస్తవి. అవన్నీ నీకు నేర్పుత గని మరి నాకు మన దొడ్డిలున్న గంగరేగిపండ్లు తెంపియ్యవా?” అని అడిగింది. ఆ మాట ఇనంగనే బావ ఒక్కసారి ఉలిక్కిపడిండు గని కాదంటె ఆడి పోరి ఇర్గవడి నగుతది. అవును ఇంట సెట్టు వెట్టుకొని ఇంతతండ్లాట ఎందుకు? నా కన్న ఈ పోరే నయం. అనుకొని “సరె ఏశి నీవు దిడ్డికాడ కావలిగాయి. నేను గోడదుంకి తెస్త” నన్నడు. గని అప్పటికి ఆడ్నే మణుషులు మెసుల్తుంటే అనుము దొర్కక తెనుగురంగడు దెచ్చిన చెరుకు గడలు చేతులపట్టుకొని పిట్ట గోడెక్కి కూసోని కాళ్లూపుకుంట ఏశిసదువు తుంటే ఎన్క బావసదువుతున్నడు. ఇది జూసి పిల్లలంత ఉరుక్కుంట వోయి ఇంట్ల జొరవడి “అత్తా! అత్త! ఇదో, బావ ఎచ్చక్క తోటి అంగ్రీజ్ నేర్చుకుంటుండడు. అక్క పంతులమ్మైంది. సూతువు రా”. అని పిల్సుకుంట గుంజిన్రు. ‘కొడ్కు అంగ్రీజ్ నేరుస్తుండడంటె ఎంతో సంబురం అయింది ముత్యాలమ్మకు. అవును రేపు మా వోడు తాలుక్దా రయ్యెటో డనుకొని ఉబ్బిపోయింది గని, ‘అంతకొడుక్కు ఏలంత పోరి, రేపు వాణి అదుపాజ్ఞల మసిలే పోరి గురు వోలె నేర్పతుండదంటె ఎంతసిన్నతనం అనుకొని “ఎవతే ఆ మాట అంటున్నది? మీ ఎచ్చక్క లొచ్చక్క నేర్పితగిన బావదొరకు దెల్లారదు? పోనియ్యరు సత్తిబింకాలు? అవుతలికి నడుస్తరా లేదా? అంటు ఎలగొట్టింది.

మర్నాడు పిల్ల లెవ్వరు లేకుండజూసి అందరికండ్లు గప్పి ఎచ్చమ్మ బావ ఇద్దరు గలిసి ఇంటెన్క గోడమీదికెల్లి దుంకి, పెరట్లజొరవడి గడ్డివాముల సాటు కెల్లి రేగిచెట్టు కాడికి వోయిన్రు. చెట్టు ఇర్గ గాసింది. కసరుపిందెలు దోరవండ్లు బాగా దోరమాగినపండ్లు ఎన్నెన్నో ఉన్నవి. చెట్టు నిండ గజ్జెగాసి నట్లుండది. గాని గడల తోటి, సువ్వలతోటి గొడ్తె కసరుగాయలు రాల్తవి. కమ్మకత్తి దెచ్చెటట్లు లేదు. అందుకోసం చెట్టెక్కాలె, బావ ఎక్కితె కింద ఎచ్చి ఒక్కతె ఉంటది. పక్కకు దయ్య ముండది. అందుకే ఇద్దరు చెట్టెక్కాలె, మరి ఏశి కి కాళ్ళందవు ఎట్లా మరి?

“నాకేం బయంలేదు బావ నీవెక్కు.

” “వొద్దు ఎశ్శి.”

 “మరెట్ల బావ?”

 “నా ఎన్క నీవు రా!”

“నీ వేమొ సెట్టు వాకి ఎక్కుతవు ఈ కొత్త పర్కిణి నేను ఎగవాకేటప్పుడు సిన్గితె ఎట్ల?”

బావకు నిజమే అనిపిచ్చింది.

“అయితే ఎచ్చ నేను రాళ్ళు పోగువెడ్త. ఈ రాతి మీదికెల్లి నా ఈపు మీద వో కాలుపెట్టి నీవు చెట్టు మొదట్ల వో కాలువెట్టు. అటెంక కొమ్మ దొర్కవట్టుకొని, చెట్టు మొదలు పంగలల్ల నాకు సోటుంచి గూసో. ఇంగనే నెక్కివస్త.

ఏశికి బావ ఎంత మంచో డనిపిచ్చింది. బావనుపట్టుకొని ఏశి ఎక్కింది. బావ ఎక్కిండు. కావల్సినన్ని వండ్లు సిల్క గొర్కినవి వాలాయించి ఏరుకొని తిన్నరు తెంపుకోని కీసలు నింపుకున్నరు. సాలైనవి. ఇంగ బావ కిందికి దుంకిండు. పాపం ఏశికి దిగొస్తలేదు. పట్క జారుడ మంటె సెట్టు గీస్కపోతుండది. ఇంతట్లనే మెరుపుమెర్శి నట్లు రఘునాథరెడ్డి కో ఆలోచనొచ్చింది. దబ దబ చెట్టుదిగి ‘నోడల్ల చెట్టు కింద బండ ఎక్కి వొంగిండు. “ఎచ్చ, బయపడకు చెట్టుదిక్కు

మొకం జేయి ఎడమమోకా లొంచి చెట్టు కానిచ్చినిలవడు. మెల్లగ ఆ కాలు నా ఈపుమీద మోపుకుంట దిగు” అన్నడు. బావ జెప్పినట్లె ఎచ్చమ్మ ఆవలి మొకంజేసి రెండుజేతుల చెట్టును గట్టిగపట్టుకొని మెల్లగ దిగుతుండది.

ఇంతట్లనె బోజినాలకు పొద్దైంది. “సోటుజేసి శాన పేపాయె”. అన్న గూడొచ్చి “వొడ్డ నైందా?” అని అడ్గవట్టె అయనకు వొడ్డనజేత మంటె, పనివడి “మా రాగయ్య యాడుండ డని” అడిగిండు. పిల్లగాడు కండ్లవడకుంటె అన్నేమనుకుంటడు? తులవపోరలల్ల గలిసి ఇలుపట్టకుండైం డని అనుకుంటడేమొ! ఎట్లజేతబ్బా! అని బిరబిర ముత్యాలమ్మ ఇవతలికొచ్చి జుస్తె, పిల్లలు యాడలేరు. ఇంతట్లనె ‘రాత్రిపూటకు యాటను పొతంజేస్త’ నని కటికో డొచ్చిండు. దిడ్డి దర్శి వొస్తనని దిడ్డి దరువాజ దెరిసెట్యాళ్ళకు కొడ్కు వొంగిండు; వాణి సల్వ అంగిమీద ఏశి కాళ్ళు పెట్టి దిగుతుండది.

“వాయబ్బ! ఎంత పనాయె! పోయి పోయి అదునా కటికోని కండ్లల్ల వడె గదబ్బ! అమ్మో! పోరి తిప్పి తిప్పి కొడ్తె పదేండ్లు లేదు. ఇప్పుడే వాణ్ణి కఱ్ఱె కుక్కను జేసితిప్పుతుండది. తల్లీ, నయం. కండ్లుదెర్శిన. కానక కంపల వడ్తుంటి. ఈ పోరికో దండం దీని సంబందానికో దండం”. అని బిరబిరవోయి “రాగా! ఏం జేస్తుండవురా?” అని చెవ్వు పట్టి గొర గొర గుంజుకొచ్చింది. అట్లొచ్చి దివానుపీట మీద గూసున్న అన్నను జూసి, “అన్నా! సాలు నీ ఇంటికి వొచ్చినందుకు మర్యాద బాగనే జేసినవ్. తల్లిగారింటికి వెయ్యిదండాలు. ఇన్నాళ్ళ నుండి కడ్పు చించుకుంటె కాళ్ళ మీద వడ్త దని కడ్పులవెట్టుకొని ఊకే ఉన్న. నీ పెండ్లామన్న సూటిపోటిమాట లన్ని బరిచ్చిన. ఇగ నన్ను నా పిల్లగాణ్ణి నీ

పిల్ల కంట్లే కనుపాపోలె దిర్గమంటే మా శాతగాదు. నాకు మీ సమందమే వొద్దు. సవారికచ్చరం గట్టియ్యి. నేను పోతా” అని పయనమైంది.

“రాజీ! నాకు ఆకలిలేదు. వొడ్డునజేయకుండి. రుక్కుణమ్మను పిల్లను దోల్కొని రేపే పొమ్మనిజెప్పు” అని అనుకుంట అవతలికి నడ్సిండు కాశిరెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com