…….మరుమాముల దత్తాత్రేయ శర్మ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

సదమలచిత్తవృత్తి సరసాకృతి ప్రాకృతి సత్త్వమూర్తి సం
పదలకు స్ధావరమ్ము మురిపమ్మును పంచెడు ముద్దు మోము నిం
పొదవెడు గుజ్జు రూపమున పుట్టెడు బుద్దుల మూటగట్టి యా
పదలను దోలునట్టి గణపా! దయజూడవె విఘ్న నాయకా!

ఓం గను సూక్ష్మ నేత్రములహోపరమేశు కటాక్షమీయగా
శ్రీం గతి శూర్పకర్ణములు చిన్మయ ధాతృ శ్రుతంబు నిల్పగా
క్లీం గమకమ్ములన్ బహుముఖీన రమేశ సుసిద్ధులీయగా
గం గణనాథ! ప్రోవు మనఘా! త్రిగుణాత్మక ! విఘ్న నాయకా!

తిరిపెములెత్తు నయ్యకును దేవనగేంద్ర ప్రసూతికీవెగా
మురిపెపు ముద్దుపట్టివి ప్రమోదము గూర్చెదవెల్లవేళలన్
కరిగెదవార్తులన్ గనిన గర్వము జూపవు మంచుకొండవై
కరుగుటపొంగిపోవుటలు కాదనకుండుట సాజమేగదా!
పరహితధర్మకర్మములు వంశగుణమ్ములు విఘ్న నాయకా!

గండశిలాకృతుల్ కఠిన గండము లన్నియు బూదిజేయగా
నిండమనమ్మునన్ దలచి నేమము తోడుత నిన్నుగోరగా
తొండము దేవరా! తొలగ దుఃఖము మాకిల నీవెరక్షగాన్
దండము పెట్టితొట్టతొలి దైవమ! కొల్తుము విఘ్న నాయకా!

కాలాధీనము విశ్వమంచనగ సంకల్పంబువైకల్పముల్
లీలాలోలత యీశ్వరేచ్ఛయగు, కాళీకాళుపుత్రుండవై
మాలో కోర్కెలు రేగగా నణచుచున్ మమ్మెంతొవేధించి కు
య్యాలించెంతయొ ప్రేముడిన్ గడకు విఘ్నాళుల్ తొలంగించుచున్
మూలాధారము నీవయై నిలుతువో మోదాత్మ విఘ్నేశ్వరా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com