– వనపట్ల సుబ్బయ్య

నేను

సేను బిడ్డను

సెలుకనే నా ఇల్లు ఇడుపు

సేతానమే నా సంస్కృతి

ముల్లుకర్రనే నా నేస్తం

మొకాళ్లలోతు మట్టిలో పొర్లాడి

బురుదను మింగి

విత్తును సృష్టించిన

ఆకలిని తాగి

అన్నదాత ట్యాగులైనును తగిలిచ్చుకున్న

అపర దరిద్రుని

గడెం నొగలు నా శ్వాసలు

ఎడ్లబండి నా నడక

నాగలి నా ఆయుధం

పలుగొర్రు, గుంటుక నా భుజాలు

దుకిమోకు, పగ్గం, బ్యారలు

పలుపు,ఆండ్రె, వార్లు, నా నరాలు

గంటలు మువ్వలు నా గుండెలు

తుకం నారు నా సింగారం

మేడితోక నా అలంకారం !

పాలుపట్టిన కంకులనుచూసి

బిడ్డల ఆకలితీరుతదని మురిసిపోయినోన్ని

ఇంటికొచ్చిన కళ్లాన్ని చూసి

దేశం ముందుకుపోతుందని గంతులేసినోన్ని

ఊరి కోమటాయనకు బర్తి పట్టిచ్చి

వారం దినాలకోయి

కాంట లెక్కలు చూసుకున్నోన్ని

వచ్చినంతనే తృప్తిపడ్డోన్ని

వానొచ్చి

గింజలు నవ్వకున్న పోతేపోననుకున్నోన్ని

కరువొచ్చి

కాలం కాకున్న కలతచెందనోన్ని

ఎరువులు

సబ్సిడీలు ఎగనామం పెట్టినా

గుండెనిబ్బరం చేసుకున్నోన్ని

అప్పులు

కత్తులై కుతికెలను కోస్తున్నా

నేలకోసం సిపాయిళ్లా నిలబడ్డోన్ని

ఇయ్యాళ

సౌకర్యాల పేరున రెక్కల్ని గత్తిరిచ్చి పరుగులపోటిపెడ్తున్నరు

పంటరకం తప్ప

పురుగుల రకం ఎరుగనోన్ని

గుమ్ములు గాదెలు తప్ప

గోడౌన్లనకు అయిసతు లేనోన్ని

సెలుకాడికి ఇంటికాడికి తప్ప

ఏ దేశం సంగతి తెల్వనోన్ని

నలుగుట్ల

నగుపట్లపాలైన నాగలిని

(రైతులకు మద్దతుగా కవిత.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com