-వెల్దుర్తి మాణిక్యరావు

“పూర్ణిమా! లే, తెల్లవారొచ్చింది… టాన్గా. రిక్షాల సందడిగూడా మొదలైంది. పాపను తర్వాత లేపుదాంగాని.”

రామం భార్యను మేల్కొలుపు తున్నాడు. అత్తవారు బొంబాయిలో ఉద్యోగరీత్యా ఉంటున్నారు. రాత్రి మూడు ఝాములు మెలకువతో ఉండటం వల్ల పూర్ణిమకు నిద్రమబ్బు వీడలేదు.

“అబ్బా. ఏమి తొందరండి. ఏది చేయి చూతాం…. కుడిచెయ్యి ఎవరిమ్మన్నారు?”

పూర్ణిమ, రామం ఎడమచెయ్యి పట్టి లాగి కూర్చోబెట్టి ఎడమ ముంజేతిని ఎడమచెవి దెగ్గరికి పోనిచ్చి, “టక్ టక్ టక్ టక్, అన్నది కొంటెగా.

పెదవులు నవ్వుల పువ్వులు విసరుతున్నట్లు కండ్లు వలపు జల్లులు చల్లుతున్నట్లు రామం కనిపెట్టాడు.

“అట్లంటే ఏమన్నట్టు.” అని ప్రశ్నించింది.

“ఏమైనట్లో నీవే మొదలు చెప్పు. మీరు నీ కనుచూపు మేరలో లేనంత సేపు నా గుండె యిట్లా కొట్టుకుంటుంది అన్న మాట. జీవామృతపు ఒక్కొక్క చుక్క ఆవిరై అదృశ్యమవుతున్నదన్నట్టు?”

“ఎప్పుడు వేదాంతమే నీకు” “ఇప్పుడే కదూ పున్నమ తెల్లవారింది. రాత్రి తొమ్మిది నుండి నాలుగు వరకు గడియారపు ప్రతిగంట మోతలో హెచ్చరికను గమనిస్తున్నాను. పైన చూదామా చందమామ నిండు వెలుగుతో పరుగెత్తుతున్నాడు. ఓకళ తగ్గించుకోటానికి ఎంత తొందరపడుతున్నాడో అతను. ఇటుపక్కలో చూతామా పూర్ణిమ ప్రయాణపు గడియలు సమీపిస్తున్నవి నా హృదయాన్ని”.

“ ఔను పాపం కలతజెందిస్తున్నవి కదూ?” అని పూర్ణిమ అందుకొన్నది. ఇద్దరు తమ్ముతాము మరచిపోయినారు. ఒక అరగంట సేపు.

“నాస్నానం అయింది. ఉపహారం గిన్నెల్లో సిద్ధంగా వున్నది ఇదిగో. ఈ డబ్బాలో యాభై రవ్వావుండలు. ఈ బుట్టలో తయ్యారుగ కల్పి పెట్టిన అటుకులు, టిఫిన్ క్యారియర్ లో వర్సగా బజ్జీలు, పూరీలు, చేగోడీలు ఇవి ముగిసేవరకు వుండలకు చేయిపెట్టవద్దు. హోటల్ ఫలహారం తింటే ఒట్టు. చీరకట్టు కుంటూనే ఒట్టుపెట్టుతూవున్న పూర్ణిమను రామం కండ్లనిండ చూసుకున్నాడు. అట్లనే చూస్తూ చిత్తరువువలె నిలిచాడు.

“అయ్యొ! మిమ్ముల అడుగకుండానే .. అని గునుగుకుంటూ రామాన్ని పూర్ణిమ సామానుగదిలోకి తీసికొని వెళ్ళింది. పెట్టె విప్పింది. “చెప్పండి ఏది కట్టుకోవాలో” అన్నది. ఒకటొకటి మడతలు విప్పుతున్నది, రామం చూస్తూ వున్నాడు.

ఆకు పచ్చని చీర, ప్రకృతికన్య కోయిల కూతలలో కట్టుకునేది. వెనెలకన్న చల్లనిదేమో అనిపించింది. ఎంచి యాభై దుకాణాలు తిరిగి ఉభయులు మెచ్చి తెచ్చికొన్నచీర, అది సీమంతంనాడు జరిగింది. ఆనాటి దినచర్య జ్ఞాపకం వచ్చింది. తలవూపినాడు రామం. మడత విప్పింది. మొగిలిరేకుల వాసన గుప్పుమన్నది. ఎండివరుగైన రెండు మొగిలిరెక్కలు రామం ముఖం మీద పడ్డవి. ఒళ్ళ జలదరించింది. వాసన మొగిలిరెక్కలు చూచేసరికి ఎందుకో ఏమో గుండె దడదడమన్నది. “పెరిగి పెద్దనయ్యె పచ్చరంగు కావాలంటే. ఈ ఎండిన పూరెక్కలేమిటి ?” అనే

భావం మెరుపువలె వచ్చింది. పోయింది.

నాన్న! నాకు పూల అంగి కావాలె” అంటున్న అమ్మాయిని ఎత్తుకొని బనారసీ బూటాల ఆకుపచ్చ ఫ్రాకు వెదికి తొడిగినారు. నవ్వుతున్న అమ్మాయిని చెరోచెంప ముద్దు పెట్టుకున్నారు.

పొద్దున స్నానం చెయ్యగానే కుంకుమ పెట్టుకుంది. పూర్ణిమ సీసాల కుంకుమ, కలర్ కుంకుమ, సీమ కుంకుమలను బదులు సాయంత్రం ముస్తామయ్యేటప్పుడు కుంకుమ బరిణె పెట్టినచోట లేదు. విచారాన్ని కనబడనీయకుండ అణచి సీమకుంకుమతో నుదుట బాలచంద్రుని దిద్దుకొని ఏమంటున్నారు? అన్నట్టు రామంవైపు చూసింది. .

ఉపహారానికి పదమన్నాడు రామం. మామూలు ప్రకారం కాఫీ గిన్నె అమ్మాయి ముందు పెట్టి ఇంట్లో చేసిన బిస్కట్లు అందించింది. తాము బేసిన్ లడ్డూలు వడ్డించుకున్నారు. అది కావాలని పట్టుపట్టింది. మూడేండ్ల సుధ.. “నీకు సరిపడదు. తినగూడదు” అని తల్లి బుజ్జగించింది. కావాలని కాళ్ళు రాసింది సుధ. అంతటితో రెండు కాఫీ కప్పులు పగిలినాయి. రామం ధోవతిచెంగు, పూర్ణిమ చీరెకొంగు తడిసినాయి. ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. సుధను కోపగించడం కాని తాము కిచులాడటం కాని వారికి తెలియదు. నవ్వు తెచ్చుకొని ఇద్దరు రేగుపండంత లడ్డు యిచ్చి

సుధను బుజ్జగించి పాలుత్రాగించినారు. పూర్ణిమ తన కాఫీ రామానికిచ్చింది. రామం తనకు సాయింత్రానికని మిగిల్చిన పాలను పూర్ణిమకు ఇచ్చాడు. పాలు ఫలహారం అయిపోయింది.

“ఇక లే ప్రయాణసన్నాహానికి” అన్నాడు రామం.

టాంగావాడు సామాన్నెక్కిస్తున్నాడు. తాళం కోసం వెదుకుతూ పూర్ణిమ గదిలోకి వెళ్ళింది. రామం వెనకాలె వెళ్ళాడు. నిలువుటద్దంలో ఒకరినొకరు చూచుకున్నారు. కడుపులో ఏమిటో ఆవేదన చెప్పుకోరాదు. యంత్రాలమోస్తరు తిరుగుతున్నారేకాని ఎవరి హృదయం వారి అధీనంలో లేదు. అద్దంలో నీడను చూస్తూ ఇద్దరు చేతులు చాచారు. మలిచారు.

వరండాలోకి వస్తున్న పూర్ణిమను, మరోసారి పలుకరిస్తామని “ఇదిగో” అని పిలిచాడు రామం. తమలపాకు విడెం మరింత ఎరుపెక్కిన ఆ నాల్గు పెదిమలు నాలుగు అంగుళాల అంతరంలో ఉన్నవి.

“పోతున్నావా పూర్ణమా” పక్కింటి శేషమ్మ బొంగురు కుతక వినపడ్డది. వణుకుతున్న పెదవులు కలువలేక వెనక్కు కదిలినవి. ఆశ ఉండిపోయింది. ఎవరో అడిగినట్టు “ఏమంత తొందరపని పూర్ణమ్మా! దినాలు చూస్తే బాగులేవు. ఐనా, పంపించి రా నాయనా! రామం!” అంటూ జారుకుంది శేషమ్మ టాంగా ముందు నుంచి

ముగ్గురు టాంగా ఎక్కి స్టేషన్ చేరుకున్నారు. పోర్టర్ కు పావలా ఇచ్చి కంపార్ట్ మెంటులో చోటుచేయించాడు. రైలు కదలటానికి పది నిమిషాలు మాత్రమే ఉంది.

“చూడండి” అని మొదలు పెట్టింది పూర్ణిమ. సొమ్ముల పెట్టి తాళంచెవి అల్మారిలోని చందనపు డబ్బిలో ఉంది. చంద్రహారం, గుండ్లు, నాను, రెండు జతల గాజులు, నా వెంట ఉన్నవి. వెండికంచం, చెంబు, గ్లాసు, వెంకయ్యగారి కూతురి పెండ్లంటే యిచ్చాను. తెప్పించండి…. అవుసలి కొండయ్య రెండు తులాల వెండిగిన్నెల బాబతుయివ్వాలె. చాకలికి ఈ నెలజీతం నేను ఇవ్వలేదు. మీ ఎర్రంచు ధోతి రావాల్సివుంది. “ఈ విధంగా చేబదుళ్ళవరకు సంసారపు లావాదేవీలను అప్పజెప్పింది. ఇప్పుడు రామానికి కావల్సింది సంసారపు గొడవ కాదు. హాయి గూర్చు నాలుగు ముక్కలు, గొంతులోని మధురవాణి.

“ఉద్యోగులు బదిలి అయ్యేటప్పుడు కవిలెకట్టలు అప్ప చెప్పినట్టు ఇవేమిటి ?” అన్నాడు రామం నవ్వుతూ.

ఏదో చెప్పాలనిపించింది. మనసు కుదుటపడుతుందనుకున్నాను. ఐనా మీ కెన్నని జ్ఞాపకముంటాయి లెండి?” అన్నది పూర్ణిమ.

“ఇక నేను చెప్పుతాను విను. అంటూ రామం పర్సుదీసి. “ ఇవి ప్రయాణం ఖర్చులకు, ఇవి కట్నాలకు, ఇవి చిల్లర ఖర్చులకు” అంటూ నోట్లు చూపించాడు. “ఫౌంటెన్ పెన్ ఇందులో ఉన్నది ఏయిర్ మేల్ కవరు విలాసం వ్రాసి వుంది. క్షేమంగా చేరినట్టు వెంటనే ఈ కవరుపంపు”. అని చేతికందించాడు. స్పర్శసుఖం అనుభవించాడు.

రైలు కదలడానికి అరనిముషం మాత్రమే ఆలస్యం ఉంది. హడావుడిగా రైలు ఎక్కుతున్న రామిరెడ్డిని సమీపించి “మా వాళ్ళిదే రైలులో వెళుతున్నారు. నీవు బొంబాయికే వెళతానన్నావుగా! కామాటిపురాలోదించు. “వెంటనే ఏయిర్ మేల్ కవరు రాయి” అన్నాడు రామం.

“తప్పకుండా, అంతా జాగ్రత్త చేస్తాను. ప్రతి స్టేషన్లో పూర్ణక్కయ్యను చూస్తుంటాను. నీవేమి చింతపడుకు.”

పచ్చఝండా ఎగిరింది.

“ఏయిర్ మేల్” అనే రామం కేక పూర్ణిమ చెవిలో మరోసారి ప్రతిధ్వనించింది.

రామం కలంబట్టి రెండు గీట్లు గీయలేదు. కాని -దినం గడిచింది. అరగంటైనా కనుమూయలేదు. కాని – రాత్రి గడిచింది. ఉదయం పదకొండు గంటలు వీధిలో ఎయిర్ మేల్ వార్తాపత్రికల అమ్మడం హడావుడి కేకలు వినవచ్చాయి. రామం పేపరుకొన్నాడు. “యవనపురంలో రైలు పై దాడి. సాయుధ గుండాల ఘోర దౌర్జన్యాలు ” అని తాటికాయలంత అక్షటాల శీర్షికలు. రామానికి ముఖంలో నెత్తురు చుక్కలేదు. కత్తులు ఝుళిపిస్తు గుండాలు ఆడవాండ్ల డబ్బాలో జొరబడ్డారు.

తొక్కుళ్ళో పదిమంది పిల్లలు నలిగిపోయారు”

“సుమారు యాభైవేల లూటి.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com