కొమురవెల్లి అంజయ్య

పక్క పక్కనే మంటల వంటల పని మంతురాళ్లు

కవలల్లా పుట్టి పక్కపక్కనే

వంటింట్లో చిట్టుపొయ్యి , కట్టెలపొయ్యి

జాజుతో అలికి ముగ్గేసి బొట్లు పెడితే

ఇంటి పెద్దర్వాజ కడపలా బడాయి పోయేవి

ఒకటి ముట్టిచ్చి ఊరుకుంటే

రెండోది చిన్నబోయేది, అలకబూనేది

వాడిన ముకుడునో , అన్నం కూర గిన్నెలనో మోసేది

తప్పని తిప్పలు తగులుకున్న భావన

రెండు మూడు కట్టెలు పెట్టి వెలిగిస్తే

భగభగ మండే పొయ్యి మీసాలు మెలేసేది

చిన్న రోకలి నిలబెట్టి పొయిల చిట్టు నింపడం

అమ్మ నేర్చిన బ్రహ్మవిద్య

మంట మలిగినా కాకతగ్గని చిట్టుపొయ్యిది

నెమ్మదితనం ,నేర్పరితనం

ఒక్కోసారి రెండూ అలిగి మారాం చేసేవి

పొగ ఏడుపులతో గోలగోల చేసేవి

గొట్టం ఊది ప్రాణవాయువు బిస్కెట్లిస్తేనో

గ్యాస్ నూనె బెల్లం ముక్క చేతిలో పెడితేనో

తొవ్వల కొచ్చి మండేవి బుద్దిగా

పొగ గొట్టం ఊదడమంటే ప్రాణం కొంత పంచివ్వడమే

పొగ సూరిన కన్నీళ్ళను తుడువడమే

పొయ్యిలు పొగబెడితే

సున్నం గోడలకు మసంటకుండా

పెంకుటింట్లో పైకప్పు కట్టెలు మసి బారకుండా

ఇంటి కప్పును చీల్చి కట్టిన చిమ్నీ

పొయ్యిలు రాజేసిన విషయం

వాడకట్టంతా చాటింపేసేది

పొయ్యిల పిల్లి లేస్తేనే కదా

కడుపుల ఎలుకలు పరారయ్యేది

మంట మర్యాదగా మెలిగితేనే

మసంటని గిన్నెలు ,మాడిపోని వంటలు

కుండలో పాలు పొంగడానికి

తుకతుక ఉడికే రాతెండి బువ్వ గిన్నెలకు

చలికాలం స్నానాలకు నీళ్లు మసల బెట్టేందుకు

పొయ్యిలు రెండు పెద్దదిక్కయ్యేవి

ఇంటింటికి మంటి పొయ్యిల కాలంలో

అవి వంటింటి నుదుటి బొట్లు

నాగరికతకు ఆనవాళ్లు

గ్యాస్ వంటింట్లో పెత్తనం మొదలెట్టాక

కట్టెలు, చిట్టు ,గ్యాస్ నూనె పొయ్యిలన్నీ

కొట్టేసిన చిట్టా పద్దులయ్యాయి

ప్రదర్శనలలో కూడా వెలుగని బొమ్మలైనాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com