అమ్మ! నన్నుగుడా బాపుతోని మబ్బులనే లేపే, రేపు పంద్రాగస్ట్ పొద్దున్నే ప్రభాతభేరికి పోవాలే” అన్న అమ్మతోని…

“నేను నాల్గుటికి లెవ్వంగనే నిన్నే మొదలులేపుత, ఇప్పుడైతే జల్దివండుకో” అని నవారు మంచం మీద చద్దరు పర్చి నన్ను పండుకోవెట్టింది అమ్మ.

తెల్లారి ఐదుగొట్టింది. గచ్చుల మంచుకురుస్తున్నది. అమ్మ లాసిగ పిలిచిలేపింది. లెపంగనే లేసి, మొహం కడుక్కోకుంటనే చాకలి రామలక్ష్మి ఇంటికిపొయ్యి కడక్ ఇస్త్రీచేసిన ఖద్దరు లాగు, తెల్లంగి తెచ్చుకొని దిగూట్ల వెట్టుకున్న.

ఐదున్నరవరకు రాజ్మహ్మద్ చిన్నకొడుకు లియాఖత్, వడ్ల రవి, నేను కలిసి కమాన్ దగ్గరుండే మా బడికి పోయినం. అప్పటికి సూర్యుడు పుట్టలే. చీకటి చీకటిగనే ఉన్నది. ఒగలమొగాలు ఒగలకు సరింగ కనవడుతలెవ్వు గొంతులనువట్టుకొని గుర్తుపట్టుడే.

కొద్దిసేపటికి పీటీ మార్క శేఖర్ సర్ బడిదగ్గరకొచ్చిండు. విజిల్ తీసుకొని క్లాస్ తీరుగ వరుసగ నిలవెట్టిండు.ప్రతి వరుసకు క్లాస్ పెబ్బ మొదలునిలవడ్డడు. ముంగట బ్యాండ్ కొట్టే రమేశ్, దోరోల్ల మనోహర్ యన్.సీ.సీ. డ్రెస్సు వేసుకొని నడుస్తున్నరు.

మెల్లగ ప్రభాతభేరి మెయిన్ రోడ్డు మించి, బస్టాండ్ దగ్గరికి చేరుకునే సరికి సూర్యుడు అప్పుడే పుట్టిన చిన్నపిల్లగాడు కండ్లు తెరిచినట్టు, భూమిమీద చూపు ప్రసరించిండు. మేమంతా భారత్ మాతాకీ జై, జై జవాన్, జై కిసాన్, బోలో స్వాతంత్ర్య భారత్ కి జై అని నినాదాలు చేసుకుంట పోతున్నం. విక్టరీ టాకీస్ చౌరస్తాల మా బడి ప్రభాతభేరికి ఎదురుంగ కాంచీట్ చౌరస్తాల ఉన్న ఇంకో బడి పిల్లలు ఎదురైన్రు. వాళ్ళు మమ్మల్ని చూసి లాషిగ నినాదాలు ఇస్తే, అంతకంటెక్కువ మేము నినాదాలు ఇస్తున్నం. అట్లా మా బడి ప్రభాతభేరి గాంధిబొమ్మ నించి మళ్ళా బడికి ఏడింటికి చేరింది.

మళ్ళా శేఖర్ సర్ అందరిని లైన్ల నిలవెట్టి,

” మీరు జల్దిన ఇంటికివొయ్యి, స్నానం చేసి ఇస్త్రీ చేసిన బడి డ్రెస్ వేసుకొని ఎనిమిదిన్నరకు జెండావందనం ఉంటది అందరూ రావాలి” అని మమ్ముల్ని ఇంటికి పంపిండు.

బాపు బడికి తయారైతుండు. దోతికట్టుకొని, లాల్చీ వేసుకొని మీద కండువా సదుర్కొని “అరే మురళీ నీ తయారవుడు అయ్యిందా లేదా” గట్టిగ అన్నడు. నేను వెంటనే దన దన దిగూట్లున్న ఇస్త్రీ అంగీ, లాగువేసుకొని వచ్చిన. బాపు, నేను నడసుకుంట బడి తొవ్వవట్టినం. నాకు ప్రభాతభేరికి దోస్తులతోని పొయ్యి మజా ఉడాయించుడు, జండా ఎగిరేటప్పుడు బాపుతోని ఆవెన్క ల్యాగ దూడ లాగ నడిచిపోవుడు చానా చానా ఇష్టం,

సరింగ 8 గొట్టంగనే కమాన్ దగ్గరజండాని మున్సిఫల్ ఛైర్మెన్ సోహన్లాల్ బల్దవా ఎగిరేసిండు. దానిపక్కకే మా బడి. ప్రతి పంద్రాగస్టుకు, చెబ్బిస్ జనవరికి ముఖ్యఅథితి బల్దవాసేటే.

బల్లె మా హెచ్చెమ్ తొడుపునూరి కిష్టయ్య సార్ ఎగిరేసిండు. పదవతరగతి పెబ్బ ఉమాకాంత్ జనమనగణ గీతాన్ని పాడితే మేమంత గొంతుకలిపి జెండాకు వందనం చేసినం. అప్పటికే జరంత పెరిగిన సూర్యుడు తొంగి తొంగి చూసుకుంట జెండాను కిరణాల వేళ్ళతో సెల్యూట్ చేస్తున్నడు.

మళ్ళొక్కసారి పీటీ సర్ విజిలేసిండు. హెచ్చెమ్ సర్ మైక్ అందుకొని” మన పట్టణ ప్రథమ పౌరుడు, మున్సిఫల్ చైర్మన్ గారు అయిన సోహన్ లాల్ బల్దవా విద్యార్ధులనుద్దేశించి ప్రసంగిస్తారు”.

నా మట్టుకు నేను ఆయన ఉపన్యాసం అస్సలు వింటలేను, వెనక లియాఖత్ తోని మాట్లాడుతున్న, ముందటున్న కోమట్ల నాగేందర్ “అరే మురళి మీ బాపు నీ దిక్కే కోపంగ చూస్తున్నడు. ముచ్చటాపి పెద్దోళ్ళు చెప్తున్నది విను” అన్నడు.

“నువ్వు విన్రా, ఎప్పుడు వింటున్నదే గదా, గండ్ల కొత్తగేముండది” అన్నగని, అసలు విషయం అదికాదు. ఛైర్మెన్ సర్ ఉపన్యాసం అయిపోయేటప్పుడు చెప్పే ముచ్చటకోసమే నా ఎదురుచూపు.

“……. ఇట్లా ఎన్నో పనులు చేసిన. మీ బడికి జాగగుడా చూసినా…… చివరగా…… నాకు ఎర్కే మీరు దేనికోసం ఎదురుచూస్తున్నరో, ఎప్పటి లెక్కనే, మా బాలాజీ టాకీస్ల పదిగంటలనుండి పదకొండు గంటల వరకు ఉట్టిగనే సినిమా పాటలు, కొన్ని ఫైటింగ్ బిట్లు మీకోసం రెడీగ ఉన్నయి. వచ్చి చూడుండి” అని తన ఉపన్యాసాన్ని ముగించిండు.

ఈ మాటకోసమే నా మనసు అన్ని ఆగవట్టుకొని ఎదురుచూస్తున్నది. సినిమా అంటే నాకు చదువుకంటే ఎక్కువ ప్రాణం. ఈరోజైతే అంతా స్వేచ్ఛ గనుక, ఇంట్ల అమ్మేమనదు, బాపైతే బడిలనే విన్నడు. వెంటనే

నేను నాగేందర్ కు ఇషార చేసినా, లియాఖత్ ఇంకాకొందర్ని మోపుజేసిండు. మెల్లగ అందరం లడ్డుబొంది చూర తీసుకున్నం. అప్పుడే గేటుదగ్గర నిలవడ్డ బాపు తన చేతిల ఉన్న బోంది లడ్డుపొడి నాకువెట్టి తినుకుంట పొమ్మన్నడు.

బస్సు డ్రైవర్ స్టీరింగ్ పట్టుకొంగనే లోపటున్నోళ్లు ఎంత సంబరవడుతరో అంతకంటే ఎక్కువ సంతోషంతోని దోస్తులగూడి బాలాజీ టాకీస్కు పోయినం.

పదినిమిషాల్ల అందరం టాకీస్కు చేరినం. ఆడ ఇంక గేట్లే తియ్యలేదు. మస్తుమంది గేట్లనువట్కొని ఊపుకుంట లొల్లి లొల్లిజేస్తున్నరు. ఆ మందిని చూసి నా నోట్ల తియ్యగ కరుగుతున్న బొంది చూర ఒక్కసారి చేదుగొట్టవట్టింది. ఈసారి ఎట్లనన్న లోపటికి జొరవడి

సీటుదొర్కవట్టుకోవాలె అనుకున్నం అందరం. పదయింది టైం. గేట్ తీస్తున్నరు, పిల్లలు ఒక్కసారి కోమటిచెరువు మత్తడి దుంకినట్టు ఒక్కటే ఉరుకుడు లోపటికి.

ఈసారి అందరం అష్టకష్టాలువడి సీటు దొరికిచ్చుకున్నం. పదినిమిషాల ఆలస్యంతోని వేటగాడు సినిమాలోని పాట మొదలైంది. ఎన్టీఆర్ రెండుగుండీలిప్పి డ్యాన్ మొదలువెట్టిండో లేదో పర్దామించి పాట మాయమయ్యింది. ఏం జరుగుతున్నదో ఎవ్వరికీ అర్థమైతలేదు. ఒర్రుతున్నరు

కొందరు. ఈలలు గొడుతున్నరు. కాయిదాలు చింపి ఎగురేస్తున్నరు. కొందరైతే సీట్లు చింపనీకి చూస్తే గేట్ దగ్గరోళ్ళు చూసి లొల్లివెడితే ఆగిపోయిండ్రు బడిపిల్లలు.

అట్లనో, ఇట్లనో టైం గంట అయినట్టున్నది. అందరం వానకోసం నోరుతెరిచిన భూమిలెక్క కండ్లుతెరిచి పరదానే చూస్తున్నం. నేను వెనకకు తిరిగి రీళ్ళు నడిచే ప్రొజెక్టర్ దిక్కు చూసిన. లోపట సినిమా ఆపరేటర్ ఏదో సదురుతున్నడు. పెద్దపొక్కల నుంచి సినిమా బొమ్మ పడుతుంటే, పొగల వరుసకనవడుతది అసలుకైతే, కని ఇంకా ఆ పొగ పొక్కల నుండి వస్తలేదు. కొంచెంసేపటికి ఏదో మెతుకంత వెలుగుపొగ వస్తుంటే తల పరదాదిక్కు తింపిన.

“క్షమించండి, ప్రొజెక్టర్ల రీల్ జామ్ అయినందున వేటగాడు పాటల ట్రైలర్ మొత్తం చూపించలేక పోతున్నందుకు చింతిస్తున్నాం, ఇట్లు టాకీస్ యాజమాన్యం” అని ఉన్న స్లైడ్ ప్రత్యక్షమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com