ఇంకో గంటయితే బడి వదిలిపెడ్తరనంగ దంచి కొట్టుడు వెట్టింది వాన. సూత్తుండగనే రోడంత కాలువయి పారవట్టింది. ఇంటెనక పెరట్ల నీళ్లు నిలిచి కుంటయింది. మా పాత, కొత్త ఇండ్ల మధ్యన బురదనీళ్ళు కాళ్లకు అంటకుండ నడవడానికి వేసిన శావాస్ బండలు కొంత మునిగి కొంత తేలి, బావురు కప్పల్లా కనవడవట్టినయి. నిలిచిన నీళ్లు కురిసే వాన చినుకులకు చిట్లి ముత్యాలై ఎగురుతున్నయి. “మేఘమా! మేఘమా! కురవకే ఈ క్షణం..” పాట గున్గునాయించుకుంటూ, ముందు దర్వాజాలకేల్లి పోలీస్ స్టేషన్ దిక్కు కనిపించినంత కాడికి చూస్తున్న, గడిగడికీ. దోస్తుల్ని కలువ బయిటికి పోవడానికి తయారుగున్న మా అన్న, నన్ను ఓ కంట కనిపెడ్తున్నడు. వదలని వర్షంలా నా పాట వినీ వినీ విసుగుచెందిండేమో, “ఎవరి కోసం రా! పాడుతున్నవ్?” అన్నడు. పానం జల్లు మంది. దెబ్బకు నోట్ల గచ్చకాయ పడ్డట్లయింది. ఈయనకెట్ల తెలిసిందబ్బాని, గునుగుకుంట, “అదేం లేదన్నా”ని పైకి అన్న. నా దేహ భాష పట్టిచ్చిందా? పాడే పాటా? లేక ప్రేమలో ఉన్న సంగతి ఉత్తగనే తెలిసిపోతుందా బయటికి!?

నా గానం ఆలకించాయేమో మేఘాలు తెరిపిచ్చినయి. వాన తగ్గినా, తొవ్వెంబడినీళ్లు దాటిగా పారుతున్నయి. అన్న బయటకు పోయిండు. నేనే రాజుని.

దర్వాజల నిలబడి చూస్తున్న. ఇద్దరిద్దరు, నల్గురునల్గురు కలిసి జంటలుగా, లేనోళ్ళు ఒంటరిగా వస్తున్నరు, పెద్దబడీలకేల్లి విద్ధ్యార్థులు. వాళ్ళ వెనకాల తాత్పరంగా ముచ్చట్లు వెట్టుకుంట నడుస్తున్నరు స్కూల్ ఫైనల్ హీరో హీరోయిన్లు. పదో తరగతికి రాంగనే వయిసోళ్లమైపోయినం అనే టెంపరితనం నేత్తి కెక్కుతుంది. పోయిన యాడాది, నేను సుత గట్ల ఫోజులు కొట్టినోన్నే.

పోలీస్ స్టేషన్ ముందర, రోడ్డు పక్కన పొరపాటుగా పెరిగాయో లేక వాటి పరిమళాల్ని పీల్చయినా పీడనను మరువక పోతరాని, కావాలనే ఎదిగాయో ఆకాశమల్లె చెట్లు. నీటి చినుకుల భారాన్ని మోయలేక, కొమ్మను వీడి నేల రాలుతున్న ఆకాశమల్లెలు… పారె నీటికి తడవకుండా ఓణీలంగలను పాదాల వరకు సుతారంగా ఎత్తిపట్టుకుని, సునోసరంగా నడిచివస్తున్న పువ్వులోలె అమ్మాయిలు… వాళ్ళ తలలపై మల్లెలు రాలి పడుతుంటే, నలనల్లని కురుల్లో మెరిసే తెలతెల్లని ముత్యాల మల్లెలు. పువ్వులో లేక పువ్వుకాడల వంటి మునివేల్లో, ఎక్కడ కంది పోతాయోనని నెత్తి పై పడ్డ పువ్వుల్ని సుతిమెత్తగా తీసి, కిందకు జారిడుస్తుండ్రు. నీటి పారకంలో పడి పువ్వులపడవలై వాళ్ళ పాదాల్ని పరికిస్తూ, కాలి గజ్జెల సవ్వడులు వింటూ, పరవశిస్తూ ప్రవహిస్తున్నయి. ఆ గుంపు మా ఇల్లు దాటి పోయేవరకూ తలుపు వెనక నిలవడి, దాటినంక తలుపులు బిడాయించి, వాళ్ళను అనుసరిస్త్తూ, అనుసరిస్తున్నట్లు తెలియనంత దూరంలో నడుసుడువెట్టిన, తను ఎవరి తాలూకో తెలుసుకో డానికి .

ఆమె నాకంటే ఒక సంవత్సరం జూనియర్. బడి అయిపోయి బయిటికి వచ్చేవరకూ ఎందుకు కనిపించలేదో!? కళ్ళుండీ చూడలేని తనం! మనసుకు పసిగట్టే వరం! ప్రేమ.. ఎవరికీ చెప్పలేని, చెప్పకుండా ఉండలేని, చెప్పినా అర్థంకాని, చేసుకోలేని, హృదయ సలపరం.

బద్ది పోచమ్మ గుడి దాటిండ్రు. పోచమ్మ ఊరేగింపు ఎదురువడ్డది. జమడిక వాయించుకుంట బైండ్లోళ్లు నడుస్తుంటే వెనుక బలిమేకకు తిలకం నుదుట దిద్ది, మేడలో వేప ఆకుల హారం వేసి, అలంకరించుకుని తోలుకస్తున్నరు. నెత్తిన బోనాలు ఎత్తుకుని ఆడోళ్ళు. వెనుక మొగోళ్ళు. వాళ్ళని తప్పించుకుంటూ, వీళ్ళు తప్పిపోకుండా చూస్తూ నడుస్తున్నా. వాళ్ళ వాళ్ళ ఇండ్లల్లకి తోటోళ్లు ఒక్కరొక్కరుగా వెళ్లిపోతుం డ్రు. మిగిలింది, ముందు తను, నేను వెనుక. మధ్యన, నన్ను గమనించనంత ఎడం. గుండార్సు శివప్రసాద్ ఇంటి సందు మలగకుండా, కోరుట్ల శ్రీనివాస్ ఇంటి ముందు నుండి సక్కగ నడుస్తుంది, పుస్తకాల్ని ఎదనెత్తుకుని.. హత్తుకుని. నమిలకొండ నటరాజ్, ప్రతాప సంతోష్ ఇండ్లు దాటి, ఎడం వైపు భీమేశ్వరాలయపు వీధి మలుపు తిరగక, మునుముందుకు పెద్దగుడి కేయి పోవట్టింది. కళ్ళు కాపలా కాస్తుంటే తనను, సంకేతాలు అందక, దారి కానరాని కాల్లు నీళ్లలో అడుగేసినయి. అడుసులోని అడుగు తీసి, అడుగు వేసి, చూసే లోపు, మటుమాయం.

‘తప్పిచ్చుకుందిరా తాబేటి బుర్రా!’ అనుకుంట, తూము దాకా ఒక్క జంగలో ఎగిరివచ్చినంత పనిజేసిన. తూము నీళ్లకు బొల్లు తోముతున్న అవ్వ, పని ఆపి చూసింది “ఎందన్నట్టు?” ‘ఏంలేదన్నట్టు!’, ముందుకు కదిలిన. మూడు తొవ్వలు. ఎటువైపు చూసినా బోసిపోయిన దారి. ఎదురుగా అప్పాల చంద్రశేఖర్ ఇల్లు. కుడిఎడమల రామశాస్త్రి రాములు, మధు నాగేందర్ ల ఇండ్లు. ఇంకా అప్పాల ప్రసాద్, దేవరాజు నరహరి, బ్రమ్మన్నగారి రమేష్ ఇండ్లు. అందరూ దోస్తులే. అక్కడ ఉండే చాన్సే లేదు. మరి ఏమయినట్లు!? బహుశా, నేను వెంబడిస్తున్నది తెలిసిందా? కావచ్చు. “స్త్రీల వీపులకు సైతం కళ్ళుంటా”యంటాడు చలం.

ఎవరింట్లోనో దాక్కుని నన్ను గోల్ తిప్పింది.

# # #

పట్టు’వదిలి’న విక్రమార్కుడు, బిక్కమొహం వేసుకుని వెనుదిరిగాడు. అలసట మరవడానికి కథ చెప్పే భుజం మీది శవం లేదు. కానీ, కథ చెప్పుకునే మిత్రుడొకడు దొరికిండు, ఎడ్ల మహేష్ రూపాన. మిత్రుడొక్కడుండిన పదివేల సైన్యంబు. వాస్తవంబు. వివరంగ నా ప్రేమని వివరించిన. వారంలో వివరాల్తో వచ్చిండు. “నువ్వురా స్నేహితుడివంటే” అని, కౌగిలించుకున్న సినిమాటిగ్గా. “అంతొద్దుగానీ ఉడిపిహోటల్ల మసాలా దోశ తినిపించి, పస్టుషోకి సినిమాకు గొంచవో” అన్నడు. అననయితే అన్నడు గానీ, వాడే పెట్టిండు.

# # #

మా ఇంటిముందు నుండి స్కూలుకు పోయేప్పుడు, తిరిగి వచ్చేప్పుడు, తనకు తెలియకుండా చూడ్డం, ఓ దినచర్య అయిపొయింది. ఎన్ని రోజులిలా!? ధైర్యం చేసి, ఎదుటపడి, మాట్లడేంత దమ్ము లేదు. ఏదో ఒకటి చేయాలి! ఏం చేయాలో తెలియదు. వ్యక్తావ్యక్త.. అనులోమ విలోమ.. ఆలోచనలు. అదృష్టంకొద్ది, కొత్త సంవత్సరం రాబోతుంది. మనకు రాసే తెలివుంది. శుభాకాంక్షలో, ప్రేమకాంక్షలో, రాసి మెప్పించక పోతునా! పోతనా! గంటంబు చేబూని, కాయితంబు గైకొని, ప్రారంభించితిన్.. తిని. తిననయితే తింటిని గాని పలుమార్లు.. రాయసంగ రాయడమే రాక.. రాసింది నాకే రోతగా తోచి.. ఛీ! అనుకుని.. ఛి! ఛీ! అనిపించుకోకూడదని.. చించి పడేసి.. లేసి.. బజార్ల పడ్డ గ్రీటింగ్ కార్డ్స్ కోసం. తిరిగి తిరిగి.. చూసి చూసి.. తిరిగి చూసి.. దొరికిచ్చుకున్నానో కవితలాంటి కార్డును, కన్నె హృదయాన్ని గెలుచుకునే ఆయుధంబును. మిగిలిందిక, చేరవేసే ప్రహసనంబు. ప్రత్యక్షంగా ఇచ్చేదా! అంత తెగింపా! మరి మహియే శరణ్యమా! వాడీరాయబారపు భారాన్ని ఒప్పుకోకోప్పడవచ్చు. చివరకు, తిలక్ అక్షరమైన పోస్టుమేనే మేఘమై మెరిసిండు మది లోన.

ఇగచూస్కో! పోస్ట్ చేసింది మొదలు, ఎదురు చూపులు మొదలు. “ఉత్తరాలు ఏమైనా వచ్చాయా?”ని, పోస్టుమేన్ రాములుకు తప్పని రోజువారీ వేధింపులు.

# # #

ఓ చల్లని సాయంకాలం, వేడి ముఖం వేసుకుని మహిషాసురుడై వచ్చిండు, మహి. వచ్చుడువచ్చుడే, తిట్ల దండకం అందుకుండు.

“తెలివి లేదుర?”

‘ఉందా! లేదా! ఏమో!’, లోలోపల అనుమానపు సుడులు.

“పోస్టు చేసేప్పుడు చూసుకోవద్దుర?”

‘ఎర్రని డబ్బల, తెల్లని కవరు, చూసే వేసిన్నే!’, మౌనంతో భాషిస్తూ గుర్తుకుతెచ్చుకుంటున్న.

“నువ్వే పంపినవని నీ ‘లవ్’కు తెల్సిపోయింది.” (లవర్ అనకుండా లవ్ అంటడు వాడు. నిజమే కదా!)

‘అయ్యో.. అట్లేట్ల! అయ్యవ్వ పెట్టిన పేరు పెట్టకుండా, ఆకాశరామన్నను కదా అడ్డంగా పొడుగ్గా వాడుకుంది. మరెలా సాధ్యం!? ఈ అసాధ్యురాలు, ఆ డిటెక్టివ్ యుగంధర్ చెల్లలా? కాకూడదే! తనకు ప్రియురాళ్లు ఉంటారే తప్ప చెల్లెలు ఉన్నట్టు లేదే!’, మనసు మాట్లాడుకుంటుంది.

“నేను తిడుతుంటే, ఎదో ఆలోచిస్తున్నవేంది బే! కవిలా”.

నాకు రేషం పొడుచుకువచ్చింది, రాంపూర్ కత్తిలా. సినిమాటిక్గ్గా, “అరేయ్! నన్ను ఎన్నయినా అను. నాలోని కవిని మాత్రం తిట్టకురా”అన్న. రోషాన్ని రేషన్ షాపోడికి ఇచ్చి, లోగొంతుకతో, “ఎట్ల దొరికిపోయిన్నో చెప్పరా” ని బతిమిలాడిన.

“కాబోయే మీ వదిన పేరు, అడ్రస్, తనకు పంపిన కార్డుపై ట్రెస్ అయింది. అది పట్టుకుని చూపించి, తిట్టింది. ప్రేమలు, గీమలు ఇష్టం లేదంది”.

‘గీమలకు నిఘంటువు వెతకాలి’.

“అవున్రా! వదిన అడ్రస్ రాసేప్పుడు కవర్ కింద ఒత్తుకోసం ఈమెకు పంపిన కార్డు పెట్టి ఉంటా”. మంచి మరిదన్న మార్కులు కొట్టేద్దామంటే కథ ‘నిలువు’తిరిగింది.

# # #

మబ్బుల బసుకు హైద్రాబాద్ పోవాలే. O.U లో చదువాలే.(మా ఊరి యువతకు ఉండే ఓ కామన్ ఫాషన్). తన హృదయాన్ని గెలుచుకోవాలే. మన తడాఖా ఏందో చూపాలే. బస్. మనుసు స్థిరం చేసుకున్న.

హత్యాత్మహత్యలు లేవు. యాసిడ్ దాడులు, రివేంజులు లేవుగాక లేవు. ఉన్నదల్లా, కడుపులో బడబాగ్నులు దాచుకున్న సముద్రంలా నేను. మునిగిన టైటానిక్ లా నా తొలిప్రేమనౌక. మా ముగ్గురికి తప్ప మూడోకంటికి తెలియకుండా మునిగింది, ముగిసింది.

-పిన్నం శెట్టి కిషన్

9700230310.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com