హైదరాబాద్లో ఆధునిక కాలంలో సామాజిక మార్పులకు, పారిశ్రామి కీకరణకు, సంస్కరణలకు దారులు వేసింది సాలార్జంగ్ పేరిట అందరికీ తెలిసిన నవాబ్ మీర్ తురాబ్ అలీఖాన్ (1829-1883). అఫ్జలుద్దేలా మొదలు మహబూబ్ అలీఖాన్ వరకు ముగ్గురు అసఫాహీ రాజుల వద్ద ప్రధానిగా పనిచేసిన సాలార్జంగ్

మొత్తం 1853 నుంచి 1883 వరకు 30 యేండ్లు పదవిలో ఉన్నాడు. హైదరాబాద్ రాజ్య పాలనలో సాలార్జంగ్ తీసుకొచ్చిన సంస్కరణలు ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని గడించి పెట్టింది. అప్పటి వరకు మధ్యవర్తులు దోసుకుంటున్న సొమ్ముని ప్రభుత్వ ఖజానాకు జమ చేయించ గలిగాడు. ప్రభుత్వం, దివానీల అధీనంలో 1853లో 26వేల ఎకరాల మైళ్లున్న భూమిని 1889 నాటికి 71, 589 ఎకరాల మైళ్లకు పెంచాడు. వీటిని ప్రత్యక్ష ప్రభుత్వ పాలనలోకి తీసుకు వచ్చాడు. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. కొన్ని జాగీర్దార్లను, మరి కొన్ని చోట్ల జాగీర్దారి పద్దతిని క్రమబద్ధం చేసిండు. ప్రభుత్వానికి వ్యవసాయ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని 18531862ల మధ్య కాలంలో 163 శాతం పెంచాడు. ప్రయివేటు వ్యక్తులకు గుత్తకిచ్చిన రహదారి పన్నుల వసూలు పద్ధతిని తొలగించి ప్రభుత్వమే సరిహద్దుల్లో సుంకాన్ని వసూలు చేసే పద్ధతి అమల్లోకి తీసుకు వచ్చాడు. 1853లో మొత్తం 0.8 మిలియన్లున్న ప్రభుత్వ ఆదాయాన్ని 1883 నాటికి 35 మిలియన్లకు పెంచగలిగాడు.

వివిధ వనరుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో ఋణ వితరణ విస్తృతంగా సాగింది. అలాగే రైల్వే ల ఏర్పాటు కోసం పెట్టుబడి కూడా అధిక మొత్తంలో పెట్టడం జరిగింది. 1874లో సికింద్రాబాద్-వాడి రైల్వేలైన్ ప్రజల సౌకర్యార్థం పనిచేయడం ఆరంభించింది. రైల్వేల అభివృద్ధికి తోడుగా నిజాం ప్రభుత్వం నిజాం స్టేట్ గ్యారంటీడ్ రైల్వేస్ సంస్థని, మరో బ్రిటీష్ కంపెనీ హైదరాబాద్ దక్కన్ మైనింగ్ కంపెనీని (1887) ఏర్పాటు చేసింది. 1920లో సింగరేని కాలరీస్ కంపెనీ ఏర్పాటయింది. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం, వాటి మరమ్మత్తుల కోసం ప్రభుత్వం పి.డబ్ల్యు.డి, సివిల్ ఇంజనీరింగ్ శాఖను ఏర్పాటు చేసింది. 1869లో విద్యాశాఖ, ప్రభుత్వ నిర్వహణ న్యాయవ్యవస్థ కోసం ప్రత్యేక విభాగాలు, పోలీస్, ఫైనాన్స్, అడవులు, పబ్లిక్ వర్క్స్, కస్టమ్స్, రెవిన్యూ, పోలీస్, ఆరోగ్యం , మిలిటరీ, పొలిటికల్ అఫెయిర్స్, క్రిమినల్ కోర్టులు, ఉన్నతమైన హైకోర్టు ఏర్పాటయ్యాయి. దేశంలోనే సొంత రైల్వే, రోడ్డు వ్యవస్థ, బొగ్గు గనుల ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి చేసిన రాజ్యం హైదరాబాద్. పారిశ్రామికంగా కూడా హైదరాబాద్ రాజ్యం ముందంజలో వుండింది. బ్రిటిష్ ప్రభుత్వం బొగ్గు గనులు, పత్తి మిల్లులున్న ప్రాంతాల్లో రైల్వే లైను నిర్మాణం చేపట్టింది. ఇదొక అభివృద్ధి శకం. ఆధునికతకు పునాది. సాలార్జంగ్ 1865లో జిలాబంది పద్ధతిని ప్రవేశపెట్టి రాజ్యాన్ని 14 జిల్లాలుగా విభజించాడు. ఆ తర్వాత

ఈ 14 జిల్లాల్ని ఐదు సుభాలుగా విభజించారు. వంశపారంపర్యంగా వస్తున్న గ్రామ కాపలాదార్ల స్థానంలో 1865లో పోలీసు విధానాన్ని ప్రవేశ పెట్టారు. 1868లో హైదరాబాద్-షోలాపూర్ రోడ్డు, భూమిశిస్తులో మార్పులు, వాణిజ్య పన్నులు, ఆబ్కారీ పన్నులు దేశ్ పతి అనే స్థానిక పన్నులు, నజరానాలు కూడా ప్రభుత్వానికి ఆదాయాల్ని చేకూర్చాయి. ఇవన్నీ హైదరాబాద్ రాజ్యంలో ఆధునికత ప్రవేశం కావడానికి, పారిశ్రామికంగా ఇతర రాష్ట్రాలతో పోటీ పడడానికి ఆస్కారం కలిగింది.

1886లో ఏర్పాటైన చేసిన సింగరేణి కాలరీస్ కంపెనీ ఇప్పటికీ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. సర్ సిల్క్ అజాంజాహీ మిల్స్, రాంగోపాల్ మిల్స్, డిబీఆర్ మిల్స్, ఆల్విన్, ఏసీసి సిమెంట్,

రామగుండం, బెల్లంపల్లి మైన్స్, హైదరాబాద్ స్టీల్ కంపెనీ, బీడి కంపెనీ, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ, రోడ్డు, రవాణా ఇలా అనేక రంగాల్లో హైదరాబాద్ పారిశ్రామికంగా ముందుండింది. దీంతో చాలామంది శ్రామికులకు ఉ పాధి లభించింది. 1869లో సివిల్ ఇంజనీరింగ్ కాలేజి, 1890లో వరంగల్ లో ఇండస్ట్రియల్ స్కూల్, 1928లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (బి.ఇ), 1940లో కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఏర్పాటు కావడం హైదరాబాద్ ఘన చరిత్రను చెప్పకనే చెబుతుంది. మద్రాసు యూనివర్సిటీకి అనుబంధంగా 1880లోనే చాదర్‌ఘాట్ హైస్కూలు ఏర్పాటు కావడమనేది ఒక మైలురాయి. వందేండ్ల క్రితమే హైదరాబాద్ లోని హుసేన్ సాగర్ తీరంలోనే విద్యుదుత్పత్తి చేసేవారంటే హైదరాబాద్ గొప్పతనం తెలుస్తుంది. కరెంటు వచ్చిన మూడ్నాలుగేళ్లలోపే ఇప్పటి ఓల్డ్ సిటీ మొత్తం విద్యుత్ కాంతులతో మెరిసిపొయ్యింది.

విద్యారంగంలో కూడా హైదరాబాద్ ముందుండింది. 1854లోనే ఇక్కడ కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ (తర్వాతి కాలంలో గాంధీ ఆసుపత్రి) స్థాపితమయింది. సెయింట్ ఆన్స్ స్కూల్ (1861), మహబూబ్ కాలేజి, ఆంగ్లో వర్సాక్యులర్ (కీస్ హైస్కూలు), ఆదయ్య స్మారక పాఠశాల (విలియం బార్టన్ పాఠశాల-1916), సెయింట్ మేరీస్ హైస్కూలు (1885), సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ (1850), పరోపకారిణీ బాలికా పాఠశాల (1916) మొదలైన పాఠశాలలు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేస్తూ దేశంలోనే ఆంగ్ల విద్యకు కేంద్రంగా నిలిచింది.

నగరంలోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, జూబిలీ హాల్, పబ్లిక్ గార్డెన్(1864), అసెంబ్లీ, ఉస్మానియా వర్సిటీ, జజ్జీఖానా, ఫలక్ నుమా ప్యాలెస్, హైకోర్టు, రాజ్ భవన్, నిజామియా అబ్జర్వేటరీ(1901), హైదరాబాద్ మ్యూజియంలు ఆనాడు నిర్మించినవే. కిషనలాగ్ మందిర్ (1822), లాడ్ బజార్, మలక్ పేట్ రేస్ కోర్స్ (1879), మాల్వాలా ప్యాలెస్ (1849), మోజాం జాహీ మార్కెట్ (1935), మీర్ ఆలం ట్యాంక్ (చెరువు-1804-1808), ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, పురానీ హవేలి ఇలా ఎన్నో కట్టడాలు నిజాం పాలన విశిష్టత. జ్యూడిషియరీ, ఎగ్జిగ్యూటివ్ రెండింటిని విడదీసిన ఘనత దేశంలోనే మొదటి సారిగా నిజాంలకు దక్కుతుంది.

సంస్థానాల్లోనూ చేసిన పోరాటాలను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. హైదరబాద్ చరిత్రలో విడదీయలేని భాగమయిన వీడదీయలేని భాగమయిన వీటిని ఏనాడు సీమాంధ్ర పాలకులు తమవిగా భావించలేదు. మీరు మిక్కిలి ఉస్మానియా దవాఖానా, కోరంటి దవఖానాలకు నిధులివ్వక పేదలకు వైద్యాన్ని దూరం చేస్తుంది. డాక్టర్లకు సదుపాయాలు కల్పించకుండా సతాయిస్తున్నది.

మొత్తం ఏషియా ఖండంలోనే మొట్టమొదటి నోబెల్ బహుమతి ‘హైదరాబాదీ’కి దక్కిన విషయం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. మలేరియాకు కారణాల్ని కనుక్కొన్నందుకు రోనాల్డ్ రాసు మెడిసిన్లో 1902లో నోబెల్ బహుమతి దక్కింది. ట్రిగానమెట్రికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించిన ఎవరెస్టు 1818లో హైదరాబాద్ లో సర్వేయర్‌గా పనిచేశారు. అలాగే రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఇంగ్లండ్ ప్రధానిగా పనిచేసిన విస్టన్ చర్చిల్ కూడా హైదరాబాద్ లో పనిచేశాడు. బ్రిటీష్ ఆర్మీలో భాగంగా ఈయన 1880లో సికింద్రాబాద్ లో పనిచేశాడు. కవి రిచర్డ టేలర్, బ్రిటీష్ రెసిడెంట్లు రస్సెల్, హాలండ్, ఫ్రేజర్, సిదెన హామ్ ఇలా ఎంతోమంది హైదరాబాద్న అక్కున జేర్చుకున్నరు.

మొత్తం ప్రపంచంలోనే మొట్ట మొదటి మహిళా అనస్తీషీయన్ హైదరాబాదీ. రూపాబాయి ఫరూంజీ అనే పార్సీ మహిళ ఉస్మానియా మెడికల్ కాలేజిలో చదువుకుంది. ఈమె 1889-1917 సంవత్సరాల మధ్యకాలంలో హైదరాబాద్ లోని బ్రిటిష్ రెసిడెన్సీ హాస్పిటల్ (ప్రస్తుత సుల్తాన్ బజార్ ప్రసూతి వైద్యశాల),

జజ్జీఖానాల్లో ఈమె పనిచేసింది. విదేశాల్లో సైతం విద్యనభ్యసించి వచ్చిన ఈమెకు కూడా చరిత్రలో తగిన స్థానం దక్కలేదు. హైదరాబాద్ క్లోరోఫామ్ కమిటీ సభ్యురాలిగా ఆమె అందించిన సేవలు కూడా మరవలేనివి.

1857 నాటికే హైదరాబాద్లో టెలిగ్రాఫిక్ సౌకర్యాలున్నాయి. నగరంతో పాటు వివిధ జిల్లాలను కలుపుతూ రెగ్యులర్‌గా ఉత్తరాల బట్వాడా చేసేందుకు గాను 1872లో ఆధునిక పద్ధతిలో పోస్టాఫీసు పద్ధతి ఆరంభమయింది. తర్వాతి కాలంలో ప్రత్యేకంగా పరిశ్రమలకోసం సనత్ నగర్ పారిశ్రామిక వాడనే ఏర్పాటు చేయడ మయింది. ఉర్దూల్ సనత్ అంటే పరిశ్రమ.

1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన సమయంలో హైదరాబాద్/ సికింద్రాబాద్లో కూడా ఆ సంస్థ కార్యకలాపాలు, కాంగ్రెస్ జండా ఆవిష్కరణ జరిగింది. అప్పటి నుంచీ ప్రభుత్వాలకు మహాజర్ల ద్వారా, వినతి పత్రాలిస్తూ ప్రజలు తమ కోర్కెలను, డిమాండ్లను విన్న వించేవారు. ఈ కొద్దిపాటి చైతన్యమే అద్భుతాలు సృష్టించింది. ఈ చైతన్యంలో భాగంగానే గ్రంథాలయాలు ప్రారంభమయ్యాయి. మొదట 1872లోనే ముదిగొండ శంకరారాధ్యుల గ్రంథాలయం సికింద్రాబాద్లో ఏర్పాటయింది. అసఫియా లైబ్రరీ లైబ్రరీ 1892లో, షాలిబండలోని భారత గుణవర్ధక లైబ్రరీ (1895), బొల్లారం ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ (1896) జంటనగరాలకు విజ్ఞానాన్ని పంచాయి. 1901లో స్థాపించబడ్డ శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం తెలంగాణలో గ్రంథాలయోద్యమానికి, ఆధునికతకు దారులు వేసింది. రాజరాజనరేంద్రాంధ్ర గ్రంథాలయం (హన్మకొండ-1904), సంస్కృత కలాభివర్ధిని గ్రంథాలయం (సికింద్రాబాద్-1913), బాలసరస్వతీ లైబ్రరీ (గౌలిగూడ-1923)లు జంట నగరాల్లో సాంస్కృతిక, సాహిత్య, సామాజిక చైతన్యాన్ని పెంపొందించాయి.

హితబోధిని(1913), గోలకొండ (1926), సుజాత(1927), నీలగిరి(1922), తెనుగు (1922), దక్కన్ కేసరి (1934) పత్రికలు పునర్వికాసోద్యమానికి చేయూత నిచ్చాయి. ఇంగ్లీషు, ఉర్దూ పత్రికలు ప్రజల అభ్యున్నతికోసం నిర్వహించిన పాత్ర చిరస్మరణీయమైంది. హైదరాబాద్ టెలిగ్రాఫ్ (1886), దక్కన్ స్టాండర్డ్ (1889), దక్కన్ టైమ్స్, హైదరాబాద్ రికార్డ్ (1891) లాంటి పత్రికలు హైదరాబాద్ ప్రజల చైతన్యానికి చేసిన దోహదం ప్రశంసనీయమైనది. థియోసాఫికల్ సొసైటీ, బ్రహ్మసమాజ్, ఆర్యసమాజ్, హిందూ సోషల్ క్లబ్, హుమానిటేరియన్ లీగ్, సోషల్ సర్వీస్ లీగ్ లాంటి సంస్థలు, బారిష్టర్ రుద్ర, ముల్లా అబ్దుల్ ఖయూం, పండిత తారానాథ్, బాజీ కృష్ణారావు, వామన నాయక్, మాడపాటి హనుమంతరావు, భాగ్యరెడ్డి వర్మ, షోయెబుల్లాఖాన్లు చేసిన కృషి హైదరాబాద్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

ఈ కాలంలో విద్యాలయాలు, వైద్యాలయాలు, ఆంగ్ల, ఉర్దూ పత్రికలు విరివిగా నెలకొల్పబడ్డాయి. ఈ మార్గమే హైదరాబాద్ లోని రెసిడెన్సీ ప్రాంతంలో శ్రీకృష్ణదేవ రాయాంధ్ర భాషానిలయం ఏర్పాటుకు దారి తీసింది. ఈ భాషా నిలయ స్థాపనతో తెలంగాణలో ప్రశ్నించే తత్వానికి ప్రాణం వచ్చిందని చెప్పొచ్చు. అప్పటి వరకూ వ్యక్తులుగా అక్కడక్కడా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూ ఉన్న వారికి ఈ నిలయం ఒక వేదికగా అంది వచ్చింది. తెలుగులో రాయగలిగి, మాట్లాడగలిగి, అంతో ఇంతో పలుకుబడి ఉన్న వారందరికీ నిలయం ఒక కూడలి ప్రదేశమయింది. వార్షిక ఉ త్సవాలు, రోజువారి సమావేశాలు, సభలు, సన్మానాలు అన్నీ కలగలిపి తమ వారి బాగోగుల కోసం పోరాడేలా పురికొల్పింది. రాజ నాయని వెంకటరంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు, పాల్వంచ సంస్థానాధీశులు, రావిచెట్టు రంగారావు, ఆదిరాజు వీరభద్రరావు ఇలా ఎంతో మంది దీని స్థాపనలో పాలుపంచుకున్నారు. తెలంగాణలో ఆధునికతకు చైతన్యానికి దారులేసింది ఈ భాషానిలయమే అంటే అతిశయోక్తి కాదు.

ఆధునిక సమాజంలో ఉత్పత్తి, శ్రమశక్తి, పారిశ్రామిక ప్రగతి, ఉద్యమాలు, పాలనా సంస్కరణలు, రవాణ సాధనాలు, విద్య, వైద్యం, కమ్యూనికేషన్స్, ముద్రణా రంగాల్లో అభివృద్ధి మనిషి జీవితంలో మెరుగైన మార్పులు తీసుకొచ్చాయి. ముద్రణా రంగంలో మార్పు వేలమంది విద్యావంతులకు రచనలు ఏకకాలంలో చేరువయ్యేందుకు పత్రికలు పుస్తకాలు తోడ్పడ్డాయి. ఇప్పుడు ముద్రణా రంగాన్ని అధిగమించి కంప్యూటర్, ఇంటర్నెట్ రంగం, బ్లాగులు, ట్విట్టర్లు, ఫేస్బుకు, వెబ్ పత్రికలు క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యాన్ని, సమాచారాన్ని చేరవేస్తున్నాయి. మానవ జీవితాల్లో, ఆలోచనా సరళిలో, సమాజ సంబంధాల్లో కూడా ఈ మార్పు ప్రతిఫలించింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. తెలుగు సమాజాన్ని ఈ ఆధునికత అలుముకున్న దగ్గరనుంచీ సృజనకారుల రచనల్లో భిన్న ధోరణులు, చెప్పే వస్తువులో వైవిధ్యం, విషయంలో విస్తృతి కనిపిస్తాయి. ‘ఆధునికత అంటే అశాస్త్రీయతపై, సంప్రాదాయాలపై తిరుగుబాటు’. మరో విధంగా చెప్పాలంటే ‘మనువాదానికి లోను గాకుండా ఆంగ్ల సాహిత్యంతో ప్రభావితమైంది’ ఆధునిక సాహిత్యంగా చెప్పొచ్చు. ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామిక ప్రగతితో ప్రారంభమైన ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం’ భావన ఆధునికతకు మూలం. ఈ ఆధునికతను ఆవాహన చేసుకోవడంతోనే తెలుగులో కథానిక/కథా రచన ఆరంభమయ్యిందని చెప్పొచ్చు. అందుకే ‘జీవితంలో ఎదురయ్యే సంక్లిష్ట సంఘటనలను, ఆటుపోట్లకు గురయ్యే సంబంధాలను, పాత్రలు, సన్నివేశాలు కల్పించి రాసిందే ఆధునిక కథ’. తాతాచారి, తో తీనామా, దక్కన్ కథలు, కాశీమజిలీ కథలు కూడా కథసాహిత్యంగా పరిగణించినప్పటికీ ఆధునిక ‘కథ/కథానిక’ వెలువడడానికి దారితీసిన పరిస్థితుల్ని అంచనా వేసి, అది చూపిన ప్రభావాన్ని లెక్కలోకి తీసుకొని ‘ఆధునికత”ను లెక్కగట్టాలి. ఈ వ్యాసంలో కాలం మాత్రమే ప్రాతిపదికగా కాకుండా దానికి తోడు రచనల్లోని వస్తువు ఆధునికమైనప్పుడే పరిగణనలోకి తీసుకోవడమైంది. అయితే వ్యాసానికి సమగ్రత చేకూర్చేందుకు ఈ కాలంలో రచనలు చేసిన వారి పేర్లు కూడా ప్రస్తావించడమైంది. కాలాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకొని రచనల్ని పరిశీలనలోకి తీసుకున్నట్లయితే రచయితల బిబ్లియోగ్రఫీ తయారవుతుంది. అలా గాకుండా ఆధునిక సాహిత్యాన్ని చర్చించాలనుకోవడంతో వస్తువు ప్రధానంగా తీసుకొని విశ్లేషించడమైంది. ఈ సమస్య కేవలం కవిత్వం/పాటకు మాత్రమే ఏర్పడుతుంది. ఎందుకంటే కథ, నవల రెండూ దాదాపు పూర్తిగా ఆధునిక ప్రక్రియలు. ఈ ప్రక్రియల్లో రాసిన సాహిత్యమంతా ఆధునికమైనదిగానే పరిగణించడమైంది. అక్కడక్కడా కథ, నవలల్లో వస్తువు చరిత్రకు సంబంధిచినదైనప్పటికీ అవి జాతీయ భావనను పాదుకొల్పడానికి పనికివస్తాయి కాబట్టి వాటిని ఆధునికమైనవిగానే భావించడమైంది. కథకు, నవలకు, కవిత్వానికి స్వల్ప బేధాలతో కింది అంశాల ప్రాతిపదికన ఆధునికతను లెక్కకట్టవచ్చు. అవి

1. ఆధిపత్య ధిక్కారం (సకల)

2. ఆంగ్ల విద్యా ప్రభావం

3. పత్రికా ప్రచురణ / ముద్రణా | కమ్యూనికేషన్/ ఇంటర్నెట్ విస్తృతి

4. పాలక పక్షం గాకుండా ప్రజా పక్షం / (పాలకులకు వ్యతిరేకంగ)

5. జెండర్ సమానత్వం – అభ్యున్నతి | స్త్రీవిద్య

6. తెలుగు డయస్పోరా (వలస – చలన జీవితం) మొబిలిటీ

7. జాతీయత

8. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, 9. హేతువాదం

సూలంగా 1930కి ముందు తెలంగాణ నుంచి వెలువడిన సాహిత్యాన్ని పై అంశాల ప్రాతిపదికన ఈ వ్యాసంలో రికార్డు చేయడమైంది. 1930వరకు అనే ప్రాతిపదిక తీసుకోవడంలో ప్రధాన ఉద్దేశ్యం తొలి ఆంధ్రమహాసభలు జరిగిన సంవత్సరం కావడం. ఈ ఆంధ్రమహాసభలు తెలంగాణ ప్రజల్లో అస్పృశ్యతా నివారణకు, సంఘసంస్కరణకు, సాహిత్యోద్ధరణ, రాజకీయ చైతన్యం, గ్రంథాలయోద్యమానికి పునాదిగా నిలిచింది. ఇది కేవలం వ్యాసం కావడంతో విపులంగా కాకుండా లోతుల్లోకి వెళ్లకుండా పైపైనే స్పృశించడం జరిగింది. ఆధునిక సాహిత్యం కవిత్వం , పాట, ద్విపద, పద్యం, కథ, నవల, నాటకం, రూపకం, యక్షగానం, శతకం, జానపద గేయ కథా కావ్యాలు, దండకాలు ఇలా అనేక ప్రక్రియల్లో వెలువడింది. కొన్ని ప్రక్రియలు పాతవైనప్పటికీ ఆధునిక విషయాలు రికార్డు చేసినవి కూడా ఉన్నాయి. శతకాలు, పద్యాలు, దండకాలు, తత్వాలల్లో ఆధునిక భావజాలంతో కూడిన అంశాలున్నాయి. వీటన్నింటిని సమన్వయం చేసుకొని చూసినప్పుడే సమగ్రత ఏర్పడుతుంది. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం ఏర్పాటు సమయంలో తెలంగాణలో తొలి కవి సమ్మేళనం జరిగింది. అంతకుముందు గద్వాల, వనపర్తి, కొల్లాపురం సంస్థానాలల్లో ఈ గోష్టులు, సమ్మేళనాలు జరిగినప్పటికీ ఆధునిక

భావజాలంతో, ఇతివృత్తంతో కవి సమ్మేళనం 1901 సెప్టెంబరు ఒకటిన జరిగిందని చెప్పొచ్చు. కొమర్రాజు లక్ష్మణరావు, భండారు అచ్చమాంబ, ఆదిరాజు వీరభద్రరావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరం నరసింహశాస్త్రి, సురవరం

ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, శేషాద్రి వెంకటరమణకవులు, ఒద్దిరాజు సోదరులు, రూప్టాన్‌పేట రత్నమాంబ దేశాయి, సోమరాజు రామానుజరావు, ఆయన సోదరి ఇందుమతిదేవి, ఇ. రాజయ్య, కోదాటి రామకృష్ణారావు, మాడపాటి రామచంద్రుడు ఇంకా అనేక మంది తెలంగాణలో ఆధునిక సాహిత్యానికి పాదులు తీనిండ్రు. అన్ని ప్రక్రియల్లోనూ ఇది కొనసాగింది. ఇంచుమించు 1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపన నాటి నుంచి ప్రారంభమైన ఈ సాహిత్య సాధన 1930లో ప్రథమాంధ్ర మహాసభల నాటి వరకు కొనసాగిన తీరుని ఈ షత్రంలో విశ్లేషించడమైంది. కవిత్వంలో రావిచెట్టు రంగారావుపై రాసిన ఎలిజీ, షబ్నవీస్

వెంకటరామనరసింహారావు ఆయన భార్యపై రాసిన ఎలిజీ, హితబోధిని, ఆంధ్రాభ్యుదయము, నీలగిరి, తెనుగు, గోలకొండ, సుజాత పత్రికల్లో వచ్చిన సాహిత్యమూ ఇందు కోసం పరిశీలించడమైంది. 1926 తర్వాత గోలకొండ పత్రిక, 1934 నాటి గోలకొండ కవుల సంచిక, భాషానిలయ వార్షిక సంచికలు, ఆంధ్రప్రాంతం నుంచి దిన పత్రికలూ, భారతి, ఆంధ్రభారతి లాంటి మాస పత్రికలూ సమాచార సేకరణలో తోడ్పడ్డాయి. సంస్థానాల్లోని పండితులు చేసిన ఆధునిక రచన, పత్రికల్లో చోటుచేసుకున్న సాహిత్యం ఇక్కడ చర్చించడమైంది. కె.శ్రీనివాస్ డాక్టరేట్ పరిశోధన గ్రంథం, సుంకిరెడ్డి నారాయణరెడ్డి ముంగిలి, మత్తడి, బాల శ్రీనివాసమూర్తి తెలంగాణ తెలుగు మాగాణం, విశ్వేశ్వర సంస్కృతాంధ్ర డిగ్రీ మరియు పిజి కళాశాల వెలువరించిన తెలంగాణా ఆధునిక సాహిత్యం , ఓగేటి అచ్యుతరామశాస్త్రి హైదరాబాదు నగర తెలుగు భాషా సాహిత్య వికాస చరిత్ర, తెలుగు అకాడెమీ నాలుగు శతాబ్దాల హైదరాబాద్ నగరం, షబ్నవీస్, దస్రమ్, హైదరాబాద్ సిర్ఫ్ హమారా మొదలైన పుస్తకాలు కూడా ఈ రచనకు తోడ్పడ్డాయి. ఇంతవరకూ తెలంగాణ నుంచి తొలి

కవితగా మత్తడిలో బూర్గుల రామకృష్ణారావు కవితగా రికార్డయింది. అది 1917లో వెలువడింది?. దాన్ని తోసి పుచ్చుతూ 1901కి ముందే ఆధునిక కవిత వెలువడిందని ఇందులో వివరించడమైంది. ఈ సాహిత్యాన్నతంటినీ ప్రక్రియల వారిగా విశ్లేషించుకున్నట్లయితేనే పూర్తి అవగాహన ఏర్పడుతుంది. అందుకే భాగంగా తొలి విడతగా కవిత్వం గురించి ఇక్కడ పరిశీలిద్దాం! కవిత్వం :

తెలంగాణాలో ఆధునిక కవిత్వం భాషానిలయ స్థావన సమయంలో మైలవరపు నరసింహశాస్త్రి చదివిన కవిత్వంతో ప్రారంభమయిందని చెప్పొచ్చు. అంతకుముందు రూప్టాన్ పేట రత్నమాంబ దేశాయి, రంగరాజు కేశవరావు, గోవర్ధన వెంకటనృసింహాచార్యులు, దొంతరమల్లేశం, కంసాలి సుబ్బకవి తదితరులు ఉర్దూమిశ్రిత తెలుగులో రాసిండ్రు. అయితే ఇవి కొంత సనాతన దృక్కోణంతో ఉన్నాయి. అలాగే వివిధ సంస్థానాల్లోని కవులు అక్కడక్కడా ఆధునికత ధ్వనించే కవితలు రాసినప్పటికీ అవి ఎక్కువగా సనాతన అభిప్రాయాల్నే ప్రతిఫలింపజేశాయి. దున్న ఇద్దాసు భక్తి పూర్వకమైన తిరుగుబాటు తత్వాలను బోధించిన అవి ప్రధానంగా ఆధ్యాత్మిక సాహిత్యం. ఆధునికమైన గ్రంథాలయోద్యమము, పత్రికోద్యమము, గ్రంథమాలోద్యమము, సంస్కరణోద్యమం, స్త్రీవిద్య, కవుల, సంస్కర్తల, నాయకుల, ప్రముఖుల ప్రశంస, మద్యపాన నిరోధము, అస్పృశ్యతా నివారణము, భావ కవిత్వము, రైతుల బాధలు, జాతీయత, నిజామాంధ్ర మాత, అసహీ రాజుల ప్రశంస, భాగ్యనగర ఖ్యాతి, మూసి వరదలు, వయోజన విద్య ఇలా అనేక అంశాలపై కవిత్వం ఈ కాలములో వెలువడింది. పద్యాలు, గీతాలు, పాటలు, కీర్తనలు, ద్విపద, దండకాలు ఇలా అనేక రూపాల్లో కవిత్వం వెలువడింది.

ఈ కాలంలో కవిత్వం రాసిన దాదాపు అందరూ గోలకొండ కవుల సంచికలో నమోదయ్యారు. అయితే సాధ్యమైనంత మేరకు ఇంతవరకు ఎక్కడా చోటు చేసుకోని కవితల్ని మాత్రమే ఈ పత్రం కోసం ఉదాహరణగా తీసుకోవడమైంది. దున్న ఇద్దాసు, రూప్లాన్ పేట రత్నమాంబ దేశాయి, మైలవరం నరసింహశాస్త్రి, కేశవపట్నం నరసయ్య, షబ్నవీసు వెంకటరామనరసింహారావు, మంగవెల్లి బుచ్చి వెంకటాచార్యులు, కందాళ లక్ష్మణాచార్యులు, సరికొండ లక్ష్మీనరసింహరాజు, వేదాంతం వెంకట నరసింహాచార్యులు, దరూరి సీతారామానుజాచార్యులు, జొన్న ఎల్లారెడ్డి, శ్రీరామకవచం కృష్ణయ్య, ఆత్మకూరు అంజనీదాసు, దేవరకొండ సయ్యద్ సోదరులు, పెరంబుదూరు, మరింగంటి, పెంటమరాజు వంశీయులు, ఆదిరాజు వీరభద్రరావు, మాడపాటి హనుమంతరావు, ఆదివూడి సోదరులు,ఇ. రాజయ్య, కందిరాజు వెంకటకిషన్‌రావు, వనం వేంకట నరసింహారావు, కోదాటి రామకృష్ణారావు, పొడిచేటి సీతారామారావు, లక్ష్మీకాంత రాఘవకవులు, శేషాద్రి రమణకవులు, ముసిపట్ల పట్టాభి రామారావు (అష్టావధాని), అల్లూరి రాజేశ్వరరావు, వేంకట రాజన్న అవధాని, అనుముల విశ్వనాథనీ, ఒద్దిరాజు సోదరులు, బెల్లంకొండ సోదరులు, లక్ష్మీకాంత రాఘవకవులు, కె. అన్నమరాజశర్మ, పెమమరాజు రాజగోపాలము, శ్యామరాజు, కామరాజు సోదరులు, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, గవ్వా సోదరులు, భవానీ సింగ్, గంగుల శాయిరెడ్డి, వేలూరి రంగధామనాయుడు, గుండోబా కవి, కోటయామాత్యుడు, దొంతర మల్లేశము, పంతము ఆంజనేయ కవి, వారణాసి రామయ్య, అన్నగారి వెంకట కృష్ణారాయుడు, తిరుమల పంచాంగం వేంకటాచార్యులు, గొట్టుపర్తి సుబ్బారావు, కొండా యల్లయ్య, పేరక రంగాచార్యులు, ఏలె ఎల్లయ్య కవి, పి.వి. వరదాచార్యులు, శ్రీమతి లక్ష్మీబాయి, రామసింహకవి, సిద్ధప్ప వరకవి, చెర్విరాల భాగయ్య, పదుల సంఖ్యలో కవయిత్రులు ఈ కాలంలో కవిత్వాన్ని ఆధునిక రీతిలో సృజించిండ్రు. స్థలాభావం వల్ల వారిలో కొందరిని మాత్రం ఇక్కడ విశ్లేషించుకుందాం.

వందకు వందశాతం గాకున్నా ఆధునిక ముద్ర ఉన్న కవిత్వాన్ని ఆధ్యాత్మిక ధోరణిలో సృజించిన వారిలో ఆద్యుడు దున్న ఇద్దాను అని చెప్పొచ్చు. నల్లగొండ-మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుల్లోని ప్రాంతాల్లో తన తత్వాలు,కీర్తనలతోటి జనసామాన్యంలో మార్పులు తీసుకొచ్చిన వెలుగు రేఖ ఇద్దాసు. నీతిబోధనలు చేసిండు. 1811లో పుట్టి 1919లో నిర్యాణం చెందిన ఈయన కీర్తనలు ఎక్కువగా 1870 నాటికే జనం నోటిపై నాట్యం చేసేవి. ఇప్పటికీ పాలమూరు జిల్లాలో ఈ తత్వాల్ని అలవోకగా పాడే వారు ఎందరో ఉన్నారు.

పెద్దలను దూషించి మగువల

చూచి పండ్లిగిలించినవ్వితే

సిద్ధముగ యమపురిలోన

చిత్రహింసలు జేసి యముడు

చిత్రగుప్తునకు చెప్పడా…

గట్టు దెలియక రాతి బొమ్మల

పెట్టి పూజలు చేయులోకము

ఒట్టి నిందలు గట్టె వారల

యమభటులు బిగబట్టి గొంతులు కోయరా

శిక్షలు చేయ్యరా…

నందచితుకుల చేత సద్గురు

నిందజేసెడి వారలను

మండుచున్న నరకములోని

గుండముల కోదండధరుడు

చెయ్యడా శిక్షలు చెయ్యడా….

గురుని నమ్మిన నరకమ్ము

లేదనగ వినక కనకమదిలో

పాడు మాలిన నరుల వేడితే

ఫలములేదిక ఎంతమాత్రము

పాతకీ పెద్ద ఘాతకీ…… అంటూ రాసిన తత్వాలు కొన్ని వందలున్నాయి. అయితే ఈ తత్వాలన్నీ ఆధునికతకు ముందు రూపంలో ఉన్న అభివృద్ధి కాముక రచనలుగా పేర్కొనవచ్చు. ఒక దళితుడు, అందునా మారుమూల పల్లెలో ఉంటూ తన బోధనలకు ఆకర్షితులై అగ్రకులస్తులు కూడా భక్తులుగా చేరారు. ఇప్పటికీ ఈ కుటుంబానికి చెందిన వారు దున్న ఇద్దాసు పేరిట సమారాధనలు చేస్తున్నారు. మరుగునపడ్డ ఈయన గురించి గతంలో కొంత సమాచారాన్ని శేఖరరెడ్డి సేకరించి పుస్తకంగా అచ్చొత్తించాడు. అలాగే మాజీ మంత్రి కె. మహేందర్ కూడా దీన్ని పునర్ముద్రిపించాడు. ఈ సంకలనంలోని కవితలు నిప్పుకణికలై మండుతూ భక్తులను

సేవించాయి. దున్నఇద్దాను సమగ్ర రచనలు పునర్ముద్రణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ రచనలు 1900లకు పూర్వం సృజించబడ్డాయి. అయితే 1901 తర్వాత ఆధునిక రీతిలో అప్పటికి కరెంట్ ఇష్యూగా ఉన్న వాటిపై రచనలు చేయడమనేది మైలవరం నరసింహశాస్త్రి చేసిండు. గ్రంథాలయాలను స్థాపించడమంటే ఖర్చుతో కూడుకున్నదే గాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకమైన వ్యవస్థగా అది ముద్రపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com