రచనలో నిర్మాణ దృక్పథం

చాలామందికి రచనలో వస్తువే ప్రధానం అని ఒక అభిప్రాయం ఉంటుంది. వస్తువే సామాజిక చలన శీలతకు ప్రాతినిధ్యం వహిస్తుందని కొండొకచో బాధ్యత కూడా వహిస్తుందని చెబుతుంటారు. నిర్మాణ శిల్పాన్ని లేక వ్యూహాన్ని గురించి మాట్లాడేవాళ్ళని రూపవాదులని విమర్శిస్తుంటారు.

నిజమే… వస్తు నిర్బరత లేనిదే రచనలో పుష్టి ఉండదు. రచనా క్రమాన్ని నిర్దేశించేది వస్తువే. వస్తు పరిణామమే రూపాన్ని నిర్ణయిస్తుంది. వస్తు సారమంతా కచ్చితంగా రూపంలో నిర్దిష్టమౌతుంది.

ప్రాచీన సాహిత్యాలంకారికుల మతాలు ధ్వని – రసము, చర్చ అంతా రూప నిర్దిష్టతకు పర్యవసానమే. ఒక రచన ధ్వనివంతం కావాలంటే, తద్వారా రసం చిప్పిల్లాలంటే నిర్మాణంలోని మెలకువ వల్లనే సాధ్యమౌతుంది.

అరిస్టాటిల్ కెథారిసిస్, జాన్ లాక్ ఎంపిరిసిజం, ప్రాచ్యులు చెప్పే ఔచిత్యం లేక పాశ్చాత్యులు చెప్పే decorum లాంటి సిద్ధాంతాలన్నీ రూపవాదాన్ని అంతర్లీనంగా అంగీకరించేవే.

క్లాసికల్ – నియో క్లాసికల్ , రోమంటిసిజం, నియో – రోమంటిసిజం నుండి ఇది కొనసాగుతున్నదే. ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవ దిగంబర కవిత్వాలు రూపానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. కాని తరువాత వచ్చిన తెలుగు కవిత్వమంతా రూప ప్రాధాన్యంతోనే కొనసాగింది. సంక్లిష్ట కవుల దగ్గర రూప ప్రాధాన్యం పెచ్చరిల్లింది. నవల, కథ, వ్యాసం మొదలైన వచన సాహిత్యంలో పేరులోనే రూపవాదం ఉంది.

కేవలం వస్తువు మాత్రమే ప్రధానంగా ఉన్న సాహిత్యం కళాహీనమౌతుంది. కళాహీనమైన సృజనకు కాలగర్భమే చిరునామా అవుతుంది.

నిర్మాణ గాఢత సాధించడానికి సృజన కారునికి ఇతోధిక అభ్యాసం కావాలి. ఈ తపస్సు ఎంత గాఢమైనదైతే రచన కూడా అంత గాఢతతో ఉంటుంది. కీర్తిని తన వెంట నడిపించగలిగే సృజన అతనికి సాధ్యమౌతుంది.

కళానైపుణ్యం లేని రచన చవుకబారు సంపాదకుల, పాఠకులవల్ల గొప్పగా అనిపించవచ్చు. సభలలో కరతాళధ్వనులకు ఆస్కారం కూడా కావచ్చు. కాని కాలక్రమంలో ఎంత తొందరగా ప్రాచుర్యానికి వచ్చిందో అంత తొందరగా నిష్క్రమించే అవకాశం ఉంటుంది.

కేవల రూపవాదం కూడా రచనలో అభిలషణీయం కాదు. విపరీతమైన భావచిత్రాలను గుప్పించి వస్తువును చిన్న బుచ్చడం కూడా అప్రతిభుల పనే అనిపించుకుంటుంది. ఎదో ఒకటి రెండు రచనలు సందర్భాన్ని బట్టి చేస్తే సరే కాని అన్ని రచనలు ఇదే ధోరణితో ఉంటే సాహిత్యం యొక్క మౌలిక ప్రయోజనం దెబ్బ తింటుంది.

కాబట్టి ఉత్తమ రచయిత వస్తురూపలకు సమ ప్రాధాన్యం ఇస్తాడు. అతని వల్లనే వస్తు రూపాల అభేదం వస్తుంది. ఇటువంటి సౌదర్య మీమాంస తెలంగాణ రచనలలో మరింత పెరుగాలని ఆశిద్దాం.

జై తెలంగాణ, జై జాగృతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com