కాళోజీ నారాయణరావు చాలామంది పాఠకులకు కవిగా మాత్రమే తెలుసు. ఆయన రాసిన ‘నా గొడవ’ 1960 లలో, 70 లలో స్థానీయంగా చిన్న దుమారం లేపిందని చెప్పవచ్చు. కానీ, కవిత్వంకన్న ముందు ఆయన కథలు రాశారట. అయితే వాటిసంఖ్య చిన్నదవటం వలన, పైగా అవి అచ్చులో వెలువడకపోవడం వలన, చాలామంది తెలుగు పాఠకులకు ఆ విషయం తెలియదు!

కాళోజీ నిజానికి కవిగా రచయితగా కంటె, సమాజంలోని అన్యాయాన్నెదిరించే వ్యక్తిగా, ప్రజాహక్కుల కోసం పోరాడే యోధునిగా, నిష్పక్షపాతం నిర్భయం నిక్కచ్చితనం మూర్తీభవించిన అరుదైన మనిషిగానే ప్రసిద్ధుడు. ఆయన నిజమైన కవి కాదని కొందరు విమర్శించినా, ఆ విమర్శలను తుత్తునియలు చేసే అద్భుత కవితా పంక్తులు ఆయనవి కొన్ని ఉన్నాయి. అవి కాళోజీలో రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉందని నిరూపిస్తాయి కూడా.

కాళోజీ కథల్లో సామాజిక చైతన్యం, న్యాయ రాజకీయ వ్యవస్థల పట్ల నిశ్చితాభిప్రాయం, మొత్తంగా ఒక అభ్యుదయ భావజాలం (progressive ideology) – ఇవన్నీ ఉండటం ఎట్లాగూ ఆశ్చర్యాన్ని కలిగించదు. ఎందుకంటే, ఇవి ఆయన వ్యక్తిత్వంలోని భాగాలు. అయితే కథారచనకు ప్రత్యేక వ్యక్తిత్వం, నిక్కచ్చి అభిప్రాయాలు, సరైన అవగాహన మాత్రమే సరిపోవన్నది అందరికీ తెలిసిన విషయమే. కథలు రాయడంలోని మెళకువలు – ముఖ్యంగా శిల్పం గురించిన అవగాహన – కొరవడితే, రచయితకు విశిష్ట వ్యక్తిత్వం ఉన్నా అతని కలంలోంచి మంచి కథలు పుట్టవు. కథారచన గురించిన సరైన అవగాహన కాళోజీకి ఉన్నదని, ఆయన రాసిన దాదాపు ప్రతి కథలో తెలిసిపోతుంది పాఠకునికి.

నేరుగానో, అన్యాపదేశంగానో సమాజానికి హితం చేకూర్చని ఇతివృత్తంతో ఒక్క కథ కూడా రాయలేదు కాళోజీ. ప్రజా ఉద్యమాల్లో ఒక్క చిన్నకథ పది పన్నెండు ఉపన్యాసాలంత ప్రభావాన్ని చూపిస్తుంది అని అభిప్రాయపడ్డారు ఆయన (ఇదీ నా గొడవ). ఇది ఒక పార్శ్వమైతే, శిల్పంలో కొత్తదనానికి ప్రాధాన్యమిస్తూ మూసకథలకు భిన్నంగా రాయడం పట్ల ఆయన ఎక్కువ ఇష్టాన్ని కనబరిచినట్టు సులభంగా తెలిసిపోతుంది, ఆ కథల్ని చదివితే. ఒకటి రెండు కథలు గల్పికలలాగా, లేక వార్తాచిత్రాలలాగా, లేదా కథనం లేని అసంపూర్ణమైన కథలలాగా కనిపిస్తాయంటారు కొందరు కథకులు. అయితే కథ నిర్వచనం మీదనే ధ్యాసనంతా కేంద్రీకరించడం కంటె, ఆ కథ సమాజం మీద బలమైన ప్రభావం చూపుతోందా లేదా అన్నదే కాళోజీకి ముఖ్యం. సామాజిక, రాజకీయ చైతన్యం నరనరాన పెద్దమొత్తంలో జీర్ణించుకుపోయిన ఒక రచయిత కథ నిర్వచనం గురించి అంతగా పట్టించుకోకపోవడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.

‘తెలియక ప్రేమ, తెలిసి ద్వేషము’ కాళోజీ కథలన్నిటిలో మిగతా వాటికంటె ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఒక ఊళ్లోని దేవాలయం లోకి ప్రవేశించడం గురించి హరిజనులకు, సవర్ణ హిందువులకు మధ్య జరిగిన కొట్లాటలో చనిపోయిన ఒక బ్రాహ్మణుడు, ఒక హరిజనుడు ఇందులోని ముఖ్య పాత్రలు. వాళ్లిద్దరు నరకానికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. తాము ఒకే దొమ్మీలో చనిపోయినవాళ్లు అని తెలియనంత వరకు పరస్పరం ప్రేమను కనబరుస్తారు. కాని, వాస్తవం తెలియగానే వారిలో మళ్లీ వర్గవిద్వేషం బుసలు కొడుతుంది. దీన్ని గమనించిన యమభటుడు, “వీరి ద్వేషం చట్టుబండలు గాను. ఇదేం కావరం రా! చచ్చినా ఈ మతపిచ్చి, ఈ వర్ణభేద శత్రుత్వం పోలేదేం?” అంటాడు. మనదేశంలో మనుషులు ఎంత బలమైన కులమత స్పృహను కలిగివున్నారో తెలిపే కథ యిది. భూలోకం లోని మనుషుల మతోన్మాదాన్ని చూసి యమభటుడు సైతం విస్తుపోవడం ఆసక్తికరమైన విషయం!

‘విభూతి, లేక ఫేస్ పౌడర్,’ ‘లంకా పునరుద్ధరణ,’ ‘ఆగష్టు పదిహేను’ – ఇవి వ్యంగ్యవైభవం నిండిన కథలు. ఈ మూడింటిలో అన్యాపదేశంగా చెప్పడముంది. దీన్నే అలెగరి (allegory) అంటున్నారు. మొదటి కథలో ప్రధానంగా సెటైర్ కనిపిస్తుంది. మిగిలిన రెండింటిలో satire and sarcasm ల మిశ్రమం ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఆ కథలు ఆ కాలపు రాజకీయ పరిస్థితులను వ్యంగ్యంగా విమర్శించిన అన్యాపదేశ కథలు. ఈ మూడు కథలలో కాళోజీ ప్రదర్శించిన శిల్పనైపుణ్యం అరుదైనదని చెప్పవచ్చు. శవప్రాయమైన కాంగ్రెస్ పార్టీ తాలూకు రాజకీయ సంస్కృతిని హేళన చేస్తూ బలమైన నిరసనను తెలుపడం ఆగష్టు పదిహేను కథలోని ఇతివృత్తం. ఇందులో మహాత్మా గాంధీని వ్యాసభగవానునిగా చిత్రించారు కాళోజీ. స్వాతంత్ర్యం వచ్చింతర్వాత కాంగ్రెస్ పార్టీని నిర్మూలించాలని భావించిన వ్యాసభగవానుని (గాంధీ) మాటలను అతని అనుయాయులు లెక్క చేయరు. ఒక శవం లాగా కంపు కొడుతున్న ఆ పార్టీ అస్తిత్వాన్ని ఎంతో ప్రేమతో ఆరాధించడం, దాన్ని నిర్మూలించేందుకు ఒప్పుకోకపోవడం చాలా విమర్శనాత్మకంగా, వ్యంగ్యాత్మకంగా చిత్రితమయ్యాయి కథలో.

‘లంకా పునరుద్ధరణ’ అన్నది రామాయణ కాలం నాటి కిష్కింధలోని విడ్డూరమైన పాలన మీద, పరిస్థితుల మీద సంకేతాత్మకంగా రాసిన కథ. అందులోని పాత్రలు, పరిస్థితులు నిజానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, పోలీస్ చర్యల తర్వాతి పరిణామాలకు అద్దం పడతాయి. ఆ సందర్భంలో కేంద్రప్రభుత్వం శాంతిభద్రతలు అనే సాకుతో జనరల్ చౌదరీ, వెలోడిలను హైదరాబాద్ సంస్థానానికి పరిపాలకులుగా నియమించి, తుగ్లక్ వ్యవహారం లాంటిదానికి వీలు కల్పించడాన్ని చాతుర్యంతో, వ్యంగ్యంతో చిత్రించారు కాళోజీ. ‘విభూతి, లేక ఫేస్ పౌడర్’ లో శ్రీకృష్ణుడు, సత్యభామ, శివుడు, పార్వతి, దక్షుడు మొదలైన పురాణ పాత్రలను ఉద్దేశిస్తూ వేరే పేర్లున్న పాత్రల ద్వారా కథను నడిపించడం జరిగింది. ఇందులో అద్భుతమైన సెటైర్ ఆవిష్కృతమైంది.

ఎట్లాంటి అన్యాపదేశ పద్ధతినీ (allusion method ను) అవలంబించకుండా సూటిగా, స్పష్టంగా రాసిన కథ భూతదయ. కాళోజీ ఈ కథను మరో ఇద్దరు రచయితలతో కలిసి రాశారు. వారి పేర్లు వెల్దుర్తి మాణిక్యరావు, వెంకట రాజన్న అవధాని. 1937 లో గోల్కొండ పత్రికలో ప్రచురితమైన కథ ఇది. ఒక ఊరి దేవాలయ ఆవరణలో కనిపించిన అనాథ పసికందును అక్కున చేర్చుకునేందుకు ఎవ్వరూ ముందుకు రారు కానీ, అదే దేవాలయంలో అదే చోట శ్రీరాముని విగ్రహమొకటి కనపడితే దాన్ని ప్రతిష్ఠింపజేసేందుకు అందరూ అత్యుత్సాహాన్ని చూపడమే కాక విరివిగా విరాళాలు ఇస్తారు. మానవత్వం కన్న మూఢభక్తి గొప్పది కాదనీ, పైగా అది నిరసింపతగినదనీ చెప్తారు రచయితలు. పైన పేర్కొన్నట్టుగా ఈ కథలో ఎంత సూటిదనం, స్పష్టత ఉన్నాయంటే, మనుషులలోని మానవత్వ లేమిని ప్రస్తావిస్తూ ఆ విషయాన్ని కథ చివర్న కరాఖండిగా ఎండగట్టడం జరిగింది. ఈ కోణంలోంచి పరిశీలిస్తే, ఈ కథ మిగతావాటికంటె భిన్నమైనదని తెలుస్తుంది. ఎందుకంటే, తక్కిన దాదాపు అన్ని కథల్లో ఏదో కొంత మోతాదులో అన్యాపదేశంగా చెప్పడముంది. కేవలం సగం పేజీ నిడివిని (రెండు పేరాగ్రాఫులను) కలిగివున్న కథ ఎన్నిక. స్వయంవరంలో తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ రాకుమార్తెకు ఉండాల్సినట్టే, ఎన్నికల్లో (elections లో) తమ నాయకులను ఎన్నుకునే స్వేచ్ఛ పౌరులందరికీ ఉండాలనే విషయాన్ని చెప్పకనే చెప్పారు ఈ కథలో.

మనమే నయం అనే కథలోని భిన్నత్వం ఏమిటంటే, ఇందులోని ప్రధాన పాత్రలు జంతువులు. ఈ మనుషులందరూ మనమీద బూటకపు ప్రేమను కనబరుస్తున్నారని ఒక ఎద్దు ఆక్షేపించగా, వాళ్ల పరిస్థితి కూడా దుర్భరంగానే ఉన్నదనీ, నిజానికి వాళ్లకంటె మన పరిస్థితే నయం అనీ మరో ఎద్దు ఈ కథలో సూచించడం జంతువుకు ఉదాత్తతను అపాదించి, దాన్ని మనిషికన్న ఉన్నతస్థాయిలో ప్రదర్శించడం కిందికి వస్తుంది. ఈ దృక్పథంతో కథలు రాసేవాళ్ల సంఖ్య తక్కువే.

కాళోజీ ఇరత భాషలలోని కొన్ని కథలను తెలుగులోకి అనువదించారు కూడా. అపోహ, జాజితీగ, అనుభవము లేని ఆందోళన, రెండు గింజలు అట్లాంటివే. ‘అపోహ’కు మూలం ఇంగ్లీషు అని పేర్కొన్నారు ఆయన. ఇది సోమర్సెట్ మామ్ రాసిన Mr. Know All ను దాదాపు ఎనభై శాతం పోలివుంటుంది. ఆ ఆంగ్లకథ చాలా విభిన్నమైనది, విశిష్టమైనది, ఒకరకంగా వినూత్నమైనది. కాళోజీ అనువదించిన కథలు అనువాదాల్లాగా లేవు. అవి మూలకథలు (original stories) అనిపించేలా ఉండటం కాళోజీ అనువాద ప్రతిభకు నిదర్శనం.

ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీ, సుల్తాన్ బజార్, హైదరాబాదు – దక్కన్ వారు మొదటిసారిగా కాళోజీ కథలను ప్రచురించారు. వాటిని 2000, 2011 లలో కాళోజీ ఫౌండేషన్, వరంగల్ మళ్లీ అచ్చు వేయడం తెలుగు పాఠకుల అదృష్టమనవచ్చు. ఈ పుస్తకాన్ని ఈ వ్యాసరచయిత ఈ మధ్యనే ఆంగ్లంలోకి అనువదించగా, కాళోజీ ఫౌండేషనే ప్రచురించడం జరిగింది. కాళోజీ రాసిన కథలు కొన్ని అలభ్యంగా ఉన్నాయని అన్నారు ఆ ఫౌండేషన్ వారు. ఎవరైనా పూనుకుని వాటిని సంపాదించి, వెలుగులోకి తెస్తే, ఒక తెలంగాణ వైతాళిక రచయితకు సంపూర్ణ న్యాయాన్ని చేకూర్చినవారవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com