రవీంద్ర అనాహతలోకి…

ఇటీవల రవీంద్ర సూరి నామాల వెలువరించిన అనాహత కవితా సంపుటి సాహితీ లోకంలో ఒక కొత్త ఒరవడి ప్రవేశపెట్టింది. తన ఆలోచనల నుండి, హృదయ ద్రావకం నుండి స్రవించిన రవీంద్ర కవితా ధార మామూలు గానే మొదలై కవిత్వమై కూచుంటుంది.

చూసే వాళ్ళకు

నాలుగు కాళ్ళ కుర్చీలో

గంటలు తరబడి కూర్చున్నచోటే

ఉన్నట్లు కన్పిస్తుంటాను నేను

కాని..‌

నేను తిరిగేది ఎక్కడో

వెతికేది ఏంటో

ఎవరికీ కనిపించదు

గాలిలో పరుగెడతాను

వానతో పాటు నడుస్తాను

రాత్రి పూట మొలిచే చుక్కల్ని

తోడుగా ఉన్న చంద్రున్ని…

పలకరించి.. పలవరించి..

ఇట్లా కవి కవిలోక విహారం చేస్తూ భౌతిక జడత్వంలో ఉంటాడు. కవిత్వం లో ఆయన చేసిన నిర్మాణం ఎక్కడా కృతకం ఉండదు.

కావాలని వేసే ప్రతీకలు అసలు కనిపించవు‌. అట్లా నెమ్మది నెమ్మదిగా పాఠకున్ని ఆక్రమించుకొంటాడు.

‘కొమ్మను వీడిన గాలి

ఊపిరాడక మరో

కొమ్మ నందుకొమ్మంటూంది

ఊపందుకోవాలని’

ఇట్లా ప్రాకృతికమైన ఉపమానాలతో సాగిపోయే ఈ కవిత చివరికి మానవ చైతన్యాన్ని ఉపమేయం చేసి ముగిస్తాడు.
‘అలక్ష్యం చేస్తే

లక్ష్యం ఉన్న మనిషైనా

మనిషి నిత్యం రగిలిపోవాలి

చైతన్య మూర్తిలా

కొత్త ఊహల్లో

దుఃఖం గురించి కృష్ణశాస్త్రి రాశాడు. మరణం గురించి అజంతా రాశాడు. ఇవి రెండూ మనిషితనానికి అవిభాజ్యాలు. వీటిపైనా రవీంద్ర చూపు పడింది. చూపు పడడమేమిటి? ఈ కవిత్వమంతా ఈ పార్శ్వాల నడుమే. గింగురుమంటూ తిరుగుతుంది.

గిర్ మంటూ నేలపై పడ్డాక మసక చూపులోనూ దుఃఖం స్పష్టంగా కనిపించింది. మళ్ళీ చావడం కోసం పుట్టినట్లు చివరి వాక్యంలో మళ్ళీ చావడం కోసం పుట్టినట్లు అన్న మాటలోని జీవితం బరువు అలాగే కవిత్వంలో ఒదిగించిన తూగు చూస్తే ఈ కవి సామర్థ్యం అర్థమవుతుంది.

“నా కళ్ళు కార్చేది

నేను దుఃఖంలో

ఉన్నపుడే అంటూ బలమైన వాక్యాలతో కొనసాగే ఈ కవిత

‘సుఖానికి ఒకవైపే

దుఃఖం – ఒడవని

దుఃఖానికి మనిషే

ముఖ చిత్రం లాంటి వాక్యాలతో ముగుస్తుంది‌‌.

యుద్ధం చేసేది

గెలవడానికే అని చాలామంది అనుకొంటారు. కానీ, సూరి ‘యుద్ధంలో గెలవకపోవడం కాదు. యుద్ధం చేయకపోవడమే విషాదం అంటాడు‌

ఊరును గురించి రాయని కవి దాదాపుగా కనిపించడు‌. రవీంద్ర ఊరిని గురించి రాసిన తీరులో ఒక ప్రత్యేకత ఉంది‌‌‌.

” ఊపిరి పోసిన

అమ్మతో సమానం

ఊరు కన్నబిడ్డల

వెచ్చని కౌగిలింతల్లాం

టి పచ్చని జ్ఞాపకాలు”.

జీవితానుభవం, విభిన్న తాత్విక అధ్యయనం కలిసిపోతే వచ్చే వ్యక్తీకరణలు రవీంద్ర కవిత్వంలో కనిపిస్తాయి‌. రాయడం, చదవడం అనే ప్రధానాంశాలను ఆయన నిరంతరం కొనసాగిస్తే తెలుగు సాహిత్యంలోని అగ్ర కవుల వరుసలో ఆయన తొందరలోనే చేరిపోతాడు‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com