ముఖాముఖి నవ్య సంప్రదాయ ప్రతినిధి డా. తిరుమల శ్రీనివాసాచార్యతో మామిడాల రమేష్ బాబు ముఖాముఖి

‘బడి ఎవ్వడు కడితేనేం

గుడి ఎవ్వడు కడితేనేం

మన బుడతడు తెలివి పెంచి

చదివి బాగు పడితే సరి’

తెలుగు సాహితీ లోకానికి పరిచయంమక్కరలేని వ్యక్తి డా.తిరుమల శ్రీనివాసాచార్య. పద్యకవిగా, గేయకవిగా, సాహితీ విమర్శకులుగా, గ్రంథ పరిష్కర్తగా, గ్రంథ వ్యాఖ్యాతగా, ప్రయోక్తగా, గ్రంథ సంపాదకులుగా, సాహితీ రూపకాల రూపకర్తగా బహుముఖ ప్రజ్ఞా సంపన్నుడు డా. తిరుమల శ్రీనివాసాచార్యులు గారు. నిండైన విగ్రహం, శ్రావ్యమైన కంఠం, ఆకట్టుకునే వ్యక్తిత్వం, అమాయకమైన చిరునవ్వుతో తెలుగు సాహిత్యాభినులందరికీ గుర్తొచ్చే వ్యక్తి డా. తిరుమల శ్రీనివాసాచార్యులు. ఆరు దశాబ్దాలుగా 50 కి పైగా తన రచనలతో పాత, కొత్త తరాలకు వారధిగా నిలిచారు. 2015 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తొలి దాశరథి సాహితీ పురస్కారాన్ని అందుకున్న కవి తిరుమల శ్రీనివాసాచార్యులు. గత 60 సంవత్సరాలలో ఎన్నో పురస్కారాలను అందుకున్న రుబాయిల రాజు తిరుమల శ్రీనివాసాచార్యులు గారితో ముఖాముఖి.

ప్రశ్న: ఇంత గొప్ప సాహితీవేత్తగా పరిణితి చెందడానికి నేపథ్యమయిన మీ బాల్యం మరియు విద్యాభ్యాసం, ఉద్యోగం గూర్చి తెల్పండి?

జవాబు: మాది ఒక పేద కుటుంబం. వైష్ణవులం. అప్పటి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలుకా నారాయణపురం మా ఊరు. 12 సంవత్సరం వరకే వైష్ణవ సాంప్రదాయాన్ని, సాహిత్యాన్ని మా నాన్న గారు కారంచేటి తిరుమల మనోహరాచార్యుల వారు బోధించినారు. నిత్యానుసంధానం, తిరువాయిముర్రి, పంచ వాక్యాలతో పురుష సూక్తం, లక్ష్మీ సూక్తం నేర్చుకున్నారు. మా నాన్న గారికి రామరాజు భూషణుని, వసు చరిత్ర అంటే గాఢమైన అభిమానం, ఆయన నాచేత 50,60 పద్యాలు కంఠతా పట్టించాడు. మా ఊరికి అప్పుడే కొత్తగా బడి వచ్చింది. అచ్యుత రామరాజు గారు అనే అధ్యాపకుడు ఉండేవారు. మంచి గాయకుడు, రంగస్థల నటుడు. మా ఊరిలో మూడవ తరగతి వరకు పక్కనే ఉన్న ఎల్లారెడ్డి పేటలో 4, సిరిసిల్లలో 5,6 తరగతులు చదువుకున్నారు.

చిన్నప్పటి నుండి పాటలంటే ఇష్టం, హాయిగా గొంతెత్తి పాడుకునేవారం. ఆ తర్వాత మా పెద్దన్నయ్య K.V. రాఘవాచార్యులు మెదక్ లో టీచర్ గా పనిచేసేవారు. వావి వద్దనే 7,8,9,10,11,12 తరగతులు అప్పట్లో మల్టీపర్పస్ హై స్కూల్ మొదటి బ్యాచ్ 1959 లో చదివాను. నాది M.P.C ఇంజనీరింగ్ చదవాలి కాని వయస్సు 21 సంవత్సరాలు దాటింది. కావున BE కి అర్హుడవు కావు కావున టీచర్ గా పనిచేస్తూ చదువుకో అని అన్న సలహా ఇవ్వడంతో టీచర్ గా ఉద్యోగం ప్రారంభించాను. మెదక్ జిల్లా రామాయంపేట తాలూకా కలువకుంట దగ్గరున్న వెంకటాపురంలో నా ఉద్యోగ జీవితం ప్రారంభించాను. ఆ తర్వాత సూరారం, చేగుంట, రామాయంపేట స్కూళ్లల్లో పనిచేసాను. దుబ్బాకలో పనిచేస్తుండగా M.A. ఉస్మానియా నుండి ప్రైవేటుగా పూర్తిచేశాను. ఆ తర్వాత సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో లెక్షరర్ గా నియమించారు. అక్కడి నుండి S.P కాలేజ్ సికింద్రాబాద్ లో స్థిరపడ్డాను

ప్రశ్న: మీ వివాహం, కుటుంబం గూర్చి..?

జవాబు: 1968 లో నాకు పెళ్ళయింది. నా భార్య శ్రీమతి స్వరాజ్య లక్ష్మి. హైదరాబాద్ లో కమలా నెహ్రు పాలిటెక్నిక్ కళాశాలలో ఆమె ఉపన్యాసకురాలు. నాకు నలుగురు కూతుళ్లు. నేను సిద్ధిపేట, కుటుంబం హైద్రాబాదు, ఈ తిరుగుడు కుదురదని సిద్ధిపేటలో రాజీనామా చేసి సర్ధార్ పటేల్ కళాశాలలో చేరాను. 25 సంవత్సరాలు అక్కడే పనిచేశాను. 1995 లో రీడరుగా రిటైరయ్యాను. కళాశాలలో నా పాఠాలు వినడానికి ఎక్కడెక్కడి నుండో విద్యార్థులు వచ్చేవారు. ఇతర కళాశాలల నుండి కూడా చాలా నిర్మలంగా, స్వచ్ఛంగా, పారదర్శకంగా అధ్యాపక వృత్తిని ముగించాను.

ప్రశ్న: మీ రచనల గూర్చి, వాటి ప్రేరణ గూర్చి తెల్పండి..?

జవాబు: ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా రచనా వ్యాసాంగం కొనసాగేది. నా రచనలకు ప్రేరణ నా భార్య. ఆమే నా తొలి విమర్శకురాలు కూడా. బాగుంది, బాగాలేదు అని స్పష్టంగా చెప్పేది. బాగాలేదు అని చెప్పినప్పుడు మళ్లీ కొంచెం మార్చుకుని చెప్పేవాన్ని. 1970లో ‘ఉదయరాగం‘ నుండి 2019 ‘ స్వరాజ్యలక్ష్మీ స్మృతి’ వరకు 50కి పైగా రచనలు చేసాను.

ప్రశ్న: పాట, పద్యంపై మీకింత అభిరుచి ఎందుకు కలిగింది..?

జవాబు: చిన్నప్పటి నుండి నాకు పాటంటే ఇష్టం, గేయరచనల కన్నా. M. A చదివేటప్పుడు పెద్దపెద్ద ప్రబంధాలు, కావ్యాలు చదువుకున్నాం కాబట్టి పద్యమంటే ఇంత గొప్పదా అని పద్యం మీద కూడా అభిరుచితో పట్టు సాధించాను.వచన కవిత్వం కూడా రాసాను కానీ తక్కువ.

ప్రశ్న: మీ వాఖ్యాలు, గ్రంథ పరిష్కరణం గూర్చి తెలపండి?

జవాబు : ఇతరుల కోసం, వారు కోరితే పండితునిగా కొన్ని కావ్యములకు వ్యాఖ్యానం కూడా చేసాను.

ప్రశ్న: మీపై ప్రభావం చూపిన వారిలో దాశరథి,సినారె ముఖ్యులని చెప్పవచ్చు వారిని గురించి చెప్పండి?

జవాబు: మొదటి నుండి దాశరథి, నారాయణరెడ్డిగారు ప్రభావం నాపై ఎంతో ఉంది కొందరు ప్రభావం ఉంటేనే మనిషి ఎదుగుతాడు తర్వాత తన దారి తను చూసుకుంటాడు. పరిసరాలలో జీవించిన మహా కవుల ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన మీద ప్రసరిస్తూనే ఉంటుంది.పాండిత్య పరంగా దివాకర్ల వెంకటావధాన గారిి ప్రభావం కూడా ఉంది. వారికి నా తొలి కావ్యం ‘ఉదయరాగం’ అంకితమిచ్చాను.

ప్రశ్న: యువభారతి తో మీ అనుబంధం?

జవాబు: 1970 లో లహరీ ప్రసంగాలతో యువభారతి లో నేను కూడా సభ్యునయ్యాను వంగపల్లి విశ్వనాథం, సుధామ, విజయ వంటి వారితో అక్కడ మంచి స్నేహం దొరికింది. అక్కడే ఇరివెంటి కృష్ణమూర్తి ప్రత్యేకంగా నాకు ఆప్తుడైనాడు. ఒక విధంగా నాకు ఆయన మార్గదర్శి కూడా కృష్ణమూర్తిగారు అరబీ, ఉర్దూ,ఫార్సీల లో మంచి పండితుడు,నారాయణ రెడ్డి గారికి ఏ అనుమానం వచ్చినా కృష్ణమూర్తినడిగే తెలుసుకునేవారు నారాయణరెడ్డి గారి కొన్ని కావ్యాలకు దాదాపు 15 కావ్యాలకు మూలం కృష్ణమూర్తిగారి ప్రేరణ. కృష్ణ మూర్తి గారు చెప్పిన విషయాల్లో నుండి ఒక పాయింట్ తీసుకొని సినారె గారు కావ్యాన్ని రచించే వారు.

ప్రశ్న: మీ రూబాయిలు, గజల్లు గురించి చెప్పండి. దాదాపు 25 కావ్యాలు రుబాయిల్లో రచించారు కదా ?

జవాబు: రుబాయి ,గజల్ రెండూ ఉర్దూ ప్రక్రియలే. రుబాయి ఎందుకు బాగా ఆకర్షించిందంటే మనం చెప్పదలుచుకున్న భావానికి అది మెరుపు లాగా ఉంటుంది.ఇది చివరిపాదంలో చెప్పే ప్రక్రియ రుబాయి. 26 కావ్యాలు రుబాయిల్లో రచించాను ఉర్దూ లో ఉన్న ప్రశంసాత్మక గుణం నన్ను ఆకర్షించింది. దాశరధిని అభిమానించే నేను ఉర్దూలో పండితుడైన ఆయనను ఈ విషయంలో కూడా అనుకరించాను.అలాగే నారాయణరెడ్డి గారిని కూడా. సినారె కావ్యాలన్నీ చదివి “సినారె సాహితీ మూర్తి” అనే పెద్ద గ్రంథాన్నే వ్రాసాను.దీనికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. విశ్వంభర దాకా వ్రాసాను. రుబాయిలన్నీటికీి దాశరథి గారి ప్రేరణే.నారాయణ రెడ్డి గారి నుండి గానం అనుకరించాను.

ప్రశ్న: గంగా తరంగాలు గూర్చి, గానం, సంగీతం ఎలా అలవడింది?

జవాబు: సంగీతం ఏమి నేర్చుకోలేదు దిల్ షుఖ్ నగర్ ,గడ్డి అన్నారం గట్టుపై కూర్చొని పాడుకుంటూ ఈ గంగా తరంగాలు రాసాను. ఇవి కొందరు గాయకులు సీడీ రూపంలో తీసుకొచ్చారు.

వానమామలై వరదాచార్యులు ప్రత్యేక అభిమానం ఎందుకు ఏర్పడింది ఆధునిక తెలంగాణ సాహిత్యంలో ఒక మంచి ప్రబంధం లేదనే బాధతో వనామామలై వరదాచార్యులు గారు “పోతన చరిత్ర”అనే ప్రబంధాన్ని రాసి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో ప్రముఖుల సమక్షంలో పాడి ప్రచారం చేసినాడు.

ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆధునికయుగంలో తెలంగాణ సాహిత్యంలో వానమామలై వరదాచార్యులుగారు నన్నయ లాంటివారు. దాశరథి గారు తిక్కన లాంటివారు. సినారె గారు ఎర్రాప్రెగడ లాంటివారు. కారణం ఆధునిక మొదటి తెలంగాణ ప్రబంధం పోతన చరిత్రే. ఆయన మీద అభిమానంతోటే ఈ వ్యాఖ్యానాలు వ్రాసాను.

ప్రశ్న : ఎన్నో అవధానాలలో మీరు సంధానకర్తగా ఉన్నారు. పద్యంపై ఇంత పట్టు,ధారణ ఉన్న మీరు అవధానం ఎందుకు ప్రయత్నించలేదు?

జవాబు: నిజమే నాగఫణిశర్మ, మేడసాని మోహన్, మన అందెవెంకటరాజం, గుండ్లూరి దత్తాత్రేయశర్మ వంటి అవధానుల సభల్లో సంధానకర్తగా, సమన్వయకర్తగా వ్యవహరించాను కానీ ఎప్పుడూ ఆ అవధానాన్ని చేయాలని కూడా ఎందుకో అనుకోలేదు.

ప్రశ్న : అప్పట్లో “మీరు సాహిత్యాన్ని ఎందుకు చదవాలంటే” అనే పుస్తకాన్ని వ్రాసారు. ఇప్పటి పరిస్థితులలో, ఈ సమాజానికి మీరు సాహిత్యాన్ని ఎందుకు చదవాలంటారు?

జవాబు: ఇప్పుడు నా దృష్టిలో సాహిత్య అధ్యయనం ఇంకా ఎక్కువ అవసరం అనిపిస్తుంది. కారణం సమాజానికి హితైక దృష్టి తగ్గిపోతున్నది.ఒకరి గురించి ఒకరు మంచి చెప్పడం తగ్గిపోయింది.కవుల గురించే కాదు మనుషుల గురించి కూడా మంచిగా చెప్పం. ఇప్పుడు ఎదుటివారి పాండిత్యాన్ని అభినందించేవారు కూడా తక్కువే. దీనిలో కవి తనంతట తానే చెప్పుకోవాల్సిందే. కవి ఒక సంఘజీవి, వ్యక్తి యొక్క కష్టాన్ని సమాజపరం చేసే ఇది ఇది అందరూ కష్టమని చెప్పేవాడే కవి. సాహిత్యంలో దీనినే సాధారణీకరణం అంటారు అలా చేసే వాడు కవి కాబట్టి సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే సాహిత్యం ఎప్పుడూ చదవాల్సిందే. సమాజానికి దార్శనికుడు కవే.సమాజానికి హితాన్ని మాత్రమే చెప్పేవాడు కవి.

ప్రశ్న: ఒక కవికి కనీసం ఏ లక్షణాలుండాలంటారు?

జవాబు: సమాజంలోని కష్టసుఖాలను పరిశీలించి చెప్పేవాడే కవి. భావాన్ని ప్రకటించే గుణం ఉండాలి ఈ ప్రకటనకు శబ్దం అవసరం. శబ్ద నిర్దోషిత్వం శబ్ద శుద్ధి,శబ్ద సృష్టి,కొత్త సమాస నిర్మాణం, కొత్త పలుకుల నిర్మాణం, జాతీయాల నిర్మాణం ఇవ్వన్ని కవికుండాలి. కవి సుందరంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. కవి ప్రజా ప్రతినిధి. ఇంగ్లీష్ లో స్థూక్తి ఉన్నట్లు కవి “poet is a un acknowledged legislator of the world”

ప్రశ్న : మీకు సినీ ప్రముఖుల పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి?

జవాబు : నాకు అభిమాన నటుడు నాగేశ్వరరావుగారు ఆయనకు నా “దీపాల చూపులు” అనే కావ్యాన్ని అంకితమిచ్చాను.అలాగే విశ్వనాథగారితో కూడా నా “గంగా తరంగాలు” అనే కావ్యాన్ని విశ్వనాథ వారికి అంకితమిచ్చాను. ఆ కావ్యాన్ని చదివి నన్ను సినిమా రంగానికి పరిచయం చేస్తాడేమో అనుకున్నాను కానీ నేను ఆయనను ఈ విషయమై అడగలేదు.ఆయన కూడా నన్ను పిలవలేదు. ఘంటసాల నా అభిమాన గాయకుడు.బాలు గారికి నా “ప్రపంచం విపంచి” అంకితమిచ్చాను.

ప్రశ్న: చివరగా ఒక గొప్ప పద్యకవిగా నేటి పద్య కవులకు మీరిచ్చే సూచన?

జవాబు: పద్య రచన కావ్య హేతువులైన ప్రతిభ, పాండిత్యము, అభ్యాసం ఈ మూడింటికూర్పు. ప్రతిభ,పాండిత్యం ఎంతున్నా అభ్యాసం ఎప్పుడూ ఉండాల్సిందే. శబ్దం మీద అధికారానికి బాగా చదవాలి కాబట్టి అధ్యయనం, అభ్యాసం రెండూ క్రమం తప్పవద్దు. పూర్వకవుల కావ్యాలు చదవాలి కొందరి గ్రంథాలు చదివినవాడే కొత్త గ్రంథాలు వ్రాస్తాడు.

ప్రస్తుతం అనేక మాద్యమలున్నాయి. కాబట్టి నీ ప్రతిభా పాండిత్యాన్ని సులభంగా ప్రదర్శించుకోవచ్చు కాబట్టి కృషిముఖ్యం. అది ఏదైనా. ప్రస్తుత ప్రభుత్వానికి గుర్తింపు కూడా ఉంది కాబట్టి మన కృషే మనకు ఆస్తి.

ధన్యవాదాలు సర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com