-వి.వింధ్యవాసినీ దేవి

సాహిత్యంలో ప్రతిఫలించిన తెలంగాణ గ్రామాలు…

తెలంగాణ బతుకుచిత్రాన్ని ప్రపంచానికి దృశ్యమానం చేసిన తెలంగాణ దినపత్రిక – “నమస్తే తెలంగాణ” వలస పాలనలో నామమాత్రావశిష్టమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భాష, యాస, ఆచార వ్యవహారాలను పునరుజ్జీవింప చేయడంలో ఈ పత్రిక నిర్వహించిన పాత్ర గణనీయమైనది. పరపీడనలో మూగబోయిన తెలంగాణ ప్రజల గొంతుకను గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలంగా వినిపించింది. కేవలం రాజకీయ, ఆర్థిక, సాంఘిక అంశాలకే ప్రాధాన్యతనీయకుండా తెలంగాణా సాంస్కృతిక వైభవాన్ని సైతం నలుదిశలా వ్యాపింప చేయడానికి చేసిన కృషి అనన్యసామాన్యమైనది. తెలంగాణ ప్రాంత గత చారిత్రక వైభవాన్ని చాటిచెబుతూ, వర్తమాన ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపిస్తూ, భవిష్యత్ బంగారు తెలంగాణ కల సాకారానికి తన వంతు బాధ్యతగా నిర్మాణాత్మకమైన కృషి చేస్తూ కొనసాగుతున్న దినపత్రిక ‘నమస్తే తెలంగాణ’ – అని పేర్కొనడం అతిశయోక్తి కాదు.

ఈ క్రమంలో ఆదివారం వెలువడే అనుబంధ పత్రికకు ‘బతుకమ్మ’ అని నామకరణం చేయడం ఔచితీవంతంగా ఉంది. బతుకమ్మ వారపత్రిక తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశాలు, సంస్థానాలు, పాలకుల చరిత్రను వెలికితీసి అందించడంతో పాటు ఈ ప్రాంతానికే పరిమితమైన, ప్రత్యేకమైన సాంస్కృతిక చిహ్నాలైన ఆట-పాటలు, పండుగపబ్బాలు, ఉత్సవాలు-

జాతరలు, కోట పేటలు, ఆచార సంప్రదాయాలు, ఆహారపు టలవాట్లు మొదలగు అనేకాంశాలకు సముచితమైన గుర్తింపునిచ్చింది. భాషకు సంబంధించి పలుకుబడులు, జాతీయాలు, సామెతలు, నుడులు, నానుడులు, లోకోక్తులు మొదలగు విషయాల్లో ప్రత్యేకంగా నిలిచే తెలంగాణా మాండలిక భాషను, యాసను బలపరిచింది. మొత్తం మీద సహజమైన

ప్రాకృతిక సౌందర్యానికి పెద్దపీట వేస్తూ, ఉనికి కోల్పోయేదశకు చేరుకున్న తెలంగాణ ప్రాంత చిత్రానికి రంగులద్ది, ప్రపంచ పటంలో నిలబెట్టిందని చెప్పొచ్చు.

ఈ నేపథ్యంలో ‘బతుకమ్మ’ వారపత్రికలో ప్రచురితమైన కథానికల్లో కథకులు చిత్రించిన తెలంగాణ గ్రామీణ జీవన చిత్రణను పరిశీలించడమే ఈ వ్యాస ప్రధానోద్దేశం. ‘బతుకమ్మ’ కథలు తెలంగాణా గ్రామీణ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తాయి అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అర్థ దశాబ్దపు బతుకమ్మ కథల్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

సంస్కృతీ సంప్రదాయాలను ఒక తరం నుంచి మరోతరానికి సంక్రమింప చేయడంలో గ్రామాలదే ముఖ్య పాత్ర. భారతీయ సంస్కృతిని తెలుసుకోవాలంటే

గ్రామాల్లోకి పయనించాలని చెప్పిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు అక్షర సత్యాలుగా గ్రహించవచ్చు. దేశానికి వెన్నెముకగా నిలిచేవి గ్రామాలే. తెలంగాణ సంస్కృతిని అధ్యయనం చేయడానికి ముఖ్య ఆధారం గ్రామాలే. గ్రామాల్ని, గ్రామ జీవితాన్ని పరిశీలిస్తే తెలంగాణ ప్రాంత సంస్కృతి తెలుస్తుంది. అయితే బతుకమ్మ కథలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబించడంతో పాటూ, వలస పాలకుల దోపిడీయుత పాలనలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు, కులవృత్తులు అంతరించడం, సాగునీటి వసతులులేక వ్యవసాయ రంగం కుంటుపడడం, ఇతర ఉపాధి మార్గాలు అందుబాటులో లేక, నిలకడైన ఆర్థిక స్థితి లేక, దైన్యంగా మారిన స్థితిని, ఆ పరిస్థితిని మార్చాల్సిన ఆవశ్యకతను వ్యక్తం చేశాయి.

మలి దశలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర నివాదం తెరపై వస్తున్న క్రమంలో, ఉద్యమ నినాదాలు ఊపందుకున్న తరుణంలో ప్రతి కథకుడు తాను పుట్టిన మట్టి ఋణం తీర్చుకునేందుకు ప్రయత్నించాడు. తన ప్రాంత ఆస్తిత్వం పై అలుముకున్న చీకట్లను పారద్రోలడానికి కధకులు కథా సాహిత్యా న్ని ఒక అస్త్రంలా ప్రయోగించారు. గత కాలంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ భాషను ఉన్నత స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ మాండలిక యాసలో కథనాన్ని నడపడం ద్వారా కొత్త శిల్ప సౌందర్యాన్ని సాధించారు. యదార్థ జీవిత గాథలనే కథలుగా మలచుకోవడంలోనే కథకుల ప్రతిభ వెల్లడవుతుంది. “బతుకమ్మలో ప్రచురింపబడిన కథలన్నీ వాస్తవ జీవితావిష్కరణ కావించి గ్రామీణ ప్రాంత సహజత్వానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. స్వరూప, స్వభావ చిత్రణల రెండింటిలోనూ యధార్థతకు పెద్ద పీట వేయడంలో కథకుల దృక్పథం వెల్లడవుతుంది కల్పనలకు, ఊహలకు ఆస్కారం లేకుండా ఉన్నదున్నట్లుగా చిత్రీకరించడంలో కథకులు కృతకృత్యులయ్యారని చెప్పొచ్చు.

‘బతుకమ్మ’ కథలు ఈ క్రింది ప్రయోజనాలను సాధించినట్లు గ్రహించవచ్చు.

గ్రామీణ జీవితంలోని సహజత్వాన్ని ఏ మాత్రం కల్పనలు లేకుండా కళ్ళముందు నిలిపాయి.

• శ్రామిక జీవన వ్యథలను, వెతలను వాస్తవిక దృష్టికోణంలో ఆవిష్కరించాయి.

• ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర కల నెరవేరిన తర్వాత సాధించుకోవాల్సిన బంగారు తెలంగాణకు ప్రతిబంధకాలుగా ఉన్న సమస్యలను ఎత్తి చూపాయి.

• తెలంగాణా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడలన్న సృహను కలిగించాయి.

• సహజ ప్రాకృతిక జీవన మాధుర్యాన్ని అనుభూతి మయం చేశాయి.

• వెల్లువలా దూసుకొచ్చే అభివృద్ధి ప్రభంజనంలో మానవ సంబంధాలను నిలుపుకోవాలని సూచించాయి.

• వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతును రాజుగా మార్చాల్సిన ఆవశ్యకతను వెల్లడించాయి.

• విభిన్న వృత్తులవారి జీవితాల్లోని అపశృతులను సరిచేయాలని చాటి చెప్పాయి.

• ‘గోబ్యాగ్ టు వేదాస్’ అన్నట్లు నేటి నాగరిక అరణ్యంలో తప్పిపోయిన మనిషి, తాను కోల్పోతున్న మనిషితనాన్ని వెతుక్కోవడానికి పల్లెబాటపట్టాల్సిన అవసరాన్ని తెలియజేసాయి.

• అంతరించిందని భావించే దోపిడీయుత భూస్వామ్య వ్యవస్థ నేటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతుందనీ బడుగు జీవుల్ని జలగల్లా పీడిస్తున్న పరిస్థితులకు చరమగీతం పాడాలని ఆకాంక్షించాయి.

•గ్రామ చిల్లర దేవుళ్ళయిన దొరలు, భూస్వాముల పడగనీడ నుంచి తప్పించుకోవడానికి శ్రామిక జనమంతా ఏకమై పోరాటానికి సిద్ధం కావాల్సిన అనివార్యతను వ్యక్తం చేశాయి.

“బతుకమ్మ కథల్లో తెలంగాణా గ్రామీణ జీవన చిత్రణ”ను ఈ క్రింది అంశాల ఆధారంగా పరిశీలించడం జరిగింది.

1) శ్రామిక జీవన సౌందర్యం 2) రైతు జీవితం 3) హిందూ ముస్లిం సమైక్యత 4) కులవృత్తుల క్షీణత 5) భూస్వామ్య వ్యవస్థ అస్తిత్వ చిహ్నాలు 6) సంచార కళాకారుల జీవనం 7) గ్రామీణ స్త్రీల చైతన్యం 8) గిరిజన జీవన చిత్రణ 9) గ్రామీణ సంస్కృతి

10) పశుపక్ష్యాదుల పట్ల మమకారం శ్రమైక జీవన సౌందర్యం …

గ్రామీణ జీవితంతో విడదీయలేని అంశం శ్రమ, శ్రామిక జీవనం. శ్రమైక జీవన సౌందర్యమంతా గ్రామాల్లో సుస్పష్టంగా దర్శమిస్తుంది. శ్రమలోంచే సమస్త సంస్కృతి రూపుదిద్దుకుంది. శ్రమలోంచే నాగరిక ప్రపంచం ఆవిష్కృతమైంది, విలువ కట్టలేని అమూల్య సంపద శ్రమ. శ్రామికులు శ్రమైకజీవుల జీవితాలు ఎంత తృప్తిగా ఉంటాయో తెలియ చెప్పే కథ “ఊరు మెచ్చిన మనిషి” రచయిత గుడి పెల్లి నిరంజన్ ఈదన్న కక్కయ్య పాత్రను శ్రామిక జన ప్రతినిధిగా తీర్చిదిద్ది పాత్రకు జీవం పోశాడు. ఈదన్న కక్కయ్య అవసానదశలో ఊరు ఊరంతా కదిలొచ్చి బాధపడుతుంటే “ఈదన్న కక్కయ్య’ తృప్తిగా ఊపిరి విడుస్తాడు, “ఈదన్న కక్కయ్య ఊరిని మెప్పించడానికి సెప్పులే కారణం. సచ్చిన గొడ్ల నొలిపి తోలు కర్రగల్లలో నానేసి మురిగిన తోలును ముద్దుగా కడిగి, ఎండలో నానబెట్టి తోలు సాపు జేసేటోడు. సిన్న పెద్ద తేడా లేకుండా ఊరికంత సెప్పుల జతలు నేసెటోడు. ఊరు ఊరంత సెప్పులొడుక్కొని నడుస్తుంటే ఆనంద పడెటోడు. సెప్పుల్టేసుడే అతని ప్రపంచం. అతన్డేసిన సెప్పులూస్తే అతనికి సెప్పరాని ఆనందం. సెప్పుల్టేసుట్ల పుట్టి, సెప్పుల్లేసుల్లనే పెరిగిండు, సెప్పులే అమ్మ కౌగిలనుకునేటోడు. మునివేళ్లతో సెప్పులను ముద్దాడెటోడు. పాదాలు సాపుగుంటేనే మనిషి సాపుగుంటడని నమ్మెటోడు. తాన్టేసిన సెప్పులే ఊరి పాదాలను ముండ్ల నుండి, పెంట నుండి, రాళ్ల నుంచి కాపాడుతున్నై అనుకునేటోడు. కుక్కలు కొరికేసిన సెప్పుల్ని కుసురు కోకుండా, బాగు జేస్తుండే, ఉంగుటం పోయిన చెప్పుల్ని, కప్పూసిపోయిన సెప్పుల్ని. ఉంగుటం బిగ్గరయిన సెప్పుల్ని గూటంతో గూటించేటోడు, సెప్పుల్ని ఊరికి ఆయుధంగా మలసినోడు. చిన్న పిల్లలకు పూలు పెట్టి కుచ్చుల చెప్పులు, కిర్రు సెప్పులు చేసెటోడు. చెప్పుల్టేసి ఊరికి రక్షనైనోడు. అందుకే ఊరు ఊదన్నపట్ల అంత ప్రేమ సూయించేది” అంటూ రచయిత గ్రామాల్లో శ్రామికుల దృక్పథాన్ని తెలుపుతూ, గ్రామాల్లో శ్రమకు దక్కే గౌరవాన్ని హుందాగా చిత్రించారు. అయితే ఆర్థికంగా నిలదొక్కుకోకపోవడం శ్రామిక జీవితాల్లోని విషాదకోణం, సరైన ఆర్థిక స్తోమత లేక చెడిపోయిన కిడ్నీలను బాగు చేసుకోవడానికి, డయాలసిస్ చేయించుకోవడానికి గానీ ఆర్థిక శక్తి లేక ఈదన్న కక్కన్న మరణించడమనే పెను విషాదాన్ని నేటి సామాజిక వ్యవస్థ వైఫల్యంగా పేర్కొంటూ అసమసమాజ స్వరూపాన్ని దృశ్యకరణ చేసారు రచయిత.

రమేష్ హజారి రాసిన “మట్టిబండి” కథ నాటకీయశైలిలో నడుస్తూ గ్రామీణుల,

శ్రామిక మనస్తత్వాన్ని వెల్లడిస్తుంది. చెరువుల మట్టిని పంటపొలాల్లోకి తోలడానికి మట్టిబండ్లను సిద్ధం చేయడంతో మొదలైన కథ శ్రామికుల చెమట చుక్కల పరిమళాన్ని అందిస్తూ, తెలంగాణ, భాష, యాసతో మరింత సుగంధాన్ని కలుపుకొని జీవన సమరంలో శ్రమ ప్రాధాన్యతను వ్యక్తం చేస్తుంది. రైతు జీవన చిత్రణ…

గ్రామ జీవితంలో ముఖ్య పార్శ్వం రైతు జీవితం. వ్యవసాయమే

ప్రాణ ప్రదంగా భావించే కర్షక జీవితాల స్థితిగతులను వెల్లడించే కథలు – చిల్ల మల్లేశం’ – ‘మట్టి మనిషి’, వై.వసంత – ‘చంద్రన్న’ తమ్మిడి మాసయ్య పల్లెపిలిచింది’ రమేష్ హజారి ‘మట్టిబండి’ బి.కళాగోపాల్ ‘బోనం’ మెహక్ హైదరాబాదీ – ‘నర్సయ్య బాయి’ (మూల ఉర్దూ రచయిత – జీలానీ బానూ) మంగారపు రమేష్ యాదవ్ – ఎపుసంకు ఎలుగు, రెహనా బేగం – పత్తిపూలు’ హుమాయున్ సంఘీర్- పచ్చశీర” అల్లాణి శ్రీనివాస్ – “మార్పు” కూతురు రాంరెడ్డి ‘సర్వేనెం-321″ పెద్దింటి అశోక్ కుమార్ “గుండెలో వాన’ మొదలైనవి. ఈ కథలన్నీ రైతుకు పొలంతో గల అనుబంధాన్ని తెలియజేస్తాయి. అలాగే రైతు జీవితంలోని విషాదాన్ని పట్టిస్తాయి.

రైతులు తమ ప్రాణాలైన వదులు కోవడానికి సిద్ధపడతారు కానీ తల్లిగా భావించే భూమిని మాత్రం వదులుకోలేరు. అనివార్యంగా భూమిని కోల్పోవలసిన పరిస్థితి తలెత్తినపుడు, అందుకు ఇష్టపడని రైతు మనస్తత్వాన్ని, అతడనుభవించే తీవ్ర మానసిక క్షోభకు అద్దం పట్టే కథ “మట్టి మనిషి”. రచయిత చిల్లమల్లేశం రాజయ్య పాత్ర ద్వారా భూమిని వదులుకోవాల్సిన సందర్భంలో సగటు రైతు అంతరంగ సంఘర్షణను దృశ్యకరించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల నుంచి భూమి తీసుకోవడం నష్టపరిహారం చెల్లించడం, ముంపు

గ్రామాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించడం, వందల వేల ఎకరాల భూమికి సాగునీరందించడం అభివృద్ధికి | సోపానమే కానీ, ఈ దశలో భూమిని కోల్పోతున్న రైతు మానసిక స్థితి వర్ణనాతీతం. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు తన పంటపొలాల్ని ముంచేస్తాయన్న ఆలోచన, తన తాత ముత్తాతల నాటి భూమి సంబంధ జ్ఞాపకాలు ప్రవాహంలో కల్సిపోతాయన్ని వేదన భరించలేక భూమి పుత్రుడైన రాజయ్య గుండె పగిలి, తన భూమాత నుండి తననెవరూ విడదీయలేరని ఆ భూమిలోనే శ్వాస విడవడమనే హృదయ విచలితమైన సంఘటనను ‘మట్టిమనిషి’ కథ ద్వారా రచయిత వ్యక్తీకరించారు.

గ్రామం అంటేనే రైతు, రైతు అంటేనే గ్రామం. గ్రామీణ రైతు భూమినే తన గుండెగా భావించి సేద్యమే ఊపిరిగా మలచుకున్న విధానాన్ని రచయిత్రి వై.వసంత “చంద్రన్న” కథలో హృద్యంగా చిత్రించారు. భూమిని దుక్కిదున్నడం నుంచి పంట చేతికొచ్చేవరకు వ్యవసాయ వృత్తిలోని ప్రతిదశను కళ్ళకు కట్టించారు. ఎండనకా, వాననకా, గాత్రనకా, పగలనకా, ఆకలిదప్పులు మరచి పంట పండించడానికి రైతు పడే శ్రమనంతా ఈ కథలో అక్షరీకరించారు. కత్తీ విత్తనాలు, కత్తీ ఎరువులు, దళారులు, మధ్యవర్తుల మోసాలతో కుదేలవుతున్న రైతాంగాన్ని, తగిన సమయానికి కనికరించని వరుణదేవుడు సైతం రైతన్నను నిర్దాక్షిణ్యంగా బలిదీసుకుంటున్న తీరు హృదయ విదారకం. తాను నమ్ముకున్న మట్టి నిట్టనిలువునా ముంచేసినా రైతు మాత్రం ఆ మట్టిని వదలకపోవడం, చివరికి ఆ మట్టిలోనే కలిసిపోవడానికి సిద్ధపడడం, రైతు జీవన దృక్పథాన్ని, అతని నిబద్ధతను, భూమి పట్ల అతని కున్న మమకారాన్ని వ్యక్తం చేస్తుంది. “పల్లె అక్కడ బక్కెటోళ్ళ బత్కులల్ల ఓ భాగమైతది. గామనిషి మట్టిని తన బతుకుని మీరు చేసి సూడడు. పుట్టినప్పట్నంది. సచ్చిందాకాగా మట్టిల్నే తన్లాడతుంటడు. తనకంతాగా మట్టే అనుకుంటడు. గిదంత తెల్వకుంటనే జరిగిపోతది. గా మట్టే బువ్వ

పెడదనుకుంటడు. గా మట్టే అడవి తల్లనుకుంటడు. గా మట్టే అన్నింటిని పుట్టిస్తది. గా మట్టే అన్నింటిని తనలోన కలిపేసుకుంటది. గా మట్టినే అల్కుతం, ముగ్గులు పెడం, పూజలు చేస్తం, చివరికి మట్టిల మట్టి లెక్క కల్సిపోతం….. కొంత మంది యేమున్నది ఊర్లల్ల అంతా మట్టే గదా అన్కుకుంటారు. కొంత మంది గా ఊర్లున్న మట్టినే పానమనుకుంటారు అని

గ్రామీణ రైతుల మనస్తత్యాన్ని వెల్లడించడంతోపాటూ, మానవ జీవన తాత్వికతును సైతం ధ్వన్యాత్మంగా వ్యక్తీకరిస్తారు రచయిత్రి.

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా అవతరించిన తర్వాత గ్రామాలు పునరుజ్జీవనం పొందుతున్న సందర్భంలో గతంలో ఉపాధి లేక వలస పోయిన రైతులు తిరిగి పల్లెబాట పట్టడాన్ని సహజంగా చిత్రించిన కథ- పల్లెటలిసింది” రచయిత తమ్మిడి మాసయ్య పరిస్థితుల దృష్ట్యా కథను ఎన్నుకొని కథనంలో గ్రామాల సహజత్వాన్ని వర్ణించారు. “ఊరొచ్చేశెయ్యి, మల్లా తాతల కాలం నాటి రోజులొచ్చినయి, మన చెరువుకు నీళ్ళోచ్చినయి, అంతటా నాట్లు

మొదలైనయి. నడిమున్న నీ పొలమొక్కటే పడావుంది” అని చెప్పిన మిత్రుడు గొల్ల పర్వతాలు మాటల ప్రకారం చంద్రయ్య ప్రైవేటు కాలేజీ వద్ద సెక్యూరిటీ ఉద్యోగం వదిలి పెట్టి పల్లెకు చేరాడు. ఈ కథలో రచయిత మిషన్ కాకతీయ పథకంలో చెరువులు అభివృద్ధి చేయబడటాన్ని సూచించారు. కులమతాల పట్టింపులు లేక గ్రామంలోని వివిధ వృత్తి కులస్తులందరూ కలిసి మెలసి, కష్టం-సుఖం పంచుకోవడం, అన్ని మతాల ఆచారాన్ని గౌరవించడం, స్వచ్చమైన మనుషుల ప్రేమాభిమానాలు, ఆదరాభిమానాల మధ్య జీవించడంలో ఉన్న ఆనందాన్ని, ఆ ఆనందం గ్రామాల్లో లభించడాన్ని తెలియజేసాడు రచయిత. హిందూ-ముస్లింల సమైక్యత…

భారతీయ గ్రామీణ జీవితం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుంది విభిన్న కులాల, మతాలు, భాషలు, ఆచార సంప్రదాయాలు, వృత్తులున్నప్పటికీ గ్రామీణులందరు కలిసి మెలసి సహజీవనం చేయడం గమనించవచ్చు. కులాల, మతాల భేదాభిప్రాయాలు లేకుండా ఒకరి కష్టానికి మరొకరు ఆసరాగా నిలిస్తుండడం చూస్తూనే వుంటాము. గ్రామాల్లో హిందూ-ముస్లింల సమైక్యతను తెలిపే కథలకు వేదికగా నిలిచింది ‘బతుకమ్మ’ పత్రిక. ఫరిష్ణా, ఆవు, మెహందీ, జూకాలు, రంగుల గూడూ మొ|| కథలు హిందు ముస్లిం కుటుంబాల మధ్య సంబంధాల్ని వారి మధ్య నెలకొన్న స్నేహాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

‘ఆవు’ కథలో రచయిత వల్లపాటి సురేంద్ర-వడ్డీ వ్యాపారీ అంజిరెడ్డి నెలవారీ వడ్డీ డబ్బులు కట్టలేదని వెంకన్న ఆవు ‘గంగ’ను తీసుకెళ్ళి సంతలో బేరానికి పెట్టినప్పుడు వెంకన్న ఇంటి పక్కనే నివసించే కరీంబాయ్ విషయం తెలుసుకొని అంజిరెడ్డి నుంచి ఆవును కొనుక్కొని తిరిగి వెంకన్నకు అందించడం హిందూ, ముస్లింల ఐక్యతను తెలుపుతుంది.

పేదల జీవితాలు బాగుపడడం కోసం సులేమాన్ సాబ్ తన చిరకాల కోరిక ‘హజ్ యాత్రను’ రద్దు చేసుకొని ఆ డబ్బును ఆపన్నులకు అందించడాన్ని స్కైబాబ ‘ఫర్తిషా, కథలో చూడవచ్చు అయితే ఆ పేదలు హిందువులు కావడమిక్కడ గమనార్హం. హిందూ అయినా ముస్లిం అయినా లేమితనం ఒక్కటే. సాయం చేయడానికి మతం అడ్డురాదని రచయిత నిరూపించాడు.

“మొహంది” కథలో రచయిత బి. కళాగోపాల్ గ్రామీణ ముస్లిం వీధులను ఎంతో సహజంగా వర్ణించారు. “ఆ వీధిలో నుండి నడవటం నాకెప్పుడూ ఆసక్తే! ఎందుకంటే…. ఆ వీధిలో గుమ్మానికి వేలాడే రంగురంగుల పరదాలు, నెమలీకలు, విసనకర్రతో దట్టంగా ఊదు పొగను ఊదుకుంటూ వెళ్లే ఫకీర్ సాయెబులు, అరుగులపై పాదాన్ పక్కన పెట్టుకొని, ముచ్చట్లు పెట్టుకునే దాదీమాలు, మాసిన కమీజు, చిరుగులలుంగీతో కనిపించే సైకిల్

మెకానిక్ ‘రహీం’ తాత” అంటూ వాస్తవికతను చిత్రించారు రచయిత. కుల వృత్తుల క్షీణత…

ఒకప్పటి గ్రామం సమస్త కులాల సమాహరం. చేనేత, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి మొ|| కులాలవారు కులవృత్తులు చేసుకుంటూ జీవికకు ఏలోటు లేకుండా సంతృప్తిగా, ఆనందంగా, మనశ్శాంతితో జీవితం సాగించడం తెలిసిందే. అయితే ఆర్థిక సరళీకరణ పేరుతో విశ్వవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రపంచీకరణ నినాదం గ్రామీణ కులవృత్తులను కోలుకోకుండా దెబ్బతీసిందనేది చారిత్రక సత్యం. యాంత్రీకరణ కులవృత్తి దారుల కడుపు కొట్టింది. క్రమంగా కులవృత్తులు అంతరిస్తుండడాన్ని నేటి సమాజంలో గమనించవచ్చు. ఈ స్థితిని ‘బతుకమ్మ’ కథలు ఎత్తి చూపాయి.

తమ పాలిట దైవమైన మగ్గాన్ని నమ్ముకొని జీవితం వెళ్ళదీస్తున్న నేతన్నల జీవితాల్లోని చీకట్లను తెలిపే కథ-“పొడుస్తున్న పొద్దు” నాయని సుజనాదేవి రాసిన ఈ కథ చేనేత కార్మికుల బతుకుల్ని కళ్ళ ముందు నిలుపుతుంది. చేనేత బట్టలకు గిరాకీ లేక, యంత్రాల పై తయారయ్యే వస్త్రాలతో పోటీపడలేక చితికిన నేతన్నల జీవితాలను చూపెడుతుంది. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసే పనితనం ఉన్న

నేతన్నలు, విదేశాల్లో సైతం కీర్తించబడటానికి పనికొచ్చారని, దేశ ప్రతిష్ఠను పెంచడానికి పనికి వచ్చిన వారి కళానైపుణ్యం నేతన్నల కనీసావసరాలు తీర్చుకోవడానికి అక్కరకు రాలేదన్న చేదునిజాన్ని రచయిత్రి బట్టబయలు చేశారు.

వడ్రంగి, కమ్మరి కార్మికుల వర్తమాన పరిస్థితులను, కులవృత్తులకాదరణ తగ్గడంతో వారి జీవితాల్లోని విషాద కోణాన్ని వెల్లడించే కథలు – అమ్మోరు, గ్రానైటు భూతం.

రావుల పుల్లాచారి ‘అమ్మోరు’ కథలో కులవృత్తులు క్షీణించడంతో మరో ఉపాధి మార్గం లేక కూలీపనులు చేయలేక నిస్సహాయ స్థితిలో మిగిలిపోయిన కాశయ్య పాత్రను నేటి వెనుకబడిన వర్గాల ప్రతిరూపంగా చిత్రించాడు.

వడ్రంగి పని, శిల్పాలు చెక్కేపనికి ఆదరణ ఉన్న సమయంలో బాగా బతికిన కాశయ్య కుటుంబం, యాంత్రీకరణలో భాగంగా పుట్టుకొచ్చిన కొత్త పరికరాలతో పోటీ పడలేక కులవృత్తి మూలన పడుతుంది. రాయిని శిల్పంగా మార్చి, దేవతా మూర్తిగా మలచి, గుళ్ళో ప్రతిష్ఠించి, వేల, లక్షల మందితో పూజలందుకోవడానికి కారణమైన శిల్పులకు, దక్కింది పేదరికమేనని ‘గ్రానైట్ భూతం’ కథలో ఏనుగు వీణారెడ్డి స్పష్టం చేశారు. భూస్వామ్య వ్యవస్థ అస్తిత్వ చిహ్నాలు…

స్వాతంత్రానికి పూర్వం, స్వాతం త్ర్యానంతరం కొంత కాలం వరకు తెలంగాణా గ్రామాలు నిజాం నిరంకుశ పాలనలో, దొరలు, భూస్వాములు, జమీందార్లు, పటేల్ పట్వారీల, అధికారిక అనధికారిక దోపిడీలో నిర్బంద జీవనాన్ని అనుభవించాయి. భూస్వామ్య వ్యవస్థ, వెట్టిచాకిరీ విధానం, లేవీగల్లా కొలవడం వంటి దోపిడీ విధానాల్లో ప్రజలు నిట్టనిలువునా మోసానికి గురయ్యారు. అయితే నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో సైతం, చాపకింద నీరులా, ఏదో ఒక రూపంలో కొనసాగుతున్న ఈ పీడనను ఎత్తి చూపుతూ రాయబడిన కథలు బి.నర్సన్ ‘జలగలు’, వై.వసంత – ‘ఆవేదిరా’, చందు తులసి – “పాలపిట్టలపాట” ఉప్పు నూతల నరసింహారెడ్డి – “తుఫాను” మొదలైనవి.

పీడనకు, దోపిడీకి గురువుతున్న ఉత్పత్తి కులాల వెతలను, నిస్సహా యతను, న్యాయం కోసం పోరాడే శక్తి లేక మౌనం వహిస్తున్న దైవ్యస్థితిని ఈ కథలు వెల్లడిస్తున్నాయి.

దోపిడి వర్గానికి వ్యతిరేకంగా ప్రజలంతా సంఘటితం కావాలని అప్పుడే తమ హక్కులను సాధించుకోవచ్చుని ‘ఆవేది రా’! కథ ద్వారా రచయిత్రి వై. వసంత సూచించారు “ఊర్లగాలితప్ప అన్ని దొర చేతిలకించే నడుస్తది” అన్న మాటలో దొరల నియంత్రత్వం వెల్లడవుతుంది. దొరదగ్గర వడ్డీకి అప్పు తెచ్చుకొని కొనుక్కున్న ఆవును, బాకీ తీరిపోయినా, తీర్చలేదని చెప్పి దొర మనుషులు ఆవును స్వాధీనం చేసుకుంటే కడుపు ఎండి మండిన తాత దొరను ప్రశ్నించడానికి సన్నద్ధం కావడం ప్రజా చైతన్యానికి సంకేతం. “తుఫాను” కథలో రచయిత ఉప్పునూతల నరసింహారెడ్డి, ఏకమైన ప్రజల్ని అణచివేసి ప్రజాగ్రహానికి గురికావడం కంటే వారి అవసరాలు నెరవేర్చడం ద్వారా, వారికి ఆశ్రయ మివ్వడం ద్వారా, ప్రజా మద్దతును కూడగట్టుకోవచ్చని దొరలు ఆలోచిస్తున్నారని రచయిత మారుతున్న దొరల మనస్తత్వాన్ని నిరూపించాడు. సంచార కళాకారుల జీవనం…

సంచార జీవితం గడుపుతూ, తరతరాలుగా వారసత్వ ఆస్తిగా అందివచ్చిన కళను నమ్ముకొని జీవనం సాగించే కళాకారులెందరెందరో తెలంగాణా పల్లెలో ఉన్నారు. ఒకప్పుడు సంచార కళాకారుల జీవితాలు ఏ లోటూ లేకుండా గడిచిపోయాయి. కానీ రాన్రాను సమాజంలో వస్తున్న మర్పులు సహజ కళలకు, కళాకారులకు స్థానం లేకుండా చేస్తున్నాయి. ప్రపంచీకరణ ముసుగులో, యాంత్రీకృత, పాశ్చాత్య సంస్మృతి విషబీజమై మన సంస్మృతి సంప్రదాయాలను మింగేస్సు, ప్రజా కళాకారుల జీవితాలకు ఆధారం లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన కథ – వజ్జీరు ప్రదీప్ రాసిన “రంగుల గూడు”. తెలంగాణ గ్రామాల్లో చిందు, గుర్రపు, గంగిరెద్దు, కాకిపడుగ, బుడిగ జంగాలు, మిధుల,గోయిందు. కూనపలి వంటి తెగల్లో సంచార జాతుల వాళ్ళు కళను నమ్ముకొని జీవనం సాగించేవారు. అక్షర జ్ఞానం లేని జానపదులు రామయణ,భారత, భాగవతాలలోని సన్నివేశాలను, ఇతర పౌరాణిక గాథలను అద్భుతంగా ప్రదర్శించి జీవనోపాధి పొందేవారు. అయితే నేటి అధునాతన మీడియా విప్లవం ముందు గ్రామీణ కళలు వెలవెలబోతున్నాయన్న నగ్నసత్యాన్ని తెలియజేసారు రచయిత. ఈ కథ ద్వారా గ్రామీణ కళాకారులను ఆదుకోవాలని, ప్రాచీన కళల్ని నిలబెట్టుకోవాలని, ఆందుకు ప్రభుత్వాలు సైతం వారికండగా నిలవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ స్త్రీల చైతన్యం …

పురుషులతో పోల్చినపుడు స్త్రీలు శారీరంగా కాస్త బలహీనులు. కానీ వారి మనో నిబ్బరం, గుండెధైర్యం, పోరాట తత్వంలో పురుషుల కంటే ధృఢ చిత్తులు. ముఖ్యంగా గ్రామాలలో కాయకష్టం చేసుకొని బతికే స్త్రీలు, వ్యవసాయం చేసే

స్త్రీలు, కూలీపనులు చేసుకునే స్త్రీలు, బతుకులో నిత్యం అడుగడుగునా అనేక సవాళ్ళతో పోరాటం చేస్తూ జీవిక కోసం శ్రమిస్తుంటారు. ఇటువంటి శ్రామిక స్త్రీల చైతన్యాన్ని “బతుకమ్మ” కథలలో గమనించవచ్చు. బతుకు పోరాటంలో అలిసిన భర్త దిగులు చెందినపుడు భార్య ధైర్యం చెప్పడాన్ని బి. కళాగోపాల్ — “బోనం”, రావుల పుల్లాచారి ‘అమ్మోరు’, హుమాయున్ సంఘీర్ – పచ్చ శీర’, బి. నర్సన్ – ‘జలగలు’, చిల్ల మల్లేశం – – ‘మట్టిమునిషి’, రావుల కిరణ్మయి – ‘శ్రీ తెలంగాణ’ కథలలో గమనించవచ్చు సమ్మెట ఉమాదేవి – పని మంతులు’, ‘ద్యాలి’, బి. కళాగోపాల్ – ‘లచ్చుమమ్మ’, కూతురు రాంరెడ్డి – ‘కాలుతున్న కట్టెలు’, ఉప్పరి చెన్నయ్య – ‘వానొచ్చింది’, నామని సుజనాదేవి – ‘పొడుస్తున్న పొద్దు’ శారద “కర్రావు’, పర్క పెల్లి యాదగిరి – ‘రాజమణి’ మొదలైన కథలలో చిత్రించబడిన స్త్రీ పాత్రలను మహిళా చైతన్యానికి ప్రతీకగా గుర్తించవచ్చు.

సమ్మెట ఉమాదేవి ‘ద్వాలి’ కథలో ద్వాలి పాత్ర రాజకీయాలలో | మహిళాస్థానం గురించి ఆలోచింప జేస్తుంది. ఒక నాయకురాలిగా ప్రజలకు న్యాయం చేయడమే తన కర్తవవ్యమని, ఇందుకోసం భర్తను సైతం ఎదిరించిన వైనం ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. భర్త మరొక స్త్రీతో కలిసి జీవిస్తూ ద్వాలిని నిర్లక్ష్యం చేసినా, ఏమాత్రం నిరుత్సాహపడకుండా బతుకు పోరాటానికి సిద్ధపడుతుంది. ‘బోనం’ కథలో దేవవ్వ. రాజమణి కథలో ‘రాజమణి’ ‘పొడుస్తున్న పొద్దు’ కథలో లక్ష్మి మొదలయిన స్త్రీ పాత్రలన్ని స్త్రీ స్పూర్తికి, చైతన్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. గిరిజన జీవన చిత్రణ…

డా|| సూర్యాధనంజయ్ – ‘మొళి’, సమ్మెట, ఉమాదేవి – ‘ద్వాలి’ కథలు గిరిజనుల జీవితాలకు ప్రతిబింబంగా రాయబడినవి. గిరిజనుల జీవితంలోని కన్నీటి చారికలను, మూఢ నమ్మకాలను, తండా ప్రజల అమాయకత్వాన్ని ఈకథలు ఎత్తిచూపాయి. ‘యెళి’ కథలో ఆడపిల్లల పట్ల వ్యతిరేక భావాన్ని, వారిని వదిలించుకోవడానికి అమ్మకానికి సైతం వెనుకాడని నిస్సహాయ స్థితిని, హృద్యంగా ఆవిష్కరించి, గిరిజనులలో ఆడపిల్లల పట్ల ఉన్న దృక్పథం మారాలని, ఆడ శిశు వులను ఆమ్మే సంస్కృతి నశించాలని ఆడపిల్లల అక్షరాస్యతను ప్రోత్సహించడం ద్వారా గిరిజనుల్లో చైతన్యం కలిగించాలని, అప్పుడే గిరిజన జాతుల్లో గూడు కట్టుకొని ఉన్న మూఢనమ్మకాలను పారద్రోలవచ్చని ఉద్బోధించారు రచయిత్రి. సమ్మెట ఉమాదేవి ‘ద్వాలి’ కథలో ద్వాలి పాత్రను గిరిజన మహిళలకు, రాజకీయ రంగంలో ఉన్న స్త్రీలకు ఆదర్శంగా నిలిపారు.

గ్రామీణ సంస్కృతి…

ఎన్నుకున్న కథాంశం ఏదైనా ప్రతికథలోను గ్రామీణ సంస్కృతి అంతర్భాగంగా చిత్రింపబడింది. దండలో దారంలాగా ప్రతి కథకు గ్రామీణ నేపధ్య సంస్కృతి ఆధారభూతమైంది. సాంస్కృతిక జీవనంలో భాగమైన, పండుగలు,

జాతరుల, పెళ్ళి, పేరంటాలు, ఆట పాటలు, కుల, మత సంబంధమైన వస్తు సంస్కృతి, ఆహారపుటలవాట్లు ఇతర ఆచార వ్యవహారాలన్నీ సందర్భనుసారంగా వ్యక్తమయ్యాయి.

తెలంగాణా సంస్కృతీ సంప్రదా యాలకు అద్దం పట్టే పండుగలు బతుకుమ్మ, బోనాలు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబట్టే పూలపండుగ బతుకమ్మ. కథనంలో భాగంగా బతుకమ్మ పండగను స్మృశించిన కథలు, పెద్దింటి అశోక్ కుమార్ “గుండెలో వాన”, చందుతులసి – “పాలపట్టిలపాట” కొట్టం రామకృష్ణా రెడ్డి – ‘ఇగురం’ మొ||నవి. “పాలపిట్టల పాట’ కథలో బతుకమ్మను పేర్చడానికి కావలసిన పూల వివరాలతో పాటూ, బతుకమ్మను పేర్చడం, ఆడడం నిమజ్జనం చేయడం వరకు గల ప్రతి దశను కళ్ళకు కట్టించారు రచయిత. బతుకమ్మ పండుగలో బతుకమ్మ పాటలకు విశిష్టమైన స్థానం ఉంది. యజమానుల కోసం అడవంతా గాలించి పూలు సేకరించి తెచ్చే అట్టడుగు వర్గాల ఆడబిడ్డలకు మాత్రం బతుకమ్మ ఆడే అవకాశం లేకపోవడడాన్ని ఈ కథలో వ్యక్తం చేసారు.

బి. కళాగోపాల్ ‘బోనం’ కథలో “పొద్దునే లేచి ఇల్లు, వాకిలి అలుక్కొని ముగ్గులు పెట్టి తీర్చిదిద్దింది. గుమ్మానికి వేపాకు మండల్ని కట్టింది. కట్టెల పొయ్యి ముట్టించి, విత్తనాలకై కాగులో దాచి వుంచిన గింజల్ని బాగు చేసి ఉడకేసి బెల్లన్నం వండింది. కుండలో సాక సిద్ధం చేసుకొని కంచుడులో పెద్ద వత్తివేసి దీపం ముట్టించి, ఆ కొత్త కుండకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి వేపాకులు కట్టి బోనమెత్తింది దేవవ్వ .కట్టమీద పోశవ్వ దగ్గర ఊర్ల అందరి ఇండ్ల నుంచి వచ్చిన బోనాల్ని కలిపి, బలిచ్చిన జంతువు రక్తంతో తడిపి, బలి అన్నాన్ని ఎండుతున్న పైర్ల మీద, చేన్ల మీద, బీడు పొలాలో చల్లాడు పూజారి” అంటూ గ్రామీణులు భక్తి శ్రద్ధలతో గ్రామదేవతలకు బోనం సమర్పించుకోవడం, తద్వారా

గ్రామదేవతలు శాంతించి గ్రామాన్ని కాపాడతారన్న విశ్వాసం వ్యక్తం చేయబడింది. భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శుచీ శుభ్రతలను పాటిస్తూ గ్రామదేవతలకెత్తే ‘బోనం’ లాగానే వారి జీవనానికి ఆధారమైన దేశవాళీ విత్తనాలను సైతం భద్రపరచుకుంటే వ్యవసాయక జీవితం పండుగవుతుందని రచయిత సందేశం.

తెలుగు భాష ప్రాచీనతను, ప్రాశస్త్యాన్ని వెల్లడించే కథలు వజీరు ప్రదీప ‘దేవక్క పెళ్లి కూతురు’

జయశ్రీ మాస్టారు తబాదలా”. పశుపక్ష్యాదుల పట్ల మమకారం…

గ్రామీణులు పశుపక్ష్యాదుల పట్ల పెంచుకునే మమకారానికి నిదర్శనంగా నిలిచే కథలు – “కర్రావు”, “ఆవు” ‘తాత దోస్త్ ‘కర్రావు’ కథలో రచయిత్రి శారద ప్రధాన పాత్ర రాజవ్వకు కర్రావు పట్ల ఉన్న

ప్రేమను, వాత్సల్యాన్ని కంటినిండుగా చూపించి, గుండె నిండుగా అనుభూతి చెందేలా చిత్రించారు. కర్రావు నాలుగు రోజులు కనబడకపోతే రాజవ్వ అస్థిమితమైన మానసక స్థితి, అది దొరికినపుడు పట్టపగ్గాలు లేని ఆమె

ఆనందం, ఇరుగుపొరుగు, చూసిపోతే దానికి దిష్టి తగులుతుందని భావించిన తీరు, కర్రావు ఈనిన దూడను మరణించిన తన కూతురుగా ఎంచడం

మొదలైనవన్నీ గ్రామీణల స్వచ్చమైన కల్మషం ఎరుగని మనస్తత్వానికి దర్పణం పడతాయి. ‘ఆవు’ కథలో రచయిత వల్లపాటి సురేంద్ర వెంకన్నకు తన ఆవుతో ఉన్న అనుబంధాన్ని అది కనపడకపోతే ఊరంతా గాలించడం, ముస్లిం అయిన కరీం దాన్ని ఏం చేశాడోనని చింతించడం

మొ||వన్నీ మూగజీవాల పట్ల గ్రామీణుల దృక్పథాన్ని తెలియజేస్తున్నాయి. ‘ఆవు’కు గంగ అని పేరు పెట్టుకోవడంలోనే జంతువులకు మనుష్యత్వాన్ని ఆపాదించుకునే గ్రామీణుల నైజం తేటతెల్లమవుతుంది.

‘బతుకమ్మ’ కథలు తెలంగాణా గ్రామ జీవనంలోని ప్రతి అంశాన్ని స్పష్టంగా, సున్నితంగా స్మృశించాయి. గ్రామీణుల సామాజిక జీవితంలోని సుఖదుఖాల్ని, మంచి చెడ్డల్ని కష్టనష్టాల్ని, గ్రామీణల దృక్పథంతో రూపుకట్టించాయి.

జోగినీ వ్యవస్థ, మధ్యపానం, బాల్యవివాహాలు, రైతుల ఆత్మహత్యలు, ఆడశిశువు అమ్మకాలు, ఉపాధి వలసలు, అనాధల జీవన్మరణ సమస్యలు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బలవుతున్న పంటపొలాలు, నిరక్షరాస్యత, వడ్డీ వ్యాపారుల దోపిడి, వాణిజ్య పంటల సాగులో నష్టపోతున్న రైతాంగం, సఫాయి కార్మికుల వెతలు మొ॥న సామాజిక

సమస్యలతో పాటూ, తెలంగాణా రాస్ట్రోద్యమం, రాష్ట్రం ఏర్పాటు అనంతరం పునరుజ్జీవనం పొందుతున్న పల్లెలు, హరితహారం, ప్రభుత్వ పాఠశాలలో ఒకప్పటి తరానికున్న అనుబంధం మొదలగు అనేకాంశాలకు బతుకమ్మ వేదికగా నిలిచి, భవిష్యత్తరాల వారికి పల్లెలను పదిలంగా అందించాల్సిన ఆవశ్యకతను తేటతెల్లం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com