తప్పులెన్ను వారు….

సాహిత్యంలో పండితులకు దోషాలపై అసహనం ఉంటుందనే ప్రతీతి ఉంది. సాహిత్య ధిషణ ఉన్న కొందరు ఇతరుల రచనలో తప్పులు వెతుకు తారు. తద్వారా తమ ఆధిక్యతను చాటుకొని తృప్తి పడతారు. నన్నయ

మొదలు శ్రీశ్రీ వరకు వెతికితే భాషా నిర్మాణంలో దోషాలు కనిపించిన విషయం తెలిసిందే, అంత మాత్రాన వాళ్ళ స్థానాన్ని ఎవరైనా శంకించగలరా? వాళ్ళ సృజన లోతుల్ని ఎవరైనా కొట్టివేయగలరా?

అయితే మహాపాండిత్యం కలిగినవాళ్ళు అట్లా రంధ్రాన్వేషణ చేస్తే, ‘సరేలే లోపాలు దిద్దుతారు’ అని సరిపెట్టుకోవచ్చు. కాని మిడి మిడి జ్ఞానులు కూడా ఎదుగుతున్న సృజన మీద తన విమర్శనాస్త్రాలు సంధిస్తే ఎంతో హాస్యాస్పదంగా, పేలవంగా ఉంటుంది. Never judge of art by its defects అనేది ఆర్య వాక్యం. ఒక కళను దాని లోపాలతో తూచడం పెద్దరికం అనిపించుకోదు. “మరకలను కాదు, మెరుపులను చూడాల’నే సినారె మాట అందరికీ శిరోధార్యం.

ఎదుగుతున్న సాహితీవేత్తలు కూడా ఇలాంటి కువిమర్శలకు బెదరి పోకూడదు. వాటిని తాటాకు చప్పుళ్ళు గానే భావించాలి. తమ సాధనను కొనసాగించాలి. ఎవరైనా సహృదయం తో ఇచ్చే సూచనలను సౌమనస్యంతో స్వీకరించాలి. అది కువిమర్శే అయితే నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి.

ఎదుగుతున్న సాహితీవేత్తలు కూడా ఇలాంటి కువిమర్శలకు బెదరి పోకూడదు. వాటిని తాటాకు చప్పుళ్ళు గానే భావించాలి. తమ సాధనను కొనసాగించాలి. ఎవరైనా సహృదయం తో ఇచ్చే సూచనలను సౌమనస్యంతో స్వీకరించాలి. అది కువిమర్శే అయితే నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి.

కొంత మంది తొలిరాతల్ని చూస్తే మిగుల నిరాశ కలుగుతుంది. వీళ్ళు సాహిత్య రంగంలో నిలబడలేరు అనుకుంటాం. కాని సాధన తరువాత ఎదిగిన క్రమంలో వాళ్ళ రచనలలో గొప్ప కళా ఖండాలు కనబడతాయి. తమ పైన వచ్చే ఎంత వ్యతిరేకతను అవహేళనలను ఎదుర్కొంటేనే వాళ్ళే స్థానం సాధించారో ఊహిస్తే కళ్ళు చమరిస్తాయి.

సృజనకు వయసుతో పనిలేదు. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నుండే కవులుగా ప్రవర్దిల్ల వలసిన అవసరం లేదు. వాల్మీకి. కాళిదాసు, షేక్స్పియర్, రవీంద్రనాథ్ ఠాగూర్, వంటి మహాకవులు తమ బాల్యం నుండే కవితాభ్యాసం చేసిన వాళ్ళు కాదు. అయినా వాళ్ళు ఇప్పుడే స్థానంలో ఉన్నారో వేరే చెప్పవలసిన పనిలేదు. కాబట్టి సృజనకు వయసుతో నిమిత్తం లేదు. “నేను ఎప్పటినుండో రాస్తుండవలసింది” అని, ఈ వయసులో ఏం మొదలుపెడతాం ? అని నిరాశ పడవలసిన అవసరం లేదు.

సోక్రటీస్ మరణం ముందు కూడా కొత్త సంగీత పరికరం దొరికితే సాధన చేశాడట. మరణ శిక్ష అమలు కాబోయే ముందు “ఎంత సమయం దొరికితే అంత సాధన చేస్తాను” అన్నాడట. కాబట్టి సృజనోత్సాహం ఉన్న వాళ్ళు అప్రయోజకులైన విమర్శకులను పట్టించుకోవలసిన ఆగత్యం లేదు. నిర్మాణాత్మకమైన సూచనలను ఇచ్చే వారిని గౌరవించకుండా ఉండవలసిన అవసరమూ లేదు. ఒక్క సృజన రంగంలోనే కాదు, కోడిగుడ్డుపై ఈకలు పీకే పెద్దవాళ్ళు మనకు చాలా చోట్ల తారసపడతారు. వాళ్లకు ఓ నమస్కారం చేసి మన పని మనం చేసుకుపోవలసిందే. సృజనాత్మకతకు మరింత మేలిమి ప్రోది చేసుకోవలసిందే.

జై తెలంగాణ, జై జాగృతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com