నల్సులై మొల్సిన సందీ….

కాల పయ్య గొర్రగొర్ర గుంజుడు

కన్నపేగుల నిలువెల్లా యెలుగు కండ్లు

నిగురాను నీడోలె అలుంకుంటయి

ఉశారుగ ఊదరవెడ్తూ

ఉన్క పల్కులు ఉసిగొల్పే పొగ

ఆదర బాదరగ హడలగొడ్తూ

రాయితీ కలల రంగుల వొల

గాడిద బరువు మోపుకుంట

అగడుగ చెమట చుక్కల దోప్కం

గానుగెద్దుల్లా మెదుపుకుంట

గుమ్ములు నింపుకొనే నంబకరం

మోట గీరె మాటల కాన్గిరీ

మోదుగుపువ్వు వాసనల విద్దెలు

తంతే మల్లెపువ్వుల్ల గాదు

ముండ్లకంపల్ల ముక్కు ముడ్సుకపడే తంతులు

ఎపమెత్తిపోయిన ఇత్తునమోలె

ఎల్లీఎల్లక బొత్తిగ ఎల్లెల్కలవడే రంతులు

కూశి పసీతిల కూడుగ్గవడ్తే

ఇజ్జద్దీసిన రొచ్చుల రొక్కం

బెదురు కొయ్యకు యాల్లాడదీసే

అప్పు కొప్పుల ఉక్కు కొక్కెం

ఏటికి యెదురు దోసుకుంట

ఏగిలేత్తే కాటితో కలెవడుకుంట

ఏండ్ల పడంత్రంగ ఎల్లదీసిన లేకి

ఎదిగే కత్తుల్ల పురాగ వొల్లాలనీ

తలాపు నీడల తలగొడుతూ

కాళ్ల కట్ట సున్నా జాడలకు సూటివెడుతూ

పిల్లకాకులకు బులేరు దెబ్బల్తగలొద్దనీ

కన్నపేగులు నికాషర్తుగ తల్లడం మల్లడం

ఉదాత్త జీవన ఉత్తుంగ సొత్తులు

అత్తారు పొత్తుల ఉచిత పొత్తాలు

కలిమిలేముల పెయ్యిలను కప్పుకొనే

నాజూకు సమ బట్టల సింగారం

కండ్ల పండుగోలె

బుల్ బుల్ పిట్టల రెపరెపలు

రామసక్కదనపు సర్కారు సోపాల

సన్నాయి సరాగాల సింగిడి

అమ్మ నుడిలా కమ్మని బువ్వ

తోటమాలుల తోడూనీడా

పుట్టు రతనాల జాగ

మంచి నీటి ఊట చెలిమె

మన పల్లెతల్లి వొల్లెడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com