రాత్రి పగలు ఎప్పుడూ రద్దీగా ఉండే నేతన్న చౌరస్తా పట్టపగలయినా జనం అంతగా లేరు. ఉన్నవాళ్లు మాస్కులతో ఎవరు ఎవరో తెలీకుండా ఉన్నారు. అందరి కళ్ళల్లో ఎదో భయం పులి నుంచి తప్పుకుని తిరుగుతున్నట్టు అది ఎక్కడి నుంచి దాడి చేస్తుందో అన్నట్టు ఉరుకులు పరుగుల మీదున్నారు.

నాలుగురోజులు తలుపులేసుకుని భయంభయంగా మనిషి మొఖమే కాదు ఎండను కూడా చూడని నారాయణ చిన్నగా నవ్వుతూ బయటకు వచ్చాడు. ఆశా వర్కర్ ఫోన్ అతనిలో కొత్త ఆశను నింపింది. ఆ విషయాన్ని పొద్దున్నే కొడుకులతో చెప్పాడు. భార్య సరళతో కూడా చెప్పాడు. ఆ విషయమే నలుగురితో పంచుకుందామని బండిని పోలీస్ చెక్ పోస్ట్ వెనుక ఆపి  బస్టాండ్లోకి వచ్చాడు. పుట్టెడు దుఃఖాన్ని అంతే బరువుతో పుట్టెడు సంతోషాన్ని ఉగ్గబట్టుకుని చుట్టూ చూసాడు. ఎప్పుడూ కిక్కిరిసిన జనంతో వచ్చి పోయే బస్సులతో కలకలలాడే బస్టాండు వెలవెలబోతుంది. దుకాండ్లు తెరిచే ఉన్నాయి. కానీజనంలేరు. కాలు పెట్ట సందులేని తిరుపతి హోటల్ ఖాళీగా ఉంది. లోపలికి ఎవరూ రాకుండా టేబుళ్లను అడ్డం పెట్టుకుని చాయ్ మరగబెడుతూ ఎదురు చూస్తున్నాడు.

మాట్లాడే మనిషి కోసం వెతుకుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాడు నారాయణ. ఒక్కపేపర్ కొని నాలుగు పేపర్లు చదవడానికి చుట్టూ జనంతో నిండే అనిల్ బుక్ స్టాల్ జనం కోసం ఎదురుచూస్తుంది. జనాలను అదిలించే హోంగార్డ్ లేడు. మైకులో బస్సుల రాకపోకలు చెప్పే కంట్రోలర్ లేడు. వచ్చి పోయే బస్సులు లేవు. బస్సుల చుట్టూ తిరిగి అమ్ముకునే పల్లీలు లేవు. ఆగమాగాన బస్సుబస్సుకు తిరిగే అల్లం మొరలు లేవు. శవాన్ని కాలేసిన తర్వాత చెప్పాచెయ్యకుండా ఎవరిదారిన వారు వెళ్లిపోయే బంధువుల్లా జనం దూరందూరంగా ఆగమాగమున్నారు.

బస్టాండు లోపలికి వచ్చి అటూఇటూ చూసాడు నారాయణ. ఎవరైనా మిత్రులు కనిపిస్తే మనసులోని బాధను సంతోషాన్ని పంచుకుందామనుకున్నాడు. ఎవరూ కనిపించలేదు. కనీసం తనతో సెస్ ఆఫీసులో పనిచేసే కొలీగ్స్ కనిపించినా బాగుండునని చూసాడు. వాళ్లు కూడా కనిపించలేదు. పెద్దబజారు నుంచి వచ్చిన ప్యాసింజర్ ఆటో ఒకటి దుర్గా మెడికల్ ముందు ఆగింది. డ్రైవర్ అవునూరు గూడెం ముస్తాబాద్ అని అరుస్తున్నాడు. ఆరు నెలల కిందైతే అలా అరిచే అవసరమే లేకుండా దవాఖానకు వచ్చిన వాళ్లు, మందు బస్తాలతో రైతులు ఆగి ఆగంగనే నిండిపోయేవారు.ఇప్పుడు ఒక్కరు కూడా ఎక్కడంలేదు. ఆటోకు ఆరడుగుల దూరంలో నిలబడి చూస్తున్నారు.

మాట్లాడే మనిషి కోసం వెతుకుతూ పోచమ్మ గుడి ముందు నుంచి రోడ్డు మీదికి వచ్చాడు నారాయణ. అప్పుడే నాన్ స్టాప్ బస్సు  వచ్చి ఆగింది. ఎప్పుడూ కిక్కిరిసినట్టుగా ఉండే బస్సులో ఒకరిద్దరే ఉన్నారు. వాళ్లు కూడా ఆరడుగుల దూరంలో ఉన్నారు. దిగిన ఒకరిద్దరు ఎవరో తరుముతున్నట్టు వెళ్ళిపోయారు.

అటూ ఇటూ చూస్తున్న నారాయణకు మెడికల్ షాపు ముందు పరిచయమున్న ఓవ్యక్తి కనిపించాడు. ఎర్రటి ఎండలో చల్లటి చెట్టు నీడ కనిపించినట్టయింది. వెంటనే అటువైపు నడిచాడు. సజాతి అయస్కాంత ద్రువాల్లా జనం దూరందూరం జరుగుతున్నారు. మనిషిని మనిషి భయంగా చూస్తున్నాడు. కలవగానే విడవకుండా ముచ్చట పెట్టే ఆ వ్యక్తి ఆరడుగుల దూరం నుంచే పొడిపొడిగా మాట్లాడుతూ వెళ్ళిపోయాడు.

మనుసు బరువుగా ఉంది. మనుసులోని బాధను పంచుకునే మనిషి లేక మరింత బరువుగా అనిపిస్తుంది. నడుస్తూ నేతన్న బొమ్మ ముందుకు వచ్చాడు.వెనుకనే ఒక లారీ వచ్చింది. లారీ వేగంగా పోతుంది. అప్పుడే వెంకంపేట రోడ్డు నుంచి ఓబైక్ వచ్చింది. నేత బొమ్మ ముందు నుంచి పెద్దబజారు వైపు తిరిగింది. లారీ ఆగకుండా కొత్త బస్టాండు వైపు దూసుకుపోయింది. లారీని తప్పించుకునేందుకు బైక్ సడన్ బ్రేక్ వేసాడు. అదుపు తప్పి అది డివైడర్ కు గుద్దుకుంది. ఇద్దరు కింద పడ్డారు. వాళ్ల మీద బండి పడింది. లారీ వెళ్ళిపోయింది.

కింద పడ్డ ఇద్దరు గిలగిల కొట్టుకుంటున్నారు. వెళ్తున్న జనం ఆగిపోయారు. షాపుల్లో కూర్చున్న వాళ్ళు బయటకు పరిగెత్తుకొచ్చారు. అందరు ఆరడుగుల దూరం నుంచే చూస్తున్నారు కాని ఎవరూ దగ్గరికి వెళ్లడం లేదు. అందరి వైపు వింతగా ఆశ్చర్యంగా చూసాడు నారాయణ. ఇంతకు ముందైతే క్షణాల్లో జనం గుమిగూడేవారు. ఒకరు లేవనెత్తేవారు. ఒకరు నీళ్లు తాగించేవారు. రోడ్డు మీది నుంచి పక్కకు తెచ్చి సపర్యలు చేసేవారు. ఇప్పుడు జాలిగా భయంభయంగా చూస్తున్నారు. కిందపడ్డ ఇద్దరు సహాయం కోసం చూస్తూ బాధగా అరుస్తున్నారు.

నారాయణ అటువైపు పరుగెత్తాడు. అందరు నారాయణను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒకరిద్దరు వద్దంటూ అరిచారు కూడా. పట్టించుకోలేదు. ఆరడుగుల దూరాన్ని దాటి వెళ్లి బలవంతంగా బండిని పైకెత్తాడు. వాళ్ళను లేపి కూర్చోబెట్టాడు. తలకు రక్తం కారుతుంటే కర్చీఫ్ కట్టాడు. ఆప్పటికీ జనం ఎవరూ రాలేదు. ఆరడుగుల దూరం నుంచే చూస్తున్నారు.

“అరే ఏం జూస్తున్నరు…..రాండ్రిబై…ఇట్ల పట్టుండ్రి…అటు రోడ్డు పక్కన కూసోబెడుదాం….” అరిచాడు నారాయణ.

ఎవరూ రాలేదు. తనే ఆ పని చేద్దామని చూసాడు. వీలు కాలేదు. అప్పటికే గాయాలతో ఆయాసపడుతున్న ఓ వ్యక్తి కింద పడిపోయాడు. మరో వ్యక్తి నొప్పితో లేవలేక అరుస్తున్నాడు.

ఏం చేయాలో అర్ధం కాలేదు నారాయణకు. అది నడి రోడ్డు. గీత గీసి ఆపినట్టు వాహనాలు దూరంగా ఆగిపోయాయి. మనుషులకు మాస్కులున్నాయి. కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి కాబట్టి ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలియదు కాని ఒక్కరు కూడా ముందుకు రావడంలేదు. ఎవరో ఫోన్ చేసినట్టున్నారు.హారన్ కొట్టుకుంటూ అంబులెన్సు వచ్చింది.

కరోనా ప్రూఫ్ డ్రెస్ లో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వాళ్లకు సహాయ పడుదామనుకుని ముందుకు వచ్చాడు నారాయణ. “ఓ తాతా…దూరం దూరం..నాలుగు రోజులు బతుకాలని లేదా ఏంది…పో… పో..ఈ జనాలకు ఇంకా బుద్ది రాలేదు” అంటూ కసిరారు.

బాధగా చూస్తూ ‘ఇలా మాట్లాడుతున్నారేంది’ అనుకున్నాడు నారాయణ. దూరం జరిగి నిలబడ్డాడు. పది నిముషాల్లో అంబులెన్సు వెళ్ళి పోయింది.రక్తం మరకలు మాత్రం మిగిలాయి. రైల్వే ట్రాక్ గేట్లు తెరిచినట్టు ఒక్కసారిగా వాహనాలు రక్తం మరకలను తొక్కుతూ వెళ్ళిపోయాయి. మాసిపోతున్న మరకలను చూస్తూ అలాగే నిలబడ్డాడు నారాయణ. తెలిసిన ఓవ్యక్తి నారాయణ వద్దకు వచ్చాడు.

దూరంగా నిలబడి ” ఏంసార్..తెలిసిగూడ ఇట్ల జేత్తరు.వాళ్లకు కరోనా ఉందనుకో….. మీకు అంటదా..ముందటి కాలంగాదు ఎగేసుకొని ఎత్తుకుని ఉరుకనీకి. ఈ వయసులో కొద్దిగ జాగ్రత్తగుండాలె. ఎవలకైనా ఆరడుగుల దూరముండాలె. అసలే మీకు ఆరోగ్యం బాగుండదు..” అన్నాడు.

అప్పుడర్థమైంది నారాయణకు జనం ఎందుకు రాలేదో. నవ్వు వచ్చింది.  వైరాగ్యాంతో కూడిన నవ్వు. తనలో తనే మనిషిని మనిషి తాకని ఎంత పాపపు కాలమచ్చెరా అని నవ్వుకుంటూ అక్కడి నుంచి కదిలాడు. ఆరు నెలల క్రితం లాక్ డౌన్ ప్రకటించినప్పుడు తన ఇంటి పక్కన ఉండే ఓ టీచర్ ఇంటిగేటుకు“ బయటి వాళ్ళు ఎవరూ మా ఇంట్లోకి రావద్దు’ అని రాసి వేలాడేసుకున్న బోర్డు గుర్తుకు వచ్చింది. దాన్నిచూడగానే ‘నాదినాదంటావు…నా ఇల్లు అంటావు. నీ ఇల్లు యాడుందె చిలకా..ఊరికి ఉత్తరాన సామాపురంలోన కట్టేల ఇల్లుందె చిలకా..’ అని తాను పాడుకున్న పాట కూడా గుర్తొచ్చింది.

“ఆపదల్లో ఒకలను ఒకలు కలువక…సచ్చినా ఒకలనొకలు చూసుకోక ఇట్ల బతుకుడు ఒకబతుకేనా “అనుకుంటూ బండి వద్దకు వచ్చాడు. అక్కడ తన ఆఫీసులో పని చేసే వ్యక్తి కనిపించాడు. అబ్బా మనిషి దొరికిండురా కొద్దిసేపు మాట్లాడొచ్చు అనుకుని “ హలోసార్ ” అన్నాడు.

‘ఎం హలోనో ఏమో సార్…సర్వీసు దగ్గరికత్తుంటే భయమయితుంది. నాలెక్క మీకు గూడా యాడాదిన్నర సర్వీసే ఉంది కదా..మనకా పించెను లేకపాయె ..మనపిల్లలున్నరు సూడూ.. ఈ యాడాదిన్నర సావనియ్య్యరు. జీతమత్తదిగదా..తర్వాత బతుకనియ్యరు పించను రాదు గదా..’ అన్నాడు. అంటూ ఆగలేదు. ఆరడుగుల దూరం నుంచే తరుముతున్నట్టు వెళ్ళిపోయాడు.

  • లోకమంత ఓ రందయితే ఈ లోకయ్యకో రంది..జీవితాలే పోతున్నయిరా అంటే జీతాలట..’ అనుకున్నాడు. అప్పుడే ఫోన్ మోగింది.

ఇంతకు ముందైతే ఫోన్ మోగితే ఎత్తాలనిపించేది కాదు. పని పని పరుగు పరుగు. కాని ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. సెల్ ఫోన్  చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటే చెయ్యిలో చెయ్యేసి మాట్లాడినట్టుగానే ఉంటుంది. ఇంతకు ముందు ఎవరైనా మనిషి కనిపిస్తే అబ్బా నసగాడురా ఇడువడు అనిపించేది. కాని ఇప్పుడు ఇడువకుంట ముచ్చట పెట్టాలనిపిస్తుంది. అందరి ఇంటికి వెళ్లాలనిపిస్తుంది. అందరిని ఇంటికి పిలవాలనిపిస్తుంది. కోల్పోయిన జీవితమేదో ఇప్పుడిప్పుడే తెలిసివస్తుంది.

జేబులోంచి పోన్ తీసి ఎత్తాడునారాయణ.

‘నేను  ఆశా వర్కర్ సంధ్యని మాట్లాడుతున్నాను..నారాయణ గారేనా. ‘ బయట నుంచి మాట.

ఆశా వర్కర్ పేరు వినగానే భయమయింది నారాయణకు. పొద్దున్నే చేసి చెప్పింది కదా మళ్లీ ఎందుకు చేసింది అనుకున్నాడు. వారం రోజుల కింద జరిగిన సంఘటన గుర్తొచ్చింది. దగ్గరి బంధువుల పెళ్లి. కరోనా వచ్చాక చావుకు ఇరవై మంది పెళ్ళికి నలబై మంది నిబందనలు ఉండడంతో వారు కూడా అతి దగ్గరి వాళ్లనే పిలిచారు. పెండ్లిని చూడడం కాదు. మనుషులను చూడాలనిపించింది నారాయణకు. భార్య భర్తలు ఇద్దరు వెళ్లారు. వచ్చిన నాలుగవ నాటి నుంచి సరళకు గొంతు నొప్పి.

ఎందుకా అని భయపడుతుంటే అసలు విషయం తెలిసింది. పెండ్లికి వచ్చిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చి ఐసోలేషన్ వెళ్ళాడట. మరో నలుగురు సింటమ్స్ ఉండడంతో హోంక్వారంటైన్ అయ్యారట. ఈ సంగతి తెలియడంతో నారాయణకు భయం పట్టుకుంది. ఆ పర్సన్ తో తాను క్లోజ్ కాంటాక్ట్ లో  లేకున్నా సరళ ప్రాక్సిమెట్ కాంటాక్ట్ లో  ఉండడంతో వెంటనే భార్యను ఒక గదిలో ఉంచి తాను ఒక గదిలో ఉండి తెలిసిన డాక్టర్ కి ఫోన్ చేసాడు. ఈ స్టేజిలో మనలోని ఇమ్యనిటీ పెంచుకోవడం తప్ప ఏమీ చేయలేమని డైట్ మెనూ  చెప్పాడు. ఇంక్యుబేషన్ పీరియడ్  చెప్పి ఎసింటమాటిక్ నుంచి సింటమాటిక్ స్టేజ్ కి రాకుండా చూసుకోవాలని విటమిన్ డి విటమిన్ సి తో పాటు జింకోవిట్ టాబ్లెట్స్ వాడుతూ డ్రై ఫ్రూట్స్ తింటూ కొబ్బరి నీళ్లు తాగమన్నాడు. పసుపు జండూ బామ్ తో ఆవిరి ఆవిరి పట్టుకుని గంటకోసారి వేడి నీళ్లు పొద్దున మాపున అల్లం కషాయం తాగమన్నాడు. ఒకసారి గవర్న్ మెంట్ హాస్పిటల్ కు వెళ్లి రాపిడ్ టెస్ట్ చేయించుకోవాలన్నాడు.

తనకు సింటమ్స్ ఏమి రాకపోవడంతో కొంత దైర్యంగా టెస్ట్ కోసమని హాస్పిటల్ కు వెళ్ళాడు నారాయణ. కొన్ని మందులిచ్చి బయట తిరగకూడదని కొంతసేపు మందలించి మాస్క్ పెట్టుకోవాలని చేతులు కడుక్కోవాలని ఆరడుగుల దూరం ఉండాలని ఇంట్లోనే ఉండాలని జాగ్రత్తలు చెప్పి పంపారు కాని టెస్ట్ చేయలేదు.

మరునాడు సరళకు గొంతులో నొప్పి పెరిగింది. దురద పొడి దగ్గు మొదలయింది. కరోనా లక్షణాలు కనిపంచడంతో హాస్పిటల్ కు వెళ్ళి టెస్ట్ చేయమని  పట్టుబట్టాడు. బయట ఎందుకు తిరుగుతున్నారని కోప్పడ్డారు కాని టెస్టు చేయలేదు. టెస్ట్ చేసాక భయటకెందుకు వస్తామని తమకు కూడా సోషల్ రెస్పాన్స్  తెలుసని ఎంత బతిమాలినా వినలేదు. తెలిసిన ఓ జర్నలిస్ట్ మిత్రునితో చెప్పించుకుని చివరికి తనకు సరళకు రాపిడ్ టెస్ట్ చేయించాడు. రిజల్ట్ రెండు రోజులకు వస్తుందని చెప్పి బయటకు రావద్దని చెప్పారు….

ఈ రెండు రోజులు ఎవరి గదుల్లో వారే ఉన్నారు. నారాయణకు ఎలాంటి సింటమ్స్ లేవు కాని ఆమెకు మాత్రం దగ్గు గొంతుల నొప్పి తగ్గలేదు. పైగా జ్వరం మొదలయింది. సైలెంట్ హైపాక్సియా మొదలయిందా అన్న భయం మొదలయింది నారాయణకు. వెంటనే ఆక్సిమీటర్ కొని ఆక్సిజన్ లెవల్ చెక్ చేసాడు. తొంబయెనిమిది శాతం ఉంది. కొంత ఊరట కలిగినా పెరుగుతున్న టెంపరేచర్ భయాన్ని పుట్టిస్తుంది. రెండు రోజులుగా భయం భయంగా ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు. ఎవరి జాగ్రత్తలో వారు ఆరడుగుల దూరంలో మసులుకున్నారు. ఈరోజు పొద్దున్నే ఆశావర్కర్ ఫోన్ చేసి ఇద్దరికి కరోనా నెగెటివ్ అని చెప్పడంతో చచ్చి పుట్టినట్టయింది. ఆనందంతో గంతులు వేసాడు. భార్య

మీద జీవితం మీద మరింత ప్రేమ పెరిగింది. ఈ నాలుగు రోజులు తాను పడ్డ బాధను చెప్పుకుందామని భయటకు వస్తే ఒక్కలు కనిపించడంలేదు. కనిపించినా పలకరించడం లేదు.

మట్లాడే మనుషుల కోసం వెతుకుతుంటే ఇప్పుడు ఈ ఫోన్. సంద్య మళ్ళీ ఎందుకు చేసిందో అర్థం కాలేదు. భయం భయంగానే . ‘మేడం చెప్పండి……. నేను నారాయణనే ‘ అన్నాడు.

“సరళకు ఎలా ఉంది. జలుబు జ్వరం….ఇంకా ఏవైనా….”అడిగింది.

“తగ్గలేదు మేడం… దగ్గు జలుబు అలాగే ఉంది. గొంతు నొప్పి కూడా అలాగే ఉంది… ” అన్నాడు.

“మీరేం భయపడొద్దు…ఎం కాదు. కరోనా ఎంత మందికి రాలేదు ఎంత మందికి పోలేదు. కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతది…” ధైర్యం చెబుతుంటే అనుమానం వచ్చింది నారాయణకు.

“ఏమైంది మేడం. పొద్దున నెగెటివ్ రిపోర్ట్ అంటిరి కదా..ఇంకెందుకు భయం..”అన్నాడు.

“సారీ మేడందే..సేమ్ నేమ్ సేమ్ ఇన్శియల్ ..జుస్ట్ ఏజ్ చేంజ్ ..వారికి చెప్పాల్సింది మీకు చెప్పాను. మీ వైఫ్ కు పాజిటివ్ వచ్చింది…. ” అన్నది.

ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది.సెల్ పట్టుకున్న చేయి వణికింది. ” నిజమా “అన్నాడు.

” నిజమే…..సింటమ్స్ అంతగా ఏం లేవు కాబట్టి కంగారు పడాల్సిన పనిలేదు. కొద్ది జాగ్రత్త తీసుకోవాలె. ఆమెను బయటకు రానియ్యద్దు. గాలి వెలుతురు తగిలే ఒక గదిలో ఉంచాలె.14 రోజుల పాటు ఆమెను కనిపెట్టుకొని ఉండాలి. ఏది ఇచ్చినా డిస్పోజెబుల్ మాత్రమే ఇయ్యాలె . ఆమె వాడిన ఏ వస్తువూ మనం తాక రాదు. ఏది ఇచ్చినా. ఆమెకొక అసిస్టెంట్ కావాలె. ఆమెతో ఉండేవాళ్ళు ఆరోగ్యవంతులైతే మంచిది. బీపీ షుగర్ లంగ్స్ హర్ట్ కిడ్నీ వ్యాదులు ఏవీ ఉండొద్దు అన్నది. ఎవరుంటారో చెబితే ఏమేం చేయాలో వాళ్లకు చెబుతాను ” అన్నది.

భయంతో ఏం మాట్లాడాలో తెలియలేదు. ఏం మాట్లాడాలో తెలియలేదు. సరే అంటూ ఫోన్ పెట్టేసి ఇంటికి వచ్చాడు నారాయణ.

సరళ గదిలో పడుకొని ఉంది. వంట సామానులు గదిలోనే సర్దుకుంది. నాలుగు రోజుల నుంచి గదిలోనే ఉంటుంది. తన వంట తానే చేసుకుంటుంది. కూతురుకు పెళ్ళి చేసి పంపాక భార్య భర్తలిద్దరే ఉంటున్నారు. కొడుకులిద్దరు హైదరాబాద్ లో ఉంటున్నారు. కరోనా లేదని తెలియడంతో కొంత రిలీఫ్ గా ఉన్నా జ్వరంతో నీరసంగా ఉంది సరళ. అడుగుల చప్పుడుకు లేచికూర్చుంది. రాగానే విషయం సరళకు చెప్పాలనుకున్నాడు నారాయణ. ఎలా చెప్పాలో తెలియలేదు.

” కరోనా లేదు గదా..మన ఆరడుగుల దూరం అరడుగుకు తగ్గించి నేను మీకు వంట చెయ్యవచ్చునా ” అడిగింది.

” నువ్వు పడుకో సరళా..జ్వరం కదా. ఈరోజు నేనే నీకు వంట చేసి పెడుతాను.ముందు మాస్క్ పెట్టుకో..” అంటూ తనూ పెట్టుకున్నాడు.

రాగానే దగ్గరికి వస్తాడనుకుంది. అతడు ఆరడుగుల దూరంలో నిలబడదంతో ఏమనుకుందో సరళ తను కూడా మాస్క్ పెట్టుకుని బెడ్ మీద మరింత దూరం జరిగి కూర్చుంది.

” ఎలా ఉంది…జ్వరం కొంత జారిందా ”అడిగాడు నారాయణ.

“ లేదు… చలి కూడా వస్తుంది. సన్నగా తల నొప్పి…” చెప్పింది. ఏం చేయాలో అర్థం కాలేదు నారాయణకు. హాస్పిటల్లో జాయిన్ కావడమా జాయిన్ అయితే ఎక్కడ కావడం ఎప్పుడు వెళ్ళడం..ఇలాఎన్నోసమస్యలు.

పొద్దున ఆషా వర్కర్ చెప్పగానే విషయం సంతోషంగా పిల్లలకు చెప్పాడు. వాళ్లు కూడా సంతోష పడ్డారు. ముందుగా అసలు విషయం పిల్లలకు చెప్పాలనుకున్నాడు. అలాగే ఆమెకు హెల్పర్ కూడా కావాలి. ముగ్గురు పిల్లలకు తల్లంటే ప్రాణం. అడిగితే ఎవరూ కాదనరని తెలుసు.ఎవరిని పెట్టాలా అని కూడా అలోచిస్తున్నాడు.

తల్లంటే ఎక్కువ ప్రేమ ఉన్నది పెద్దకొడుక్కే అని తెలుసు. ఏ చిన్న ఇబ్బందయినా వెంట ఉండి హాస్పిటల్ కు తీసుకుపోతాడు. అడిగింది లేదనకుండా తెచ్చి ఇస్తాడు. అందుకే పెద్ద కొడుకు రవినే అసిస్టెంట్ గా ఉంచాలనుకున్నాడు. సరళ వినకూడదని బయటకు వచ్చి అతనికే ఫోన్ చేసాడు నారాయణ. విషయమంతా చెప్పి “ఒరే రవీ….రెండు వారాలు నువ్వు అమ్మతో ఉండాలిరా…నువ్వయితేనే ఓపికతో అన్ని సదిరి ఉండగలవు. నువ్వు పక్కనుంటే అమ్మ కూడా తొందరగా కోలుకుంటుంది ” అన్నాడు.

ముందు ఆశ్చర్యపోయాడు రవి. తరువాత బాధపడ్డాడు. కొద్దిగా తేరుకుని “ఎలా వీలవుతుంది నాన్నా..ఆ రోగం  నాకు అంటిందనుకో. నేను పిల్లలు ఆగమేగదా. అసలే నాకు హైబీపీ… తమ్ముడినడుగు” అన్నాడు. కొడుకు అలా మాట్లాడుతాడని ఊహించని నారాయణ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. తల్లిని అంతగా ప్రేమించిన కొడుకేనా ఇలా మాట్లాడింది అనుకున్నాడు.

వెంటనే రెండవ కొడుకును అడిగాడు. ” వామ్మో…మూడు నెలల నుంచి నేను కరోనా భయంతోనే ఇంట్ల కాలు బయటపెడుతలేను. ఏకంగా కరోనాతోనే కలిసుండుమంటవా…నువ్వసలు నాన్నవేనా…వీలుకాదు ” అన్నాడు.

” ఒరే..అర్థం చేసుకోరా…నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు.ఇమ్యునిటీ పవర్ ఎక్కువగానే ఉంటుంది.నీకేం కాదురా..” చెప్పాలని ప్రయత్నించాడు. కొడుకు వినలేదు. ‘నువ్వెప్పుడు ఇంతే…నన్నో రకంగ జూత్తవు అన్ననో రకంగ జూత్తవు..ఆపదివడ్డప్పుడే నేను యాదికత్త. అన్నను ఉండుమను…ఏమైతుందట.” నిష్టూరాలాడుతూ ఫోన్ పెట్టేసాడు.

కూతురును అడిగితే అల్లుడిని అడగమంది. అల్లుడు • చిన్న పిల్ల ఉంది కద మామయ్యా…వీలు కాదు.అత్తమ్మనే కొన్ని రోజులు ఇక్కడ ఉండుమందామనుకున్నం.ఈ కాలంల పెండ్లిలు ఎవలన్న పోతున్నరా..గా పెండ్లేందుకుపోయిండ్రు ‘ అన్నాడు.

ఎలా తెలిసిందో కాని వాడకు తెలిసిపోయింది. అందరు గుసగుసలు పోతున్నారు. దూరం నుంచే నారాయణను చూస్తున్నారు. ముందు వెనక ఇండ్ల వాళ్ళు ఇటు వైపు చూడకుండా తలుపులేసుకున్నారు. సరలకు ఈ విషయం తెలిస్తే కరోనా కంటే ఎక్కువ బాధపడుతుందని తెలుసు. ఏం చేద్దామా అని అలోచిస్తూ లోపలికి వచ్చాడు.

ఆశా వర్కర్  మరోసారి ఫోన్ చేసింది. ” ఏం సార్ పేషెంట్ తో ఎవరుంటున్నారు…..మేము రిపోర్ట్ పంపాలి  చెప్పండి . ” అడిగింది.

పెషెంట్ అంటే కోపమొచ్చింది నారాయణకు. సస్పెక్టెడ్ కాదు కాబట్టి తమాయించుకుని ‘ఓ అరగంటలో చెబుతానండీ…పిల్లలను అడగాలి గదా..అయినా పాసిటివ్ వస్తే హాస్పిటల్లో చేర్చుకోవాలెగనీ మా మీదనే వదులుడెందుకు’ అన్నాడు కొద్ది విసుగ్గా.

” దీంట్లో కూడా స్టేజిలుంటయి సార్…మొదటి స్టేజిలో ఉన్న వారికి అసలు లక్షణాలే ఉండవు.వచ్చింది. తెలువది పోయేది తెలువది. రెండవ స్టేజిలో ఉన్న వారికి ఇలాగే స్వల్ప లక్షణాలుంటాయి.వీరికి హాస్పిటల్ అవసరం లేదు…” చెప్పుకు పోతుంది. సరళ వింటుందని ఫోన్ కట్ చేసాడునారాయణ.

కాని పట్టేసింది సరళ. “ ఎవరండీ..వాళ్ళు..ఏందట..నాకు పాజిటివ్ అటనా” అడిగింది .

ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒకసారి సబ్బుతో చేతులు కడుక్కున్నాడు. అల్లం సొంటి మిరియాలు దాల్చిన చెక్క తులిసాకులు వేసిన కషాయాన్ని చేసి నిమ్మరసం పిండి ఆమెకు దూరంగా పెట్టాడు. గ్లాస్ తీసుకుందామని లేచింది సరళ. తల తిరిగినట్టయింది. తూలి పడబోయి నిలదొక్కుకుంది. ఆమెను అందుకోబోతు ఆరడుగుల దూరం గుర్తొచ్చి వెనక్కి తగ్గాడు నారాయణ.

” నీరసంగా నవ్వింది సరళ. ఏడడుగులతో అప్పుడు ఒకటయ్యాం .ఆరు అడుగులతో ఇప్పుడు దూరంమయ్యాం …….. ఏం కాలమండీ…..మళ్లీ ముందటిలా ఉంటుందా కాలం ” అడిగింది.

“చెప్పలేం సరళా ……… వాక్సిన్ వస్తుందంటున్నారు కదా…… చూద్దాం…. అయినా ఏదీ ముందటిలా ఉండదు…… “అన్నాడు.

“నెగెటివ్ వచ్చింది కదా……చేతికి ఇవ్వచ్చు కదా….. “అడిగింది సరళ.

కళ్ళ నీళ్లోచ్చాయి నారాయణకు. చెప్పక తప్పదనిపించింది. “కాదు సరళ…నువ్వేం భయపడాల్సిన పని లేదు… ఆక్సీజన్ లెవెల్స్ భాగానే ఉన్నాయి. దగ్గు ఉంది కాబట్టి కాఫ్ సిరప్ తాగాలి. సర్ది ఉంది కాబట్టి సిటిజన్ వేసుకోవాలి, జ్వరానికి పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది. అవసరమైతే డోలో వేసుకుంటే చాలు…సింపుల్ టీట్ మెంట్ ..వారంలో బయటపడొచ్చు…”అన్నాడు.

“భయమెందుకండి……. నెగెటివ్ వచ్చింది కదా……. “అనుమానంగా అడిగింది.

“కాదు సరళ…పాజిటివ్ అట. ఇంతకు ముందే మళ్లీ ఫోన్ చేసి చెప్పారు. ఎదో రిపోర్ట్ తారుమారు అయిందట….. “అంటూ ఆమె మొఖం లోకి చూసాడు. కొద్దిసేపు మాట్లాడలేదు. ఎంతో భయపడుతుందనుకున్నాడు. భయపడలేదు. నెమ్మదిగా తలుపులు మూసుకుంది. వెళ్లి బెడ్ మీద ఒరిగింది. సాయంత్రం వరకు ఒకరిని ఒకరు చూసుకోలేదు.

సాయంత్రం ఆమెతో మాట్లాడాలనిపించి ఫోన్ అందుకున్నాడు నారాయణ. సరళ ఫోన్ ఎత్తి “చెప్పండి “అన్నది.

“సరళ…… బాధపడుతున్నావా…… ” “లేదు…..భయపడుతున్నా..నా కోసం కాదు…… మీ కోసమే….. “

“నా కోసం ఎందుకు…” అడిగాడు.

” మీకు లివర్ ప్రాబ్లం…..బైపాస్ అయింది. బీపీ ఉంది షుగర్ ఉంది. పైగా అస్తమా..మీకు ఎక్కడ అంటుతుందోనని..”

“లేదు సరళ…. జాగ్రత్త తీసుకుంటున్నాను గదా….. “

“ఎంత జాగ్రత్త తీసుకున్నా చెప్పలేమండి..పెండ్లి దగ్గర మనం మాత్రం జాగ్రత్తగా లేమా..పిల్లలను పిలవండి. రేపు రేపు నాకు వంట చేసుకోవడం చేతగాక పోవచ్చు.వాళ్లే ఎవరైనా నా వద్ద ఉంటారు. మీరు ఎక్కడికయినా వెళ్ళండి “అన్నది

నారాయణకు దుఃఖం వచ్చింది. పిల్లలు ఏమన్నది చెప్పాడు. మౌనంగా విన్నది సరళ. “సరే వాళ్లన్నది కూడా నిజమే కదా..” అన్నది. అప్పుడే పెద్దకొడుకు నుంచి కాల్ రావడంతో మళ్లీ మాట్లాడుతానని సరళకు చెప్పి కట్ చేసి కొడుకు కాల్ ను రిసీవ్ చేసుకున్నాడు.

“నాన్న…..ఎక్కడున్నావు…..ఒక్కసారిబయటకురా….. ” అన్నాడు. తలుపు తెరిచాడు నారాయణ. గేటు ముందు ఇద్దరు కొడుకులున్నారు. ముఖానికి మాస్కులు, చేతికి గౌజులు, నెత్తికి గ్లాస్  హెల్మేట్ అంతరిక్షం నుంచి దిగివచ్చిన వారిలా ఉన్నారు.

“రండిరా…… లోపలికి…. ” పిలిచాడు తండ్రి.

వినరాని మాటను విన్నట్టు ” ఇప్పుడా… ఇప్పుడేందుకు లోపలికి ”అంటూ ఒక కవర్ తెచ్చి దూరంగా పెట్టాడు పెద్దకొడుకు.

” కాఫ్ కు జ్వరానికి కోల్డ్ కు ఈ కవర్ లో మెడిసిన్స్ ఉన్నాయి. టైం ప్రకారం వేసుకుంటే సరి. ఎలా వేసుకోవాలో అమ్మకు ఫోన్లో చెబుతా. అమ్మకు ఆరోగ్య సమస్యలేం లేవు కాబట్టి తప్పకుండా కోలుకుంటుంది. మా బాదంతా నీతోనే. నీకు వైరస్ అటాక్ అయితే కోలుకోవడం కష్టం.దీనికి ట్రీట్మెంట్ కదా.. ” అన్నాడు రవి.కొడుకును వింతగా చూసాడు నారాయయణ “మరి అమ్మరా… “అశ్చర్యంగా అడిగాడు నారాయణ.

“అమ్మ ఇక్కడే ఇంట్లోనే ఉంటుంది. కావలసిన వస్తువులన్నీ అందుబాటులో ఉంచుదాం. వండుకుంటుంది తింటుంది. అంత సీరియస్ అయితే తర్వాత చూద్దాం. మా బాధంతా నీతోనే నాన్నా..నీకు ఆరోగ్యం సరిగా లేదు కదా.. “అన్నాడు రవి.

కోపమచ్చింది నారాయణకు. ఇంతకు ముందే స్నేహితుడు అన్న మాటలు గుర్తోచ్చాయి. “దాన్ని ఇంట్లోనే ఉంచి తాళమేసి పోదామంటావు…. రెండు వారాల తర్వాత బతికుంటే చూద్దామంటావు…నువ్వు కొడుకువేనారా….మీరు నాకోసం కాదురా..నా జీతం కోసం చూస్తున్నారు. నేను ఇక్కడనే ఉంటా.. మీరెళ్ళండి.. ” అన్నాడు కోపంగా.

పెద్ద కొడుకు మాట్లాడలేదు. చిన్న కొడుకు రాజు అన్న మీదికి కోపానికొచ్చాడు.

“అదేంటన్నా..నువ్వు అక్కడ మాట్లాడిందెంటి. ఇప్పుడు వచ్చి చెబుతున్నదేంటి. అమ్మకు హెల్పర్ గా ఉంటానంటివి గదా. ” అన్నాడు.

“అనుకున్న..కాని నాకు వీలు కాదు…. ” దాట వేస్తూ అన్నాడు రవి.

“ఈ మాట ముందే అనాల్సింది. ఇక్కడికెందుకు రమ్మన్నావ్…… ” నిలదీసిఅడిగాడురాజు.

” అగో నేనే ఎందుకుండాలె.నీలెక్క నాది పాణం గాదా. నువ్వేమో అంటించుకోవు గనీ నేను అంటించుకొవాల్నా..” కోపానికచ్చాడు రవి.

ఇంటి ముందు కొట్లాట కావడంతో సరలకు వినిపించింది. ఎవరా అని చూసింది. తండ్రి కొడుకులు తగువులాడుకోవడం వింటుంది. అది తన మూలంగానే అని తెలిసిపోయింది. ఎవరిని ఓదార్చలేని పరిస్థితి. ఏడుపు ముంచుకొచ్చింది.

అన్న మాటలతో రాజుకు కోపం వచ్చింది. “ఎవలు ఉండుడొద్దు. మా అమ్మ నాకు చేదు కాదు. నేనుంటా మీరు వెళ్ళండి…… ” అంటూ చేతులకు సానిటైజర్  రాసుకుని లోపలికి వచ్చాడు. తెచ్చిన కొబ్బరి బొండాలు తొలిచి గ్లాస్ లో నీళ్లు పట్టి తల్లి గది ముందు పెట్టి ఫోన్  చేసాడు.

నారాయణకు కొంత నిమ్మలమైంది. భార్యకు చెప్పి పెద్ద కొడుకుతో వెళ్ళిపోయాడు. తండ్రి వెళ్ళి పోయిన అరగంటకే చిన్న కొడుకు కూడా వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ‘ మొండి మనిషి. ఆయనకదలడనే ఈ ఐడియా చేసిన్నమ్మా…నీకేం గాదు. కావలసిన మందులు సరుకులు అన్నీ సర్దిపెట్టిన. ఇప్పుడు నువ్వు గదిలో ఉండాల్సిన అవసరం లేదు..ఇల్లంత తిరుగచ్చు..ఒక్కదానివే గదా..పోన్ లో టచ్ లో ఉంట..’ అన్నాడు.

తల్లి కొడుకును బతిమాలింది. ఏడ్చింది. ఒక్కదాన్ని ఉండలేనన్నది. చిన్ననాడు అతడిని ఎలా పెంచింది. గుర్తు చేసింది. కనీసం ఒక్క రోజయినా ఉండమని అడిగింది. వినలేదు కొడుకు. తనకు పని ఉన్నదంటూ వెళ్ళిపోయాడు.

సరళ ఏడుస్తూ ఒక్కతే ఇంట్లో మిగిలిపోయింది. అప్పటికి దగ్గు జ్వరం ఎక్కువయింది. గొంతు పచ్చి పుండయింది. మోషన్స్ మొదలయ్యాయి. రాత్రిపూట భయమయింది. లేవడానికి చేతకాలేదు. అలాగే పడుకుంది.

హైదరాబాద్ వెళ్ళాక మరునాడు ఫోన్ చేసాడు నారాయణ. ఏం చెప్పాలో అర్థం కాలేదు సరళకి. ఏడుపును ఉగ్గబట్టుకుని మాట్లాడింది. చిన్నకొ డుకు తనతోనే ఉన్నాడని తను బాగానే ఉన్నానని చెప్పింది. మూల్గుతుంది. మంచి నీళ్ళు ముంచుకుందామన్నా నీరసంగా ఉంది. దగ్గర ఎవరూ లేకపోవడంతో భయానికే జ్వరం మరింత ఎక్కువయింది.

ఆమె మాటలోని తేడాను గమనించాడు నారాయణ. నీరసంగా ఉన్న భార్య గొంతును గుర్తు బట్టి జ్వరం పెరిగిందనుకున్నాడు. వెంటనే చిన్న కొడుక్కు ఫోన్ చేసాడు. మాట్లాడి పెట్టేస్తుంటే రైలు కూత వినబడింది. సిరిసిల్లలో రైలు ఎక్కడిదనుకున్నాడు. ఆ రాత్రి నిద్రపట్టలేదు నారాయణకు మరునాడు లేస్తూనే “ చెల్లెల్ని చూడాలని ఉందిరా వెళ్లొస్తా “అన్నాడు రవితో.

“రోజులు బాగలెవ్వు నాన్నా…… ఎందుకు…. “అన్నాడు రవి.

“ఇక్కడనే లోకల్లోనే కదరా……. ఆటోలో వెళ్లి రెండు రోజుల్లో వస్తా…….. ” అన్నాడు.

తగిన జాగ్రత్తలు చెప్పాడు రవి. తలూపి బయటకు వచ్చాడు నారాయణ. సక్కగా జూబ్లీకి వచ్చి సిరిసిల్ల బస్ ఎక్కాడు.

సరళకు ఊపిరాగి పోతుందేమో అన్నంతగా అయాసం మొదలయింది. తలుపు తీద్దామంటే ఎవరు ఏమంటారోనని భయం. ఎవరినైనా పిలుద్దామన్నా ఎవరూ రారని తెలుసు. ఒంటరిగా చనిపోతానేమో అన్న భయం మొదలయింది. ఏదయితే అదయిందని గుండెను రాయి చేసుకున్నా మనుసు ఓపలేదు. పిల్లల మీద విరక్తి పుట్టింది. బతుకు మీద విరక్తి పుట్టింది. సాయంత్రం అవుతుండగా భర్తకు పోన్ చేసింది. ఇంటి ముందే పోన్ రింగయిన చప్పుడు. వెంటనే తలుపు తట్టిన చప్పుడు. వెయ్యేనుగుల బలం వచ్చింది సరళకు. వెంటనే వెళ్ళి తలుపు తెరిచింది. భర్తను చూడగానే కన్నీళ్లు పెట్టుకుంది.

నారాయణ కూడా ఏడ్చాడు. బార్యను హత్తుకోవాలని ఉంది. అమె భుజం తడుతూ ఓదార్చాలని ఉంది. కాని ఆరడుగులు దాటి ముందుకు రాలేని పరిస్థితి.” నిజమే సరలా…ఎంత పాడు కాలమచ్చే. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాను కాని వాళ్ళ పెడబుద్ధిని గ్రహించలేకపోయాను. ” కన్నీళ్లు పెట్టుకున్నాడు. . – ఇద్దరూ లోపలికి వచ్చారు. సరళ గదిలోకి వెళ్ళి కూర్చుంది. అప్పటికప్పుడు నీరసం మాయమయి పోయింది. వస్త వస్తనే అల్లం కషాయం చేసి ఇచ్చాడు నారాయణ. తాగలేదు సరళ. పక్కన పెట్టింది. దూరంగా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు నారాయణ.

“ఎలా ఉన్నావు సరళ……. “అడిగాడు ప్రేమగా.

“వాసన రావడం లేదు….. ” చెప్పింది. ఆమె కళ్ళు మూతలు పడుతున్నయి.

“ఇది నీకో లెక్కనా…తిరిగి అదే వస్తది. నువ్వు చాలా సార్లు వాసన కోల్పోయావు తెలుసా… సిగరెట్ వాసన నీకు పడదని తెలిసి కూడా నేను సిగరెట్ తాగినప్పుడు మొదట్లో బాధపడ్డావు. తరువాత ఆ వాసన రావడం లేదన్నావు. మందు వాసన నీకు పడదని తెలిసి కూడా నేను మందు తాగినప్పుడు….. పిల్లల మలమూత్రలు ఎత్తిపోసినప్పుడు..ఇలా చాలా సార్లు నా కోసం వాసనను కోల్పోయావు. నీకు ఇదో లెక్క కాదు తప్పక తిరిగి వస్తుంది……. ” అన్నాడు.

” రుచి కూడా తెలియడం లేదండి…… ” భాదగా అన్నది సరళ బెడ్ మీద ఒరిగిపోతూ. “నీకు అదో లెక్కనా సరళా…నా కోసం పిల్లల కోసం ఎన్ని సార్లు నువ్వు రుచి కోల్పోలేదు…..ఉప్పు కారం నీకు సహించదని తెలిసి కూడా నా కోసం ఉప్పు కారం ఎక్కువ వేసి వండినప్పుడు, నీకు ఇష్టం లేని కూరలను పిల్లలు బలవంతంగా చేయమన్నప్పుడు నీఇష్టాన్ని చంపుకొని వాళ్ళ కోసం కూరలు చేసినప్పుడు…నువ్వసలే ఇష్టపడని క్యాబేజిని నేను బాగా ఇష్టపడ్డప్పుడు..అప్పుడు నువ్వు రుచిని కోల్పోలేదా..మళ్ళీ తిరిపొడుతావు ” ప్రేమగా అన్నాడు.

అతని మాటలు ఆమె అంతరంగాన్ని ఎక్కడో మీటుతున్నాయి. జీవిత చక్రం కదులుతుంది.

“ ఊపిరాడ్డం లేదండీ..” అన్నదిసరళ దమ్మును ఎగపోస్తూ.

” నీకిది కొత్తనా సరళా….అఫీసుకు నన్ను పంపి పిల్లలను స్కూలుకు పంపి ఉరుకులు పరుగులతో ప్రైవేట్ బడిలో పాటలు చెప్పినప్పి సాయంత్రం ఇంటి పని వంట పనేగాక ట్యూషన్లు చెప్పి సంసారాన్ని నెట్టుకచ్చినప్పుడు మాత్రం నీకు ఊపిరాడిందా…పదేండ్లు ఊపిరాడక సతమతమైనా తట్టుకున్నావు..నీకిదో లెక్కనా..తప్పకుండా కోలుకుంటవు..” ధైర్యంగాచెప్పాడు.

అతని వైపు బేలగా చూసింది సరల. అలసటగా కళ్ళు మూసుకుంది.” తలనొప్పిగా ఉంది..” అన్నది.

” నేనూ పిల్లలూ పెట్టిన తలనొప్పుల కంటేనా..వాటి ముందు ఇదో లెక్కనా ..” ఆమె మాట్లాడ లేదు. అప్పులు పేకాట కొట్టడాలు తిట్టడాలు పిల్లల ప్రేమలు పెళ్లీలు అన్నీ గుర్తొచ్చాయి.

“నిజం సరళా…నువ్వు కోలుకుంటావు చూడు….నాతో ఏడడుగులు నడిచి ఏడు సముద్రాలు ఈదినంతగా కష్టాల కోర్చి సంసారాన్ని ఈదుకొచ్చావు. ఈ ఆరడుగుల దూరం నీకో లెక్కనా….” అన్నాడు.

“ అప్పుడు పరువు కోసం బతికానండీ…” మాటలు తడబడుతున్నాయి.

” ఇప్పుడు నీకోసం బతుకు…”

“ నా కోసం నేనెప్పుడూ బతకలేదు గదా… నేనంటూ ఒకదాన్ని లేను కదా..మీరన్నట్టూ ఈవైరస్ నాకెప్పుడో వచ్చింది. ఇన్ని బాధలు పెట్టి నన్ను సమూలంగా తుడిచేసింది. నా డీఎన్ఏనే మార్చేసింది…నాకే కాదు….నా లాంటి ఎందరికో ఏడడుగుల నడకతోనే వచ్చింది.”

“ నువ్వు బతకాలి సరళా..బతుకుతావు….”

“మీ కోసం బతకాలా….”

“కాదు..నీ కోసమే…” ” ఆలస్యమయిందండీ.. నాకు బతకాలనిపించలేదు..మీరు నిద్ర కోసం తెచ్చుకున్నమాత్రలన్నీమింగేసాను..”

ఆరడుగుల దూరంలో సరళ తల వాలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com