తెలుగులో ప్రబంధాలు అనగానే అల్లసాని పెద్దన మనుచరిత్ర, వరూధినీ ప్రవరాఖ్యులు తలపులోకి వస్తారు. ఆ తరువాత సాహిత్యం చదువుకునేవారికి పారిజాతాపహరణము, వసుచరిత్రము, శృంగార నైషధము ఇట్లాంటివి స్ఫురిస్తాయి. ఇందుకు కారణం ఇప్పటిదాకా అవే ప్రబంధాలు అనే ప్రచారం విస్తృతంగా జరిగింది. పండితులు, అధ్యాపకులు, పరిశోధకులు, పత్రికలు, సాహిత్య చరిత్రకారులు వీటినే ప్రధానంగా ఎత్తి చూపారు. ప్రబంధయుగమని శ్రీకృష్ణదేవరాయల కాలానికి పేరుకూడా పెట్టారు. అదే పద్దతిలో తరువాతి కాలంలో రాసినా వాసి తక్కువైందని క్షీణ ప్రబంధ యుగమని తంజావూరు రాజుల కాలం నాటి రచనాకాలానికి పేరు పెట్టారు. ఈ ప్రబంధాలకు ముందు, సమకాలంలో తరువాతి కాలంలో వెలువడిన అనేక తెలంగాణ ప్రబంధాలు అంతగా ప్రసిద్ధికి నోచుకోలేదు. కారణం వాటిని చిన్నచూపుచూడటమే. తెలంగాణలోనే మొదటి ప్రబంధం వెలువడిందని ఇటీవల కొందరు పరిశోధకులు సోదాహరణంగా చూపుతున్నారు. అయినా వాటికింకా ప్రాచుర్యం రాలేదు. మన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు పాఠ్యాంశాలుగా వీటిని నిర్ణయించినపుడు, ఆయా సాహితీ సంస్థలు వీటి పై దృష్టి సారించి చర్చలు గోష్టులు నిర్వహించినపుడు వీటికి తగిన ప్రాశస్త్యము, గుర్తింపు లభించే అవకాశం ఉంది.

ప్రబంధం అంటే వర్ణనా ప్రధాన కావ్యమని రూఢిగా ,స్థూలంగా చెప్పుకుంటున్న నిర్వచనం. కథకన్నా వర్ణనలకెక్కువ ప్రాధాన్యతనిచ్చి, కల్పనలు, చమత్కారాలు, కవితావైదుష్యము మొదలైన వాటికి ప్రాధాన్యత నిచ్చినవి

ప్రబంధాలు.

అటు కవికృతమైన కావ్యత్రయంబు గద్యపద్య విమిశ్ర సంప్యామండ్రు నగర ముఖ్యాష్టదశ వర్ణనములచేత

బరగు నదియును నవ్యప్రబంధమనగ……. అని విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణిలో తెలిపాడు. నగరము మొదలైన పద్దెనిమిది వర్ణనలు ఉంటే అది నవ్యప్రబంధము. గద్యము, పద్యము, మిశ్రమము అనే మూడు ముందే ఉన్న రూపాలు. నిజానికి ఇవి ప్రక్రియా పరమైనవి. తరువాత చెప్పిన వర్ణనా ప్రధానమనేది ఈ మూడింటిదో పోల్చదగినది కాదు. ఈ మూడింటిలో కూడా వర్ణనలుండవచ్చును. కాని సరికొత్తగా ఇటువంటివి వెలువడుతున్నాయని విన్నకోట అభిప్రాయం . ప్రతాపరుద్రీయంలో విద్యానాథుడు కూడా నగరార్ణవ శైలర్లు చంద్రార్కోదయ వర్ణనమ్ , ఉద్యాన సలిలక్రీడా, మధుపాన రతోత్సవా, విప్రలంబో వివాహశ్చ, కుమారోదయ వర్ణనమ్ , మంత్ర ద్యూత, ప్రయాణాజి నాయకాభ్యుదయా…. అపి ఏతాని యత్ర వర్ణ్యంతే తన్మహాకావ్యముచ్యతే, ఏషామష్టాదశానాం యైః కైశ్చి దూనమిష్యతే….. అన్నారు. పద్దెనిమిది వర్ణనల జాబితా ఇచ్చారు. ఇవికాక మరికొన్ని కవులు చేర్చుకున్నారు. కొన్నిటిని వదిలేశారు. ఇవన్నీ వర్ణనలుంటే అది మహాకావ్యమవుతుందన్నారు. కొంచెం తక్కువగా చేస్తే కావ్యమవుతుందని సూచించారు. కావ్యము, ప్రబంధముఅనే వాటికి భేదం అంత స్పష్టంగా కవులు తెలుపలేదు. కొందరు కవులు తమ కావ్యారంభంలో నాచెప్పంబూనిన మహాకావ్యంబునకు కథాక్రమంబెట్టిదనిన అని ఆశ్వాసాంతంలో ….మహా ప్రబంధమునందు

ప్రథమాశ్వాసాము …. అని ముగించినవారున్నారు. ఉదాహరణకు పిల్లలమట్టి పినవీరభద్రుడు అవతారికలో “ అని సవినయంబుగా కర్పూర తాంబూలంబు జాంబూనద పాత్రంబున నర్పించి ప్రార్థించిన తద్వచన ప్రకారంబున మిశ్రబంధంబుగా శాకుంతలంబను ‘ప్రబంధంబు’ బంధుర ప్రీతిం జెప్పంబూనితి……. అన్నారు. ఆశ్వాసాంతంలో ” ఇది శ్రీ భారతీతీర్థ గురు శ్రీ చరణ కరుణా కటాక్ష లబ్ద సిద్ధ

సారస్వత పవిత్ర గాదయామాత్య పుత్ర యారాధితామర వీరభద్ర పిల్లలమట్టి పినవీరభద్ర ప్రణీతంబయిన శకుంతలా పరిణయంబను శృంగార శాకుంతలంబను ‘ కావ్యము నందు ప్రథమాశ్వాసము….. అన్నారు. కవి తానే రెండు విధములుగా చెప్పినాడనగా రెండింటికి తన దృష్టిలో భేదము లేదని అర్థము. ఇట్లా చాలా కావ్యాలలో ప్రబంధాలలో కనిపిస్తాయి. అంటే కావ్యము, ప్రబంధము ఒకే అర్థంలో పూర్వం భావించారు.

కాని సాహిత్య చరిత్రకారులు వర్ణనా ప్రధానమైనవి ప్రబంధాలని ఒక యుగంగా చేసి ప్రచారం చేశారు. నిజానికి కావ్యాలన్నిటిలోను వర్ణనలుంటాయి. కథా ప్రాధాన్యత ఉండి వర్ణనలు సందర్భోచితంగా ఉన్నవి కావ్యాలుగా అవి మరింత మహత్తరంగా కథాపాత్రల సన్నివేశాల రసోద్దీపనంగా చేసిన వర్ణనల వల్ల కావ్యానికి ఉన్నతి ఉత్కృష్టత కలుగుతుంది. ఒక్కొక్కసారి మహాకావ్యం కూడా అవుతుంది. ఇమ్మహా ప్రబంధమునకు అని ఇమ్మహాకావ్యమునకు అని కూడా కవులు తామే పేర్కొన్న సందర్భాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా తన ఆముక్తమాల్యదలో “ నా విన్నవింపంబూను నాముక్తమాల్యదా మహాప్రబంధంబునకు కథా క్రమంబెట్టదనిన” అని రాశారు.

పైన ఉదాహరించినవాటిని బట్టి కావ్యము, ప్రబంధము వేరు కాదు, మహాకావ్యము మహాప్రబంధము కూడా అంతే. ప్రబంధాలగురించి మాట్లాడితే కావ్యాలగురించి వేరా? అనే ఆలోచన కలుగుతుంది. కాని కావ్యాలు ప్రబంధాలు సమానార్థకాలుగానే కవులు రాశారు. విమర్శకులు, సాహిత్య చరిత్రకారులే విడిగా చూపారు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ప్రబంధాలు, కావ్యాలు గా పిలువబడినవి ఎన్నో వెలువడినాయి. ప్రసిద్ధ కథలు కాక కల్పిత కథలు రాయడం కూడా ఒక నూతనత్వం. కేవల కల్పనాకథలు అని పింగళసూరన ఒక పద్యంలో పూర్తిగా ప్రసిద్ధమైన పురాణేతిహాసాలకు సంబంధించిన కథ అయితే ప్రసిద్ధమని, అచ్చంగా కొత్తగా కల్పనచేస్తే అది తొందరగా పాఠకులకు నచ్చదని రెండింటిని కలిపి చెపుతానని మిశ్రకథగా నొనరింతు నన్నాడు.కథ, వర్ణనలు ప్రధానంగా ప్రబంధాలు వెలువడ్డాయి.

తెలంగాణలో వెలువడిన ప్రబంధాలు అనేకం ఉన్నాయి. కాలాన్ని బట్టి ధనాభిరామం అనే కావ్యం నూతన కవి సూరన ఒక కల్పిత కావ్యం రాశాడు. ఇది క్రీ.శ. 1360 – 1550 మధ్యకాలానికి చెందిన కవి అని వావిళ్ళ రామస్వామి మొదటిసారి 1950లో ముద్రించిన పీఠికలో పేర్కొన్నారు. డా.ఆలేటిమోహన్ రెడ్డి విపులమైన చారిత్రికాధారాలతో చర్చచేసి ఈ కవి క్రీ.శ. 1500 కంటే ముందరివారని నిరూపించారని సుంకిరెడ్డి నారాయణరెడ్డి

ముంగిలిలో పేర్కొన్నారు. పింగళిసూరన కళాపూర్ణోదయం కంటె అల్లసాని మనుచరిత్రకంటె ముందు అని నిశ్చయించారు. అయితే ఈ కావ్యం పరిమాణంలో చిన్నది . కేవలం కొన్ని పాత్రలు. ఇందులో అందం ప్రధానమా? ధనం ప్రధానమా? అనే అంశంపై చర్చ జరుగుతుంది. వాటి నిరూపణకు అందమైన యువకుడిని, ఆస్తిఉన్న ధనికుడిని చేరిన స్త్రీ పాత్రను కల్పించి నిర్ణయించడం జరుగుతుంది.

ఇందులో కథానాయకుని చూసి నాయిక మాటల్లో నలుడొ, శశాంకుడో దివిజనాథుని కూరిమి నందనుండొ కా కల నలకూబరుండొ, ప్రియమారగ మానవరూపుదాల్చి తా నిలను చరింపవచ్చిన రతీశుడొ యిన్నియు చెప్పనేల మీ చెలువము మర్త్యులందు విలసిల్లగ నేర్చునె బ్రహ్మకూర్చునే…… ఈ పద్యం సరిగ్గా మనుచరిత్రలో వరూధిని ప్రవరుని చూసినప్పుడు ” ఎక్కడి వాడొ యక్షతనయేందు జయంతవసంత కంతులన్ చక్కదనంబునన్ గెలువజాలినవాడొ,మహీసురాన్వయం

బెక్కడ ఈ తనూవిభవ మెక్కడ………….” అనే పద్యాన్ని స్ఫురింపజేస్తుంది. పెద్దన పై పద్యాన్ని అనుసరించినట్లుగా కనిపిస్తుంది. పద్యరచనలో కూడా తరువాతి కవులకు ఒరవడి పెట్టిన పద్యాలెన్నో కనిపిస్తాయి. ఇదంతా కల్పితమే .. ఒక విధంగా సాంఘికేతివృత్తం. ఇట్లా వస్తునవ్యతతో ఉన్న కావ్యమైనా చిన్నకావ్యమని, దీనికి మూలం సంస్కృతంలో

ఉండవచ్చునని అందుకని ఇంతకన్నా అన్ని విధాలా సమగ్రమైన ప్రబంధ లక్షణాలు కలది చరిగొండ ధర్మన్న రాసిన చిత్రభారతము ఆద్యంగా చెప్పుకోవచ్చునని డా. సంగనభట్ల నరసయ్యగారు ఇటీవల తెలుగువిశ్వవిద్యాలయం వారు ప్రచురించిన చిత్రభారతం పీఠికలో పేర్కొన్నారు. ఈ కవి కాలాన్ని గురించి విపులంగా చారిత్రకాధారాలతో చర్చించిన నర్సయ్యగారు చరిగొండ ధర్మన్న కరీంనగర్ జిల్లా ( ఉమ్మడి) ధర్మపురి వాస్తవ్యుడని, క్రీ.శ.1500 నుండి

1505 ల మధ్య రచించబడిందని తేల్చారు. ఇంతే కాదు పింగళి సూరన కూడా పూర్వతెలంగాణకు అంటే మహారాష్ట్ర సరిహద్దుల్లోని వాడని చూపించారు. చిత్రభారతం లోని కథ పూర్తిగా కల్పితం. ఇందులో కృష్ణుడు, రంభ మొదలైన పాత్రలు ఉన్నా ఆ కథ ఏ పురాణంలోనూ ఉన్నది కాదు. కవి తాను చెప్పదలచుకున్న అంశానికి అనుగుణంగా పాత్రలు, సన్నివేశాలు సృష్టించాడు. ఎనిమిది ఆశ్వాసాలతో అష్టాదశాధిక వర్ణనలున్న రచన చిత్రభారతం. అలంకారాలు, శబ్దచమత్కారాలు అనేకం కావ్యంలో అడుగడుగునా కనిపిస్తాయి. తెలుగులో అవధానం కూడా ఇతడారంభించాడనడానికి ” శతలేఖిన్యవధాన పద్యరచనా సంధా సురత్రాణ చిహ్నిత నామా! చరిగొండ ధర్మసుకవీ ! అనే సంబోధనతో కూడిన పద్యం కనిపిస్తుంది. కవులు చెపుతుంటే తాళపత్రాలమీదనో భూర్జపత్రాలమీదనో రాసే లేఖకులుండేవారు. వందమంది వ్రాయసకాండ్రున్నా అందరికి ఒకేసారి పద్యాలను ఆశువుగా చెప్పగల సామర్థ్యం చరిగొండ ధర్మనకున్నట్లు ఈ పద్యం వల్ల తెలుస్తున్నది. తరువాత ప్రబంధ కవులకు మార్గదర్శకంగా ఉన్న పద్యాలు కూడా ఈ ప్రబంధంలో ఉన్నాయి. ఉదాహరణకు  ఏమిటికింతవంత తరళేక్షణ, చెప్పుమటన్న లేచి య బ్బామిని చన్నుదోయిపయి పయ్యెద కొంగుదలంగ జాఱ నె మ్మోమరవాల్చి యూరుపుల ముంగర ముత్యము కంద నేడిచెన్

కోమల నూతన స్వరము గ్రోలుచు కోయిల పిల్లయోయనన్. ఇది నాయిక ఏడుపును వర్ణించిన పద్యం. తరువాత అల్లసాని, తిమ్మన, భట్టుమూర్తి అందరి కావ్యాలలో నాయికలనేడ్పించిన పద్యాలున్నాయి. అల్లసాని అల్లనల్లన ఏడ్చెను, ముక్కుతిమ్మన ముద్దుముద్దుగా ఏడ్చెను, భట్టుమూర్తి

భోరున ఏడ్చెను అని తెనాలి రామకృష్ణుడు పరిహసించాడని ప్రతీతి. తిమ్మన పారిజాతాపహరణంలో

ఈసునబుట్టి డెందమున హెచ్చిన కోపదవానలంబుచే గాసిలియేడ్చె ప్రాణవిభుకట్టెదుటం లలితాంగి పంకజ శ్రీసఖమైన మోముపయి చేలచెరంగిడి బాలపల్లవ

గ్రాస కషాయకంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనిన్ ………. అని వర్ణించారు. ఇట్లా ఈ రకమైన వర్ణనలకు ఒక విధంగా మార్గదర్శి చరిగొండ ధర్మన. ఇట్లా అనేక వైశిష్ట్యాలు ఈ చిత్రభారతంలో ఉన్నాయి.

అందుకే ఇది చిత్రభారతం అయింది. . వాణి నా రాణి అని చాటి చెప్పుకున్న పిల్లలమఱి పినవీరభద్రుడు శృంగార శాకుంతలం రాశాడు. ఈయన నెల్లూరి

ప్రాంతం వాడని సాహిత్య పరిశోధకులు కొందరు అభిప్రాయపడినారు. కాని ఈ కవి పూర్వీకులు నల్లగొండ జిల్లా పిల్లలమట్టివాస్తవ్యులు అని ఆచార్య ఎస్.వి.

రామారావుగారు కొన్ని ఆధారాలుచూపారు. ఇట్లా అల్లసాని పెద్దనాదులకు ముందు తెలంగాణలో సరికొత్త కథావస్తువులతో అనేకానేక వర్ణనలతో ప్రబంధాలు వెలువడ్డాయి. ఆయా ప్రబంధాలలోని వస్తువులు, వర్ణనలు, కవితా వైశిష్ట్యాలు పరిశోధించడానికి కావలసినంత సామగ్రి మనముందుంది. వస్తుపరంగా కల్పితాలు, ప్రసిద్ధాలు, మిశ్రమాలు , కవితారూపంలో ద్వ్యర్థికావ్యాలు, నిరోష్యాలు, అచ్చతెలుగు ప్రబంధాలు, క్షేత్రసంబంధ ప్రబంధాలు, విలాసాలు, పరిణయాలు , చరిత్రలు మొదలగు వైవిధ్యంతో కూడిన ప్రబంధాలున్నాయి.

వాటిలో ఇప్పటికి తెలిసిన కవుల ప్రబంధాల పేర్లు ఇవి… 1. నూతనకవిసూరన… ధనాభిరామం…. క్రీ.శ. 1480-1500 రచనాకాలం 2. చిత్రభారతం – చరిగొండ ధర్మన… క్రీ.శ. 1503-1512 3.మరింగంటి సింగరాచార్యులు – దశరథ నందన రాజ చరిత్ర (రామాయణం) 4. అద్దంకి గంగాధరుడు – తపతీ సంవరణోపాఖ్యానము – క్రీ.శ. 1525 – 1585 5. కామినేని మల్లారెడ్డి – షట్చక్రవర్తి చరిత్ర – క్రీ.శ. 1550-1600 6.మరింగంటి జగన్నాథాచార్యులు – శ్రీరంగనాథ విలాసం – క్రీ.శ 1551 7.పొన్నికంటి తెలగన్న – యయాతి చరిత్ర (అచ్చతెలుగు)- క్రీ.శ. 1550-1600 8. కందుకూరి రుద్రకవి – నిరంకుశోపాఖ్యానం – క్రీ.శ. 1568 9.సారంగు తమ్మయ – వైజయంతీ విలాసం – క్రీ.శ. 1580 10. సురభిమాధవ రాయలు – చంద్రికాపరిణయం క్రీ.శ. 1570-1600

533

  1. పైడిమర్రి వేంకటపతి – చంద్రాంగద చరిత్ర -క్రీ.శ. 1570-1640 12. ఎడబాటి ఎఱ్ఱన – శృంగార మల్హణ చరిత్ర – క్రీ.శ. 1627-1693 13.రెడ్రెడ్డి మల్లా రెడ్డి – గంగాపుర మహాత్మ్యము – క్రీ.శ. 1650-1700 ( ఇటీవల తెలంగాణ సాహిత్య అకాడమి

దీన్ని ప్రచురించింది ) 14. సిరిప్రగడ ధర్మన్న – నలచరిత్రము -క్రీ.శ. 1650 – 1750 15. పొనుగోటి జగన్నాథరాయలు – కుముదవల్లీ విలాసము – క్రీ.శ. 1650 ( ఇటీవల వీరి వంశీయులు

ప్రచురించారు.) 16. బోయినపల్లి కుమార వెంకట రాయలు – ద్రౌపదీ కళ్యాణం 1650 17. చెన్నకృష్ణకవి (ప్రెగడరాజు ) సావిత్రి చరిత్ర, (సువ్వాల ప్రబంధం) . క్రీ.శ.1738 18.

శ్రీకృష్ణ విలాసం 19.

యాదవ భారతీయం 20. దొంతిరెడ్డి పట్టాభిరామిరెడ్డి – ఆంధ్రపూర్ణాచార్య అభ్యుదయం – క్రీ.శ. 18 వ శతాబ్దం 21. శేషభట్టరు సింగరాచార్యులు – కేశవ విలాసం – 1742 22.తిరుమల బుక్కపట్నం కిరీటి వేంకటాచార్యులు – అచలాత్మజా పరిణయం ( ద్వ్యర్థికావ్యం ) 1730 23. సురపురం కేవవయ్య – దాశరథి చరిత్ర – (నిరోష్ట్య ఉత్తర రామాయణం) 1734-1819 24. కుందావఝల గోపాలకృష్ణకవి – శ్రీకృష్ణ జన్మఖండం 1750-1820 25. చింతలపల్లి చినవీర రాఘవయ్య – మధురవాణీ విలాసం – 18వ శతాబ్దం 26. కాణాదం పెద్దనసోమయాజి – ముకుందవిలాసం – 1762 27. , శేషశైలేషలీల…. తెలుగులోని 25 అక్షరాలు క నుండి మ వరకు వదిలి రాసిన కావ్యం 28. రాపాక లక్ష్మీపతి – శ్రీకృష్ణవిలాసం – 1765-1790 29.

భద్రాయురభ్యుదయం 30.మరింగంటి వేంకట నరసింహాచార్యులు – తాలాంకనందినీ పరిణయం – 1800- 1880 31.చెన్నూరి శోభనాద్రి – శృంగార సుధాసముద్రపూర్ణ చంద్రోదయం – 1830 32.తూమురామచంద్రారెడ్డి – శ్రీ అలువేలు మంగా పరిణయం 19 వ శతాబ్ది తొలిభాగం 33. తడకమళ్ళ వేంకట కృష్ణారావు – కంబుకంధర చరిత్ర ( వచన ప్రబంధం ) 1830-1890 34. నెల్లూరు నరసింగకవి – రాచకన్యకాపరిణయం – 1860-1920 35. బోయినపల్లి వేంకటాచార్యుడు – జానకీపరిణయం – 1869- 1890 36. వారణాసి అచ్యుత రామకవి – సురథాణీ పరిణయం 37.మరింగంటి వేంకట నరసింహాచార్యులు – శల్వపిళ్ళ రాయ చరిత్ర 18 వ శతాబ్దం ( శ్రీరంగాచార్యులుగారి

పరిష్కరణతో ఇటీవల ముద్రించబడింది. ) ఈ కవి పదహారు ప్రబంధాలు రచించాడని కేవలం నాలుగు మాత్రమే ముద్రితాలని, ఐదు అలభ్యాలని, ఏడు ముద్రించవలసినవనీ శ్రీరంగాచార్యులుగారు పేర్కొన్నారు. 38. వటపురి వేంకట నరసింహాచార్య రాజయోగి – సీతాకళ్యాణము – 20వ శతాబ్దం

ఇంకా వెలుగులోకి రావలసినవి ఉండవచ్చును. ఈ ప్రబంధాలలో పరిణయ ప్రబంధాలు ( చంద్రికాపరిణయం వలె ) పదివరకున్నాయి, విలాస ప్రబంధాలు ( శ్రీరంగనాథ విలాసం వలె ) ఏడు వరకున్నాయి, చరిత్రలు ( నలచరిత్ర వలె ) తొమ్మిదివరకున్నాయి. వీటిపై విడిగా పరిశోధనలు చేయవచ్చును. ఇవి కాక తెలంగాణ నుండి వెలువడిన కొఱవిగోపరాజు సింహాసనద్వాత్రింశిక ఇది కథాసంకలన కావ్యం కనుక ప్రబంధాలలో చేర్చలేదు. కాని తెలంగాణ భాష, సామాజిక, చారిత్రకాంశాలకునెలవు. ఇంకా మహాకావ్యాలు

ఉన్నాయి. పోతన, సోమన మొదలైన వారిని ఇందులో చేర్చలేదు.

తెలంగాణ ప్రాంతం నుండి వెలువడిన ఈ ప్రబంధాలలో తెలంగాణ భాష నుడికారము,సామెతలు, సామాజిక అంశాలు, సమకాలీన చారిత్రకాంశాలు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు కుముదవల్లీ విలాసంలో వ్యవసాయం, కాపులు కాపుల వేషధారణ వారి పనులు వస్తువులు వర్ణించారు. పలుపులు యడ్లనాగలి, పెంట, యాతము, తవుటుకుండ, పైనము, కలియగూర వంటి పదాలెన్నో కన్పిస్తాయి.

శల్వపిళ్ళరాయ చరిత్ర ప్రబంధంలో మహమ్మదీయుల కాలంనాటి విషయాలు ఎన్నో ప్రస్తావించబడినాయి. ఢిల్లీ పాదుషా నుండి శ్రీరామానుజులు విగ్రహాన్ని తీసుకొని రాగా పాదుషా కూతురు వెంటవచ్చి మేల్కోటలో స్వామి ప్రతిష్ఠ సమయంలో స్వామిలో లీనమయినట్లు కథ కాగా బీబీ , తురుష్క బీబీ అని పేర్లతో చెప్పడమే కాక అప్పటి సామాజిక చిత్రణ కూడా ఉంది. ఏహే, ఐతే, జుల్మతీ, దునేదారు వంటి ఉర్దూపదాల మిశ్రమ వాడుకలు ప్రబంధంలో కన్పిస్తాయి.

ఆయా ప్రబంధాలలో శ్రీవైష్ణవ, శైవ మతాల సిద్ధాంతాలతో పాటు వారి వేషభాషలు, క్షేత్రాలు, అక్కడి మహాత్మ్యాలు అవికూడా తెలంగాణలో ఉన్న విశేషాలు కూడా తెలుస్తున్నాయి. ఈ గంగాపురమహాత్మ్యంలో క్షేత్రమహాత్మ్యం తెలుస్తుంది. ఇది తెలంగాణలోని క్షేత్రం కావడం గమనించాలి.

ఈ ప్రబంధాలలో వస్తువైవిధ్యము, పద్యశిల్పము, అలంకార, రస, చర్చలు చేయవచ్చును. శృంగారం, భక్తి, వీరము మొదలైన రసాలలో ప్రబంధాలు రచించారు. ఛందో వైవిధ్యం బహుళంగా కన్పిస్తుంది. కానాదం పెద్దన నాయికను వర్ణిస్తూ ఆమె అవయవాలను ఆయా వృత్తాలతో ఉపమిస్తూ రాసిన పద్యం

గతిమత్తేభము నాసచంపకమొగింకైశ్యంబు కందంబు సం గత వాక్యంబులు మత్తకోకిలలు దృఢ్పండిత్యమయ్యుత్పల ద్యుతి మోమంబురుహంబు దేహరుచి విద్యున్మాలిగా మానినీ

తత వృత్త స్థితులెన్నగా తరమె తద్వార్టానికైనందగున్ ఇందులో మత్తేభ, చంపక, కంద, మత్తకోకిల, ఉత్పల, మొదలైన ఛందస్సులను ఆమె నడక, ముక్కు కొప్పు, మాట, చూపు మొదలైన వాటిని పోల్చాడు కవి. ఇక్కడ ఛందస్సుపట్ల సామర్థ్యము, అభిమానము చూపించారు. ప్రబంధాలలో దేశీయమైన రగడలు, పద్యాలు, ద్విపదలు ప్రయోగించారు.

శ్లేషాదులు అనేక ప్రబంధాలలో కన్పిస్తాయి. చరిగొండ ధర్మన శ్లేషను అలంకారాలను జోడించి వర్ణించిన పద్యం ..

పదముల చొప్పును వడియు ప్పిదము నలంకార లక్ష్మి పేర్మియు ధారా స్పద భావము గల్గి శుభ

ప్రదమై హయమమరె సత్రబంధము రీతిన్……. ఈ పద్యంలో సత్రబంధము ఎట్లా ఉండాలో పరోక్షంగా వర్ణించాడు. కవి వర్ణించదలచుకున్నది హయమును. గుర్రాన్ని ప్రబంధాన్ని ఒకే పద్యం తాడుతో కట్టేశాడు.

పదముల తీరు, వడి అంటే వేగము, అలంకారం గుర్రానికి చేసిన అలంకరణ, ధారాస్పదము పరుగెత్తే లక్షణము చూడగానే శుభమనిపించేదియైనది అని గుర్రానికి, పదములు ప్రయోగించే శబ్దాలు, వడి వాటి వేగము ఆయాపదాల సంయోజనం వల్ల కొన్ని వాక్యాలు వేగంగా చదువుతాం, కొన్ని వాక్యాలు ఆగి ఆగి చదువుతాం, వేగం చదివించే కూర్పు ఉంటే అది వడి, వడి అంటే పద్యాల్లో యతి అని కూడా అదికూడా ఆగకుండా చదివించే వేగంతో ఉండడం వడి, అలంకార లక్ష్మి కావ్యంలో అనేక అలంకారాల సంపద ఉండేట్లుగా చూడడం, ధారాస్పదము ప్రవాహం వలె సాగిపోవడం వడి అంటే వేగం ధారాస్పదం అంటే ఆగకుండా సాగడం అనే లక్షణాలు, ఉండి కావ్యం శుభాన్ని కలిగించేది అని …. పదములు, వడి, అలంకారము, ధార మొదలైన పదాలతో రెండింటిని చమత్కరించాడు. ధర్మన ప్రబంధంలో మరెన్నో

చమత్కారాలున్నాయి.

కొన్నింటిని మాత్రమే నేను మచ్చుకు చూపించాను. ప్రతి ప్రబంధం ఒక పరిశోధనాంశమే. కొన్నింటి పై ఇప్పటికే పరిశోధనలు వచ్చినా మరిన్ని పరిశోధనలు రావలసిన అవసరం ఉంది. తెలంగాణ భాష ఎంత

సమర్థవంతమైందో ఎంత సజీవమైందో ఎంత చారిత్రకమైందో ఈ ప్రబంధాల అధ్యయనం వల్ల తెలుస్తుంది. తెలంగాణ ప్రాంతపు భాష, చారిత్రక విషయాలు, సామాజికాంశాలు ఎన్నో ఈ ప్రబంధాలలో సుస్పష్టంగా తెలుస్తాయి. ఈ ప్రబంధాల ఆధారంగా తెలంగాణ సామాజిక చరిత్రకూడా తెలియవస్తుంది. ఈ  సాహిత్య విద్యార్థులు, సాహిత్యాభిమానులు, పద్యకవితాభిమానులు , అధ్యాపకులు వీటిని పరిశోధన చేసే దిశగా సాగాలి. సాహితీ సంస్థలు విద్యాసంస్థలు వీటిపై చర్చాగోష్టులు నిర్వహించాలి. తెలంగాణ ప్రబంధాలు కొత్తగా తెలంగాణలోను తెలుగు చదివేవారందరిలోను విస్తరించాలి. తెలంగాణ ప్రాచీన కవితా వైభవాన్ని సహృదయంతో అనుభవించి అనుభవింపజేయాలి.

ధరజనవశ్యమై భజన తప్పక యెక్కడ యెరలేని యెందరేని బెలొరసిన మించుగల్గి కడునొప్పగు నెత్తున వన్నె వచ్చియుం జిరమతి నన్ని దిక్కులను చెల్లుబడై సుకవిత్వమెప్పుడున్ వొరపదిలేక బంగరపు పూదె విధంబున నుండి యొప్పగున్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com