సుజాత ఫోన్ చేద్దామని సెల్ ఫోన్ తీసేసరికి గోదావరి పంపిన వాట్సప్ మెసేజ్ కనపడింది .

సారీ సుజాతా ! అని మొదలు పెట్టే సరికి గోదావరి మీద కోపం ముంచుకొచ్చింది .

‘‘ సారీ సుజాతా! నువ్వన్నట్టు చాలా కాలమై పోయింది. మనం కలిసి మల్ల పోవుడే కాలేదు. ఎపుడో కుక్కి , డొక్కు జీపులో పోయినం. ఆనాడు రోడ్డు సరిగ్గ లేక ఆ కుక్కి జీపులో ఎత్తేస్తుంటె నడుం విరిగినంత పనైపాయె. నీకు తొంటి పట్టుకునె! ఆరోజులల్ల అన్ని వూర్లు గట్లనే ఉండెననుకో! జీపులు, ఎడ్ల బండ్లు ఎక్కడవడితే అక్క్కడ బురుదనీల్లల్ల దివడుతుండె.

అయితే ఆ మధ్య తార్రోడ్డు పడ్డదా! ఈ సారి ఇన్నోవా కారులో హాయిగా పోయి రావచ్చంటవా! మునుపటి తీరు పోతె ఒకరోజు . వస్తె ఒకరోజు. మధ్యల ఒకరోజు. పోయి రావాలంటే మూడు రోజులు. ఇపుడు పొద్దున బయిలెల్లి రాత్రి వరకు మల్ల ఇంటికి చేరచ్చు అంటవు. మునుపటి తీరు ఇయ్యాల ఒక్కరోజైన ఉండున్రి. లేకపోతె ఎందుకచ్చినట్టు? అని ఇపుడెవలు బతిమాలెటోల్లు లేరంటవు. అందరిని కలిసి ఆపని కూడా చూసుకొని వెంటనే బయల్దేరి రావచ్చంటవు.

మీ ఇన్నోవా కార్ల సుఖంగ పోయి రావచ్చంటవు.

చింతకింది లచ్చన్న కొడుకు సంజీవ్ నీకన్న మూరెడు ఎత్తైండంటవు! ఔ కాడా

మరి! ఇపుడు పొలగాన్లు మస్తు పొడువు పెరుగుతన్నరు. మునుపు మనకు ఏం సుఖముండెనే. ! ఇపుడు సుఖంగ తింటున్నరు. సంజీవ్ ఉస్మానియాలో పి. జి చేసిండు! రైల్వే, బ్యాంకు , గ్రూపు పరీక్షలు రాసిండు! ఏదో ఒకటి వస్తదంటవు. లచ్చన్న తెలిసిన సంబంధం ఎత్తి పోవద్దని సంజీవ్ ను తొందర పెడుతున్నడా? సంజీవ్ కు ఆ సంబంధం ఇష్టం లేదా? మరి మనం పోయి ఎవరిని ఒప్పిచ్చుడు? తండ్రినా ? కొడుకునా? సంజీవ్ గందుకే క్యాంపస్ ఇడిసి ఇంటికి పోతలేడా?

నిజమే గని మీ అక్క ఒప్పుకుంటదా? మీ బావ ఊకుంటడ? లచ్చన్న మాత్రం ఒప్పుకుంటడ?

సంజీవ్ కు ప్రతిమ అంటే ఇష్టం. ప్రతిమకు కూడా సంజీవ్ అంటె ఇష్టం . ఉస్మానియాలో వాల్ల

స్నేహాలు, తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేయడాలు ల్యాండ్ స్కేప్ గార్డెన్ లో షికార్లు చర్చలు అన్ని వాల్ల మనుసులు కలిపినై అంటవు.

నిజమేనే! వాల్లు మేజర్లు. వాల్లకు ఇష్టమైనపుడు మనం పెద్ద మనుషులుగ మాట్లాడితే మంచిదంటవు. మనం చేయక పోతే లేచిపోయి వాల్లే మ్యారేజి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన పెద్దరికం ఏం ఉంటదంటవు? మనమే మన చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తే మంచిదంటవు. అది గూడ నిజమే!

కాని మీ పెదనాన్న ఊరుకుంటాడా? మీ పెద నాన్న ఆ వూర్లె ఇంకా

పెత్తనమే సాగిస్తుండా? కొడుకు పెద్ద బిల్డరైపోయిండు. ఇంకా ఎందుకే ఊర్లె బోడి పెత్తనాలు? ఆ నడుమ జెడ్పీటీసీగా ఓడిపోయిండన్నవు. ఇంకా బుద్ది రాలేదా? ఓపెన్ల చింతకింది లచ్చన్న గెలిస్తే గూడ ఓర్వలేకే పోతుండన్నవు!

మరి గసొంటోడు గిట్ల లచ్చన్న కొడుకుతోని కులాంతర వివాహం మనం చేస్తం అంటె చూసుకుంటూ ఊకుంటడా? మనం మంచికి పోయి అందరికి కంటయితమా? ఆలోచించు!

‘ గోదావరీ! పెళ్లికి తల్లి దండ్రులు ఒప్పుకోలేదని నీహారిక , అబ్బాయి ఇద్దరు

ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకునిరి. అది యాది కచ్చినపుడల్లా మనుసుల కల కల అనిపిస్త ది. గంతెత్తు పెరిగి , బుద్దెరిగిన పిల్లలు. వాల్లు పారి పోయినా , లేచి పోయి పెండ్లి చేసుకున్నా మంచిగుండు. ! దానికి అమ్మా నాన్నలంటే ఎంత ప్రేమో..ఎంత అటాచ్ మెంటో! నన్ను నా మనసును అర్థం చేసుకోలేదని అలిగి ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకునిరి! పోగొట్టుకొని ఇపుడు ఏడ్వ వట్టిరి. గట్ల మల్లెవలు కావద్దు. మనమే ఒప్పించి పెండ్లి చేద్దామంటవు.‘

అదే మండలంలో అందరిని కలిసి పిలిసి ఒప్పించి పెండ్లి చేయాలనే నీ ఆశయం మంచిదేనే! మనం మోరల్ సపోర్ట్ గ నిలబడాలంటవు! పోగొట్టుకున్నంక ఎంత ఏడిస్తే ఏమస్తదంటవు! నీ హృదయావేదన అర్థం చేసుకోగలను.

సరే ! పోదాం. ఎన్ని మాటలన్నా పడుదాం! జాహ్నవి, సీత, రమేష్ కూడ మనతో వస్తున్నరంటె నాక్కూడ సంతోషంగనే ఉన్నది. కాని పోయిన పని కాక నల్ల ముకం తోని వస్తే మధురమైన ఆనాటి తీపి జ్ఞాపకాలన్ని చేదైపోతయేమో! అట్లేం కాదు. ఊరు చాలా మారిందంటవు. మనుషులు చాలా మారిన్రంటవు!

ఎం. పి లాడ్స్ తో రచ్చబండ చౌరస్తా కాడ పెద్దలైట్లు పెట్టిన్రంటవు!

ఊర్లె లైబ్రరీ పెట్టిన్రంటవు! ఆ వూర్లె టీవీ డిష్ కనెక్షన్లు మూడు వందలైనయా? ఇంకేందే? ప్రపంచమే ఆ వూర్లెకు వచ్చింది. ఇంక దాన్ని పల్లెటూరని ఎట్లంటవు? రోజుపాల వ్యాన్ల జగిత్యాలకు పాలు పోతున్నయంటవు! రెండువందల డెబ్బయి మంది రోజు జగిత్యాలకు ప్రయివేటు స్కూల్లకు పోతున్నరంటవు! తెలంగాణ గ్రామీణ బ్యాంకు పెట్టిన్రంటవు.

హైదరాబాద్ల నలుబయి కిలోమీటర్ల దూరం వున్నా సిటీ అనే అంటున్నం!

మరి ఆ వూరు జగిత్యాల కు పది పన్నెండు కిలోమీటర్లు గూడలేదు. అందుకని అది మునుపటి పల్లెటూరు తీరుగ ఎట్లుంటదంటవు? ఆ వూర్లె తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు చాకలి అయిలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, కె. జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టిన్రంటవు! చైతన్యం బాగా పెరిగిందంటవు! ఇపుడు సంజీవ్ ప్రతిమను

చేసుకుంటే ఆ వూర్లె అదేమంత కొత్త విషయం కాదని సంతోషం పడుతరంటవు!

సరే నువ్వున్నట్టే కాని ! మా ఆయనను రెండు రోజులు స్వంతంగ వంట చేసుకొమ్మంట! అందరం

ఒకే ఇన్నోవా లో ముచ్చట్లు పెట్టుకుంట కలిసే పోదాం!

మాట ముచ్చట అయితే ఎంగేజ్ మెంటుకూడ అదే రోజు చేద్దామంటవు! జెడ్పీపీ చైర్ పర్సన్ రమ

కూడ గూడ యాల్లకు వస్తదంటవా? నీది మాస్టర్ మైండే! తప్పక పోదాం! పుణ్యకార్యం గదా!

మరి సంజీవ్ కు చెప్పు ! పిలువంగనే పది నిమిషాలల్ల ప్రతిమ గూడ

దోస్తులతోని వచ్చేటట్టు … జగిత్యాల చేరి రెడీగ ఉండుమని చెప్పు! అదే రోజు ఎంగేజిమెంటు తోపాటు అవే ఫోటోలతో వీలైతే అదే రోజు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా చేపిద్దాం. వాల్లను డేటాఫ్ సర్టిఫికేట్ కూడా రెడీగ ఉంచుకొమ్మని సంజీవ్ కు చెప్పు! ప్రతిమకు చెప్పుమను ! ‘‘

వాట్సప్ ల గోదావరి పంపిన మెసేజ్ చూసి సుజాత కు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది.

ప్రోగ్రాం ఫిక్స్ చేస్తూ చింతకింది లచ్చన్న కు, సంజీవ్ కు ,అందరికి ఫోన్లు కలిపింది సుజాత.

( తమ ప్రేమను అంగీకరించలేదని అమ్మా నాన్నల మీద అలిగి

జగిత్యాల పక్కన గల హైదర్ పల్లెలో ఆత్మహత్య చేసుకున్న యువ

ప్రేమికులకు …… మల్లా అలా జరగకూడదని ఆశిస్తూ

కన్నీటితో అంకితం)

-బీ ఎస్ రాములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com