లంబాడి సంస్కృతిని, పట్టుదలను చెప్పే కథ..

రేపు సైట్ ఇన్సి పెక్షన్ ఉన్నది వర్కిన్సిపెక్టర్, ఇంజనీర్ భోజనాలకొస్తరు, వంటకాడికి నువ్వు కూడా పో, వంటలు బాగలేక పోతే, పని కరాబైతది, ఏదో ఒక వంక పెడరు చెరువుకట్ట కట్టుబడిని” అన్నడు జానమ్మ మొగడు రాత్రి అన్నం తిని పండుకునే ముందు.

“అయ్యో ! రోజు నే బోకుంట అంత వంటామె మీద వదలి పెడతన్ననా ! నా కోసమన్న రుచిగ వండుకోవాలి కదా!” అన్నది జానమ్మ. “నిజమే లే,

కానీ రేపు కొద్దిగ జాగ్రత్తగ వండండి. నాటు కోడి కోసి తెస్తడు సారయ్య. మంచిగ మరింత అల్లమేసి వండాలె. పనోళ్ళకు పోసే పప్పుచారు కాకుండా, వేరే చిక్కగ చేయించు, దోసకాయ పచ్చడి, గడ్డ పెరుగు ఉండేట్టు చూడు” అన్నడు.

బుగులే నీకు” అన్నది. అడువుల్ల

రోడ్లేసుడన్నా, చెరువు కట్టలు కట్టుడన్నా మద్దెల దరువే గుమస్తాలకు. గుత్తేదార్లు పట్నంల కూసుంటరు బద్రంగ.

అడవిల అన్నలొచ్చినా , ఆఫీసర్లోచ్చినా గుమస్తాలకే ఉరుకులు పరుగులు.

కమలాపురం అడువుల్ల కామారం దగ్గర చెరువు కట్ట కడతాను. అక్కడ గుమస్తా జానమ్మ మొగడు. తాడ్వాయి దగ్గర కామారంల కొయ్యోళ్ళ ఇంట్ల ఉండుకుంట పని చేయిస్తాండు. .

రోజు పాతిక మంది కూలోళ్ళకు అన్నాలు వండిస్తరు. ఎప్పుడన్నా అన్నలు ఆఫీసర్లోస్తే నీసు కూడ వండుతరు ఇదంత అలవాటే జానమ్మకు.

తెల్లారి మొగడు చెప్పినట్టే దగ్గరుండి జాగ్రత్తగ ఐదారుగురికి సరిపడ వండిచ్చింది. మధ్యాహ్నం మూడింటికి ఇద్దరు ఆఫీసర్ల తోటి వచ్చిండు భోజనాలకు వాళ్ళాయన. అన్ని గిన్నెల్ల పెట్టి ముందల పెట్టింది.

జానమ్మ మొగడు వడ్డిస్తాండు ముందన్నం పెట్టిండు కోడికూరెయ్యబోతే ఒకాయనేసుకున్నడు, ఎర్రంగున్న రెండోయన నేను తినను కోడికూర అన్నడు. అన్నమంత ఇస్తరు మధ్యలకు జరిపి గుంట చేసిండు అండ్ల సాంబారు పొయ్యమన్నడు , అండ్లనే సాంబారేసుకున్నంత పెరుగేసుకున్నడు అంత శ్రద్ధగ పులిహోర కలిపినట్టు కలిపిండు, పక్కన దోసకాయ పచ్చడేసుకున్నడు. వంచిన తలెత్తకుండ విస్తరి ఖాళీ చేసి లేచి చెయ్యి కడుక్కున్నడు.

జానమ్మ మొగడందించిన తువ్వాలతో చేతులు తుడుసుకుంట “భోజనం బాగుందయ్యా చిన్నప్పుడు మా తండాల దేవుడ్ని పెడితే చేసే పప్పుచారున్నట్టు ఉన్నది, గడ్డ పెరుగు

సాంబారు చాలా బాగుంది” అనుకుంట పొయ్యి జీబెక్కిండు.

జానమ్మ మొగడు కూడ ఆయనెనక సీట్ల కూసున్నడు.

జానమ్మ ఆయన తిండిని ఇచిత్రంగా చూసింది. తన ఫ్రెండ్ ధ్యాళి కూడా పెద్దాఫీసర్ అయిందని విన్నది. ఈనె కూడ లంబడాయనా ఇంజనీర్ అయినా తన తండాని మరిచి పోలేదు.

ఆయన మాటలతో గతంలోకి ఎల్లి పోయింది. ఎన్నాళ్ళయింది తన దోస్తు ధ్వాళిని చూడక. తన పెండ్లయి పదేళ్ళయె. ఎన్నిసార్లు పుట్టింటికి పోయినా తన దోస్తు కలవలే.

ఆరోజులు గుర్తుకొచ్చినయి మళ్ళీ. జానమ్మకు.

“వాడీర్ కూండి దేకేరీ చోడ్ దే సస్రు” (వడ్లోల్ల

పిల్ల చూస్తంది వదిలి పెట్టు మామా) అంట గింజుకుంటంది సుక్కి. అప్పుడప్పుడు ఇనపడే చప్పుడే అది. అయినా తలకాయ తిప్పి చూడలేదు జానమ్మ. ఇటువంటివి విన్నప్పుడు చాలా కోపం వస్తది. కని తనేం చెయ్య గలదు. వయసులో వాళ్ళ కంటే చిన్నది వాళ్ళ మనిషి కాదు.

ఆ గుడిసెలుంది లచ్చునాయకుడు ఇంకో ఆడమనిషి.

బాయికాడికొచ్చిన ఆడోల్లతో మాటలు కలిపి ఇంట్లకు పిలుస్తడాయన చిన్నచిన్న పనుల వంకతో , ఎవరు చూడక పోతే బలవంతంగా గుంజుక పోతడు. పెద్ద అరెకరమంత జాగల ఒక చివర ఇల్లు గొడ్లకొట్టం

పంచాయతీ ఆఫీసుకోసం సర్కార్ పక్కాగ డంగు సున్నంతో కట్టిచ్చిన ఒక అర్ర, అండ్లనే లచ్చునాయకుని ఆటలు.

సంగతి తెలిసినా మోతుబరని భయపడతరు, తమూరి సర్పంచ్ అని తండల జనం ఎదురు చెప్పరు. ఇంటింటికొక సారా బట్టి ఉంటది. ఆబ్కారోళ్ళు పట్టుకున్నపుడు ఇడిపిచ్చే దిక్కు వాడే. అందుకని లొంగిపోతరు. ఏదో ఒకటి గొడ్లకొట్టం ఊడ్చమని, గిన్ని శనక్కాయలు ఒలువమని, బియ్యంల పోటెయ్యమన్నంత చిన్న పనే, వాడడిగినప్పుడు వొల్లప్పజెప్పుడు. వాడికది ఆట, చాలామందికది రోత.

అందరికీ తెలిసిన సంగతే అయినా జానమ్మకు నచ్చలేదు.

జానమ్మకే కాదు చిన్నసీతానాయకుని మనవరాలు బాసికి నచ్చలేదు, సోగ్లా కోడలు గోరికి, శక్రు బిడ్డ సక్లీకి, ఔసులోల్ల సుగుణకు, తురుకోళ్ళ యీకుబ్బీకి ఎవరికి నచ్చట్లేదు. వీళ్ళంత ఒక్కీ డోల్లు కాకపోయినా సోపతోల్లు. నీళ్ళకు పోయిన కాడ బట్టలుతికెటందుకు

చెరువుకు పోయినకాడ మాట్లాడుకునేటోల్లు గియన్ని.

బాయికి పోయినప్పుడు తను చూసిన సంగతి అమ్మకు చెప్పిందొకసారి “ఆ ఇచ్చకాయలన్నీ నీకెందుకు. నీళ్ళు చేదుకొని వచ్చేదానికి” అని తిట్టింది. ఇంకెవరికీ చెప్పే ధైర్నం చెయ్యలేదు మల్ల.

గయన్ని ఆలోచించుకుంట బాయి కాడ బొక్కెన కోసం ఎతికింది, కనపడలేదు. చుట్టు చూసింది ఎవరన్నా వస్తున్నరేమో అని. ఎవరొచ్చేట్టు కనపడలేదు.

మళ్ళ మాటలినపడ్డయి. “తమ్మె బోస్సి కూండి కాంయి కరే ? ఒన్నె బళ్ళా ఒన్నే సులా. (ఆగు, వడోళ్ళ పిల్ల ఏం చేస్తది) మొగోడి మాటలు వినపడ్డయి.

జానమ్మకు పూనకం వచ్చింది. “ఈ మోర్దోపు బట్టేబాజ్ గాడు నన్ను కలుపుతాండా” అంతే అగ్గి మీద గుగ్గిలమైంది.

” ఏయ్ నాయకుడా నీ మాటలు ఇనపడ్డయి. అరేయ్ నీ మాటలు ఇన్నరా! నువ్వు చేసేది చూసిన, అందరికీ చెప్తా చూడు” అనుకుంట కిందికి ఒంగి ఒక రాయి తీసుకొని అర్రలకి ఇసిరేసి, ఖాళీ బిందె తీసుకొని ఇంటికొచ్చింది.

జానమ్మ తల్లి ఉత్త బిందెతో వస్తున్న బిడ్డను చూసి తిట్టుడు మొదలు పెట్టింది. “ఏమైంది నీళ్లు అయిపోయినయని ఒర్రంగ ఒడ్రంగ పెద్ద బిందె పట్టినవు, దానితో ముంచబోయి బాయిల మునిగి

ఛస్తవా! అంటె. చిన్నబిందె తీస్క పొయి ఊపుకుంట ఉత్తగొచ్చినవ్ ఏమొచ్చిందే నీకియ్యా ల” అడిగింది.

తల్లిని చూస్తే బాయికాడ జరిగిన సంగతి చెప్పబుద్ది కాలేదు. కోపం పౌరుషం ఏం చెయ్యలో తోచని తనం.

“గొడ్ల మంద ఎదురొస్తంది, ఆ ఎర్రమట్టి దుబ్బల నేను బోను. కొద్దిగాగి మల్ల పోత అరవకే” అనుకుంట. వంట గుడిసెలకు పోయి, మంచినీళ్ల కుండల నీళ్లు, గిలాసతో ముంచుకొని తాగింది. కుండల నీళ్లు అడుగున ఉన్నయి. నీళ్ళు చేదుకొని వచ్చేదుండె. కోపంల ఉత్తగొచ్చింది. వాడన్నమాటలు తలుచుకుంటేనే కోపమొచ్చింది. చిన్నగ నడుచుకుంట ఇంటెనకున్న కుంకుడు చెట్టు కిందికి చేరింది చికాగ్గా,

జానమ్మకు కోపం వచ్చినప్పుడల్ల కుంకుడు చెట్టు కిందికి పోద్ది, దాని కింద ముత్తాలమ్మ గుడి ఉంది. కుంకుడాకులు తెంచి పొరక పుల్లలు, తుమ్మముళ్ళు గుచ్చి చిన్న చిన్న ఇస్తరాకులు, దొప్పలు కుట్టడం ఇష్టం తనకు. గవి చూసి చిన్న బొప్పివా బొమ్మలాటలాడెటందుకని, తల్లి తిడతది. అట్ల తిట్టకుండా ఉండేటందుకు చెట్టు కింద రాలిన కుంకుడు కాయలు కొన్ని ఏరుకొని తెచ్చేది. ఇప్పుడు కాయలు చెట్టుకింద లేవు.

రాయితో కాయలు రాలగొట్టి ఏరుకొని ఇంటికి వచ్చింది.

జానమ్మ కనపడంగనే తల్లి మళ్లీ మంచినీళ్ల గోల మొదలు పెట్టింది. జానమ్మకు నీళ్ల బాయికాడికి పోవాలనిపించటం లేదు.

కానీ తప్పదు మంచినీళ్లు కావాలి. బిందె పట్టుకొని సర్కార్ బాయికాడికి బయలెల్లింది.

ఏబై గుడి సెలున్న ఆ తండా మధ్యలో బాయి తవ్వించి, చుట్టూ ఎత్తుగోడలు కట్టించి, రెండు వైపుల గిరకలు పెట్టిచ్చింది సర్కార్, ఆ తండాలో ఉండే జనం తాగేటందుకు. ఆ చుట్టు పక్కల రెండు మూడు తండాలకు అదొక్కటే మంచి నీళ్ళబాయి.

ఆగస్టు నెల అది. నిండుకుండోలె చేతికందేటట్టు బాయి నిండా నీళ్లున్నయి.

ఒక్కో తడవ చేదెయ్య కుండనే బిందెతో నీళ్లు ముంచుతది జానమ్మ. తనకట్ల ముంచడం ఇష్టం.

కానీ అది పెమాదమని “ఎప్పుడో అండ్ల మునిగి చస్తవే” అని తల్లి తిడతది. ఆలోచిస్తా బాయి వైపు నడుస్తున్న జానమ్మకి దూరం నుండే బాయి చుట్టూ జనం కనపడ్డరు. ఏమైందోనని గబగబ బాయి కాడికి చేరింది. ఎవర్నడగకుండనే జరిగింది అర్థం అయ్యింది. ఏ యాడీ, ఏ

బాయి, ఏ బియ్యా అనుకుంట గోలగోలగున్నది.

సుక్కి బాయిల పడ్డది, నీళ్లు ముంచ పోయి అందులో మునిగింది. ఇంకా బయటకు తీయలేదు, అడుగు పట్టిందేమో అంటన్రు.

జానమ్మకు గుండె గుబెల్లుమన్నది. తాను చూసినందుకో! లేకుంటే అందరికీ చెప్తన్నందుకో! భయపడి చచ్చిపోయిందేమో!. అయ్యో తను చూసినందుకు ఒక మనిషి చచ్చిపోయిందా! వాడు చంపేసిండా ? అనుకుంది. దూరంగ లచ్చు నాయకుడు పెద్ద పెద్దగా జీతగాళ్ళ మీద అరుస్తండు.

“మోకులు, పగ్గాలు తెండ్రా. ఇంకెంత సేపు చూస్తరు, బయటకు తీయండి, పానం అంటే లెక్కలేదా” అంటూ హడావుడి చేస్తున్నడు.

జానమ్మ అటుకెల్లి చూసింది, అప్పుడే వాడు కూడా జాసమ్మ కెల్లి చూసిండు. వాడి చూపులు ఆమెను భయ పెట్టినయి. తలొంచుకొని ఇంటికి వచ్చింది. తల్లి మళ్లా అరుసుడు సురూ చేసింది.

” ఏమొచ్చిందే ఉత్త బిందెతో మల్లెచ్చీనవు”అంట.

” ఎవరో లంబడామె బాయిల బడి సచ్చిందట. చుట్టూ జనం ఉన్నరక్కడ” అన్నది చిన్నగ.

“అంత చిన్నగా చెప్తన్నవు, ఎవరో చచ్చిన్రని, ఇప్పుడు మనకు నీళ్లెళ్లా”.

తల్లి గోల తల్లిది మళ్ళీ వంట గుడిసెలకు పోయి నీళ్ల కుండలనించి గిలాసెడు నీళ్లు ముంచుకొని గట్టగట్ట తాగింది, అయినా భయం తగ్గలేదు. బిందె అందుకొని సలివాగు దారి పట్టింది.

బిందె పట్టుకొని నడుస్తున్న జానమ్మకు దార్ల ఔసులోల్ల సుగుణ కలిసింది. సుగుణ జానమ్మ దోస్తే. ఇద్దరు కలిసి మూడుమైళ్ళ అవతలున్న సలివాగుకు పొయి బిందెల నిండా నీళ్ళు నింపు కొని, ఎవరింటికి వాళ్ళు యిన్రు. దార్ల ఏం మాట్లాడకుంట నడుస్తన్న జానమ్మను, “ఏమయిందట్లున్నవని” సుగుణ గుచ్చి గుచ్చి ఎన్ని మాట్లడిగినా, అమ్మ తిట్టిందిలే అన్నది. ఎవరికేం చెప్పబుద్ది కాటల్లే జానమ్మకు. బుగులు బుగులుగున్నది.

మసగపడ్డంక గాసునూనె దీపంబుడ్లు పాతగుడ్డతో తుడిచి గాసునూనె నింపి ముట్టిచ్చింది. తల్లి వంట చేస్తాంది. నాయిన దీపం బుడ్డి కాడ కూసోని బీడి తాగుకుంట పెన్సిల్తో అప్పుల లెక్కలు రాస్తండు. “ఇగో ఆర్నెల్లల రెండొందల

అప్పయింది, ఇంటన్నవానోయ్” అని పిలిసిండు పెళ్ళాన్ని,

జానమ్మ తండ్రికి అప్పంటే భయం.

“అబ్బో మలావయింది, తీర్పక పోతే గుండ్లెత్తుతరు నీకు” అంట ఎక్కిరించు కుంట బయటికొచ్చింది. “పావే జానమ్మ” అని. “ఇగో తలుపేసుంచు, సప్పుడయితే సూడు పిల్లి తిరుగుతాంది. రోజు లెక్కలేత్తే అప్పు తీరది, మేం బయట్కి పోతన్నం”

అనుకుంట నీళ్ళున్న పెద్ద పెద్ద ఇత్తడి చెంబులు చెరొకటి పట్టుకొని డొంక దారి పట్టిండ్రు తల్లి బిడ్డలు.

వాళ్లు తిరిగొచ్చే టారికి ఇంటి ముందల జనం గుమిగూడిన్రు.

జానమ్మ తండ్రి పంచె సర్దుకుంట ఎవర్చో తిడతాండు గుడంబ తాగి పెండ్లాల కొడతరు మురికి బడ్లు” అంటాండు మాంచి కోపమ్మీదున్నడు.

ఎదురుంగ భద్రి జుట్టంత లేచి పోయి, లేవలేక కూసోని “యాడీయే మన్నె మారేరో హీడా! తార్ నామ్ బుడ్డా! మార్ హాత్ తోడేరో”(వామ్మో నన్ను సావగొట్టిండే, నీ పేరు మునిగిపోను, నా చెయ్యి ఇరగొట్టినమ్రా) అంట రాగాలు పెడతాంది. వాళ్ళల్లో తండ్రినైనా అన్ననైనా మొగుడినైనా ‘అరె’ అంటరు. ‘ఏ బా ఆరే’ ఓనాన్నా రారా” రకారం తప్పుకాదు వారి జాతిలో.

పక్కనే భద్రి మొగడు తడిసిన బట్టలతో కూలబడి భద్రికెల్లి సూసుకుంట” బోస్పి రోమత్, మనె అంగోళి కరె కోని కేన్ మార్ పరువు నికాళేన్ మార్ కాయి బోలేరో అంగోళి, బోల్డోర్ టాండ్ర సారె ధారూర్ నిసా ఉతాఫ్ట” (ఏడ్వకు నేను స్నానం చెయ్యట్లేదని అందరికీ చెప్పి నా పరువు తీసినవ్, తన్నులు తిన్నవ్ తాగిన నిషా అంత దిగిపోయింది) అంటాడు.

భద్రి కొడుకు ఐదేండ్లోడు తల్లిని పట్టుకొని “ఏ యాడి రో మతే బూక్ లాగో ధళయా దే యాడీ”

(ఓ అమ్మ ఏడ్వకే, ఆకలయితాంది బువ్వేద్దువురా) అని ఏడుస్తాండు. సంగతర్థమయింది

జానమ్మకు, తండ్రి చేతుల కట్టె పేడు పట్టుకొని అట్లనే ఉన్నడు.

తండ్రి కోపంగుంటె తల్లి నోరెత్తదు. బయట గాబు కాడ కాళ్ళు కడుక్కొని ఇంట్లకు బొయ్యింది తల్లి.

జానమ్మ భద్రి కాడి కొచ్చి నువ్వు సారొండకుంట ఉంటె, నీ మొగడు తాగడు నిన్ను కొట్టడు కదనే ఆన్నది.

“యాడియే ఊకో జానమ్మ. నేనొండక పోతే తండల కరువు పోయింద సార , తినే జొన్నలు ఎత్తక పొయ్యి సారదా గొస్తడు వాడు. వాడినిప్పుడు అంగోళి చెయ్యమని ఉడుకు నీళ్ళు పెట్టిన గందుకు కట్టె తీస్కొని ఉరికిచ్చి కొడతాండు. మీ నాయన అడ్డం రాకుంటే సంపేసును” అని ఏయాడి లని రాగాలు మొదలు పెట్టింది.

ఎవరో వచ్చి భద్రిని లేపి ఆమె గుడిసె కెల్లి తీసక పొయిన్రు.

జానమ్మ తండ్రి కట్టె పేడు ఆడ పారేసి “లే లే , లేసి ఇంటికి పొయ్యి నీళ్ళు పోసుకొని పొడి గుడ్డలు కట్టుకుపో. నీళ్ళు పోసుకోమంటె పెండ్లాన్ని కొడతరారా తిక్కల సన్నాసి” అని గద్దిస్తే తడిచిన బట్టలతో లేచి గొనుక్కుంట సోలుక్కుంట గుడి సెకెల్లి పొయ్యిండు భద్రి మొగడు. జానమ్మకు ఇదంతా రోజు చూసేడిదే అయినా చికాకుగ ఉంది. పొద్దున జరిగింది మళ్ళీ గుర్తుకొచ్చింది అన్నం తిన బుద్ది కాలే. ఆ భయంల, చికాకుల కూడా తండ్రి భద్రి మొగణ్ణి తిట్టిన తిట్టు అర్థం కాలేదు. ఆమె ధ్యాస ఆ మాట మీద పడ్డది. తల్లి దగ్గరకు నడిచింది.

తల్లి సాపలేసి పక్కలు పరుస్తాంది. తండ్రి అన్నం తిని బయట కూసొని బీడి కాలుస్తాండు.

అమ్మా అని పిలిచింది. ఆం ఏమాదికొచ్చింది ? తిండి తినలేదు ఆకలైతది. ఆ గిన్నెల గంజున్నది ఇంత ఉప్పుగల్లేసుకొని తాగుపో అన్నది.

పోపో బోల్లిప్పుడు తోముతవా పొద్దుగల్ల తోముతవా?” పని పురమాయించింది తల్లి”

“పొద్దుగాల తోమలే” అనుకుంట సాప మీద ముడుసుకొని పండుకుంది. నిజమే ఎన్నడు జాస పెట్టలే. గిదేం ఆచారం అనుకున్నది. రేపెల్లుండి కిట్టునాయకుని బిడ్డ ధ్వాళి పట్నంకెల్లస్తది అన్ని అడగాలె అనుకుంది.

ధ్వాళి హాస్టల్ల చదువుకోసం పోయింది. ఇద్దరు కలిసి ఏడో తరగతి వరకు సదవుకున్నరు. మంచి దోస్తులు.

సెలవులకొచ్చినప్పుడల్ల ధ్వాళి జానమ్మింటికొస్తది. ఇద్దరు కలసి ధ్వాళి వాళ్ళ మిరపతోట కాడికో, మామిడి థితో వారు తాము భూములు లేవు తండ్రి వడ్రంగం చేస్తడు.

జానమ్మ ఎదురు చూసిన ఆదివారం వచ్చింది. ధ్వాళి కూడ వచ్చింది. ఇద్దరు మామిడి తోటలకు పోయిన్రు ముచ్చట్లాడటానికి. ధ్వాళి తన హాస్టల్ సంగతులు చెప్పింది. “మా హాస్టల్ ఇన్సి పెన్షన్ కు ఆఫీసరు వచ్చిండు. వాడు మా ఆడ పిల్లల్ని అవి ఇవి అడుక్కుంట భుజాల మీద ఆడీడ చేతులేసిండు. మా వార్డెన్ చూస్తనే ఉంది , ఏ మంటలే? వాడేమో మీ వార్డెన్ ప్యాడ్లు ఇస్తందా హిహి ఇంటికి కొంటపోతందా హిహి అనుకుంట ఎకిలెకిలి చేసిండు” అన్నది ధ్వాళి.

“మరి మీ వార్డెన్ ఏమనలేదా?” అనడిగింది జానమ్మ.

“వాడామె సుట్టమట ఏమంటది. మా వార్డెన్ మాకు ఇవ్వాలిసిన గుడ్డు స్వీట్లు అన్ని ఇంటికి తీసుకపోతది. పైగా నేను మంచిదాన్ని. వేరే వార్డెన్లయితే ఇండ్లల్ల పనిచేయించుకుంటరు , ఆఫీసర్ల రూములకు పిల్లలను పంపుతరని చెప్పుద్ది” అన్నది ధ్వాళి.

జానమ్మకు సుక్కి యాదికొచ్చింది. జరిగిందంత ధ్వాళికి చెప్పింది.

“ఔను మాకు పెదనాయినయితడు సర్పంచి. వాడి సంగతందరికి తెలుసు. ఎవరేమనరు , పోయినేడాది సోషీ కోడలు వాడు సెయ్యబట్టే బాయిలపడి సచ్చింది” అన్నది ధ్వాళి.

“ఔను కని మీకు భూములున్నయి, పదవులున్నయి, సదువులున్నయి గీ గలీజేంది” అన్నదీ

జానమ్మ. “ఏం గలీజు మాదికూడా రాజుల

జాతే రాజపుత్ వంశం మాది. భూములు, ఎకరాల కొద్దిపొలాలు ఉన్నవాళ్ళు భూస్వాములో తిగ దొరలోతిగ బుద్దులు జూ పెట్టుకుంటరు. భూములు లేనోళ్ళు పశువుల మందలతో సంచార జాతులుగా తిరుగుతుంటరు. మాదాంట్ల లేనోడున్నడు ఉన్నోడున్నడు. ఉన్నోడు లేనోడిని పీడించుడున్నది. ఏం చేస్తాం” అన్నది విచారంగా ధ్వాళి.

“అది సరే. బయిలుకు పోతే ఆకులే వాడుతరట కదా. గిదేందబ్బా” జానమ్మ.

సిగ్గనిపచ్చింది ధ్వాళికి. అయినా దోస్తేగా అనుకుంది.

“చెప్పిన కదా ! మాది సంచార జాతి, రాజపుత్లమని. అంటే రాజస్థాన్ మా ప్రధాన స్థానం. నీటికోసం మైళ్ళ కోసం ప్రయాణం చెయ్యాలి. నీటి ఎద్దడిని ఎదుర్కొనే అలవాట్లలో ఇదొకటయ్యుంటది. మా వాళ్ళు ఇంకా అట్లుండుడు చికాకే. కొందరు మారుతున్నరు శుభ్రంగా ఉంటున్నరు. మిగిలినోళ్ళు కూడ మారతరు, ఒకళ్ళను చూసొకళ్ళు” అన్నది.

మళ్ళీ తనే “నేను బాగ చదువుకొని కలెక్టర్ అయితా వీళ్ళందరికీ ఇంటింట పాయఖానాలు కట్టిస్తా” అన్నది ఆలోచిస్తా.

“మరి మాకు కట్టిచ్చవా” అడిగింది జానమ్మ.

“ఎందుకు కట్టించను? ఐనా నువుకూడా చదువు కోవచ్చు కదా! నువ్వాఫీసరైతే నువ్వు కూడా ఏదంటే అది చేయచ్చు” అన్నది ధ్వాళి.

“ఔను నేను పోలీసు సర్పంచను పట్టక పోతా. బొక్కలిరగొట్టి టానాల పెడతా” అని.

మళ్ళీ నీరసంగా “ఈ ఏడు నాకు పెండ్లి చేస్తరట మా వాళ్ళు” జానమ్మ.

“అయితే ఈ సారి తీజ్ పండగకు బాగ ఆడుకోవాలె. మళ్ళ కలుస్తమో లేదో నీ పెళ్ళయితే” అన్నది ధ్వాళి. “ఏ ధ్వాళి తార్ యాడి బళ్ళారి( మీ అమ్మ పిలుస్తాంది)” అనుకుంట వచ్చిండు వాళ్ళ జీతగాడు. దోస్తులిద్దరు ఇంటి దారి పట్టిన్రు.

“అమ్మా… అమ్మా…. “

వంటామె పిలుపుకి ఈలోకంలకు వచ్చింది. “వంటలు చాలా మిగిలినయి.

రాత్రికి పనోళ్ళకు మాత్రం వండితే చాలు బియ్యమియ్యండి” అంటాంది.

జానమ్మ ఆలోచిస్తూ లేచింది. బియ్యం వంటా మెకిచ్చి వచ్చి టీవీ పెట్టింది వార్తలొస్తున్నాయి.

వార్తల్లో “జిల్లా కలెక్టర్ ధ్వాళి నాయక్ మరుగుదొడ్లు లేని ఇండ్లకు రేషన్ కార్డులు రద్దు చేస్తారని ప్రకటించారు. పల్లెల్లో తండాల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వం మరుగుదొడ్లు మంజూరు చేసింది”. టీవీలో తన దోస్తు ధ్వాళిని చూపిస్తూన్నరు.

“ఎంత బాగుందో ! తన దోస్తు… అనుకున్నది సాధించ గలిగింది కదా” జానమ్మ తనే కలెక్టరైనంత సంబరపడ్డది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com