నాటి కవి ఆత్మ విశ్వాసం…

సన్నయాదుల పురాణయుగం, పెద్దనాదుల ప్రబంధ యుగం మధ్యన సంధి కాలంలో జన్మించి రాణించిన కవుల్లో పేర్కొనదగిన ప్రౌఢకవి సార్వభౌముడు శ్రీనాథుడు కాగా యువకవి కిశోరంగా నిలిచి ‘వాణి నారాణి’యని కీర్తిగాంచిన వాడు పిల్లలమఱ్ఱ పినవీరభద్రుడు. 15వ శతాబ్ది మధ్య కాలంలో పినవీరన తెలంగాణ సూర్యాపేట సమీపమందలి పిల్లల మట్టిలోనే జన్మించిన కారణాన తెలంగాణ కవిగానే పరిగణించాలి. కాని ఆయన చిరకాలంగా ఇక్కడ నివాసమున్నట్లు ఏ ఆధారాలూ లేవు. అతని అన్నయైన పెదవీరన సాళువ నరసింహరాయల సామ్రాజ్యంలో పెద్ద పదవిలో వున్నందున తన సాహితీ జీవనప్రాభవంకై పినవీరన విజయనగరం వెళ్లివుంటాడు. రాజాశ్రయం పొంది, అతనికిష్టమైన “జైమిని భారతం” రచించి అంకిత మొసగి సకల సౌఖ్యాలతో జీవించి వుంటాడు. అట్టి సౌఖ్యాల వల్లనే అలసత్వం ఏర్పడి, రాజు నిర్దేశించిన గడువులో జైమిని

భారతాన్ని ఆంద్రీకరించక, చివరకు రాత్రికి రాత్రి పూర్తి చేసివుంటాడు, శారదాదేవి కటాక్షంతో. కావున అందరూ ఆశ్చర్యచకితులై అతన్ని ప్రశ్నించగా “వాణి నారాణి” యని వెల్లడించి వుంటాడు. వెంటనే అది విస్తృత వ్యాప్తి చెంది వుంటుంది.

కాని పినవీరన ఉద్దేశ్యం. లోక వ్యవహారంలోని తన రాణియన్న భావం కాదు – తన భారతీమంత్రాధిష్టాన దేవతయైన సకల సారస్వత రాజ్ఞయని. పినవీరన గురువు భారతీ తీర్థులు. (శృంగార శాకుంతలంలో స్తుతి పద్యముంది) కావున శారదోపాసకుడై వాగ్గేవిని ఆరాధించి, అలవోకగా కవితలల్లగలిగిన నైపుణ్యం గడించి వుంటాడు. అందుకే తన వాణికి ఆ విద్యలరాణి అనుగ్రహమే కారణమన్న

భావంతోనే “వాణి నారాణి” యని సభక్తిగానే చాటి వుంటాడు. అందుకు నిదర్శనంగా ఆయన అల్లిన ఈ శారదాస్తుతి పద్యంనే చూపవచ్చు.సీ. ప్రణవపీఠమున మంత్ర పరంపరలు గొల్వ నుండు నేదేవి పేరోలగంబుభావజ్ఞులకు బరాపశ్యంతి మధ్యమా వైఖరులేదేవి వర్ణసరణి

జపహార, కీర, పుస్తక విపంచి సమంచి తంబు లేదేవి హస్తాంబుజములు

కుందేందు మందార కందళీబృందంబు చందమే దేవి యానందమూర్తి తే. కాంచె నే దేవి కాంచన గర్భచతుర పూర్వదంత కవాట విస్ఫుట మనోజ్ఞ చంద్రకాంత శిరోగృహస్థల విహార మమ్మహాదేవి వాగ్గేవి నభినుతింతు (1-5)

ఈ విధంగా పినవీరన వాణిని వాగ్గేవిగా స్తుతించినా, తర్వాత కవులంతా పొరపాటున అతని రాణిగానే అతడు పలికినట్లు భావించి అంటగట్టారు. పినవీరభద్రుడు రచించినట్లు పేర్కొనబడిన అవతార దర్పణం, నారదీయం, మాఘమాహాత్మ్యం, మానసోల్లాససారం ఏమైపోయాయో కాని మనకు లభ్యమైన కృతులు రెండే రెండు.

అవి. 1. శృంగార శాకుంతలం 2. జైమిని భారతం

మొదటి “శృంగార శాకుంతలం” కావ్యాన్ని సోమరాజుపల్లి రాజుయైన చిల్లర వెన్నయామాత్యునికి అంకిత మిచ్చినట్లు తెలుస్తున్నది. నాలుగు ఆశ్వాసాలుగా విరచితమైన ‘శాకుంతలం’లోని ప్రథమాశ్వాసంలో హస్తినాపుర వైభవం,దుష్యంతుని మృగయా వినోదం

మొదలగునవి; ద్వితీయాశ్వాసంలో దుష్యంతునివేట, శకుంతలావృత్తాంతం – ఆమెను దుష్యంతుడు గాంచి మోహించటం మొదలగునవి చోటుచేసుకున్నాయి.

తృతీయాశ్వాసంలో దుష్యంతుడు – శకుంతలకు కలిగిన విరహావస్థలు, ఆ తర్వాత వారి గాంధర్వ వివాహం, దుష్యంతుడు రాజ్యానికి తిరిగి వెళ్లడం వర్ణించబడ్డాయి. మచ్చుకు ఇందలి పద్యమొకటి, దుష్యంతుడు శకుంతలను దర్శించిన సందర్భంగా, గమనించ వచ్చునిలా –

సీ. సురకన్య కాబోలు, సురకన్యయయ్యెనే రీవిమైజెప్పలాడించుటెట్లు?

పుత్తడి కాబోలు, పుత్తడి యయ్యెనే – హంసీగతుల నడయాడుటెట్లు?

వనలక్ష్మి కాబోలు, వనలక్ష్మి యయ్యెనే – గటివల్కలంబులు గట్టుటెట్లు?

రతిదేవి కాబోలు, రతిదేవి యయ్యెనే – వలరాజు నెడబాసి వచ్చుటట్లు?

తే.గీ. కన్నుగవయార్చుటకును సుకన్యకాదు

నడచి యాడెడుగాన బుత్తడియుగాదు లలిద పశ్చిహ్నమునవనలక్ష్మి కాదు

ప్రసవశరముక్తయైనది రతియుగాదు (2-56)

తన కావ్యంలో శ్రీనాథుని ‘సదసత్సంశయగోచరోదరి’ పద

ప్రయోగాన్ని ఆదరంతో స్వీకరించడమే గాక పినవీరన శ్రీనాథుని సీసపద్య రచనా విధానాన్ని కూడ అనుసరించి నట్లుతోస్తుంది. తుమ్మెద శకుంతల వదనారవిందాన్ని, అధరామృతాన్ని ఆస్వాదించనెంచి ఆమెను వేధిస్తుంటే, దుష్యంతుడు ఆ తుమ్మెదను నిందించక తిలకిస్తూ

మ. వనితం జంచదపాంగ జేసి కనుగ్రేవల్ ముట్టుచుంజేరి మం

తనముం జెప్పెడు భంగి నొయ్య జెవి చెంతన్ మ్రోయుచున్ మెల్లమె

ల్లన మోవిన్ రతి సౌఖ్య సంపదల

గొల్లల్ గొంటి ధన్యుండ వీ

వనఘా! తుమ్మెద! నేను వెల్వడితి దత్వాన్వేషముంజేయుచున్!

అంటూ తనకు లభించిన ఆ అదృష్టము తుమ్మెదకు దక్కినట్లుగా భావిస్తాడు.

లభ్యమైన పినవీరన రెండవ కృతి ‘జైమిని భారతం’. దీన్ని రచించి, తన వంశస్థులైన పాండవుల ప్రశస్తినిప్రస్తుతించవలసిందని సాళువ నరసింహరాయలు నాటి రాజరాజ నరేంద్రుని వలె కోరగా, నన్నయ్యలా పినవీరన కురుక్షేత్ర విజయానంతర గాథయైన అశ్వమేథ వృత్తాంతముతో కూడిన ‘జైమిని భారతం’ను 8 ఆశ్వాసాల ప్రబంధంగా ఆంద్రీకరించి అంకితమిచ్చాడు. పాండవ మధ్యముడైన అర్జునుడి దిగ్విజయ యాత్ర ఇందులో వర్ణించబడింది. అర్జునుడు అన్ని దిక్కులా విజయం సాధించినా, మహిళా రాజ్యాధినేత్రియైన ప్రమీలను మాత్రం జయించలేకపోతాడు. అప్పుడామె చేత పినవీరన పలికించిన పద్యం –

చ. కనుగొని నన్ను నా హవ ముఖంబున మార్కొని నిల్వనీక కా

దనిమిష సిద్ధ సాధ్యులకునైన నసాధ్యము కార్యకాంక్ష నె మ్మనమున గల్డెనే దురభిమానము మాని ప్రియంబేలర్పన

న్నెనసిన వేడ్కతోడ వరియింపు హయంబు బరిత్యజించెదన్ (5-116)

తే. సోమపానంబు నీయ గ్రజుండొనర్చి యిష్ట ఫలభోగముల బొందనిమ్ము

నీవు

నిటమదీయ ధరామృతం బెలమిగ్రోలి

యువతి మండలమున కెల్లనొడయడగుము (5-117)

అని ప్రమీల అర్జునుడు తనను పరిణయ మాడి అధరామృతం

గ్రోలనెంచినచో, గుజ్రాన్ని వదిలెదననగా ఆకాశవాణి సూచనమేరకు అర్జునుడు ప్రమీల పాణిగ్రహణం చేస్తాడు. గుర్రాన్ని చేబూని ముందుకు సాగుతాడు.

చివరలో అశ్వమేధయాగానంతరం, అతివలు భీమపాకాల్ని అతిథులకు వడ్డిస్తుంటే, అమాయక విప్రులు తెగిన జంధ్యపు పోగులు మాకెందుకు? అని ప్రశ్నిస్తుంటే వాళ్లు నవ్వి అవి జంధ్యపు పోగులు కావు – కమ్మని ‘సేమియాలు’ అంటూ బదులివ్వడం, అలాగే

మోదకముల (లడ్డూల) గూర్చి వివరించడంలో పినవీరన మన తెలుగు వంటకాల్ని సీసపద్యంలో పొందుపరచడం విశేషం!

తమ తాతముత్తాతలు రాజమండ్రి ప్రాంతమందలి మడికి గ్రామానికి చెందిన వారు కాగా, సింగన (కరీంనగర్) సబ్బి నాటి మండల మందలి రామగిరి రాజుల నాశ్రయించి తెలంగాణ కవిగా తేజరిల్లినట్లుగా, పినవీరభద్రుడు సూర్యాపేట ప్రాంతమందలి పిల్లలమట్టిలో జన్మించి, విజయనగర

ప్రభువులనాశ్రయించి విఖ్యాతిగాంచాడు. పుట్టకతో జన్మహక్కు ఏర్పడుతుంది కాబట్టి, పినవీరభద్రుడిని తెలంగాణ వాడిగా చెప్పక తప్పలేదు యిలా. ‘వాణి – నారాణి’ అన్న ఆయన అసలు ఆంతర్యం కూడ విశ్లేషించవలసి వచ్చింది విధిగా. “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com