పీవీ నరసింహారావుగారి గురించి మాట్లాడుకునేముందు ఒక చారిత్రకవిశేషాన్ని చెప్పుకోవాలి. ప్రాచీనకాలంలో కానీ, మధ్యయుగాలలో కానీ ఢిల్లీ రాజధానిగా దేశం మొత్తాన్ని ఒక రాజవంశం, లేదా ఒక వ్యక్తి పరిపాలించిన ఉదాహరణ లేదు. బ్రిటిష్ పాలకులకు కూడా ఆ అవకాశం పూర్తిగా లభించలేదు. అప్పట్లో అయిదువందలకు పైగా సంస్థానాలు ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే దేశం మొత్తాన్ని ఏలే అవకాశం పాలకులకు లభించింది. ఉత్తరభారతం నుంచి ఆ అవకాశం పొందిన తొలి వ్యక్తి ‘పండిట్’ జవహర్లాల్ నెహ్రూ అయితే, దక్షిణభారతం నుంచి ఆ అవకాశాన్ని అందుకున్న తొలి వ్యక్తి ‘పండిత’ పీవీ నరసింహారావు. ఇంకా మరెన్నో విషయాలలో వారి మధ్య పోలికలు కనిపిస్తాయి. తమ రాజకీయ, పరిపాలనా జీవితంలో కొన్ని మౌలిక ఆలోచనలు చేసినవారుగా, సంస్కరణశీలురుగా ఇద్దరూ పేరుపొందారు. దేశం స్వతంత్రమై ఫెడరల్ స్వభావం కలిగిన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని తెచ్చుకుని సరికొత్త ఆశలతో, వినూత్నమైన మార్గంలో అడుగుపెట్టబోతున్న కీలకఘట్టంలో దేశానికి దిశానిర్దేశం చేసే అవకాశం నెహ్రూకు లభించింది. అలాగే, బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన స్థాయికి దేశఆర్థికత అణగారిపోయిన దశలో సత్వరచర్యలు తీసుకుని ఆర్థికపరిస్థితిని చక్కదిద్దే అవకాశం పీవీకి లభించింది. సాహిత్యాభిరుచిలోనూ, రచనలు చేయడంలోనూ కూడా నెహ్రూ, పీవీల మధ్య పోలిక చక్కగా కుదురుతుంది. అప్పట్లో అంతర్జాతీయంగా నెహ్రూకు ఉన్నంత ప్రతిష్ఠ కానీ, అంతర్జాతీయవ్యవహారాల మీద నెహ్రూకు ఉన్నంత పట్టు కానీ మరెవరికీ ఉండేవి కావు. కొత్తగా స్వతంత్రమవుతున్న దేశానికి ప్రపంచదేశాల గుర్తింపు, సహకారం లభించడానికి నెహ్రూకు గల ఈ రెండు అర్హతలు తోడ్పడతాయని భావించడం వల్లనే ఆయన ప్రధానమంత్రి కావాలని గాంధీ కోరుకున్నట్టు చెబుతారు. విశేషమేమిటంటే, అంతర్జాతీయవ్యవహారాలలో పీవీ పరిజ్ఞానం కూడా అంతటిదే. ఒక సందర్భంలో ఆయనను కలుసుకుని అంతర్జాతీయవ్యవహారాలను సుదీర్ఘంగా చర్చించే అవకాశం పొందిన ప్రముఖ పాత్రికేయుడు శేఖర్ గుప్తా ఆ తర్వాత ఒక వ్యాసం రాస్తూ, భారతప్రధానమంత్రులలో నెహ్రూ తర్వాత అంతటి అంతర్జాతీయవిషయాల నిపుణుడు పీవీ నరసింహారావే నని అంటారు. అంతేకాదు, జాతీయనాయకులు అందరిలోనూ నెహ్రూ ప్రభావమే పీవీపై ఎక్కువ ఉన్నట్టు, ఇంచుమించు ఆయన ఆత్మకథగా చెప్పదగిన ‘ది ఇన్ సైడర్’ (తెలుగులో ‘లోపలి మనిషి’)ను చదివితే అర్థమవుతుంది. తన తండ్రి మరణం తర్వాత, నెహ్రూ మరణమే పీవీని ఎక్కువ చలింపజేసినట్టు కనిపిస్తుంది. ఆ ఇరువురి మరణఘట్టాలను ఎంతో విస్తృతంగా ఆయన చిత్రించారు. ‘లోపలి మనిషి’లోని కరుణరసార్ద్ర ఘట్టాలలో అవి ప్రముఖస్థానం వహిస్తాయి.
‘మాలోని మనిషివే, మా మనిషివే…’
పీవీ నరసింహారావు ప్రధానమంత్రి కావడం, ఒక మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ అయిదేళ్లపాటు దేశానికి సుస్థిరపాలనను అందించడం తెలంగాణకే కాకుండా, రెండు తెలుగురాష్ట్రాలవారికీ గర్వకారణమే. రాజకీయ, పరిపాలనా రంగాలలో ఉన్న ఇప్పటి నాయకులకు, రేపటి నాయకులకూ కూడా మార్గదర్శకం కాగల నిండైన జీవితం ఆయనది. ‘ది ఇన్ సైడర్’ అనువాదకునిగా వారిని అనేకసార్లు కలుసుకునే అవకాశం నాకు లభించింది. మొదటిసారి కలిసినప్పుడు చెరబండరాజు రాసిన ఒక పాటలోని చరణం గుర్తుకొచ్చింది. ఆయన అప్పటికి మాజీ ప్రధాని అయ్యారు. దేశంలోనే అత్యున్నత పదవిని నిర్వహించిన ఒక వ్యక్తిని మొదటిసారి కలుసుకునే ముందు సహజంగానే ఎవరికైనా కాస్త జంకు కలుగుతుంది. అలాగే నాకూ కలిగింది. తీరా ఆయన సంభాషణ ప్రారంభించాక నాలో జంకు పోయింది. పలకరింపులు, పరిచయాలు అయిన తర్వాత నేరుగా ఆయన నాతో సాహిత్యం గురించి, అందులోనూ అనువాదవిధానాల గురించి ముచ్చటించడం ప్రారంభించారు. విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’ నవలను తను ‘సహస్రఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించడం గురించి చెప్పుకొచ్చారు. ప్రచురణకకర్తలు పుస్తకం మరీ పెద్దదిగా ఉందని, కుదించాలని అన్నారట. తను విశ్వనాథవారితో ఆ మాట అంటే ఆయన ససేమిరా, వల్లకాదు అన్నారట. అప్పుడు ఎలాగో ఒప్పించారట. ఆ విధంగా హిందీ అనువాదంలో మూలం 500 పేజీల మేరకు తగ్గింది. నేను పత్రికారచయితనే కాకుండా సాహిత్యనేపథ్యం ఉన్నవాడిని కనుక నేను వెంటనే ఆయనతో కనెక్టై సంభాషణలో స్వేచ్ఛగా పాలుపంచుకోవడం ప్రారంభించాను. చెరబండరాజు పాట చరణం గుర్తు రావడానికి అదే కారణం. “మాలోని మనిషివే, మా మనిషివే నీవు, పొట్టకూటికి నీవు పోలీసువైనావు” అంటాడు ఆ పాటలో చెరబండరాజు. ఆ చరణాన్ని నేను సవరించుకుని పీవీగారికి అన్వయించుకుంటూ ఇలా అనుకున్నాను: “మాలోని మనిషివే, మా మనిషివే నీవు, (పొరపాటున?)పొలిటీషియనువైనావు”.
నేను చెరబండరాజు ప్రస్తావనతో మొదలుపెట్టడానికి ఇంకో కారణం కూడా ఉంది. నేను శ్రీశ్రీ, దిగంబరకవులు, విప్లవకవులు, అస్తిత్వవాదుల తరానికి చెందినవాణ్ణి. స్వాతంత్ర్యం కల్పించిన ఆశలు భ్రమలుగా తేలిపోవడం మా తరానికి కొంచెం ముందునుంచే మొదలైంది. పీవీగారు స్వాతంత్ర్యోద్యమతరానికి, స్వప్నాలకు, ఆదర్శాలకు చెందిన వ్యక్తి. కనుక మా మా మధ్య ‘మీటింగ్ పాయింట్’ ఏమైనా ఉంటుందా అన్నది మొదలే కలిగిన సందేహం. పీవీగారికి తనకంటే పెద్ద అయిన ఏ సాహిత్యవేత్తనో కలిసిన ఇలాంటి అనుభవమే ఎదురై ఉంటే ఆయనకు ఏ విశ్వనాథసత్యనారాయణో గుర్తుకొచ్చేవారేమో! ఇది మా మధ్యనున్న తరం అంతరాన్ని తెలుపుతుంది. ఇలాంటి తేడాల మధ్య నేను ఆయన ‘ఇన్ సైడర్’ ను అనువదించాను. ఆ క్రమంలో ఆయనను అనేకసార్లు కలిసి, ఆయన ఆలోచనలను, ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాను.
****
పీవీగారు (అవిభక్త) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖలు నిర్వహించిన మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వయసు రీత్యా, పరిణతి రీత్యా ఆయనను నిశితంగా చూసి అంచనా వేసే అవకాశం నాకు కలగలేదు. 1991లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాతే ఆ అవకాశం కలిగింది. ఆ సమయంలో దేశంలో ఏర్పడిన ఆర్థికసంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఆయా సంస్కరణల రూపంలో ఆయన తీసుకున్న మౌలిక, సాహసిక చర్యలు ఒక జర్నలిస్టుగా నన్ను సహజంగానే ఆకర్షించి, ఆయనపై ఆసక్తి కలిగించాయి. ప్రధానమంత్రిగా ఆయన అయిదేళ్ళ పాలననూ ఒక జర్నలిస్టుగానే పరిశీలించాను. ‘ది ఇన్ సైడర్’ నుంచి ఒక ఆంగ్లపత్రిక ప్రచురించిన కత్తిరింపులు చూసినప్పుడు కూడా, ‘ఇది తెలుగులోకి వస్తే బాగుంటుందే’ నని ఒక జర్నలిస్టుగానే అనుకున్నాను. నేను పనిచేస్తున్న ఆంధ్రప్రభ యాజమాన్యం ‘ది ఇన్ సైడర్’ తెలుగులోకి అనువదింపజేసి ధారావాహికగా ప్రచురించాలని నిర్ణయించినప్పుడు, సంపాదకులు వి. వాసుదేవదీక్షితులుగారు ఆ బాధ్యత నాకు అప్పగించినప్పుడు, ‘పాఠకులకు ఇది ఎంతవరకు నచ్చుతుంది, ఏ మేరకు సంచలనాలు రేపి పత్రిక సర్క్యులేషన్ కు తోడ్పడుతుం’దని- ఒక జర్నలిస్టుగానే ఆలోచించాను.
ప్రోటోకాల్ పక్కన పెట్టి…
అంటే, అనువాదంలోకి దిగే ముందు పుస్తకం మీద కానీ, పుస్తకంలోంచి తొంగిచూస్తున్న పీవీగారి గురించి కానీ ఇంతకు మించి గొప్ప ఊహలు, అంచనాలు ఏమీ లేవు. తీరా అనువాదం మొదలుపెట్టాక; ఓ రెండు అధ్యాయాలు ఆయన చూసి సరే అని, నాతో నేరుగా ఉత్తరప్రత్యుత్తరాలు, సంభాషణ ప్రారంభించాక —పుస్తకాన్నే కాక, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా కాస్త లోతుగా చూసే వెసులుబాటు కలుగుతూ వచ్చింది. తెల్లని పంచె, లాల్చీ, కండువాలతో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే ఈ వామనమూర్తిలోని ఆలోచనల ఆజానుబాహువును పోల్చుకోవడమూ ప్రారంభించాను.
రాష్ట్రమంత్రి నుంచి దేశప్రధానమంత్రివరకు ఎదిగి సుదీర్ఘ రాజకీయ, పదవీజీవితాన్ని చూసిన ఈ పెద్దమనిషికి, అలాంటివారిలో సహజంగా ఉండే ప్రొటోకాల్ పట్టింపులేవీ లేవు. అట్టడుగు స్థాయిలో పనిచేసే వ్యక్తితో నేరుగా సంబంధం, సంభాషణ పెట్టుకోగలరు! ఇదీ ఆయన వ్యక్తిత్వం గురించి నా తొలి ఎరుక.
అనువాదంలో తనదైన పంథా
అప్పటికి నాకు ఉన్నదల్లా వార్తలను, వ్యాసాలను అనువదించిన అనుభవం మాత్రమే. అయినా అనువాదపు మెళకువలు, పద్ధతులు నాకు బాగానే తెలుసుననుకునేవాడిని. తీరా అనువాదం గురించి పీవీగారు అన్న మాటలు నా ఊహల్ని తలాకిందులు చేశాయి. వేరే భాషనుంచి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు అందులో తెలుగుదనం ఉండాలనీ, వీలైనంతవరకు తెలుగు సామెతలను, నుడికారాన్ని వాడాలని అనుకుంటాం కానీ, అది సరి కాదని పీవీగారు అన్నారు. వేరే భాషలోని వాక్యనిర్మాణశైలిని, నుడికారాన్ని, సామెతలను వీలైనంతవరకు తెలుగులోకి యథాతథంగా తీసుకురావాలన్నారు. అప్పుడే తెలుగులో పదసంపద, వ్యక్తీకరణశక్తి పెరుగుతాయని ఆయన వివరణ. తెలుగుదనం తేవడం ముఖ్యమనుకుంటున్న నాకు ఆయన అభిప్రాయం వింతగా అనిపించినా, ఆయన చెప్పిన కారణం మాత్రం ఆలోచింపజేసింది.
ఆ తర్వాత రాష్ట్రమంత్రిగా, బహుభాషలు తెలిసినవారుగా, సాహితీవేత్తగా నాకు అంతగా తెలియని ఆయన జీవనానుభవాలలోకి కాస్త లోతుగా తొంగి చూసినప్పుడు; అనువాదం గురించే కాక, భాషగురించి కూడా ఆయనకు నాకంటే కూడా ఎక్కువ అనుభవం, అవగాహన, క్రియాశీలత ఉన్నట్టు బోధపడింది. పాత్రికేయమిత్రులు టి. ఉడయవర్లుగారు రాసిన ఒక వ్యాసం నుంచి ఉటంకించుకుంటే, ఒక భాషనుంచి మరొక భాషలోకి అనువాదం చేయడంవల్ల ఆయా భాషాజనాలకు చెందిన సంస్కృతులు కూడా ఇతర భాషాజనాలకు తెలుస్తాయనీ, దీనివల్ల భిన్నత్వంలో ఏకత్వం సాధించవచ్చునని పీవీ భావించేవారు. ఇది శైలి, శిల్పం, నుడికారం, సామెతల యథాతథానువాదం వల్ల కలిగే ప్రయోజనానికి అదనం. దేశకాల పరిస్థితుల రీత్యా అది ఈనాటి అవసరమనీ, ప్రపంచభాషల్లోని మహా కావ్యాలు అన్నింటినీ రష్యన్ భాషలోకి అనువదించడానికి దోహదం చేసిన పీపుల్స్ పబ్లిషింగ్ హోమ్ పద్ధతి మనకీ అవసరమని, తెలుగు విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు పాఠకులు ఉన్నారా లేదా అన్నది పట్టించుకోకుండా గ్రంథాలు ప్రచురించి సంస్కృతిని పరిరక్షించాలని పీవీ అనేవారు.
పరిపాలనాభాషా రూపశిల్పి
ఆయనకు రాజకీయ, పరిపాలనాజీవితం ఎంత ఉందో; దాదాపు అంతగానూ భాషగురించిన ఆలోచన, ఆచరణ జీవితం ఉన్నాయి. దక్షిణభారతహిందీప్రచారసభలోనే కాక, జాతీయస్థాయిహిందీప్రచారసంస్థలలో కీలకపదవులు నిర్వహించిన వేమూరి ఆంజనేయశర్మగారు పీవీగారి గురించి కొన్ని విశేషాలను పంచుకున్నారు. దక్షిణభారతహిందీ ప్రచారసభకు ఇందిరాగాంధీ అధ్యక్షులుగా ఉండేవారు. సభ కార్యకలాపాలు సక్రమంగా జరగకపోవడంతో ఇందిరాగాంధీ పీవీని ఉపాధ్యక్షుడిగా నియమించారు. వేమూరి ఆంజనేయశర్మగారు ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. పీవీ సారథ్యంలో హిందీప్రచారసభ కార్యకలాపాలు గాడిన పడడమే కాదు, కొత్తపుంతలు తొక్కాయి. కేవలం హిందీని మాత్రమే కాక, ఇతర భారతీయభాషలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పీవీ కొన్ని మౌలిక ఆలోచనలను అమలు చేశారు. ఉదాహరణకు, హిందీ ఎం. ఎ సిలబస్ అప్పటికి సాహిత్యప్రధానంగా ఉండేది. పీవీ దానిని భాషాప్రధానంగా కూడా రూపొందింపజేశారు. సాహిత్యకారులకు లేని ఒక అదనపు చూపు, ఒక అదనపు బాధ్యత పరిపాలనావేత్తగా పీవీగారికి ఉండడం ఇందుకు కారణం. భారతీయభాషల్లో పరిపాలన జరగడానికి వీలుగా ఆయన ఈ ఆలోచన చేశారు. విచిత్రమేమిటంటే, ఈ మార్పును అమలు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిష(యూజీసీ)నే కాదు, భారతప్రభుత్వం కూడా మొదట్లో వెనుకాడిందట. పాఠ్యక్రమానికి రూపకల్పన జరిగిన తర్వాత కూడా విశ్వవిద్యాలయాలు తటపటాయిస్తే, పీవీగారే ద. భా. హిం. ప్ర. సకు చెందిన హైదరాబాద్ పీజీ సెంటర్ లో ఆ పాఠ్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. ఆ తర్వాత ఇది దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలకూ విస్తరించింది. హిందీ సహా భారతీయభాషలను కంప్యూటర్ కు అనుగుణంగా రూపొందించడంలో కూడా పీవీగారిదే ప్రాముఖపాత్ర అని ఆంజనేయశర్మగారు అంటారు.
తెలుగును బోధనాభాషగా, పరిపాలనాభాషగా మలచడంలో పీవీగారు ఇంతకన్నా పెద్ద ప్రయత్నం, పెద్ద యుద్ధం చేశారు. ఆ కృషిని బూదరాజు రాధాకృష్ణగారు వివరిస్తూ, తను ఎంతోమంది విద్యామంత్రులను ఎరుగుదుననీ, విద్యాశాఖ కార్యదర్శులను, డైరక్టర్లను, విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులను చాలామందిని చూశానని, పీవీగారికి ఉన్నంత భాషాభిమానం ఇంకెవరిలోనూ చూడలేదని అంటారు. చేతనైన పద్ధతిలో మాతృభాషలో సృజనాత్మక రచనలు చేయడమే భాషాసేవ అని మనలో చాలామంది అనుకుంటారనీ; శాస్త్రగ్రంథ రచన చేసినా, శాస్త్రీయవిషయాలను ప్రస్తావించినా అది భాషాసేవ కిందికి వస్తుందా అని సందేహిస్తారనీ, ఇలాంటి వాతావరణాన్ని గుర్తుంచుకున్నప్పుడు పాములపర్తివారు తెలుగుభాషకు చేసిన సేవ ఎన్ని అవరోధాల మధ్య, ఎంతటి విరుద్ధవాతావరణంలో ఎంత సమర్థంగా సాగిందో నిగ్గుతేలుతుందనీ ఆయన వ్యాఖ్య. ఆయన ప్రకారం, పీవీగారి భాషాసేవలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఎవరికి వారు వ్యక్తిగత వికాసానికే ప్రాధాన్యం ఇచ్చే భాషారంగంలో, బృందంలో ఒకడిగా పనిచేసే లక్షణాన్ని అలవాటు చేయడం.
తెలుగును అధికారభాష చేయడంలో…
తెలుగులో విద్యాబోధన, పరిపాలనా నిర్వహణలకు సంబంధించి పీవీకి ముందున్న చరిత్రను బూదరాజువారు ఏకరవు పెడుతూ, పీవీ దోహదం ఎలాంటిదో ఎత్తి చూపుతారు. ఉదాహరణకు, 1926లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తును స్థాపిస్తూ చట్టం తెచ్చినప్పుడే విద్యాబోధన తెలుగులో జరగాలని నిర్దేశించుకున్నారు కానీ అమలు జరగలేదు. 1946-47లో బ్రిటిష్ వాళ్ళు తూర్పు గోదావరిజిల్లాలో ప్రభుత్వం వారి ఉత్తరప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలని ఉత్తరువు ఇచ్చినా అదీ అమలు జరగలేదు. 1950-52 మధ్య కాలంలో నిజాం నవాబు తన అధీనంలోని తూర్పు జిల్లాల్లో అదేవిధమైన ఉత్తరువు ఇచ్చినా అమలు కాలేదు. తెలుగు భాష క్రమంగా అధికారభాష కావాలనే కోరిక 1955లో కానీ తీర్మానరూపం ధరించలేదు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి శాసనసభ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన 1957లో పరిపాలనకు అవసరమైన పరిభాషను తెలుగులో రూపొందించాలనే సంకల్పం కలిగింది. పీవీ భాగస్వామ్యం అప్పటినుంచీ మొదలు. 1963లో 900 పేజీల పరిపాలనా న్యాయపదకోశం వెలుగు చూసింది. 1953-62 మధ్యకాలంలో తెలుగు టైపింగులో శిక్షణ, పరీక్షణ జరిగాయి. 1962లో తెలుగులో ఉత్తరువులు రాసే ముసాయిదా వెలువడింది. 1966 నాటికి గాని తెలుగును అధికారభాషగా గుర్తించే చట్టం రాలేదు. పీవీ న్యాయశాఖ మంత్రిగా ఉండగానే తెలుగు అనువాదవిభాగం ఏర్పడింది. అంతకుముందు భారతరాజ్యాంగాన్ని ‘భారత సంవిధానం’ పేరుతో పీవీయే తెలుగులోకి అనువదించారు. ఇంగ్లీషులో ఉన్న చట్టాలను తెలుగులోకి అనువదించడానికి తగిన విధాననిర్దేశం చేస్తూ తెలుగులో శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టే బాధ్యతను న్యాయశాఖమంత్రిగా 1968-69లో పీవీయే నిర్వహించారు. తనకన్నా ముందు చట్టాలను తెలుగులోకి అనువదించినవారు పడ్డపాట్లను పీవీగారు శ్వేతపత్రంలో ప్రస్తావించారు. అనువాద సాధ్యాసాధ్యాలను చర్చించారు. 19968లో విద్యామంత్రిగా ఇంటర్మీడియట్ స్థాయిలో, ఆ పై స్థాయిలో తెలుగును బోధనామాధ్యమంగా ప్రవేశపెట్టడానికి తెలుగు అకాడెమీని, ఇంటర్మీడియెట్ బోర్డును నెలకొల్పడమే కాక, వాటి రోజువారీ నిర్వహణ తీరును కూడా పర్యవేక్షించారు. తెలుగులో పరిపాలనానిర్వహణకు తోడ్పడడానికి అధికారభాషాసంఘాన్ని నియమించారు. 1971లో నేషనల్ బుక్ ట్రస్టుతో కలసి అనువాదవిధానాల మీద చర్చాగోష్ఠి నిర్వహించారు. ఇంత కృషిలోనూ భాషావేత్తలనుంచి పీవీకి తగినంత సహకారం లభించిందా అంటే, లేదంటారు రాధాకృష్ణ. శ్వేతపత్రంలో పీవీ పేర్కొన్న భాషాసిద్ధాంతాలను తప్పన్నారే కానీ, తమకు న్యాయశాస్త్రం పరిచయం లేదన్న సంగతిని గుర్తించలేదు. న్యాయపరిపాలన దృష్టితో పీవీ చేసిన ప్రసంగాలను వారు అర్థం చేసుకున్నట్లులేదు. వారికి న్యాయనిర్వహణలో ఎదురయ్యే సమస్యలు తెలియవు. దాదాపు 21 శాస్త్రాల్లో పరిభాషను సేకరించి, కల్పించి పాఠ్యగ్రంథాల్లో ప్రయోగించాలని తెలుగు అకాడెమీ నిర్ణయించినప్పుడు, ఆ నిర్ణయం రచయితల స్వాతంత్ర్యాన్ని హరిస్తుందనీ, ఎవరి పరిభాషను వారు వాడనివ్వాలని వాదించిన భాషావేత్తలు ఉన్నారు.
అధికారభాషపై శాసనసభకు పీవీ సమర్పించిన శ్వేతపత్రం లోతైన పరిశోధనను, పాండిత్యాన్ని పట్టి చూపుతుందని మరో ప్రముఖభాషాశాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి అంటారు. శాతవాహనుల కాలం నుంచీ శాసనాలలో తెలుగు వాడకాన్ని అది ప్రస్తావించింది. రకరకాల పన్నులను, భూసంబంధాలను సూచించే తెలుగు పదాలను శాసనాలనుంచి పీవీ అందులో విస్తారంగా ఉటంకించారు. ఇంటర్మీడియట్ స్థాయినుంచీ పాఠ్యపుస్తకాల్లో ఆధునికమైన తెలుగు వాడాలా, లేక గ్రాంథికం వాడాలా అన్న వివాదం తలెత్తినప్పుడు ఆధునికమైన తెలుగునే వాడాలని చెబుతూ పీవీ ఆ వివాదాన్ని పరిష్కరించడమే కాక; కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మాండలికాలనుంచి కూడా పదాలను తీసుకోవాలని, తద్వారా అన్ని ప్రాంతాల భాషకూ న్యాయం జరుగుతుందనీ సూచించారట. తెలంగాణ మాండలికంపట్ల చిన్నచూపు తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన అంశాలలో ఒకటన్న సంగతి గుర్తు చేసుకుంటే పీవీగారి ముందుచూపు ఎలాంటిదో అర్థమవుతుంది.
ఆలోచనల సహస్రావధాని
పీవీ ఆలోచనల సహస్రావధాని. ఆయన ఏక కాలంలో అనేక విషయాల మీద అనేక ఆలోచనలు, అనేకమందితో చేయగలిగేవారు. వాటికి నెలల తరబడి కొనసాగే ఒక ‘సీరియల్’ స్వభావం ఉండేది. ఒకసారి, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు అమలు చేస్తున్న ‘ఐడియా’ల గురించి, వాటిపై తన కున్న సందేహాల గురించి, వాటిని తొలగించుకోడానికి తను చేసిన ప్రయత్నాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఒక్క విషయం మీదే నాతో ఆయన సంభాషణ, మధ్య మధ్య పదిహేను, ఇరవై రోజుల విరామంతో రెండు నెలలకు పైగా ‘సీరియల్’ గా సాగింది. ప్రతిసారీ, ఇంతకుముందు సంభాషణ ఎక్కడ ఆగిందో సరిగ్గా అక్కడినుంచి ఎత్తుకునేవారు. ఆయనలో సమగ్రదృష్టి కలిగిన ఆలోచనాశీలిని పట్టి చూపే ఇలాంటి ఉదాహరణలను ఎన్నైనా ఇవ్వవచ్చు. ( ముగింపు వచ్చే సంచికలో…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com