దక్షిణ కాశిగా ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రం వేములవాడ. చారిత్రకంగా లేంబాళవాటికగా విఖ్యాతినొందింది. యుగాల నుండి శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంగా భాసమానమై ఉన్నది. కృత యుగం లోనే ఈ క్షేత్రం రాజేశ్వరం అనే పేరుతో ప్రసిద్ధమై ఉన్నది భవిష్యోత్తర పురాణం రాజేశ్వర ఖండంలో

 ” రాజేశ్వరంతు లోకేషు, క్షేత్రానముత్తమోత్తమం /తీర్థం పరంపరం ఙ్ఞేయం, వేద సారమ కల్మషం,

   ప్రఖ్యాతం త్రిషులోకేశు,రాజేశ్వరమితిస్థిమితం / యత్ర వై ధర్మ కుండాఖ్యం,తత్ర తీర్థం మహోత్తమం”

అని ఈ మహా క్షేత్రం యొక్క ప్రఖ్యాతి పేర్కొనబడినది . ఈ క్షేత్రంలో స్వామివారి లింగమూర్తి నవనాథ సిద్ధులచే స్థాపించబడి , నీలోత్పల ఛాయతో భక్తులను కటాక్షించుచున్నది . దీనికి లేములవాడయని మరొక పేరు వ్యవహారములో నున్నది. శాసనాలను బట్టి ఇది ఇది లేంబుల వాటిక అని తెలుస్తోంది. కన్నడ కవులలో ప్రముఖుడగు పంపన మహాకవి విక్రమార్జున విజయాన్ని రచించి వేములవాడ చాళుక్య రాజయిన రెండవ అరికేసరి కి అంకితమిచ్చాడు . కవిజనాశ్రయాన్ని రచించిన వేములవాడ భీమ కవికి , యశస్తిలక చంపు వంటి ప్రసిద్ధ ఆలంకారిక గ్రంధాన్ని రచించిన సోమదేవ సూరి వంటి మహా కవులకు పండితులకు ఈ వేములవాడ క్షేత్రమే దివ్య స్ఫూర్తి స్థలి . సుప్రసిద్ధ కవి, సినీ గీత రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు , మధుర కవిగా కొనియాడబడి,తెలంగాణ సాహిత్య వైతాళికుడుగా ఖ్యాతి వహించిన,మామిడిపల్లి సాంబశివశర్మ గారు ,ప్రసిద్ధ కథా రచయిత సురమౌళి, అభ్యుదయ కవి చొప్పకట్ల చంద్రమౌళి, వంటి మరెందరో ఆధునికులు కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం.

         కీర్తిశేషులు మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ గారు స్మృతిలోమెదిలినప్పుడల్లా వేములవాడ వీధుల్లో పసిమి వన్నెతో ,మోకాళ్ల దాకా ధోవతి ఉత్తరీయంతో సంకలో వెదురు దండంతో చేతిలో కాగితాలు కలమున్న సంచితో నిరాడంబరంగా దారి పొడుగునా ఏదో ఒక పద్యానికో లేదా పాటకో ప్రాణం పోసుకుంటూ కదిలిపోతున్న ఒక నిరాడంబర పుంభావ సరస్వతి మనస్సులో మెదులుతాడు.

మామిడిపల్లి సాంబశివశర్మ జనన విశేషాలు – బాల్యం.

ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఈ వేములవాడలోనే తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ కవి పండితులు మహా విద్వాంసులలో ఒకరైన మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ గారు తేదీ28 జూన్1920 న మృత్యుంజయ శర్మ సత్యమ్మ దంపతులకు ఏకైక సంతానం గా జన్మించినారు. పుట్టిన పదమూడునెలల వయసులోనే తండ్రిని పోగొట్టుకొని తల్లి సత్యమ్మ మరియు మేనమామ మంగళంపల్లి సత్యనారాయణరావు (వడ్లూరు మండలం బెజ్జంకి ) గార్ల పెంపకం లో పెరిగినాడు.

అందుకే మామిడిపల్లి సాంబకవి తన ‘మా దేవర శతకం’లో

 ” పుట్టితి తండ్రి జచ్చె,పదమూడునెలల్కడ ముట్టకుండనే / చెట్టలు ముట్టకుండ మన జేసిరి తల్లియు మేనమామ నన్ / బెట్టిరి నీ కరాబ్జమున నీతిని నేర్పెదో బూతు నేర్పేదో / కట్టడి పంతులయ్య ! స్మరఘస్మర ! లేములవాడ దేవరా ! అంటాడు .

నాలుగవ తరగతి వరకే పాఠశాల విద్యను అభ్యసించి కాలక్రమంలో భగవదనుగ్రహం వల్ల తనకు తానుగా విద్య యందు శ్రద్ధ ఏర్పరచుకొని తెలుగు సంస్కృతం హిందీ ఉర్దూ భాషలలో ప్రావీణ్యతను సంపాదించుకున్నారు .

పువ్వు పుట్టగానే పరిమళించినట్లు పిన్నవయసులోనే త్రికాండ అమరం, అలంకార శాస్త్రం పురాణేతిహాసాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి సహజ పాండితీ ప్రకర్ష తో తన కళాభిజ్ఞతకు మెరుగులు దిద్దుకున్నారు. సంస్కారవశంగా  బాల్యంనుండే వారిలోని కళా సాహిత్య కౌశలం దిన దిన ప్రవర్ధమానమైంది . అనంతధారణాశక్తి తో  బహుముఖీనమైన ప్రతిభతో సరస కవిత్వాన్ని, శ్రావ్యమైన గాన కౌశలాన్ని, నటనా వైదుష్యాన్ని సొంతం చేసుకున్నారు. ఏ రంగంలోనైనా అతని మూర్తిమత్వం మాటలతో కొలువలేనంతగా ఎదిగింది.

*భిన్న సాహిత్య సాంస్కృతిక ప్రక్రియలతో అనుబంధం.

1940-50 లలో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు రోజువారీ పనులనుంచి కాస్త సేద తీరడానికి హరికథలు నాటకాలు బుర్రకథలే ఆధారం. వారిని ఆనందింపజేయడానికి సాంస్కృతిక కళా రూపాలలో బుర్రకథ కున్న వైశిష్ట్యాన్ని గుర్తించి, శర్మగారు ఆనాటి సమాజంలో ఆసక్తికరమైన పౌరాణిక జానపద కథాంశాలతో దక్షయజ్ఞం, ముగ్గురు మరాఠీలు వంటి బుర్ర కథలను రచించి ప్రదర్శిస్తూ ఆ కథల మాధ్యమంగా ప్రజలలో జాతీయతా భావాలను ప్రోది చేసేవారు . కథా కథన వైచిత్రితో ఆ బుర్రకథలు వందలాది ప్రదర్శనలుగా ఆకట్టుకున్నాయి . తర్వాతికాలంలో ఆయన రచించిన ముగ్గురు మరాఠీలు బుర్రకథను 16/7/1953 నుండి ఆలిండియా రేడియో హైదరాబాద్ లో పలుమార్లు ప్రసారితమైంది .

రంగస్థల నటులుగా,రచయితగా, ప్రయోక్తగా

మామిడిపల్లి సాంబశివశర్మ గారు కవి రచయిత మాత్రమే కాక స్వయంగా గొప్ప రంగస్థల నటులు కూడా. వారు రచించిన ప్రదర్శింప చేసిన త్యాగయ్య ,భద్రావతి, నరకాసుర, భక్త ప్రహ్లాద, గయోపాఖ్యానము, భీమ ప్రతిజ్ఞ వంటి మరెన్నో నాటకాలు వందలాదిగా ప్రదర్శితమై సినిమాలు లేని కాలంలో ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని విశేషంగా అందించాయి . శర్మగారి సాహచర్యంలో ఎందరో స్థానిక విద్వాంసులు, మరెందరో పండితులు ఆ నాటకాలలో ముఖ్య పాత్రలను ధరించి అశేష అభిమానాన్ని చూరగొన్నారు . భద్రావతి నాటకం చక్కని రసమయ ధారాశుద్ధి తో ప్రసన్న కథా కల్పనా కలితమైన నాటకంగా జనరంజకమై ఆదరించ బడింది.

 ప్రసిద్ధ హరికథా విద్వాంసులుగా        

ప్రసిద్ధ హరికథా పితామహులు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు వలెనే శర్మ గారుకూడా పలు హరికథలను రస రమ్యంగా సంగీతప్రధానంగా రచించినారు .స్వతహాగా వారు ప్రసిద్ధ హరికథా విద్వాంసులు కూడా. వీరు రాజరాజేశ్వర క్షేత్ర మహత్యం హరి కథా రూపంలో రచించి క్షేత్రము యొక్క చారిత్రక పౌరాణిక సంబంధమైన విషయాలు ఎన్నింటినో జగద్విదితం చేశారు. రాగ తాళ యుక్తంగా సంగీత రస ప్రధానంగా,

భావ బంధురంగా తాను స్వయంగా రచించి ప్రదర్శించిన హరికథలు కర్ణ ప్రతాపం, భక్త ప్రహ్లాద, వంటి ఎన్నో హరికథలు బహుళ జనాదరణ ను పొందాయి .నర్మగర్భ వచో వ్యవహారంతో మధురస్వరంతో శ్రావ్యంగా సాగే అతని హరి కథాకథనం అశేష జనవాహినిని ఆకట్టుకునేది . బాహ్య ఆడంబరాలకు దూరంగా ఆయన గడిపిన ఏకాంత జీవితం వల్ల అతన్ని ప్రపంచం పట్టించుకోవలసినంతగా పట్టించుకోలేదు  .

  • రచయితల సంఘ అధ్యక్షునిగా.

మామిడిపల్లి సాంబశివశర్మ గారు బహుముఖ ప్రజ్ఞా దురంధరులు. ఆయన ఏ మార్గమును  అవలంబించినా దాన్ని చివరిదాకా సాధించనిదే వదిలిపెట్టని స్వభావం ఆయనది. వివాహానికి పూర్వం మంచి కవిగా పండితుడిగా నటుడిగా పేరు గడించిన శర్మ గారు కరీంనగర్ జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .1953 లో ఏర్పడిన తెలంగాణ రచయితల సంఘం లక్ష్యాలను భుజాలకెత్తుకొని కరీంనగర్ జిల్లా విభాగంలో క్రియాశీలక పాత్రను నిర్వహించారు. పలు ప్రాంతాలలో సభలు కవిసమ్మేళనాలు నిర్వహించారు. ఆనాటి కవి పండితులు రేమిళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి, సరి పెల్లి విశ్వనాథశాస్త్రి , ఆచి వేంకట నరసింహాచార్యులు, ఉత్పల సత్యనారాయణాచార్య విశ్వనాథ సత్యనారాయణ వంటి ఎందరో దిగ్దంతులు

సాంబ కవి ప్రతిభను ఎంతో శ్లాఘించారు.

 * స్వాతంత్ర్య సమర యోధులుగా.

స్వాతంత్ర పోరాట సమయంలో స్వరాజ్య స్థాపన అవసరాన్ని, సంస్థానాధీశుల పాలనలో సాగుతున్న అణచివేతను గురించి ప్రచారంచేసి జాగృతపరిచారు . స్వామి రామానంద తీర్థ వంటి వారి పిలుపునందుకుని నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం గురించి పలు ప్రసంగాలు చేశారు.

తాను రచించి ప్రదర్శించే బుర్రకథల్లో అంతర్భాగంగా ఆనాటి వర్తమాన స్థితిగతులను ఆర్ద్రంగా వివరించి, ప్రజలను చైతన్యపరిచే వారు.

 * మాజీ ప్రధాని ,స్వర్గీయ పీవీ నరసింహారావు గారి తో అనుబంధం.

‘సాంబశివ శర్మగారు పీవీ నరసింహారావు గారు స్థాపించిన ఆనాటి కాకతీయ పత్రిక కు విలేఖరిగా కూడా పనిచేసి స్వాతంత్ర సమరయోధులు గా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. పలు సభలు సమావేశాలలో

స్వర్గీయ పీ.వీ . నరసింహారావు గారు సాంబ కవి రచనా వైశిష్ట్యాన్ని, దీక్షను, అనుపమాన ప్రసంగ ప్రతిభను, గాన కౌశలాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు .శర్మ గారు పివి గారి అసమాన దీక్షా దక్షతల గురించి ఒక సభలో

“వంగర రంగరాయ నికి వాసిగా సత్యవతీమతల్లియం / దంగజ సౌకుమార్య దరహాస లసన్ముఖుడుద్భవించె ను

 ప్పొంగె త్రిలింగ మాంధ్రము ప్రమోదదమునందె , / విదేశ దాస్యముక్తింగను ఛాయలేర్పడెను ధీజనముల్ తలలెత్తి రత్తరిన్.

 గడచెన్ శైశవమాట పాటల సనెం కౌమారమారీతియే

నడచెన్ జవ్వనమందు కొన్ని దినముల్ నానా కళా భిజ్ఞతన్

గడియింపన్ పర దాస్య బంధనములన్ ఖండింప పంతమ్ముతో

నడుముంగట్టి కలమ్మువట్టి యడుగున్ సాగించే మున్ముందుకున్..

కాకతీయ పత్రికను సంకలన జేసి

నడిపి నూత్న చైతన్యమ్ము నిడె జనులకు

ఢిల్లీ పీఠమ్ము దిగెరల్ల తెల్లదొరలు

వచ్చి చేరె స్వరాజ్యమ్ము వసుధ వొగడ.

ఎనిమిది మూర్తులన్ వెలయు నిందువతంసుని ప్రేమ దృష్టిచే

ఎనిమిది భాషలన్ దెలిసి ఎల్లర నాత్మ సరస్వతీ ప్రచోదనమున

విఙ్ఞులన్ సలిపి తన్నెదిరించిన వారితో జయంబు గాంచిన రసఙ్ఞుడ

పీవి నృసింహరాయుడా.” అంటూ తన పద్య రచనతో కీర్తించారు.

 * వేములవాడ దేవస్థానం ఆస్థాన కవిగా.      

ఆ తర్వాతి కాలంలో శర్మ గారి పైనున్న సాహిత్య గౌరవం తో,1964 లో అప్పటి దేవాదాయ శాఖా మంత్రిగా ఉన్న స్వర్గీయ పీ.వీ నరసింహారావుగారు , సాంబశివశర్మ గారు అవిశ్రాంతంగా కొనసాగిస్తున్నసాహిత్య కృషిని , అసంఖ్యాక భక్తి సంకీర్తనల సృజననూ, పలు క్షేత్రాల సుప్రభాత రచనలను, భగవత్ సాహిత్య దృష్టి పట్ల వారికున్న తాదాత్మ్య భావాన్ని గుర్తించి , ఆయనను వేములవాడ   శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఆస్థానకవిగా నియమించినారు. వారి కుటుంబ నిత్య పోషణా బాధ్యతలను ఆలయ నిర్వాహకులు లకు అప్పగించారు . స్వాతంత్రోద్యమ సమయంలో భారతమాత భాగ్య విభవాన్ని కీర్తిస్తూ తాను రచించిన రాజేశ్వర సుప్రభాతంలో తొలి స్తుతిగా

“యస్యామూర్ధ్ని హిమాలయస్య శిఖర శ్చంచత్కిరీటాయతే /యస్యాశ్రోణితే సరిత్సముదయాస్సౌవర్ణ వాసాయతే / యస్యావక్షతి పుష్పితక్షితిజరా జిస్తారహారాయతే/ సాపాయాద్భరతాంబికా నిజజన స్వారాజ్య లక్ష్మీపదం / అంటూ సహజ సంపదలతో అలరారే ఆ భారతమాతకు లక్ష్మీప్రదమైన స్వరాజ్యం చేకూరాలని తన మనోభీష్టాన్ని నివేదించాడు..

“దేవునిమీద భక్తి యును తెల్వి యు తాల్మియు ధైర్య సాహసా /ల్పావనమైన నర్తనము భావ విశుద్ధి ప్రజాహితంబు సం /జీవ రసార్ధ్ర సూక్తులు విశృంఖల నిశ్చల సత్య దీక్షయున్ కావలె భారతీయునకు” అంటూ ప్రబోధించాడు.

సమాజంలోని అసమానతలను చూసి తల్లడిల్లి ” బాపురే భారత వాస సౌఖ్యమిదియా బొంపేది బల్పేదకున్ ” అంటూ తన పద్య రచన లో వ్యధ చెందాడు . ఆయన రచనల్లో భగవద్భక్తికి, ఎంత ప్రాధాన్యం ఇచ్చారో దేశభక్తి కూడా అంతే గౌరవాన్ని ఇచ్చారు. సమాజంలో కనిపించిన అవకతవకలను నిర్మొహమాటంగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పటం ఆయన నైజం.సహజంగా ఆయన వాక్కులో ఉన్నవ్యంగ్యశక్తి అక్రమార్కులకు  వెన్నులో వణుకుపుట్టించేది . ఇజాలకు అతీతమైన నిజాలను ఎండగట్టే ఆయన స్వభావం కుటిల రాజకీయాలకు మింగుడుపడలేదు. కాబట్టే అతని జీవితం కడు పేదరికంలో నడిచింది , ఎంతో అనాదరణ కు అవమానాలకు కూడా గురైంది . సమాజ విమర్శను ఎంత పదునైన వాక్యాలలో చెప్పేవారో అంతే తాదాత్మ్యతతో రాజరాజేశ్వర స్వామి వారి , సత్యనారాయణ స్వామి వారి, జగన్మాత స్తుతులను రసరమ్యంగా రాగయుక్తంగా కూర్చి పాడేవారు కూడా.

1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో

తొలి దశ తెలంగాణ ఉద్యమంలో యువకులను విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా ఆయన రచించి గానంచేసిన ” ప్రత్యేక తెలంగాణా పరిపాలన కావాలోయ్, / ప్రజలను పట్టించుకోని పరపాలన తొలగాలోయ్, వివక్షతల వికారాలు ఇక దూరం కావాలోయ్”/ అంటూ సాగే ఈ గీతం వేములవాడ ,సిరిసిల్ల , కరీంనగర్, సిద్దిపేట లలో జరిగిన ఉద్యమ సదస్సులలో మార్మోగింది.

“అదిగో మోగినదాంధ్ర వీణ, కపట వ్యాపార పారీణతా/భ్యుదయంబున్ నిజతంతునాళముల నుద్బోధించె నాంధ్రీయతా /నదముప్పొంగె నశాంతిహింస కలహోన్మాదం బు రేకెత్తే మి/న్నదరన్ లోకము కంటనీర్విడిచె” అంటూ ఆ కాలపు అసహనాన్ని వ్యక్తీకరించాడు . తాను కలలుగంటున్న తెలంగాణ ఎలా ఉండాలో చెబుతూ

“మా తెలంగాణమందు గల మానవులెల్లరు నీతిమంతులై / పూత చరిత్రులై పలికి బొంకనివారై ధర్మబద్దులై/

ఖ్యాతిగలారలై పరుల కష్టమలన్నిటి దీర్చువారలై/ భూత హితాత్ములై భువన పూజితులైవిలసిల్లగావలెన్” అని ఆశంసిస్తాడు.

 * సంస్కృతాంధ్ర భాషలలో అవధానిగా

అసాధారణ సాధారణా పటిమ, అనుపమాన ఆశురచనా శక్తి, సమయోచిత ప్రజ్ఞ, విస్త్రుత అధ్యయనశీలత, శ్రావ్య కంఠస్వరం ముప్పిరిగొన్న విశేషాలు గా మామిడిపల్లి సాంబ శివ శర్మ గారి అవధానాలు పండిత ప్రకాండులను, రసజ్ఞ శ్రోతల ను విశేషంగా ఆకట్టుకునేవి. ఆయన సహజ హాస్యప్రియుడు కాబట్టి అవధానము ఆద్యంతము నవ్వులతో నిండిపోయేది. చమత్కార భాషణము ఆయన భూషణం.

కీర్తిశేషులు గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ, ప్రస్తుత కాలంలో అష్టావధాని తిగుళ్ల శ్రీహరి శర్మ, అష్టకాలు నరసింహ రామ శర్మ వంటి ప్రసిద్ధ అవధానులచే , గణపతి రామచంద్ర రావు, పారు వెళ్ళ గోపాలకృష్ణ, నల్లగొండ పురుషోత్తమ శర్మ వంటి పండితులచే శ్లాఘింపబడి పలు సభలలో అవధాన ప్రజ్ఞను చాటినారు. శతాధిక అవధానాలలో పూర్తి చేసిన ద్విభాషా అవధాని తిగుళ్ల శ్రీహరి శర్మ గారు సాంబ కవి అవధానాల ప్రేరణతో రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాలలో అద్భుతంగా అవధానాలు చేస్తూ మన్ననలు పొందుతున్నారు. వారు సాంబ కవి గారిని తనకు అవధాన మార్గదర్శకులుగా పేర్కొంటూ ఉంటారు. ఎలా అవధాన విశేషాల గురించి ఇంకా వివరించడమంటే అదొక సుదీర్ఘ గ్రంథమే కాగలదు.

*  శ్రీ రాజరాజేశ్వర భక్తి పారమ్యత.

సాంబ కవి తనకు తల్లి తండ్రి గురువు సర్వము ఆ రాజరాజేశ్వర స్వామి అని తలంచి తన రచనలలో ఆ స్వామి పై భక్తిని పరిపూర్ణంగా వ్యక్తం చేశారు “సదా రాజరాజేశ్వరం పూజయామి/హృదా రాజరాజేశ్వరం భావయామి/

వినా రాజరాజేశ్వరా దన్య దైవం/  ననౌమి స్వమస్తేన నస్తౌమివాచా” అంటారు. శివుడే తానై తానే శివుడై, ఆ స్వామికి సహచరుడై, దాసుడై తన రచనలలో శివ సాన్నిధ్యాన్ని సామీప్యాన్ని సదా కోరుకుంటూ ఉండేవాడు.

ఆయన శివభక్తితో రచించిన అసంఖ్యాక కీర్తనలు, ముక్తాహారం, వేములవాడ దేవర, రాజేశ్వర క్షేత్ర మహత్మ్యం హరికథ, రాజరాజేశ్వర సుప్రభాతం, రాజేశ్వర తారావళి, వంటి మరెన్నో శివ భక్తి పూరిత రచనలే.

* సుప్రభాత రచనలు.

శ్రీ మామిడిపల్లి సాంబశివశర్మ గారు మధుర కవితాధార తో “లేంబాళవాటిక విభో తవ సుప్రభాతం” అంటూ సాగే శ్రావ్యమైన ఈ సుప్రభాతం ఆకాశవాణి ద్వారా ప్రతి సోమవారం,మరియు వేములవాడ క్షేత్రంలోప్రతిదినం

పఠించబడుతుంది. స్వర్గీయ పీవీ నరసింహారావు గారి కోరిక మేరకు  రచించి ఆ ఈశ్వరునికి సమర్పించిన కాళేశ్వర ముక్తేశ్వర సుప్రభాతం , శృంగేరీ జగద్గురువుల ఆదేశానుసారం గంగా సుప్రభాతం, గౌరీ శంకర సుప్రభాతం, కొమురవెల్లి మల్లన్న సుప్రభాతం, రచించారు . ఇంతేకాక ఇతర దేవతలపై భక్తిభావంతో సికింద్రాబాద్ మహంకాళి సుప్రభాతం, బాసర సరస్వతి సుప్రభాతం రచించారు . ఆయన ఒక్క శివ సంబంధి రచనలే కాకుండా ఆది శంకర సుప్రభాతం, బెల్లంపల్లి శ్రీ రామచంద్ర సుప్రభాతం, లక్ష్మీ నృసింహ సుప్రభాతం, మహంకాళి సుప్రభాతం, బాసర సరస్వతి సుప్రభాతం, శ్రీ కృష్ణ భజనలు శ్రీ రామ భజనలు, మంగళ హారతులు మరెన్నో రచించి సమర్పించారు.

 *ఇతర కృతులు.                                      

మధురకవి బిరుదును పొందిన మామిడిపల్లి సాంబశివశర్మ గారు రామదాసు త్యాగరాజు అన్నమయ్య మొదలగు వాగ్గేయకారుల మార్గంలో సంస్కృతంలో తెలుగులో అసంఖ్యాక కీర్తనలను కర్ణాటక సంగీత రాగాలలో జనబాహుళ్యానికి ఆసక్తిని కలిగించే రాగాలలో గాన యోగ్యంగా రచించి భక్తప్రపంచానికి అందించి

 ఒక వాగ్గేయకారుడిగా కూడా గణుతి కెక్కినారు. ఇంకా వారి సృజన వైభవాన్ని చాటుతూ ఖండకావ్యము,

కుంజవిహారము, మధుర ఝంకారము , మాదేవర, లోభ సంహారము మంగళ హారతులు, వంటి మరెన్నో అసంఖ్యాక రచనలు బహుళ జనాదరణను పొందినవి.

మామిడిపల్లి సాంబశివశర్మ గారు చెప్పే విషయాన్ని ఏ రూపంలో చెప్పినా దాని అర్థం సమాజ శ్రేయస్సుగానే ఉండేది.

స్వామిని సంబోధిస్తూ శతకం రాసినా ఆ పద్యాల ఆంతర్యంలో కలుష కలుషిత మానవ ప్రవృత్తులే ప్రతిబింబించేవి.

సమాజంలోని అస్తవ్యస్త స్థితి పట్ల బాధను,అసహనాన్నే స్వామికి నిరంతరం నివేదించే వాడు . మానవ స్వభావాన్ని

లొంగ తీసుకుంటున్న లోభం మీద కొరడా ఝళిపించి , అట్టి లోభ సంహారంకోసమే నడుముకట్టిన కవి ఆయన.

          ఎన్నిఅభివృద్ధులు జరుగుతున్నా ” దండుగయే కాదే చేతికందని ఫలంబు / నిష్ప్రయోజనమే కాదే నిర్జన వని “

అంటూ వీటన్నిటికీ కారణమయిన లోభము సమాజంలో ఎక్కడ ఎక్కడ ఉందో రెడ్ హ్యాండెడ్ గా పట్టి చూపించాడు.

ఈ కావ్యంలో కవి “పండినవి సస్యములా / మహా పాతకములా / నిండినవి చెరువులా / అవినీతి తతులా /

పెరిగినవి విభవమ్ములా /విప్లవముల / తలచినది విశ్వ హితమా / నిర్దయుల మతమా ? అంటూ పదునుగా ప్రశ్నించాడు.

          మహాకవి తులసీదాసు వ్రజ భాషలో రాసిన రామచరిత మానస్ గ్రంథాన్ని పండిత రాధేశ్యాం సరళమైన హిందీలోనికి

అనువదించగా అట్టి రాధేశ్యాంరామాయణాన్ని గాన యోగ్యమైన మంజరీ ద్విపదలోనికి మామిడిపల్లి సాంబశివశర్మ గారు

స్వేచ్ఛానువాదం చేశారు.శర్మ గారు సంపూర్ణంగా అనువదించిన ఈ ద్విపద రామాయణంలో బాలకాండ, సుందరకాండలు

మాత్రమే ముద్రితమైనవి . మిగిలిన భాగాల వ్రాతప్రతులు పూర్తిగా లభించలేదు. అనర్గళంగా సాగిపోతూ అలంకార యుక్తంగా,

ఛందోబద్దంగా, రాగయుక్తంగా రచింపబడిన ఇతని రామాయణాలు పేరెన్నికగన్న రామాయణాల సరసన పేర్కొనదగిన

గ్రంథాలుగా నిలబడగలవని చెప్పుట అతిశయోక్తి కాదు .ఆయన రచనలు శబ్దసౌష్టవాన్ని, అత్త గౌరవాన్ని

అలంకార వైచిత్రిని, రస స్ఫూర్తిని ,వ్యంగ్య వైభవాన్ని, భావ గాంభీర్యాన్ని పొదుగుకొని సాహిత్య ప్రపంచానికి రసానందాన్ని

కలిగించే రసవద్గంగలుగా మరియు ఆలోచనలను రగిలించే సాక్షర సత్యాలుగా సమాజంలో గౌరవింపబడగలవు .

తన అనుపమాన కవితా వైభవంతో శృంగేరి పీఠాధిపతులచే, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలైన కవిసామ్రాట్ విశ్వనాథ ,పద్మశ్రీ

డాక్టర్ సి.నారాయణ రెడ్డి గార్లచే ఘనంగా సత్కరించ బడినారు.

బతికినంతకాలం స్వస్థానంలో సామాజిక వాతావరణం తగినంత అనుకూలంగా లేకున్నా, ఎన్నో సందర్భాలలో పలు రంగాల్లో

మోసాలకు గురి అయినా కళా సాహిత్య సాంస్కృతిక రంగాలలో నటుడిగా కవిగా విద్వాంసుడిగా సఫలుడైనాడు . చివరి రోజుల్లో

 ఆర్థికంగా అస్తవ్యస్తమైన స్థితిలో పక్షవాతముతో మంచముపట్టి్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 9వ జనవరి 1988 వ తేదీ

పుష్య బహుళ పంచమి రోజున స్వర్గస్తులైనారు . సాహితీ సాంస్కృతిక రంగాలకు ప్రేరణా స్రోతమైన ఈ మహా జ్ఞాన వృక్షం

 మధురకవి స్వర్గీయ మామిడిపల్లి సాంబశివశర్మ గారి శతజయంతి సంవత్సరం ఇది ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com