సమాజ గమనంలోని ప్రతి అంశంపై స్పందించడం కవుల సహజసిద్ధ స్వభావం. కరోనా పై వస్తున్న కవిత్వాన్ని ఇందులో భాగంగా చూడాలి. కరోనా కేవలం ఒక వైరస్. నిర్జీవ పదార్థం. అయినప్పటికీ యావత్ ప్రపంచాన్ని కల్లోలానికి లోను చేస్తున్నది. ప్రపంచచరిత్రలో మొట్టమొదటిసారిగా మానవులంతా ఇంట్లోనే కూర్చుండిపోయే పరిస్థితిలోకి నెట్టివేసింది. దేశాలకు దేశాలు లాక్ డౌన్ ప్రకటించడంతో జనజీవనమంతా స్తంభించింది. చలనశీలత

ప్రాణంగా చరించే మనుషులంతా భయంతో బిగుసుకుపోయారు. ఈ నేపథ్యంలో ఉన్నచోటు నుంచి ఉన్నపళంగా కదలక తప్పడంతో కోట్లమంది వలస కార్మికులు భీతావహస్థితితో తల్లడిల్లారు.

కరోనా వైరస్ ఒక్కదానిపైన కాదు, మానవ స్వార్థం పైన, మార్కెట్ శక్తుల దుర్మార్గం పైన, ప్రకృతిని కబళించే బేహారుల మీద నిరసన వెల్లువెత్తింది. ఆ నిరసన స్వరాల కవితాగానమే ఈ ‘ఊపిరిపాట’. లజెట్టిపేట పరిసర

ప్రాంతాలకు సంబంధించిన 32 మంది కంఠస్వరాల్నించి ఒలికిన కవిత్వమిది. కరోనా వైరస్ నైజమే కాదు, వ్యవస్థల తీరు, పాలకుల నిర్వాకం మీద కవులకు నిర్దిష్ట అవగాహన ఉంది. అయితే వ్యవస్థ వైఫల్యాల మీద ఫిర్యాదు చేసినంతమాత్రాన సరిపోదు, తక్షణం వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోడమూ తప్పనిసరి. ఆ ఎరుకతో స్పందించిన గళాలని ఈ పుస్తకంలో వినవచ్చు.

ఈ పుస్తకంలో ప్రధానంగా ఆరు రకాల అంశాలకు సంబంధించిన కవితలున్నాయి.

1. కరోనా తీవ్రతని గురించి హెచ్చరిస్తూ, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పడం.

2. వలస కార్మికుల సంవేదన 3. ప్రకృతి, పర్యావరణం పట్ల పట్టింపు

4. అభివృద్ధి పేరిట జరుగుతున్న ధ్వంసంపై పునరాలోచన

5. కరోనా తీవ్రతతో పెరుగుతున్న పరాయీకరణ, మానవ సంబంధాల విధ్వంసం

6. పిల్లల, యువకుల భవిష్యత్… మహిళలపై లాక్ డౌన్ భారం

ఈ ఆరు అంశాల గురించి కవుల భిన్నరూపాల్లో స్పందించారు. ఏదో ఒక అంశానికే పరిమితం కాలేదు. ఈ ఆరు అంశాలలో కనీసం రెండు మూడు అంశాలపైన ప్రతి ఒక్కరు కవిత్వం రచించారు. ఈ క్రమాన వస్తు వైశాల్యం సంతరించుకుందీ కవిత్వం. వ్యక్తీకరణలో ఎవరి పద్ధతిని వారు అనుసరించారు.

ల్యాదాల గాయత్రి చెప్పినట్టు ఇది విచిత్ర సంగ్రామం. “అదృశ్యశత్రువుతో/ అలుపు లేని పోరాటంలో స్వీయ నిర్బంధంలో/ గడప లోపలే ఉండి’ తలపడకతప్పదు. ఆర్నెల్లు దాటినా కరోనా ఉధృతి ఆగడం లేదు. కందుల తిరుపతి చెప్పినట్టు – “నెర్రెలు బాసిన నేల వాన చినుకుల కోసం చూసినట్లు కనబడని కరోనా అంతం కోసం

ప్రపంచమే కునుకు లేక చూస్తున్నది” అన్న మాట అక్షర సత్యం. ‘నెర్రెలు బాసిన నేల’ అనడం ద్వారా కవికి పల్లె జీవనంతో ఉన్న అనుబంధం వ్యక్తమైంది. కరోనా కారణంగా మనుషులకు దూరం కావల్సిన పరిస్థితి విషాదం. ఈ విషాదాన్ని ఒక అవ్వ పరిభాషలో చెప్పినట్లు లేదాళ్ళ రాజేశ్వరరావు అక్షరీకరించిన తీరు ఆకర్షణీయం –

“ఈ రోగం మంట్లె పోను దుబాయిల గూడ మోపయిందట పర్లేదు, పైసల్లేవు ఎట్లనే అవ్వ ఆడికి రానిత్తలేరు

అన్నడు పోన్ల, తిన్న బువ్వ కలికలిగావట్టే ఉన్నొక్కపోరడు, ఆడోకాడ మేమోకాడ రోడ్లన్ని మూసిండ్రు, కరోనా రోగం వూల్లెకు రాకుండ వొంటికి రోగం అంటకుంట సూసకుంటం గని

మా మనసుల మనాది ఎవ్వరు మాన్పుతరు బిడ్డ…!” అన్న ప్రశ్నకు ఇప్పటికీ జవాబు లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇదంతా ఎప్పుడు ముగుస్తుందనే మనాదితోనే ఉన్నారు. ఈ బాధ ఉన్నా తప్పనిసరయిన స్థితిలో ఐ.వి.సుబ్బాయమ్మ అన్నట్టు “నేటి మన స్వీయ గృహనిర్బంధమే/రేపటి మన ఆరోగ్య మహాభాగ్యం” అన్న సత్యం మరువకూడదు. “అనివార్యమైతే ఆమోదించు” అంటాడు ప్రముఖ రచయిత డేల్ కార్నెగి. ఈ అవగాహనతోనే “శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకో మాస్క్ వేసుకో, రెక్కాడందే డొక్క నిండదు బతుకుపోరులో ముందుకు సాగిపో నీవే వైద్యుడివి, సిపాయివి, సఫాయివి నీకు నీవే రక్షకుడివని మరువకు…!” అంటున్నారు ముత్యం మల్లేశం. కరోనా భయంతో ఎన్నాళ్ళని ఇంట్లో కూర్చోగలరు సామాన్యులు. బయటికెళ్ళకతప్పదు, అయితే జాగ్రత్తలు తప్పనిసరి. ప్రభుత్వాలు చేతులెత్తేసాయి కాబట్టే ‘నీకు నీవే రక్షకుడివని’ గుర్తు చేస్తున్నాడు కవి. ఈ నేపథ్యంలోనే ‘ఖబర్దార్ కరోనా’ అంటున్నారు నూటెంకి భారతి… “ఇగ నువ్వు చేసింది చాలు గని / మేం నిన్ను మట్టుబెట్టకముందే/ నీ నెత్తి మీద నువ్వే | నీ మూడోపాదం మోపుకొని | పాతాళానికి తొక్కేసుకో” అని హెచ్చరిస్తున్నారు. అయిదు నెలలుగా కరోనా ఉధృతిలో మాటాముచ్చట లేకుండాపోయింది. నలుగురు కలిసిందీ, ఆడిపాడిందీ లేదు. లాక్ డౌనకు ముందున్న బతుకుంతా ఒక కలగా మిగిలింది. అందుకే “వివాహ వేడుకలలో తలమునకలైన బంధువుల్ని సాయంకాలాలలోని మిత్రుల సరదా సంభాషణల్ని కలగన్నాను… నేను కలగన్నాను…!

కలలో… ఎక్కడా కనిపించలేదు విచిత్ర వస్త్రధారణలు, భౌతిక దూరాలు మాస్కులు, శానిటైజర్లు, రెడ్ ఆరెంజ్ ను…! కరోనా గ్రహణకాలం వీడి

నా కల సాకారమైతే ఎంత బాగుండు” అన్నది జయ లేదాళ్ళ ఆకాంక్ష మాత్రమే కాదు, అందరి మనసుల్లో తిరుగాడే కోరిక ఇది. మనుషులు కలవకుండా ఉండలేనితనం ఎంత దుర్భరమో కరోనా విజృంభణ తెలియజెప్పింది. అందుకే కరోనా రాకముందటి గురించి కలగనడం సహజం. ఆ స్వప్నానికి తార్కాణం ‘కలగన్నాను’ కవిత. ఈ కలని నిజం చేయాలన్న లక్ష్యంతోనే వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నందునే “నీ వినాశానానికి జరుగుతున్నాయి పరిశోధనలు/ నిన్నంతం చేయడానికి కత్తులను నూరుతున్నాం” అంటున్న కొండు జనార్ధన్ మాటలు వాస్తవం. ఈ వాస్తవం త్వరగా సాకారం కావాలన్నదే మానవుల ఆరాటం. ఇది నిజం కావాలంటే వైరస్ కు దూరంగా ఉండాలి. అందుకోసమే “శత్రువు బలహీనతను/ వాడుకోకపోతే నువ్వే ఓడిపోతావు/ నువొక్కడివే కాక, ఏ పాపం తెలియని నీ వాళ్ళనీ బలి చేస్తావ్…” అంటూ జనాల్ని అప్రమత్తం చేస్తున్నాడు కవి నాగవర్మ ముత్యం. ప్రస్తుతానికి వైరసకు దూరంగా ఉండటమే తప్ప మరో మార్గం లేదు.

కరోనా వైరస్ ఒక విధమైన విపత్తయితే వ్యవస్థ వైఫల్యాలు మహావిపత్తుగా పరిణమించి కోట్లాదిమంది వలసకార్మికుల దీనగాథల్ని లోకానికి తెలియజెప్పాయి. ఆకస్మిక లాక్ డౌన్ వలసకార్మికుల పాలిటి పిడుగుపాటు. “నగరాలకు బతకవచ్చిన వాళ్ళు కాళ్ళను నమ్ముకుని బయలుదేరారు

ఎంతని నడుస్తారు… ఏమైపోతారు | పిల్లలు, వృద్ధులు, బాలింతలు

ఈ చోటుని తప్పించుకుంటే చాలని రాత్రి పగలు పరుగోపరుగు

దీనావస్థలకు బాధ్యులెవరు” అంటూ ప్రశ్నిస్తున్నారు గోపగాని రవీందర్. పనుల్లేక, పస్తులుండలేక సొంతూళ్ళకు తరలక తప్పని స్థితిలో వలస కార్మికుల అగచాట్లు వర్ణనాతీతం. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు వలస కార్మికుల బతుకుల్లో సృష్టించిన విషాద బీభత్సం చెప్పనలవికానిది. ఈ కరోనా కాలంలోనే విశాఖలో స్టెర్లిన్ వాయువు లీక్

భోపాల్ విషాదాన్ని గుర్తు చేసిన తీరుని చెబుతారీ కవి. ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపనలు పెత్తందార్లకే లబ్దిని చేకూర్చాయని స్పష్టంగా చెప్పారు. ‘కొన్ని విజ్ఞప్తులు’ శీర్షికన కరోనా కాలపు దారుణ నిజాలకు కవిత్వరూపం ఇచ్చారు. వలస కార్మికుల లాంగ్ మార్చ్ ఈ దేశ పేదరికాన్ని కళ్ళకు కట్టినట్టు చూపింది ప్రపంచానికి. “పూట పూట చేసుకొని బతికేటోళ్ళు పూట గడవక రాష్ట్రాలు దాటినోళ్ళు మాయదారి మహమ్మారి ముసురుకోగా ఊరు జేరుతారా ఊపిరి ఆగే లో పైనా…!” అని ‘వలసగోస’ని చెబుతున్నారు వినయ్ కుమార్ కొట్టె. ఊరు బాట పట్టినవారిది ఒక గోస అయితే, వారి కోసం ఎదురుచూసే అయ్య అమ్మలది మరో వేదన. “బతుకు దెరువు కోసం బాటసారివై ఈడ వుండిన నీడను విడిచి ఎల్లి పోతిరి ఏడ వుంటివో… ఎట్ల వుంటివో కాటిదాక పోకముందే కడసారి సూపుకైన వస్తవని.

కాటికాడ పిట్టవోలే మీ కోసం ఎదురు చూస్తుండిరి…” అని పల్లెల్లో ఉన్న అయినవాళ్ళ ఆవేదనని రాచకొండ శ్రీనివాస్ చిత్రించారు. పల్లెల్లో ఉన్నవారి కోసం కాలినడకన బయలుదేరిన వలసకూలీల మృత్యువు పాలవడం ఎంత ఘోరం! “అలసిపోయి ఆగిన వాళ్ళెందరో రైలు కూత పెట్టినా వినిపించని నిద్రలోనే పట్టాలపైన రక్తం ఏరులై పారింది వలసజీవుల రక్తం మరకలు ఎప్పటికీ మరిచిపోనివి, మాసిపోనివి…” అన్న సలిగంటి మల్లేశ్ మాటలు వర్తమాన చరిత్రకు చెదరని సాక్ష్యాలు. పాలకులు వివేచనతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈ దారుణాలు జరగకపోయేవి. ఎవరి దయాదాక్షిణ్యాల కోసం బిచ్చగాళ్ళుగా బతకాల్సిన దుస్థితి ఉండేకపోయేది అనే జనాల మనోగతం నూటెంకి రవీంద్ర కంఠస్వరంలోంచి వినిపిస్తున్నది…

“ఒక్క రెండొద్దుల యెసులుబాటిచ్చి ఎక్కడోల్ల నక్కడికి బంపితే – గీ తిప్పలుండేది గాదు, గిన్ని శిక్కులుండేవి గావు బంజేరుదొడ్ల తోలినట్టు శిబిరాలల్ల దోలితిరి కారట్లు గీరట్లు లెవ్వని కసిరిచ్చుకోవిరి బిచ్చ మేసినట్టు మా బొచ్చెల్ల గిన్నాన్ని మెతుకు లిదిలిస్తే యేడికి మొదలైతది? పుణ్యాత్ములు దానధర్మం జేసుకుంట

సెల్ఫీలు ఫోట్వలు దిగుతాంటే ఇజ్జత్ కే సగం పానం బోతంది” ఎవరో శిబిరాలు పెట్టి దానం చేస్తున్నట్టుగా పోజు పెడితే రెక్కల కష్టమ్మీద బతికే వారు అవమానంగా భావిస్తారు. ఆ అవమానపు తీవ్రతని వారిదయిన భాషలో వ్యక్తం చేయడం నూటెంకి రవీంద్ర కవిత్వ ప్రతిభకు నిదర్శనం. ఈ విధంగా ఈ సంకలనంలోని చాలామంది కవులు వలసజీవుల శ్రమైక జీవన సౌందర్యాన్ని తలపోస్తూనే వారిని నానాయాతనలకు గురిచేసిన పాలకుల దుర్మార్గం మీద కవితాస్త్రాలు సంధించారు. “బ్రతుక్కు భరోసా పొందలేక పోయినోళ్ళు వలస కూలీలో – అసంఘటిత రంగ కార్మికులో ఎవరైతేనేం? వాళ్ళే గదా భారత భాగ్యసృష్టి విధాతలు” అంటూ ఈ దేశం సుసంపన్నం కావడానికి తోడ్పడుతున్న శ్రమజీవులని తన కవితాక్షరాలతో సత్కరిస్తారు ‘సత్యా’పతి.

కరోనా కాలం మన అభివృద్ధి నమూనాలని, జీవనశైలిని పునర్విశ్లేషణ చేసుకోవలసిన అవసరాన్ని తెలియజెప్పింది. ఈ వాస్తవాన్ని మనసుకు హత్తుకునేలా చెప్పారు కొందరు కవులు. అలాగే ఈ దుర్భర కాలాన “ఎవరికెవరు లేరు/ ఎవరి కోసం ఎవరూ రారు” అని ఎరుకపరుస్తూనే “మానవత్వమే మనిషితనమని మరొక్కసారి నినదిద్దాం/ మనిషే మనిషికి ఎప్పుడూ తోడని / ఇకనైనా మేల్కొందాం” అంటారు యస్.నీళాదేవి. అలాగే వలస కార్మికుల సంవేదనలకు చలించిపోతూ “నడకదారుల నరక వేదనల కన్నీళ్ళు/ మా కళ్ళ ముందే కదలాడుతుంటే/ మానవత్వం సవాల్ చేస్తుంది” అని గుర్తు చేస్తారు యం.ఏ. గఫార్. “కళ్ళుండీ చూడలేక/ నోరుండీ మెదపలేకపోతున్న” మనుషుల

తీరును వెన్న మహేష్ అభిశంసిస్తారు.

“కనిపించని సూక్ష్మజీవి వారి జీవితాను ఛిద్రం చేసింది” అంటూ తోపుడుబళ్ళ టిఫిన్ సెంటర్ల వారి బతుకుదైన్యాన్ని మల్లూరి శ్రీనివాస్ తమ కవితలో వినిపించారు. బయట తినడం మాసిపోయి ఇంట్లో తినడం అలవాటయ్యాక మహిళల మరింత సమయాన్ని వంటింట్లోనే వెచ్చిస్తున్న మహిళల మనోభావాలకు ‘కిచెన్ ఫ్యాక్టరీ’ కవితలో నగధర్ వేల్పుల చిత్రిక పట్టారు.

ముఖ్యంగా ప్రకృతిని జయించే పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్న మానవుల్ని పునరాలోచనలలో పడేసింది కరోనా సందర్భం. “ప్రకృతి వరాలైన కొండలను పిండి చేశాము/ అడవిని మింగేశాము/ నదుల గతిని మా స్వార్థానికి మార్చేము” అంటూ జరిగిన వినాశానాన్ని ఏ.వి.మూర్తి గుర్తు చేశారు.

ప్రకృతినీ, సాటి మానవులనీ స్వార్థానికి వాడుకునే వారు కరోనా మహమ్మారికి బెంబేలెత్తిపోతున్న సమయాన “నీకు సృష్టించ నలవి కాని సహజవనరులను/ నీ విలాసం కోసం వాడేస్తున్నప్పుడు, తోడేస్తున్నప్పుడు నీకన్యాయం అనిపించలేదా” అని ప్రశ్నిస్తారు రత్నం తులసిపతి.

కనుకనే “ప్రకృతి రక్షణే తనకు శ్రీరామరక్ష అన్నీ ప్రకృతిని భక్షిస్తే తన ప్రకోపానికి బలి కాక తప్పదనీ/ మనిషి గ్రహించిన నాడే ఇలాంటి విపత్తుల నుండి/ జగతికి విముక్తి” అన్న నాగశ్రీ కవితా పంక్తులు అందరికీ అంగీకార

యోగ్యం. ప్రకృతిని మన్నించడం మానవునికి శ్రేయస్కరం. కరోనాని జయించాలన్న సహజమైన ఆరోగ్యపద్ధతులు అనుసరించాలని “ప్రకృతియే నీకు పరమౌషధం/ విశ్వ మైత్రి తోడ విజయమును సాధించు…!” అన్న శ్రీనివాస్ గుర్రాల మాటలు శిరోధార్యం. ఈ సంక్షుభిత స్థితిలో కాసం కుమారస్వామి సృజించినట్లు “ప్రకృతి మాత సహజత్వాన్ని కాపాడుదాం/ సానుకూలతే మార్గంగా జీవిద్దాం”. ఇదే ఇపుడున్న సరికొత్త జీవనవిధానం.

ఇంకా అనేకానేక కఠోర వాస్తవాలకు కవితారూపం ఇచ్చారు ఈ సంకలనంలోని కవులు. “ప్రతి మనిషిలో ప్రాణభీతిని కలిగించావు/ ప్రతి మనసులో పరిశుభ్రతా రీతిని రగిలించావు” (దాసరి జనార్దన్) అన్నది ఇవాళ మన నిత్యజీవితంలో అంతర్భాగమైన నిజం. గూడ రాజేందర్ చెప్పినట్టు “మనిషి బంధాలని బందీ చేసింది”. ఇంతటి భయానక పరిస్థితిలో సేవలందిస్తున్న వైద్యులని “పోరాటయోధులు”గా మిట్టదొడ్డి వెంకట సుధాకర్ అభివర్ణించడం అభినందనీయం. వైద్యులకు వందనాలు సమర్పిస్తూనే “పురివిప్పిన కరోనా దారులు మూయాలి/ అంటుకున్న కరోనా హారాన్ని తుంచాలి” అన్న పెద్ది భరత్ మాటలు పాలకుల, ప్రజల కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాయి. కరోనా విలయం కారణంగా సకల రంగాలు స్తంభించి పోయాయి. ముఖ్యంగా “ఆగమగమయిన చదువులు/ అర్ధాంతరంగా ఆగిన కొలువులు” ఎలాంటి సంవేదనలకీ, సంఘర్షణలకీ కారణమయ్యాయో ‘కరోనా తరుణం’ ద్వారా బత్తుల ద్వారకామాయి ఆర్ద్రతతో తెలియజెప్పారు.

అనేకానేక సంక్లిష్టతలతో ముడిపడిన ఈ కరోనా సందర్భంలో తమ అంతరంగంలోని అలజడిని కవిత్వం చేయడానికి కవులు చేసిన ప్రయత్న ఫలితమే ఈ సంకలనం. ఊపిరి తీసే కరోనాని ప్రతిఘటించాలన్న సంకల్పం, దృఢచిత్తం ఈ కవిత్వం నిండా పరుచుకుంది. పాఠకులని అప్రమత్తం చేయడమే కాదు, ధైర్యంగా ఎదుర్కొందామనే ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేయడం ఈ కవిత్వం సాధించిన సాఫల్యం. లక్షిట్టిపేట కేంద్రంగా కవులు సృజించిన ఈ కవిత్వం ప్రత్యేకమైంది. ఈ కాలానికి అవసరమైంది. వస్తువులో వైవిధ్యం, వ్యక్తీకరణలో సరళత, స్పష్టత సంతరించుకున్న కవిత్వమిది. ఆర్తితో, ఆర్ద్రతతో స్పందించిన కవులకు అభినందనలు. లక్షిట్టిపేట సాహిత్యకేంద్రంగా మరింత మంది సృజనాత్మక రంగంలోకి రావడానికి ఈ ‘ఊపిరిపాట’ దోహదం చేస్తుందన్నది ఆకాంక్ష.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com