తెలంగాణ ముద్రతో వచ్చిన నవల సుషుప్తి.”కుమ్మరి కుల వ్రృత్తి” వస్తువుగా తెలంగాణ లోనే కాక మొత్తం తెలుగు నవలా సాహిత్యం లో ఇప్పటి వరకు వచ్చిన ఒకే ఒక్క మొదటి నవల,”సుషుప్తి”.

1970 దశకంలో వచ్చిన ఈ వ్రృత్తినవల మాదిరెడ్డి సులోచన సామాజిక స్పృహ కు,

సాహిత్య నిబధ్ధతకు నిదర్శనం.1947-55 మధ్యకాలంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన

లోకమలహరి పద్మశాలీల వలస జీవితాన్ని వస్తువుగా ‘సంగం’నవల రాసిండ్రు.ఇందులో

భీవండి, సూరత్,బొంబాయిలకు వలస పోతున్న పద్మశాలీల జీవితాలను చిత్రీకరించిండ్రు.

సంగం నవల తర్వాత తిరిగి కుల వ్రృత్తిపై వచ్చిన నవల సుషుప్తి.తెలంగాణ కుల వృత్తుల నుంచి కుమ్మరి కులాన్ని వస్తువు గా, వాళ్ల జీవితాలల్ల సంక్రమిస్తున్న మార్పులను కుల జీవితాన్ని విపరంగా ఛిత్రిస్తూ మాదిరెడ్డి సులోచన ” సుషుప్తి” నవలను రాసింది.

‘కులవృత్తి’ పై నవలను రాసిన మొట్టమొదటి రచయిత్రిగా తెలంగాణ మరియు మొత్తం తెలుగు సాహిత్యంలోనె విశిష్టతను పొందిన రచయిత్రి “మాదిరెడ్డి సులోచన”.

‘సుషుప్తి’ నవల 1975 లో శేషాచలం&కంపెనీ, మద్రాసు నుంచి ప్రచురితమైంది.

అప్పుడు ఈ నవల ధర మూడు రూపాయల యాభై పైసలు.

మారుతున్న ఆర్థిక సామాజిక వాతావరణంలో,1970-80 దశకంలో సామాజిక చలనం ఏర్పడటం, పల్లెజనం పట్నానికి, పట్నం వాళ్లు నగరం వైపు బయలు దేరడం ప్రారంభమైంది. జీవితంలో వికాసం, స్తోమతసు పెంచుకోవడం కొరకు తాపత్రయం ఏర్పడింది.

అంతవరకున్న కుల వృత్తుల షగ్రామీణ వ్యవస్థ పై పారిశ్రామికీకరణ ప్రభావం బలంగా పడ్డది.

కుల వృత్తిని నమ్ముకుని గ్రామాలనే అంటిపెట్టుకున్నవాళ్ళ జీవితాలు అడుగంటి పోయినయి

ఇట్లా–దెబ్బ తిన్న వృత్తుల్లో కుమ్మరి వృత్తి ఒకటి..

“కుమ్మరి బాలయ్య” కుటుంబ జీవితాన్ని,వాళ్ళ వృత్తిని నేపథ్యం గా పెట్టుకొని రచయిత మాదిరెడ్డి సులోచన అప్పటి తెలంగాణ గ్రామ జీవన సంస్కృతిని మొత్తం అద్దంలో మాదిరి చూపించింది.

తెలంగాణ లో సాంఘీక వాతావరణం మారుతున్న క్రమంలో అన్ని కుల వృత్తులు రోజు రోజుకు ఎట్ల పతనావస్థకు చేరుతునృ యో రచయిత్రి నవల మొదట్లనే చూపించింది.

కుమ్మరి బాలయ్య కుల వృత్తి వివరాలు చెప్పుకుంట తెలంగాణ గ్రామీణ జీవితంలో ప్రవేశిస్తున్న ఆధునిక భావజాలాన్ని, మార్పులను ఆవిష్కరించింది.

పారిశ్రామికీకరణ ఫలితంగా ప్లాస్టిక్ వస్తువులు, స్టీలు,సత్తుగిన్నెల వాడకం 70వ దశకం నాటికి పల్లెల్లో కూడా మొదలైంది. నిత్యావసర వస్తుజాలంలొ మార్పుల వల్ల ఎక్కువ ఇబ్బందులు కలిగింది కుమ్మరి వాళ్ళకే! వంట సరుకులో మార్పు-అంటే కిరోసిన్. స్టౌలు,

గ్యాస్ వంటివి ప్రవేశించటంతో మట్టి పాత్రలు వంట చేయడానికి ఉపయోగపడక పోవటం వల్ల

అటికెలు,సట్టిలు,ముంతలు వంటి మట్టి పాత్రల వాడుక, రెఫ్రిజరేటర్లు రావటం వల్ల చల్ల నీళ్ల కు కుండలు, కూజాలు

పెద్ద మొత్తంలో తగ్గి పోయినయి. ఇండ్లు కప్పడానికి, ‘మట్టి పెంక’

బదులు సిమెంటు రేకులు, నీళ్ళు తెచ్చుకోవడం కోసం మట్టి కడవలకు బదులు ప్లాస్టిక్ బిందెలు వాడటం వంటి అనేక మార్పులు జనజీవనం లో సంభవించడంతో కుమ్మరి వాళ్ల

‘బతుకుదెరువు’ కు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. “కుమ్మరిసారె” మూలపడే ప్రమాదం పొంచివున్న తీరును రచయిత్రి చాలా సహజంగా చిత్రించింది.

ఊరు-పట్ణం అనే తేడా లేకుండా తెలంగాణ జానపద జీవనసంస్కృతి లో ఏ శుభ కార్యానికయినా అశుభ కార్యానికయినా కుమ్మరి కుండలతోనె పని! గ్రామీణ జీవనసంస్కృతి లో అన్నంకూర వండుకోవడానికి, మంచినీళ్ళు తెచ్చుకోవడానికి, ఈడిగోళ్ళు ‘కల్లు’ నింపనీకె,

పెండ్లి పేరంటాలు వంటి అన్ని అవసరాలకు కుమ్మరి కుండలు పనికొచ్చేయి.ప్లాస్టిక్ సంస్కృతి పల్లెల్లో కి వ్యాపించిన తర్వాత చాలా అవసరాలను ప్లాస్టిక్ సామాను తీరుస్తున్నది.

అందువల్ల కుమ్మరి వాళ్ళు పూర్తిగా కుల వృత్తి పై ఆధారపడి జీవించే పరిస్థితి లేకుండ పోయింది.

కుమ్మరి బాలయ్య గురించి—

ఒకప్పుడు తన వృత్తి లో ఓ వెలుగు వెలిగినాడు బాలయ్య. బాలయ్య చేసిన కూజాలంటే జిల్ల కంతా ప్రసిద్ధి. అలాగే అతను కూర చట్టీలు చేసి నార్సింగ్ సంతకు తీసుకువెడితే గంటలో అన్నీ అమ్ముడు పోయేవి!

“బాలయ్య పెరుగు తోడు పెట్టె ముంతలు యెంత బాగా చేస్తాడో, జాడీలు కొన బుధ్ధి వెయ్యదు” అనేది నర్సింహారెడ్డి భార్య లక్ష్మమ్మ.

“బాలయ్యా పూలకుండీలు నువ్వు చేస్తే మన్నుతాయి.చూడటానికి అందంగా ఉంటాయి”.డాక్టర్ గారు స్వయంగా కుమ్మరివాడకు వచ్చి తనకు కావలసినవి ఎన్నిక. చేసుకునేవాడు.

“అబే బాలయ్యా- – నాకీ కుండల్ కావాల్ భాయి”- – ఒకప్పుడు నవాబు గిరి వెలగబెట్టిన దావూద్ లుంగీ సవరించుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కుండలు యెన్నిక చేసుకు పోయే వాడు.

“బాలన్నా చిప్పలు నీ ఆముల కాలితే గట్టి గుంటయె – –” అంటూ చాకలి, హరిజన, బెస్తవాడల నుంచి స్త్రీలు వచ్చే వారు.

“ఓ బాలయ్యా! ఏందోయ్ కనిపించటం లేదు. వారం రోజుల నాటికి రెండొందల కల్లు ముంతలు కావాలి. తయారయితయా?” గౌండ్ల స్వామి వచ్చి మట్టి దులుపుకొని కూర్చునేవాడు.

“నోములకు కొత్త కుండలు కావాలి. కాస్త మధ్యస్తంగా చెయ్యవోయ్” – –కోమటి వాడ నుంచి ఆర్డరు వచ్చేది.

—– ఇవన్నీ ఇప్పుడు కాదు. ఒకప్పుడు. బాలయ్య వయసు లో వున్నప్పుడు.అతని చేతి కింద యెప్పుడూ నలుగురు పని చేసేవారు. ‘పని నేర్చుకుంటాడంటూ’ బంధువులు, తెలిసిన వారు తమ తమ పిల్లలను వదిలి పెట్టె వారు.

బాలయ్య భార్య యెంకమ్మకు కంప కు వెళ్ళే పని లేదు. కాళ్ళ కు కడియాలు నడుము కు మూడు అంగుళాల వెడల్పు తో వెండి వడ్డ్యాణం, మట్టి గాజుల వెనుక, ముందు వెండి కడియాలుండేవి.చెవులకు గెంటీలు,మెడలో గుండ్లపేరు ఉండేవి.”కుమ్మరి యెంకమ్మనా., పూసిన తంగేడు లా వుంటుంది” అనుకునేవారు తోటి స్త్రీలు. పంట లేకపోయినా, వ్యవసాయదారులకు కుండలిచ్చి తెచ్చిన ధాన్యం ఇంటినిండా ఉండేది.

దారులకు కుండలిచ్చి తెచ్చిన ధాన్యం ఇంటినిండా ఉండేది.

బాలయ్య మాటలల్ల మారిన కాలం గురించి —

“బెమ్మంగారు సెప్పిన కాలమిదేనేమో! తోలు బట్టలు, టీలు గిన్నెలు! నా కుండలు ఎవడీకి కావాలె? పెంక కప్పితే యిల్లు గాదంట – — – సిమిటి రేకులంట,. రేకులు.. నా సేత్తో

ఇచ్చేవోడిని,యెండకాలం ఎల్లుదలకు నూరు కూజాలు రెడ్డి గోరింట్ల. అదేందో అయిసు పెట్టెనంట….”ఇలా సాగుతుంది…

— ఈ నవల రాసే నాటికి గ్రామీణ జీవితంలో ప్రవేశించిన, ప్రవేశిస్తున్న మార్పును కథాకథనం చేసింది రచయిత్రి – – -“ఇప్పుడు బీదవారు కూడ పగిలే కుండలెందుకు – -అని సత్తుగిన్నెలు కొనుక్కుంటున్నారు.పెంకుటిళ్ళు కూడా చాలా తగ్గాయి. పది రోజుల కో చన్నీటి కూజాలు మార్చే ధనికులు కూడా రెఫ్రిజఠేటర్లు కొంటున్నారు.కుమ్మరి బాలయ్య తన సింహాసనం కోల్పోయి నట్లు బాధ పడతాడు. ఆ కసి భార్య మీద కొడుకు మీద తీర్ఛుకుంటాడు.”…అని బాలయ్య దిగజారి పోయిన వృత్తి జీవితాన్నిచిత్రించింది.

ప్రత్యామ్నాయంగా గ్రామాలల్లకు దిగుతున్న వస్తుజాలానికి రచయిత్రి చేసిన దృశ్యీకరణ– —-

“యెంకమ్మ గంప నిండుగా పిడుతలు పేర్చుకొని అంగడి వెళ్ళింది.ఆమె గంప దింపుతుండగానె ఎదురు గా స్టీలు గిన్నెల కొట్టు కనిపించింది. కసిగా తిట్టుకుంది.–

ఈటె ఇంట్ల దుమ్ము వడ! ఇవ్వి వచ్చనంక బేరాలు లేవు.సాయంత్రం వరకు కూర్చుంటే పది గురుగులు అమ్మ గలిగింది…

ఆకుల బుచ్చీ జర గంప ఎత్తు బిడ్డ్యా!

ఆకులు అమ్ముతున్న అమ్మాయి వచ్చి గంప ఎత్తింది.తలమీది బరువు తో అటుయిటు చూడలేక పోయింది.దూరం గా వున్న రెండు పక్కల కొట్లు కనిపించాయి.ఆకొట్లవాళ్ళందరూ

తమ జీవనోపాధి లాక్కుపోవడానికి వచ్చినంత బాధ పడింది. ఆమె బాధపడినదాంట్లో తప్పు లేదు.

గంగమ్మ గంప నిండుగా మిరపకాయ బజ్జీలు, బోండాలు,రొట్టెలు తీసుకుని సంతకు వస్తే నాల్గు దాటకముందే గంప ఖాళీ అయ్యేది. ఇప్పుడు ? చిన్న బుట్టలో తెచ్చి ఈగలు తోలుతూ కూర్చుంటుంది. ప్రతివాడు అయ్యరు హోటలుకే పోతాడు.లేదా సాయబు టీ కొట్టుకు వెడతారు.

గంగమ్మ గంప నిండుగా మిరపకాయ బజ్జీలు, బోండాలు,రొట్టెలు తీసుకుని సంతకు వస్తే నాల్గు దాటకముందే గంప ఖాళీ అయ్యేది. ఇప్పుడు ? చిన్న బుట్టలో తెచ్చి ఈగలు తోలుతూ కూర్చుంటుంది. ప్రతివాడు అయ్యరు హోటలుకే పోతాడు.లేదా సాయబు టీ కొట్టుకు వెడతారు.

గాజుల బంగారు పని అంతే అయ్యింది. రంగు రంగుల గాజులు భుజానికి వేసుకొని తిరిగితే,

వీధిలో వారు పిలిచి గాజులు వెయ్యమనే వారు,

మల్ల వచ్చే టప్పుడు ఏస్త. అంగట్లకు పోవాలె అనేది.

మంచి గాజులు అన్ని అయిపోవా అని ముత్తయిదువులు దెబ్బలాడెవారు.

….ఇగో ఇవి గుణసుందరి గాజులు… శ్రీ లచ్చుమమ్మ గాజులు.. అంటూ మలారం తీసేది.

నిమిషాల మీద పెట్టె ఖాళీ అయ్యేది. బంగారు కు బేరమే లేదు.మిగులు పడ్డ గాజులు సంతయిన మర్నాటికి ఇల్లు ఇల్లు తిరిగి అమ్ముకుంటుంది…

సంత వీధిలోనెగాజుల కొట్టు వెలిసింది. దాంట్లో గిల్టు నగలు, రిబ్బన్లు, బొట్టు కాటుక, లేసులు,

సబ్బుపెట్టెలు –ఇలా రకరకాలు అమ్ముతారు. అందరూ దర్జాగా కొట్టుకే పోతారు.

దర్జీ ఇస్తారి పెళ్ళాం మిగిలిన గుడ్డలతో డబ్బులు దాచుకోవటానికి చిన్న చిన్న సంచులు, చిన్న పిల్లల టోపీలు కుట్టేది. సంత రోజు నిమిషాల మీద అన్ని అమ్మి వారానికి కావలసిన కూరానారా కొనేది.ఇప్పుడు వాటి ముఖం ఎవరూ చూడటం లేదు…

వారిలో తనొకత్తి అనుకుంది యెంకమ్మ.కుల వృత్తి వదిలి వేరే పని చేసుకోవాలంటే మనసు అంగీకరించదు”.

—–ఇట్లా పల్లెలు, పట్ణాలల్ల ప్రవేశిస్తున్న కొత్త వస్తువులు, వ్యాపారజీవనశైలి వల్ల కులవృత్తినే

నమ్ముకుని బతుకుతున్న బాలయ్యలు ఎందరో వ్యథార్థ జీవులుగా మిగిలి పోవలసి వచ్చిందన్న వాస్తవాన్ని రచయిత్రి పాఠకుల కళ్ళముందుంచింది.

ఇంక వీళ్ళ చదువుసంధ్యల గురించి రచయిత్రి కథాకథనం—

వారికి పుట్టింది ఒక్కడే కొడుకు ‘గోవిందు’.బడికి పంపితే స్కాలర్ షిప్ వస్తుంది అని పంపేవారు. అతను చదివాడా ఊళ్ళో తిరిగాడా వాళ్లకు అక్కర లేదు.ఎప్పుడయినా బజార్లో మాష్టారు కనిపించి చీవాట్లు వేసేవాడు.

“– ఏం బాలయ్యా, కుర్రాడి సంగతి బొత్తిగా పట్టించుకోవేం? రోజూ సాయంకాలం మా ఇంటికి

పంపవయ్యా ” అనేవాడు.

“సదువుకొని ఊల్లు ఏలాలా, ఉద్యోగం సెయ్యాలా! మా పని వుంది. వాడొక్కడు బతక్కపోడు”

అనేవాడు

గోవిందు తో పెళ్లి నాటి కే గర్భం దాల్చిన సుక్కి పెళ్ళయిన ఎనిమిదో నెలలోనె కొడుకు ను కంటది.ఆ బిడ్డ తండ్రి తను కాడని దావూద్ ద్వారా తెలిసిన మరు క్షణం తట్టుకోలేక గోవిందు,

” సెప్పే , దెష్టా సెప్పు… ” సుక్కను వంగదీసి నాల్గు గుద్దులు వేశాడు.

” ఒకప్పుడు తండ్రి తల్లి ని కొడితే , తన కంటే బలహీనురాలయిన స్త్రీ ని కొట్టి ‘మొగవాడు అనిపించుకోవటమా’ అని అసహ్యించుకున్న గోవిందు భార్యను కొట్టాడు.అతను కాదు అతని శరీరం లో వున్న రక్తం కొట్టింది.అందుకే కొందరు స్త్రీ స్వేచ్ గా అనుభవించే లైంగిక జీవితం అరికట్టారు.ప్రకృతి పక్షపాతాన్నెవరు కాదనలేరు.స్పష్టంగా లైంగిక జీవితానికి ఫలితం మూట గట్టుకుంటుందని తెలుసు ” — అంటుంది రచయిత్రి ఇక్కడ..

” వదులు, వదులు ” అతన్ని దూరం నెట్టింది. బాలెంతరాలు.పచ్చి శరీరం దెబ్బలకు ఓర్చుకోవడం లేదు.అపర కాళిలా గోవిందు పైకి లేచింది సుక్క..

— “సత్తెం జెబుతాను. ఏం జేస్తవో జేసుకో. ఈ పిల్లగాడు ఎవరి పిల్లగాడో, నేను మా సర్పంచి కొడుకు తొ తిరిగినా..”

” ఆన్నే పెండ్లి జేసుకోక పోయినవు..”

” చేసుకుందమనుకున్న. ఆ మొదనష్టపోడు నీ అసుంటి మొగోడే. అందుకని ఆని కులం పిల్లను జేసుకున్నడు.”–ఈ సారి సుక్క మాటల్లో తెగింపు, కరుకుదనం స్పష్టం గా కనిపించాయి.

” నన్నెందుకు జేసుకున్నవే?”

” బుధ్ధి లేక ” అన్నది నిర్లక్ష్యంగా..

” అయితే బద్మాష్ ఒక్క గడియ ఉండొద్దే.. ఫో, ఫో. సుక్క ను తరిమేశాడు..

” పోత తీయి – నువు కూకుండవెట్టి బువ్వ వెట్న్యట్టు మాట్లాడ్తవు -ఇదే కష్టం జేసుకోని నా పిల్లగాడిని నడుపుకుంట “–

” కష్టమెందుకే లవ్డీ ! సర్పంచి కొడుకు బువ్వ వెట్టడు ? ”

“పెడ్తే పెడ్తడు లే. నువ్వు మా ఉధ్ధరించిట్టు.. చిలశిన్న తప్పు కు మీరు ఎన్ని మాటలన్నా పడ్డ.

కూటికి లేకపోతే, నా తప్పు చూపి బయట పెట్టి పైసలు తెచ్చిన. ఈన సుద్దపూస నంట. పెండ్లమును సాదలేక ఇడ్సి పెట్టి మల్ల మాట్లాడుతడు.”

గోవిందు నోటమాట రానట్టుండి పోయాడు.” మాట్లాడేది సుక్క నా అనుకున్నాడు.

భుజం మీద వేసుకొని వెళ్లి పోయింది.

స్త్రీ వ్యక్తిత్వం, పురుషాధిపత్య సమాజం పై నిరసనలు యెంకమ్మ మాటల్లో వినిపించింది రచయిత్రి —

— “శిగ్గు శరం లేదే నీకు ? ” — అన్న బాలయ్యను తిరస్కారంగా చూచింది యెంకమ్మ. ఆమె గుండె లోని మంట ఎవరి కి అర్థం కాదు.డినా

” ఏందీ ? శిగ్గు శరమా ? అవి రొండు న్న మనుస్లు కొంగు నడుముకు కట్కోని కంపకు వోరు. లో తొడలు కనిపించే దాక చీర పైకి జెక్కి పన్లు జెయ్యరు.”– అన్నది.

‘ స్త్రీలకు శిగ్గు శరమూ ఉండాలంటే అవి కాపాడబడాలంటే, పురుషుల స్వభావం ప్రవర్తన లు మారినప్పుడే జరుగుతది .స్త్రీ కొక నీతి పురుషుని కొక నీతి వుస్నంత కాలం స్త్రీ పురుషసంబంధాలల్ల అనైతికతనే వ్యాపించి వుంటది.’– అన్న సామాజిక వాస్తవం ప్రతిబింబింబిస్తయి పై రెండు స్త్రీ పాత్రలు !

నలభై సంవత్సరాలకు ముందటి తెలంగాణ సమాజం లోని జానపద ఆచారాలు, కుల కట్టు బాట్లతో కూడిన పెళ్లి, పుట్టుక, చావు వంటి పధ్ధతులు – వాటి లోని మానవీయ కోణాలను ‘సుషుప్తి’ లో ఆవిష్కరించింది రచయిత్రి..

స్థానిక ఆచారాలను వ్యక్తం చేసే తెలంగాణ పలుకుబడి, పడికట్టు పదాలను అక్కడి కక్కడే వివరిస్తూ రాయటం నవల లో రచయిత్రి కథనశైలి లో చూపిన మరో ప్రత్యేకత..

భాషకు సంబంధించినంత వరకు, ‘తెలంగాణ జానపద భాషారూపాల పదకోశము’ , ‘సుషుప్తి’నవల అంటే అతిశయోక్తి కాదు.రచనా భాషగా కథాకథనానికి రచయిత్రి కొంత ప్రామాణిక భాషను అక్కడక్కడ వాడినా, సమయ సందర్భాలను బట్టి పాత్రోచిత భాషను సన్నివేశాల చిత్రీకరణకు , సంభాషణల కు ప్రయోగించింది —

“యెంకమ్మ పూసిన తంగేడు లా వుంది” అని తంగెడు చెట్లు తో పోల్చటం కేవలం తెలంగాణ భాషా ప్రయోగం!

జానపదుల తిట్లు, ఒట్లు, ఏడుపులు, దీవెనార్తులు, సామెతలు.. తెలంగాణ పలుకుబడి, జాతీయాలతో ఈ నవల ను తెలంగాణ భాషా పరంగా సుసంపన్నం చేసింది. ఆడవాళ్ల సంభాషణలు,మగవాళ్లసంభాషణలు, పడుచు పోరగాళ్ళ మాటలు, మంచినీళ్ళబాయి కాడి అమ్మలక్కల ముచ్చట్లు, దావూద్ లాంటి ముస్లింల ఉర్దూ పలుకుబడి తో కూడిన తెలుగు మాటలు– ఇట్ల , ఒక సజీవ స్థానిక భాషా శైలులకు చిత్రిక పట్టింది రచయిత్రి !

‘సుషుప్తి’ నవల ఆధారంగా తెలంగాణ భాషకు సంబంధించిన చిన్న పదకోశం తయారు చెయ్యొచ్చు–పదులే కాదు వందలల్ల అనొచ్చు- – పలుకుబళ్ళు, జాతీయాలు, జానపద నిరుక్తులు, కాకువు,అర్ధఛాయలతో కూడిన తెలంగాణ గ్రామీణ భాషారూపాలు నవల

అంతటా పొందుపరచ. బడ్డయి.

“అబే సాలె, లమ్డీ, లంజ,నెత్తి తుప్పలు పట్టి తంత” — వంటి తెలంగాణ తట్లను నిరభ్యంతరంగా రాయ గలిగింది అంటే, సామాన్య ప్రజలు మధ్య ఒక సామాన్యురాలిగా జీవితం గడిపి నప్పుడే సాద్యమయితది.

వందలల్లో ఉన్న ఈ రచయిత్రి రచనల్ల గొప్ప జీవద్భాష, జీవితానుభవాలు ద్యోతకమయితయి !!

ఈ నవలా వస్తువు లోని ప్రధాన అంశం — “ఆకలి”.దాని భయంకర స్వరూపం!!

గ్రామీణ వృత్తుల అసంఘటిత శ్రామిక జీవనంలో, స్వాతంత్ర్యానంతరం భారతీయ ఆర్థిక వ్యవస్థ లో బడుగు బలహీన సామాజిక వర్గాలకు జరిగిందేమిటో చూపిన నవల– “సుషుప్తి”.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ నవలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన, ‘ప్రపంచ తెలుగు మహా సభలు’ సందర్భంగా, “తెలంగాణ ప్రచురణలు,హైదరాబాద్” వాళ్లు

2017 లో రెండవ ముద్రణ ను తీసుకొచ్చి, మరుగుపడ్డ తెలంగాణ మాణిక్యాలలో ఒకరయిన రచయిత్రి– “మాదిరెడ్డి సులోచన” ను తిరిగి వర్తమానం లో తెలుగు పాఠకుల మధ్యన నిలుపటంతో పాటు, ” బహుజన వృత్తి నవల – సుషుప్తి” ని వెలుగులోనికి తెచ్చిండ్రు.విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధన కు పాత్రమైన నవల ‘సుషుప్తి’ !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com