మబ్బులదుప్పటి కప్పుకుని రాత్రంతా చినుకేసి, మునగదీసిన చుట్టపువాన ఉదయాన కూరాడు బువ్వ తినకుండనే వెళ్ళిపోయింది. “పాడిందే పాడేరా! పాసు పండ్ల దాసరి!” అని రోజూ రాత్రంత వర్షమే, సినిమాకు పోకుండ.

“గంగ విడువుము పార్వతి చాలున్!” అని అడగక ముందే వరమిచ్చి వదిలినట్లుంది శివయ్య. ఎటు చూసినా నీళ్లు… ఊరంతా నీళ్లు… నీళ్లలోనే ఊరు.

తాడి చెట్టు ఎత్తుతో మూలవాగు పొంగుతుంది.

కట్టుకాలువ నిండుగా… చాయ్ నీళ్లతో కదులుతుంది చెరువుకు తాగించ.

లాలపల్లెకు పోయే తొవ్వను కడుపులో దాచుకుంది చామకుంట.

చెరువు నిండి, నీటిప్రవాహం కట్ట పైనుండి దొర్లడానికి అలలపాదాలతో పరుగులు పెడుతుంది. కట్ట యాడ తెగిపోతుందోనన్న భయంతో కట్ట మైసమ్మకి మొక్కుకుని, బలి ఏర్పాట్లు చేస్తున్నరు పెద్దలు.

ధర్మ గుండం, చెరువు కల్సి యుగళగీతంలా కలిసి పోవడానికి పోటీ పడుతున్నయి. గుండం లోని మంటపాలు మునిగి పైకప్పులు తఫుకుల్లా తేలుతున్నయి. నడిచే దారిలోకి నీళ్లు వొచ్చి గుడి ప్రహారి గోడలను తాకుతున్నయి. పెద్ద బజారు వైపేమో మెట్ల పైనుండి నీళ్ళు పొంగి పొర్లుతున్నయి. ప్రత్యేకంగా కాళ్ళు కడుక్కుని గుళ్ళోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా వుంది.

చలువ పందిళ్లు తీసేయడంతో తలార స్నానం చేసి, కొమ్మల కురుల్ని ఆరేసుకున్న అమ్మ చెట్టులా గుడి, గుడి ప్రాంగణం అందంగా ఉంది.

తూము గేటు పూర్తిగా పైకి ఎత్తడం వల్ల నీళ్లు పొంగి, రోడ్ పైనుండి పారుతున్నయి. తూము మూతి దగ్గర వుబికి పడి లేస్తున్న నీళ్లలోంచి చేపలు ఎగురుతున్నయి, పడుచు పిల్ల బుగ్గల్లో మెరిసి మాయమయ్యే సొట్టల్లా. అప్పుడప్పుడు, చేపపిల్లలు ఎగిరొచ్చి కాలువ వొడ్డున అంట్లు తోమే బెస్త గంగవ్వ, కూర దేవన్నోళ్ల అమ్మ బెస్త మల్లవ్వల కాళ్ళ ముందర పడుతున్నాయి, పేగు బంధమో! నీటి బంధమో! పొగ బారిన బాసండ్లు వారి అరిపాదాల శ్రమ స్పర్శకు మోకరిల్లి మసి వదుల్చుకుని చందమామ చేపల్లా మెరుస్తున్నయి. బెస్త రాజయ్య, దేవయ్య తపెలా తోటి (త్రిభుజాకార వల) అలుగుల చేపలు పడుతుండ్రు.

ఊరి మధ్యలోంచి నడిచివెళ్లే నదిలా వుంది కాలువ. “భీమేశ్వర ఆలయపు వీధి పొడువునా అలుగు పారే కాలువ ఉండేదట! ఈతలు కొట్టేంత లోతూ వెడల్పుతో అలుగు పారేదట! అందుకే ఆ వీధిలోని ఇళ్లన్నీ ఎత్తుగ ఉండే”దని చొప్పకట్ల చంద్రమౌళి సారు చెప్పేడిది. ఎంత సౌందర్యమయంగా ఉండేదో! ఊహించుకుంటేనే పులకంకారాలు వస్తున్నయి. ఇళ్ల ముందర గద్దెలపై కూర్చుని, పారుకపు నీళ్లను చూస్తూ వుంటే కాలం తెలియదు. ప్రాణం లేచి వస్తది.

ప్రాణులకు ప్రాణం పోసే నీటి కాలం, ఓ అద్భుతం. ఎన్ని మొక్కలు వికసిస్తాయి! ఎన్నెన్ని జీవులు జీవం పోసుకుంటాయి! ఆ కాస్త కాలం కోసం కనిపించి కనుమరుగయ్యే ఉశిళ్ళు, బంగారు, ఆరుద్ర పురుగులు……చూసే చూపు ఉంటే చుట్టూ ఎన్నెన్ని అందాలు…..

మూలవాగు పొంగు తీసి శివుని జటాజూటంలా పాయలు పాయలుగా పారుతుంది, వాగు వెడల్పున్న చోట. భీమునిపాదాల బండల దగ్గర పాయల్ని కల్పి అల్లిన జడలా పారుతుంది… తెల్లని నీటి అలలపై మెరిసే వెలుతురు కిరణాలు చేప పిల్లల్లా మురిపిస్తూ అసలు చేపల్ని మరిపిస్తున్నయి. కొన్ని చోట్ల, ‘కోమలి’ నూగారులా ఉంది వాగు. నీటి ఉద్దృతి తగ్గడంతో, కట్టు కాలువలో గాలాలు వేసి చేపలు పడుతున్నరు కొందరు బెస్త మిత్రులు, తురక మిత్రులు…

చామకుంట లాలపల్లెకు దారి ఇచ్చింది.

ధర్మ గుండం మంటపాలు తిరిగి కనిపిస్తున్నయి.

మత్తడి దూకుడు తగ్గింది. కుచ్చిళ్ళు ఎత్తిపట్టుకున్న నీటికన్నెలా మెట్లు కనిపించి, చెరువు ఈతకు రమ్మని ఊరిస్తున్నది. బురద మెల్ల మెల్లగా తేరుకుంటు, నీటి రంగు మారుతుంది. చెరువు కన్నులోలె తామరాకులు తేలుతున్నయి.

అప్పుడప్పుడే కప్పలు, చేపలు చేరినట్టు ఈతకొట్ట పిల్లలు చేరుకున్నరు. నడుములకు ఈత కట్టెలు, ఆనిగేపుకాయ బుర్రలు కట్టుకుని కొందరు. ఇంకొందరు కాటన్ బట్టతో కుట్టిన పూనా పైంట్ నడుం వైపు, కాళ్ళ చివర్ల దారంతో కట్టి, నీళ్లలో తడిపి ఊదంగనే గాలి నిండి రెండు పొడుగాటి ట్యూబుల్లా మారితే దాని జాయింట్ని కడుపు కింది వేసుకుని ఈదుతున్నరు. అవేవి లేనివాళ్లు చేతుల్తో తంతెల్ని పట్టుకుని కాళ్ళు ఆడిస్తున్నరు. కొత్తగా కొంత నేర్చుకున్న వాళ్లకి పెద్దలు నడుం దగ్గర దోతుల తోటి, ఎర్రపంచల తోటి కట్టి నీళ్ళలోపలికి నూకుతె, వాళ్ళ రెక్కల్లో బలం సన్నగిల్లి మునిగి పోతుంటే, “భయం పోకపోతే ఈత రాదురా!” అంటూ ధైర్యం చెప్పి, బయటికి గుంజుతున్నరు. ఇక ఈత వచ్చిన వాళ్ళ సంగతయితే చెప్పతరం కాదు… తూము పైనుండి ఉరుక్కుంటూ వచ్చి సూర్లు కొట్టేవాళ్ళు… ఆత్మప్రదక్షణ చేస్తున్నట్టుగా మెలికలు తిరుగుతూ పైకి ఎగిరి నీళ్ళ లోకి దుంకేటోళ్లు.. గింగిరాలు కొడుతూ దొమ్మరిగడ్డలు వేస్తున్నట్టు దూకేటోళ్లు.. అంతా కోలాహలం.. ఉరకలేసే ఉత్సాహం.. సందడి సందడిగా ఉంది. “ఈ గోల మా కేల!” అనుకుని, మాలగడ్డకు ఈదుకుంట పోతున్నరు గజ ఈతగాళ్లు కొందరు.

మాములుగా తూము దగ్గర ఆకర్షణ ఎక్కువ. నీళ్ల లెక్క మనుసును సుత గుంజుతది. డైవింగ్ ప్లాటుఫామ్ మీద ఉరికినట్టు ఉరికివచ్చి సూర్లు కొట్టొచ్చని, దుంకొచ్చని అందరి కన్ను ఆడనే ఉంటది.

నిజానికి…. నీళ్ళే ఆకర్షణ, తన ఒళ్ళో ఈదులాడ పిలుస్తున్నట్టు ఉంటుంది.. పచ్చని అడవి, తన రహస్యాల్ని కనుగొని జయించమంటుంది. పర్వతం, తనపై పారాడి అధిరోహించ కవ్విస్తుంది.

ఆ రోజు ఐతారం. జనాలు తామర తంపరగా ఉన్నరు. ఎప్పుడైనా మేము గుండం దిక్కు ఈదుతం. నీళ్ల మోటార్ కోసం కట్టిన గద్దె మీదికేల్లి సూర్లు కొడుతం. ఆ యాల్ల మాకంటే ముందు గాల ఓ గుంపు కొడుతున్నరు. అటుపక్కకు ఆడోళ్ళు బట్టలు పిండుతున్నరు. ఇక తప్పదని ఆ గుంపు పక్కన తూముకేసి దిగినం. ఆ పోరగాండ్లల్ల తెలిసిన మొఖం ఒక్కటి లేదు. చుట్టపు చూపుగా మా ఊరు వచ్చినోల్లో, తీర్థపోల్లో, లొల్లి లొల్లి జేస్తున్నరు. బట్టలుతుక్కుంటున్నోళ్ల పైనుండి దూకుతున్నరు. వాళ్ళు కోపానికి వస్తే కోంతసేపే…, మల్ల ఎప్పటాటనే. ముందే జాగ పోయిందంటే వాళ్ళు చేసే ఆటకోయిలి పనులకు కోపం నషాళానికి ఎక్కుతోంది. మాకు ఈత కొట్టుడు తక్కువైంది, వాళ్ళను తిట్టుకునుడు ఎక్కువైంది.

కొంత సేపటికి వాళ్ళు దుంకుడు ఆపి, ముచ్చట్లు ఏవో పెట్టుకుంటుండ్రు. మా నజర్ వాళ్ళ మీదనే ఉందాయె! ఈ సారి చెవులు సుత అప్పజెప్పినం. వాళ్ళు మెట్లకాడి నుండి కొంత లోపలికి పోయి చోర్ పోలీస్ ఆడుడు షురూ జేసిండ్రు. చూపుడు వేలితో క్యారం బోర్డులో కాయిన్ని కొట్టినట్లు నీళ్ళపైన కొట్టాలె. నీళ్లు చిత్తకుండ వేలు నీటిలోపలికి పోతే పోలీస్. లేకపోతే దొంగ. దొంగలందరూ నీటిలో మునుగుతరు. పోలీసు నీళ్ల పైన తేలుతూ ఉంటడు. తక్కువ సేపు మునిగి తెలీనోడు దొరుకుతడు.

ఇంతట్ల, అమ్మాయిలంతా ఉతుకుడు ఆపి మెట్ల మీద నిలవడి మాట్లాడు కోవట్టిండ్రు. కాళ్ళను ఎవరో గిచ్చిండ్రని అనుకుంటున్నరు. ఆ మాటలు మాదాక వినిపిస్తున్నయి. కొత్తగ వచ్చిన పోరగాండ్లు ఇదేం పట్టనట్లు ఆడుతున్నరు. మాకు అర్థమయింది. అమ్మాయిలకూ అర్థమయి ఉంటుంది, ‘నీళ్లలో మునిగినోడు ఎవడో వాళ్ళ కాళ్ళను గిచ్చి ఉంట’డని. ఏదో మాట్లడుకుని, ఏం కానట్లే నీళ్ళలోకి దిగి బట్టలు ఉతుకుడు తిరిగి మొదలు పెట్టిండ్రు.

మా మిత్రులు ఆవేశంతో ఉన్నరాయె, “పోయి నాలుగు పీకి వద్దాం పాండ్రి” అన్నడు శెఫిక్.

“అరేయ్! మీరేం హీరోలు కానక్కర్లేదు. ఆ బట్టల బ్యాచ్ లో అసలు సిసలు హీరో ఉంది” అన్న.

“ఎవరు? ఎవరు?” అంటే, “ఉపాధ్యాయుల సాంబశివన్న పెద్ద చెల్లె… కల్యాణి”. “ఓసారి ..

పంచకళ్యాణి దొంగల రాణి, అని పాడుకుంట ఓ పోరడు సైకిల్ మీద పోవుకుంట తనను ఛిడాయిస్తుంటే సైకిల్ ఎంబడి ఉరికి పోయి… క్యారియర్ అందుకుని… గుంజి కింద పడగొట్టి… పడ్డోన్ని గల్లా వట్టి లేపి… ఆచెంప ఈచెంప వాయించి పంపింది. ఇప్పుడు సుత ప్రేక్షకుల్లా సినిమా చూడుండ్రి” అన్న.

“అంతే కాదు, గా కేశన్నగారి చందు లేడు.. గాయన చెర్ల జారి పడితే కళ్యాణక్కనే కాపాడింది. నాకు తెల్సు” అన్నడు, బుడుబుంగ లెక్క ఈదుకుంట ఎడ్ల సురేందర్. వీళ్ళ బాపులు ఎడ్ల వెంకన్న గారు, ఉపాధ్యాయుల బ్రహ్మమయ్య గారు గుళ్లో సహోద్యోగులు.

నోట్లే పట్టుకున్న నీళ్లను నల్లపైపులకేల్లి వస్తున్నట్లు ఊది, “అదే, ఇంకో ఇంకో ఊర్లె అయితేనా… సాహస బాలిక అవార్డుకు పంపేటోళ్లు!” అన్నడు చంద్రుడు.

“ఆడ ఉన్నోళ్లను చూసిండ్రా! కళ్యాణి వాళ్ళ వదిన, కేశన్నగారి మహేశ్వరి. మల్లారం ప్రమోదు చెల్లె, శ్రీమతి. మామిడిపల్లి కిట్టన్నచెల్లె, పద్మ. అందరికి ఈతగొట్టుడు, కొట్టుడు రెండూ తెలుసు. వాళ్ళ పంచాయితి వాళ్ళు తప్సి జేసుకుంటరు” అన్న.

మేము మాటల్ల ఉండంగనే కళ్యాణి నీళ్ళలోకి మునిగి, ఒకడి జుట్టు పట్టుకు తేలి, వాడ్ని నీళ్లల్ల ముంచుకుంట మెట్ల దగ్గరికి ఈడ్చుక వచ్చింది. నీళ్లు మింగి మొస ఆడుతలేదు వాడికి. కనుగుడ్లు ఎర్రగయినయి. కండ్లపొంట కారేది నీళ్ళో! కన్నీళ్ళో!…. ఇయ్యర మయ్యర రెండు చెంపలు వాయిస్తుంటే “తప్పయిం”దని దండం పెట్టిండు. అప్పటికే వాని సోపతిగాళ్లు పరారయిండ్రు.

ఈతలు ఆపి, నోళ్లు వెళ్ళబెట్టి చూస్తున్నరు అందరు. సినిమాలో pause shot లా ఉంది ఆ దృశ్యం.

మా ఊరి అమ్మాయిలు అమ్మవారి అంశ. అవసరమయితే అన్నపూర్ణలు, ఆపత్కాలాన అపర కాళికలు. కల్యాణి చేసిందీ అదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com