“ఇంకెతసేపురా..తల్లీ..జుట్టు నొప్పెడుతోంది..ఇంకా అవలేదా నీ‌ జడ వెయ్యడం…”. తలను చేత్తో పట్టుకుని పదేళ్ళ మనువరాలు షణ్ముఖ ప్రియను ముద్దుగా విసుక్కుంది వసుంధరమ్మ. తను రోజూ వేసుకునే ముడిని విప్పి, తల దువ్వి ప్రియ ‘జడ’లా అల్లడం, తన జుట్టుతో ఆడుకోవడం వసుంధరమ్మకు షరా మామూలే! ప్రియకు అదో సరదాతో కూడిన ఆట అయితే, ఆ ఆటను ప్రియ ముచ్చట ను కాదనలేని మురిపెం ఆ నానమ్మది. తల్లి చూస్తే ” పెద్దవాళ్ళతో ఏంటా ఆటలు?” అంటూ కోప్పడుతుందని ప్రియ దొంగ చాటుగా నానమ్మ గదిలో కొచ్చి చేస్తుందీ పని. వసుంధరమ్మది చాలా పొడవైన తలకట్టు. అలా ప్రియ ఆమెకు జడ వేస్తున్నప్పుడు ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు నానమ్మ, మనవరాలు.

“ఇంకా ఎంతసేపు తల్లీ…”. ” ఇదిగో అయిపోయింది నానమ్మ.. నీ జుట్టు పొడుగ్గా వుంటుంది కదా…టైం పట్టదా ఏంటి మరి?” కిల కిలా నవ్వుతూ. “ఊఁ…ఇదిగో..” అంటూ ఆమె బారు జడను భుజం మీదుగా తిప్పుతూ ముందుకేసింది ప్రియ తెల్లజుత్తు. అక్కడక్కడా నల్లని జుట్టు తో పొడవైన జడ… చివరగా గంటల ఆకారంలో వుండి, బంగారు చెక్కడం తో వున్న గొట్టాల్లాంటి ఆకారాల్లోంచి కప్పినట్టుగా క్రిందకు జాలువారుతూ మెరుస్తున్న నల్లని పొడవైన పట్టుకుచ్చులు మెత్తగా హాయిగా తగుల్తూ..! వసుంధరమ్మకు ఒక్క క్షణం నోట మాట రాలేదు. తను కలగనట్లేదు కదా..!? బంగారు జడ కుప్పెలు ….తన జడకు అల్లుకుని అలంకరింపబడి అందంగా…వెండి తీగల్లా వున్న తన జుట్టు లో పసిడి గంటల్లో ఒదిగిన నల్లని పట్టుకుచ్చులు సుతారంగా మెరుస్తూ.. వాటిని ఓసారి ఆప్యాయంగా అపురూపంగా తడిమి చూసుకుంది వసుంధరమ్మ. అవునూ…సందేహం లేదు అక్షరాలా బంగారు జడ కుప్పెలే ఇవి! తన జీవితం లో ఓ అపూర్వంగా, ముచ్చటగా మిగిలిపోయిన బంగారు జడకుప్పెలు ఇప్పుడు తన జడలో ముస్తాబై, అలవోకగా…రాజసంగా హొయలొలికిస్తూ…! అది ‘కల కాదు’ అని రూఢీ చేసుకున్న వసుంధరమ్మ ఆనందంతో తబ్బిబ్బయింది. ఎందుకో హఠాత్తుగా ఆమె కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. కాస్సేపటికి తేరుకుని…”ఏంటిరా బంగారం.. నాకు నీ బంగారు జడకుప్పెతో జడేసావా? మా అమ్మే..మా చిన్న తల్లి… ” ఆమెకు చప్పున మొన్న కోడలు వందన ‘బ్యాంకు వెళ్తున్నా అత్తయ్య గారు..బతుకమ్మ పండగ వస్తుంది కదా…ప్రియ నగలు లాకర్ లోంచి తీసుకొస్తా…” అని చెప్పిన విషయం గుర్తొచ్చింది. ‘ఇప్పుడు మళ్ళీ పాతకాలం నాటి నగలు-వంకీ, వడ్డాణం, పాపిటబిళ్ళ, జడమొగ్గలు, జడకుప్పెలు, చెంప స్వరాలు అన్నీ ఫ్యాషన్ అయిపోయాయి అత్తయ్య గారు.. పిల్లకి ఒక్కో నగా చేయించి పెడ్తున్నా…’ అంతకు ముందెప్పుడో మాటల మధ్య కోడలు అన్న మాటలు స్ఫురించాయి.

ఆలోచనల్లో నిమగ్నమైన వసుంధరమ్మను “నానమ్మ… జడ బావుందా అంటే చెప్పవేం.. ఎన్నిసార్లు అడగాలి…జడ కుప్పెలుతో ఇంకా పొడవైంది కదా నీ జడ ….” తన గుండ్రని భూగోళాల్లాంటి కళ్ళను అందంగా అటూ ఇటూ తిప్పుతూ అడుగుతున్న ప్రియ మాటలకు “ఊఁ..చాలా బావుంది బంగారం… నువ్వు…మరి…మా అమ్మమ్మ కదా…అందుకే ఇంత బాగా వేశావ్…” అంటూ మనవరాలిని హృదయానికి హత్తుకొని ముద్దులు పెడుతూ…’ మా అమ్మవు కనుకనే నా తీరని కోరిక ఈ విధంగా ..ఇంత కాలానికి ఇలా తీర్చావురా బంగారం… ” అస్పష్టంగా గొణికినట్టుగా అన్న ఆమె మాటలు ప్రియ చిన్ని మనసుకు అర్థం కాలేదు. కాస్సేపటికి తృప్తిగా తన్మయంగా కళ్ళు మూసుకున్న వ సుందరమ్మ కళ్ళల్లోంచి రెండు కన్నీటి బొట్లు జలజలా రాలాయి.

ఆమె మనసు గతం వైపు పరుగు తీసింది.

* * *

వసుంధరకు అన్ని పండుగలు ఇష్టమే అయినా బతుకమ్మ పండుగంటే చాలా ఇష్టం. పండుగల రోజు తన పొడుగాటి జడకు అందంగా అల్లుతూ అమ్మ వేసే జడకుప్పెలంటే ఇంకా ఇష్టం. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులూ అలా జడకుప్పెలు వేసుకునే అవకాశం ఉన్నందువల్లనేమో ఈ పండుగ అంటే ఆమెకు మరీ ఇష్టం. ఆ తొమ్మిది రోజులూ స్నేహితులతో ఆడుతూ పాడుతూ అలుపెరగక గడిపే ఆ అందమైన సాయంకాలాలంటే ఎంతో ఇష్టం.

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిలో ఓ అపురూప ఘట్టం. ఇది ఆడవాళ్ళకు మాత్రమే సంబంధించిన ప్రత్యేకమైన పండుగ. ప్రతిరోజూ ఆడపిల్లలంతా ముస్తాబై అమ్మ వాళ్లతో కలిసి చక్కగా పూలతో పేర్చిన బతుకమ్మలు ఇంటికి దగ్గరలో ఉన్న వేణుగోపాల స్వామి గుడికి వెళ్లి బతుకమ్మ ఆడుకోవడం ఆనవాయితీ. ఊళ్ళోని ఆడవాళ్ళంతా కూడా ఇదే గుడికి వచ్చి గుంపులు గుంపులుగా, వృత్తాకారంలో నిల్చొని మధ్యలో తంగేడు పువ్వు ప్రధానంగా గునుగు, కట్ల, గన్నేరు, రుద్రాక్ష, గుమ్మడి, పారిజాతం, మందార, జాజి, విరజాజి, బొడ్డుమల్లె, చీర. మున్నగు రంగు రంగుల పూలతో గమ్మటంలా పేర్చిన బతుకమ్మలు పెట్టి, ఆ బతుకమ్మ లను ‘మహాలక్ష్మి’ అవతారంగా మొదట పూజించి తర్వాత లక్ష్మీ స్వరూపుల్లా చక్కగా ముస్తాబై వచ్చిన ఆడవాళ్ళ కోలాటాలతో, చిట్టి శ్రీమహాలక్ష్మి స్వరూపుల్లా పట్టు పరికిణీల్లో బుట్ట బొమ్మల్లా ముస్తాబై వచ్చిన అమ్మాయి ఆట, పాటలతో గుడి ప్రాంగణమంతా కోలాహలంగా కన్నుల పండుగగా ఉండేది. ముఖ్యంగా త‌న దోస్తులు రమ, మంగ, లక్ష్మీ, మున్ని, సంధ్య, శారద, అపర్ణ, సులోచన, వనజ, శోభ, సుభద్రలతో కలిసి గుడి చుట్టూ తిరుగుతూ, సీతాకోక చిలుకల్లా పరిగెత్తుతూ ఆటలాడుకోవడం ఓ మధురమైన జ్ఞాపకం. ఇంతలో నెమ్మదిగా సూర్యుడు పడమర అస్తమిస్తూ, చిరుచీకట్ల పులుముకుంటుండగా, ‘ఒక్కేసి పువ్వేసి చందమామా….ఒక్క ఝాము ఆమె చందమామా…’ అంటూ పాట పాడుతూ అమ్మ వాళ్ళు బతుకమ్మ ను ఆ రోజు పాట పాడుతూ అమ్మవాళ్ళు బతుకమ్మను ఆ రోజుకు నిద్రపుచ్చే దాకా తను ఆటలు కొనసాగేవి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన దోస్తులందరితో తను తన డాబా మీదికెళ్ళి ఎన్నెన్నో కబుర్లు చెప్పుకునే వారు. ఇంతలో అమ్మ పిలిచి పచ్చి మోదుగాకులతో కుట్టిన విస్సళ్ళలో చింతపండు పులిహోర, అప్పాలు, భక్ష్యాలు పెట్టిస్తే ఆవురావురుమంటూ అందరం ఆరగించడం తనకింకా గుర్తు. ఆకుపచ్చని మోదుగాకు విస్తళ్ళలో పసుపు రంగు పులిహోర, ఎర్రని అప్పాలు, గోధుమ రంగులో భక్ష్యాలు- రంగు రంగుల తినుబండారాలు నోరూరించి కనువిందు చేసేవి. ఆ తర్వాత స్నేహితులందరూ కబుర్లతో ఒకరి చెవి లోలాకులను మరొకరు తడిమి చూస్తూ, ఒకరి మెళ్ళో పూసల దండలను మరొకరు స్పృశిస్తూ అమాయకంగా మెరిసే కళ్ళను కదలాడిస్తూ ముచ్చట్లలో మునకలేస్తూ తాము కొత్తగా రేడియోలో నేర్చుకున్న లలిత సంగీతం, పాటలు, భక్తి గీతాలు, బతుకమ్మ పాటలు పాడుకొని ఆనందించేవారు. అప్పుడప్పుడే పశ్చిమాన అస్తమిస్తూ కనువిందు చేస్తున్న సూర్య బింబాన్ని అబ్బురంగా చూస్తూ ఇంటి వెనక నుండి సన్నజాజి, విరజాజి, మల్లె, మొల్లబొడ్డు మల్లె సౌరభాలను మోసుకొస్తూ తను చెక్కళ్ళను సుతిమెత్తగా స్పర్శిస్తూ వీచే ఆహ్లాదకర పిల్ల తెమ్మెరలను ఆస్వాదిస్తూ… ఆ అందమైన సాయంకాలలో సమయం ఎంత ఎలా గడిచిపోయిందో కూడా తెలియని స్థితి. గురవయ్య సారు కానిగే బడి దోస్తుల నుంచి సర్కారు బడి దోస్తుల వరకు అరమరికలు లేని ఆ స్నేహబంధం ఎంత గొప్పది! ఏ తరతమ భేదాలు లేని, కుల, మత, ప్రాంత విభేదాల సరిలేని ఆ సమున్నత మానవ సంబంధాల కలయిక నిజం చెప్పాలంటే ….ఓ గొప్ప సామ్యవాద పరిమళానికి ప్రతీక. ‘అవును…! ఆ రోజులెంత మధురం! ఆలోచనల్లోంచి ఒక్క క్షణం కళ్ళు తెరిచి జడకున్న బంగారు జడ కుప్పెలను మరోసారి ఆత్మీయంగా, పదిలంగా తడిమి చూసుకుంది వసుంధరమ్మ. ఏదో అలికిడిగా అన్పించడంతో చప్పున జడ కుప్పెలను కొంగు చాటుకు దాచింది. ఆమెకు సిగ్గుగా అన్పించింది ఒక్క క్షణం. ‘ఇలా జడకుప్పెలతో తననెవరైనా చూస్తే?.. కొడుకులు గానీ, కోడళ్ళు గానీ, అసలే బతుకమ్మ పండుగ కని వచ్చిన పెద్దకొడుకు కుటుంబం, వియ్యంకులు అందరు బంధువులున్నారు ఇంట్లో. ‘డెబ్భై ఏళ్ళ వయస్సులో ఈ పెద్దావిడకు ఇప్పుడివేం షోకులు…ఇదేం పోయే కాలం.. అనుకోరూ‌‌…?’. ‘ఛ..తన కొడుకులు…కోడళ్ళు బంగారం…! అత్మీయతను బంధాలతో, సానుకూల దృక్పథంతో, ప్రేమానురాగాలతో అల్లుకున్న కుటుంబం తనది. ఆయన పోయినప్పటి నుండి తనను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు పిల్లలు. ప్రతీ పండుగ ఎక్కడో ఓ చోట అందరూ చేరి, కోడళ్ళ తల్లిదండ్రులతో సహా కలిసి ఆత్మీయంగా, ఆనందంగా జరుపుకుంటారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. వియ్యంకులు కూడా తనను ఎంతో గౌరవంగా అభిమానంగా చూస్తారు. తమకు అటు పుట్టిల్లు ఇటు మెట్టినిల్లు రెండూ పెద్ద సమిష్టి కుటుంబాలవడంతో పెద్ద కుటుంబాల్లో వుండే ఇబ్బందులే కాదు అరమరికలు లేనితనం, అడ్జస్టుమెంట్లు కూడా తను చిన్నప్పటి నుండే ఒంటపట్టించుకోవడం వల్ల పిల్లలకు కూడా ఆ సంస్కృతితో కూడిన సంస్కారం అచ్చింది. అందుకే, వాళ్ళకు కూడా ఏ పండుగొచ్చినా ఇల్లు పదిమందితో గల గలా సంభాషణ లతో, నవ్వులతో సందడిగా కళ కళ లాడాల్సిందే.

వసుంధరమ్మ పెదాలపై చిన్ని గర్వంతో కూడిన చిరునవ్వు కదలాడింది ఒక్క క్షణం.

కొంగుచాటునున్న జడకుప్పెలు కితకితలు పెట్టగా, బయటకు తీసి వాటిని ప్రేమగా నిమరింది. మళ్ళీ సుతారంగా పట్టుకుని వాటిని చెంపకు ఆర్తిగా అనిపించుకుంది. పట్టుకుచ్చుల మెత్తదనం చెప్పలేని హాయినిచ్చింది ఎందుకో.

అక్కడున్న బంగారు, జడకుప్పెల్లాంటివే తనకూ కావాలని సంతలో కొన్న ప్లాస్టిక్ జడకుప్పెలు ఇకముందు అసలు వేసుకోనని ఆ రోజు కరాఖండేగా చెప్పి, అమ్మతో దెబ్బలాడడం గుర్తొచ్చి వసుంధరమ్మ కళ్ళు సజలమయ్యాయి.

ఆ రోజు తనకు బాగా గుర్తుంది. అమ్మతో సంతలో కొన్న పిచ్చి ప్లాస్టిక్ జడకుప్పెలు రంగు వెలిసి ఉత్తినే విరిగి పోతున్నాయని, తను అస్సలు వాటిని వేసుకోనని, అక్కడున్నటువంటి బంగారు జడకుప్పెలే తనకు కావాలని ఏడ్చి గోల చేసి, చివరికి అలిగి అన్నం కూడా తినకుండా పడుకుంది తను. అమ్మ ఎంతో బ్రతిమిలాడిందిమ బుజ్జగించింది. చివరగా తనను దగ్గరగా తీసికొని ముద్దులు పెట్టి వచ్చే బతుకమ్మ పండుగ వరకు బంగారు జడకుప్పెలు ఎలాగైనా చేయిస్తానని మాటిచ్చింది. అ తరువాత తను సంతోషంగా తృప్తి గా పడుకుంది. కానీ బంగారు జడకుప్పెలు గూర్చిన కలలతో, ఆలోచనలతో ఆ రాత్రి తనకెంతకూ నిద్రపట్టలేదు. ఇంతలో దగ్గరగా అమ్మా నాన్నల మాటలు వినిపించాయి.

“పార్వతీ నీకో విషయం చెప్పాలి”.

” నేను ఓ విషయం అడగాలనుకుంటున్నా మిమ్మల్ని ”

“అయితే ముందు నువ్వు అడుగు”

“ఏం లేదండీ సంక్రాంతి, ఉగాది, దసరా ఏ పండగొచ్చినా ఈ పిల్లలతో బంగారు జడకుప్పెలు పేచీ వస్తుంది. ఉన్నదేమో ఒక్కటే జడకుప్పెలు. ఏదైనా పంటతాలూకు పైకం చేతికొస్తే ఈసారైనా చిన్న తల్లి వసుకు బంగారు జడకుప్పెలు చేయిద్దామని! మాకు తెల్సుకదా పెద్దదాని మొండితనం…అందునా దానికి అత్తయ్య గారాబం కూడా తోడైంది. వసుకు ఒక్కసారైనా తన బంగారు జడకుప్పెలు ఇవ్వరు. ఇక బతుకమ్మ పండుగొచ్చిందంటే చాలు అ తొమ్మిది రోజులు… ప్రతి రోజూ ఆ బంగారు జడకుప్పెల గురించి ఇద్దరికీ గొడవే! ఏం చెయ్యాలో అర్థం గావట్లేదండీ…! తిరిగి చూస్తే మళ్ళీ బతుకమ్మ పండుగ రానే వస్తోంది…” దిగాలుగా అమ్మ గొంతు. తాను అడగాలనుకున్న విషయమే భార్య ప్రస్తావించడం రామారావుకి సులువయింది.

“ఇంటి పరిస్థితులు నీకు తెలియందేముంది పార్వతీ.. ముఖ్యంగా ఆరు నెలలుగా ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రైవేటు కాలేజ్ లోని నా ఉద్యమమూ పోయినప్పట్నించి ఎంత గడ్డు పరిస్థితులను అనుభవిస్తున్నాం! పెద్ద కుటుంబం… పంట ద్వారా వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఇంటి ఖర్చులకే చాలని స్థితి. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, తమ్ముళ్ళ చదువులకు అయిన అప్పులు వడ్డీలు పాపం పెరిగినట్టు పెరుగుతూనే వున్నాయి…!”

“అవుననుకోండి…కానీ.. ‌”

“ఈ విషయం గూర్చి ఇక ఆలోచించడానికేం లేదు పార్వతీ… మధ్య తరగతి జీవనాల్లో బంగారం కొన్నా, అది అలంకారానికో, అచ్చటా ముచ్చటా తీర్చుకోవడానికో కాదు పార్వతీ… అవసరాలకు ఆదుకుంటుందని మాత్రమే….! అందుకే దాన్ని ‘స్త్రీ ధనం’ అన్నారు. ఈ సారి బతుకమ్మ పండక్కి సంతలో రెండు ప్లాస్టిక్ జడకుప్పెలు కొనాలి….”

‘అంటే మారనేది…?’

‘అవును…ఇంట్లోని బంగారం.. జడకుప్పెలతో సహా కుదువ పెట్టడమో, అవసరమైతే కొన్ని వస్తువుల్ని అమ్మడమో చెయ్యాల్సిన స్థితి… ఓ వైపు వరినాట్లు వేసే టైం… మరోవైపు పత్తి చేలకు షావుకార్ దగ్గర మందులు తేవడం.. కలుపు తీయించడం …ఎంత లేదన్నా ఇరవై, ముప్ఫై వేలు కావాలి ‌పెట్టుబడి…”

కాస్సేపటికి అమ్మ వెక్కిళ్ళు..!

అమ్మ నాన్న, సంభాషణ వల్ల మొత్తానికి తనకు బంగారు జడకుప్పెలు చేయించడమనే విషయం పక్కన పెడితే ఉన్న అక్క జడకుప్పెలకూ ఎసరొచ్చిందనే విషయం వసుంధర చిట్టి బుర్రకర్థమైంది. పాపం అమ్మ తనకు జడకుప్పెలు చేయించలేకపోతున్నందుకు ఏడ్వడం, బాధపడడం వసుకి అస్సలు నచ్చలేదు. “నాన్నగారు సంతలో తెచ్చిన ప్లాస్టిక్ జడకుప్పెలు బావున్నాయి” అని చెప్పాలి అమ్మకు. గట్టిగా నిర్ణయించుకుంది వసు.

అమ్మ నాన్న, సంభాషణ వల్ల మొత్తానికి తనకు బంగారు జడకుప్పెలు చేయించడమనే విషయం పక్కన పెడితే ఉన్న అక్క జడకుప్పెలకూ ఎసరొచ్చిందనే విషయం వసుంధర చిట్టి బుర్రకర్థమైంది. పాపం అమ్మ తనకు జడకుప్పెలు చేయించలేకపోతున్నందుకు ఏడ్వడం, బాధపడడం వసుకి అస్సలు నచ్చలేదు. “నాన్నగారు సంతలో తెచ్చిన ప్లాస్టిక్ జడకుప్పెలు బావున్నాయి” అని చెప్పాలి అమ్మకు. గట్టిగా నిర్ణయించుకుంది వసు.

* * *

కాలం తన పని తాను చేసుకుపోతూనే వుంది. అక్క పెళ్ళి కాగానే తన డిగ్రీ చదువు పూర్తి కాకుండానే తెలిసిన మంచి సంబంధం అంటూ శివరామ్ తో తన పెళ్ళి చేసేశారు అమ్మనాన్నలు. అమ్మ వారసత్వం తనకొచ్చిందా అన్నట్టు అతిపెద్ద ఉమ్మడి కుటుంబం అయినా అత్తవారింట్లో పెద్ద కోడలిగా అడుగుపెట్టింది తను. శివరామ్ తో బాటు ఇంటి బాధ్యతలు నెత్తిన పడ్డాయి. అటు మరుదులు చదువులు, ఆడబిడ్డల చదువులు, పెళ్ళిళ్ళు, బారసాలలు ఓ వైపు.. ఈ లోపు తమకు కలిగిన ఇద్దరు బాబులు శ్రీరామ్, జయరామ్ లను పెంచి పెద్ద చేయడం లాంటి బాధ్యతలలో పడి తను తన బంగారు జడకుప్పెల కోరికను ఎప్పుడో మర్చిపోయింది. కనీసం తనకి ఓ ఆడపిల్ల కల్గినా బహుషా మళ్ళీ తెరమీదికొచ్చేదేమో తన కోరిక! కానీ చిత్రంగా తనకు ఇద్దరూ మగపిల్లలే అవడం తో వాళ్ళ అవసరాలు, కోరికలు తీరుస్తూ గొప్ప వాళ్ళుగా స్థితిమంతులుగా తీర్చిదిద్దాలన్న తాపత్రయంతో తన ‘బంగారు జడకుప్పెలు’ కోరిక మనసు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైపోయింది.కానీ.. ఇంత కాలానికి మళ్ళీ ఈ విధంగా తీరడం యాదృచ్ఛికమా? దైవ నిర్ణయమా? ధారగా ప్రవహిస్తున్న కన్నీళ్ళను తుడుచుకుంది వసుంధరమ్మ. ఏడ్చి ఏడ్చి బరువెక్కిన ఆమె కళ్ళు మూతలు పడుతున్నట్టన్పించింది. జడకున్న బంగారు జడకుప్పెలను సాగతీస్తున్నట్టుగా నిమురుతూ వాటిని హృదయానికి హత్తుకుంది. ఇప్పుడు ఆమె పెదవులపై వెన్నెలలా పతుచుకున్న చిక్కటొ చిరునవ్వు..!

* * *

ఇంటి ముందు వసారాలో జయరామ్ అటు ఇటు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. అతని మనసు నిండా కందిరీగల్లా ముసురుకున్న ఆలోచనలు. నిన్న అమ్మ గదిలో అల్మారాలో ఏదో ఆఫీస్ పేపరు కోసం వెతుకుతుంటే కన్పించింది అమ్మ డైరీ. సభ్యత కాదని తెలిసీ చదివిన అమ్మ డైరీలోని అంశాలే పదే పదే గుర్తొస్తున్నాయి. తనకు తెలియకుండానే ఒక్కసారిగా జయరామ్ కళ్ళు తడయ్యాయి.

అతిపెద్ద ఉమ్మడి కుటుంబంలో అమ్మ తనకు, అన్నయ్యకు ఏ లోటు రాకుండా పెంచడానికి ఎంత తపన పడిందో, ఎంత కష్ట పడిందీ తెల్సింది. అటు ఇంటి బాధ్యతలతో తీరిక లేకుండా వుంటూనే, ఇటు ఖాళీగా వున్న కొద్ది సమయంలో ట్యూషన్లు చెబుతూ ఆర్థిక వెసులుబాటు కల్పించుకుంది. ముఖ్యంగా అన్నయ్య, తను ఏది కావాలని, కొనివ్వమని అడిగినా నాన్నగారిని ఒప్పించి కొనిచ్చేట్టు చేసేది. తనకు చిన్నప్పుడు ‘బే బ్లేడ్’ (చైనా బొంగరాలు) ల పిచ్చి బాగా వుండేది. అది కొనివ్వమని నాన్నగారిని అడిగినప్పుడు ‘ఏంటీ..దీనికి మూడొందల అరవై రూపాయలా.?..అక్కర్లేదు.. మామూలు మన తాడూ, బొంగరం కొనుక్కో అన్నప్పుడు తన మొహం వాడిపోయంది. చిన్నబుచ్చుకున్నాడు. అలిగాడు, అన్నం తినలేదు. అప్పుడు అమ్మ నాన్నతో దెబ్బ లాడి,ఒప్పించి తనకు ఆ ‘బే బ్లేడ్’ కొనిపించింది. అప్పుడు తను అమ్మ మెడచుట్టూ చేతులు వేసి అమ్మను ముద్దులతో ముంచెత్తాడు. ఆ క్షణం అమ్మ కళ్ళు కోటి కాంతులతో మెరవడం తనకింకా జ్ఞాపకం. ఆ తరువాత తను ‘అట్లాస్’ సైకిల్ కావాలన్నప్పుడు, గిటార్ కావాలని ముచ్చట పడినప్పుడు తన స్నేహితులందరికీ వాళ్ళ మావయ్యతో, బాబాయిలో బంధువులో అమెరికా నుండి తెచ్చిన ‘ఐ పాడ్ ‘ కొనివ్వమని అడిగినప్పుడు, ఇలా ప్రతి సందర్భంలో అమ్మ నాన్నగారిని ఒప్పించి తనకు ఆ వస్తువులన్నీ కొనిపెట్టిన విషయం గుర్తొచ్చింది. తనకు అప్పటికే ‘ఆపిల్’ కంపెనీ వస్తువులంటే పిచ్చి. ఆపిల్ కంపెనీ ‘ఐ ప్యాడ్’ కొత్త మోడల్ రిలీజ్ కాగానే అమెరికా లో వున్న ‘కజిన్’ తో తెప్పించుకోవాలనుందని అమ్మతో అనగానే డబ్బు సర్దింది. ఆ తరువాత ఇంజనీరింగ్ చదివేటప్పుడు తనకు ల్యాప్‌టాప్ అవసరమనీ, మార్కెట్ లో కొత్త గా విడుదలయిన ‘ఆపిల్’ కంపెనీ ‘మ్యాక్ బుక్’ కావాలన్న కోరికను అమ్మ చెవిన వేశాడు. దాని ధర చెప్పినప్పుడు అమ్మ ‘అమ్మో అంత ధరనా?’ అన్నప్పుడు తను నిరాశకు గురయ్యాడు. కానీ, అమ్మ వారం, పది రోజుల్లోనే డబ్బిచ్చి ‘తెప్పించుకో నాన్నా…నీకెలాగూ అవసరం కదా! అట్లాంటప్పుడు లేటెస్ట్ దయితే నీకు ఎక్కువ ఉపయోగం కదా!’ అన్నప్పుడు అమ్మ డబ్బెలా సర్దిందో తనకప్పుడు తెలియనేలేదు. కానీ నిన్న డైరీ చదివినప్పుడు అమ్మ తన మెళ్ళోని పుస్తెల గొలుసు అమ్మ తనకు ‘ల్యాప్‌టాప్’ కొనిచ్చిందని తెలిసినప్పుడు మనసు బాధగా మూలిగింది. ‘అమ్మా…’ అతని అణువణువూ అమ్మ పట్ల కృతజ్ఞతతో ప్రేమతో నిండిపోయింది. బాధ కన్నీళ్ళ రూపంలో కట్టలు తెంచుకుంది.

అమ్మ తన స్వార్థం, తన సుఖం చూసుకోకుండా తన పిల్లల కోసం ఆరాటపడింది. అతని కళ్ళు వర్షిస్తూనే వున్నాయ్ ఆగకుండా. అమ్మలందరూ ఇలానే వుంటారా? కావచ్చు..కానీ ‌అరుదైన వ్యక్తిత్వంతో అలరారే తమ అమ్మ వసుంధరమ్మ మాత్రం తమకు ప్రత్యేకం. తమ ఇష్టాలను, చిన్ని చిన్ని సంతోషాలను, పెద్ద పెద్ద కోరికలను తీర్చడం కోసం అవసరమైతే నాన్న గారితో విభేదించడమే కాదు, దేనినీ లక్ష్యపెట్టని మాతృమూర్తి! ఆహా..అమృత మూర్తి!

నాన్న-పిల్లలు ఏదైనా అడగగానే కొనిపెడితే వారు మొండివారుగా తయారవుతారని పైగా అలా కొనిపెడితే డబ్బు విలువ వాళ్ళకు తెలియకుండా పెరుగుతారని, అందువల్ల ఇంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు వారితో చెప్పి అర్థం చేయించాలని అనేవారు. అమ్మ దానికి పూర్తిగా వ్యతిరేకం. ఇంట్లో ఇబ్బందులు, ఆర్థిక స్థితిగతులు పిల్లలకు తెలియకూడదనీ, ఇంటి చికాకులు వాళ్ళ బుర్రలో చొప్పించి హాయిగా ఆడుతూ, పాడుతూ, చదువుతూ ఆరోగ్యం గా ఎదగాల్సిన ఆ నిష్కల్మష నిర్మల పసి హృదయాలను కలుషితం చేయకూడదనే, వారి అవసరాలు, ఆనందాలు తీరుస్తూ పిల్లల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దడం పెద్దలుగా తమ బాధ్యతేనని అమ్మ అభిప్రాయం. ఏ వయస్సులో మొగ్గ తొడిగిన కోరికను, ఇష్టాన్ని ఆ వయస్సులోనే తీర్చాలని; అడిగీ, ఆ తర్వాత ఆ కోరిక పైన ఇష్టం చచ్చిపోయాక అది కొనిపెట్టినా ప్రయోజనం వుండదనేది అమ్మ వాదన. జీవితం లో ఏ దశా తిరిగి మళ్ళీ వెనక్కి రాదని ముఖ్యంగా మానవ జీవితంలో బాల్యదశ చాలా అందమైనదనీ, అపురూపమైనదనీ, అత్యంత విలువైనదీ అనీ, వ్యక్తి వికాసానికి ఆ దశ మూలమనీ, లేత మనసులు నొచ్చుకుంటే అది వారి భవిష్యత్త్ పై ప్రభావం పడుతుందనీ ఒక టీచర్ లా నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పేది అమ్మ. అయితే, అమ్మ ఏర్పరచుకున్న ఈ అభిప్రాయం వెనక అమ్మకు బాల్యంలో ఓ ‘తీరని కోరిక’ వుందనీ, అది ఆమె చిన్ని హృదయాన్ని గాయపరిచిందనీ తనకు నిన్ననే తెలిసింది. ఈ విషయం అతన్ని తీవ్రంగా కలిచివేసింది. కన్నీళ్ళతో మసక బారిన కళ్ళద్దాలను కర్చీఫ్ తో తుడుచుకున్నాడు జయరామ్! తమ కోసం తన జీవితాన్నే ధారపోసి ఆమె సర్వస్వంగా జీవించిన అమ్మ గూర్చి తెలుసుకో లేక పోయినందుకు సిగ్గుపడ్డాడు జయరామ్ !

” అమ్మ ఇప్పుడు నేనే విధంగా తీర్చగలనమ్మా నీ కోరిక” బాధగా రోదించింది అతని హృదయం. దాని ఫలితమే షణ్ముఖ ప్రియ వచ్చి ఎప్పటిలా తను వసుంధరమ్మ తో ఆడుకునే ఆట లో భాగంగానే అన్పించేలా వసుంధరమ్మకు తన ‘బంగారు ‌జడకుప్పెలు’ తో జడవెయ్యడం!

ఎంతో ఆలోచించిన మీదట భార్యకు కూడా తెలియకుండా ప్రియతో చెప్పి ఆ విధంగా చేసేలా ఏర్పాటు చేసాడు జయరామ్! ప్రియ అమ్మకు ‘జడకుప్పెలు’తో జడ వేసినప్పటి నుండి బయట కిటికీ గుండా తల్లి హావభావాలను గమనిస్తూనే వున్నాడు అతను. సంతోషంతో ఆమె ఉక్కిరిబిక్కిరి కావడం, పదే పదే జడకుప్పెలు పట్టు కుచ్చులను ఆత్మీయంగా తడమటం, తృప్తి గా కళ్ళు మూసుకోవటం, ఆనందభాష్పాలు రాల్చటం వంటి చర్యలను కళ్ళారా చూసిన జయరామ్ మనసు సంతోషంతో నిండిపోయింది.

“ఏయ్ ప్రియా..జడకుప్పెలు ఎక్కడ పడేశావే?” అంటూ అప్పుడే అటుగా వచ్చిన వందన అత్తగారి జడకు జడకుప్పెలు వేలాడుతుండడం చూసి, “అయ్యో..ఇదేంటి.. ఈ పిల్ల మీకు.. జడకుప్పెలతో జడవేసిందా అత్తయ్య… ఛ..దీని అల్లరి రోజు రోజుకి శృతిమించుతోంది. క్షమించడత్తయ్య… చిన్న పిల్ల..ఏమీ అనుకోకండి”. రెండు చేతుల్లో బంగారు జడకుప్పెలను అపురూపంగా పట్టుకుని తాదాతల్యంగా కళ్ళు మూసుకున్నట్టున్న వసుంధరమ్మతో నొచ్చుకున్నట్టుగా అంది వందన. ఆమె సమాధానమివ్వకపోవడంతో,

” నన్ను విప్పమంటారా అత్తయ్య జడకుప్పెలు… ” అంటూ ముందుకు వంగి ఆమె చేతుల్లోని జడ కుప్పెలని తెద్దామని చేతులు చాపి ప్రయత్నించిన వందనకు అది సాధ్యం కాలేదు. అప్పటికే బిగుసుకున్న వసుంధరమ్మ చేతుల్లో విడివడని బంగారు జడకుప్పెలు! చిరునవ్వుతో ప్రశాంతంగా నిద్రపోతున్నట్టున్న వసుంధరమ్మ! ఒక్కసారి షాక్ కొట్టినట్టునట్టుగా చేతులు వెనక్కి తీసుకున్న వందన దుఃఖంతో సుళ్ళు తిరుగుతూ.. ‘ఏమండీ’ అంటూ భర్తను బిగ్గరగా కేకేస్తూ అక్కడే కూలబడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com