మేడే శుభాకాంక్షలు….

ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు.బానిస సంకెళ్లు తప్ప, మొదలైన నినాదాలు మనం చాలా విని ఉంటాం. ఇవన్నీ సాహిత్యంలో కార్మిక స్పృహ, సమసమాజ స్వప్నాన్ని సాకారం చేసే సమాజ వాద స్పృహ ప్రోది చేసే నినాదాలే. సాహిత్యం కోరుతున్న ప్రజా క్షేమానికి గొప్ప నిదర్శనాలే. శ్రీశ్రీ, దాశరథి లాంటి మహాకవుల రచనలలో కనిపించే సమాజవాద సృహను లేక కార్మిక స్పృహను గురించి కొత్తగా చెప్పాలిసిన అవసరం లేదు.

అసలు మేడే పరిణామం ప్రపంచ దేశాల్లో ఒక ఆసక్తికరమైన అంశం. వసంత కాలం (spring) ఆగమనాన్ని మధ్య యూరప్లో ఒక ఉత్సవంగా జరుపుకొనేవారు. అట్లాగే ప్రాచీన గ్రీకు దేవత ఫ్లోరాకు ఆరాధనోత్సవంగా కూడా జరిగేది. ఇది 1889లో కార్మికదినంగా పరిణామం చెందింది. చికాగోలోని కార్మికులు రక్త తర్పణం చేసి తమ దేశపు కార్మికులతో పాటు ప్రపంచ కార్మికులలో కూడా ఈచైతన్యం రగిలించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకునే సమయం లో ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడి విజయం సాధించారు. ఎనిమిది గంటల పని, ఎనిమిది గంటల విశ్రాంతి, ఎనిమిది గంటల రిక్రియేషన్ అని పోగాటం ద్వారా సాధించారు. 1917లో వచ్చిన రష్యా విప్లవం, లెనిన్ నాయకత్వంలోని బోల్షివిక్ పార్టీ శ్రామిక పాలన సామాజిక, సాహిత్య రంగాలను చాల ప్రభావితం చేసింది. హెగెల్ గతి తార్కిక భౌతిక వాదం, మార్క్స్ కమ్యూనిస్ట్ మానిఫ్యాస్ట్రో ఈ ఉద్యమాన్ని ప్రభావితం చేశాయి. 1923లో మొదటి సారి భారత దేశంలో మే డే, జరుపుకున్నారు. 1920లో ట్రేడ్ యునియన్ ఏర్పడడం ద్వారా కార్మిక వర్గ చైతన్యం మొదలయింది. 1985 తర్వాత ప్రయివేటయిజేషన్, లిబరైజేషన్, గ్లోబలైజేషన్, పరిణామాల వల్ల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు.

తెలుగు సాహిత్యంలో 1935 తరువాత కార్మిక వర్గ స్పృహ మొదలైంది. 1935లో ఏర్పడ్డ అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల పైన తన ప్రభావాన్ని చూపింది.

1930కి కొంచెం అటు ఇటుగా ఆంగ్ల సాహిత్యంలో కూడా కార్మిక స్పృహ, సమాజవాద భావజాలం ప్రవేశించింది. 1932లో వచ్చిన New Signatures అనే కవితా సంకలనం దీన్ని ప్రతిఫలించింది. ఆడెన్ (W.H.Auden) డే లూయీస్ (Day Lewis)స్టీఫెన్ స్పెండర్ (StepenSpendar)వంటి కవులు ఈ మార్గానికి పాదులు వేశారు.

శాస్త్రీయతకు వీరు స్వాగతం పలికారు. తెలుగు సాహిత్వంలో శ్రీశ్రీ చైనాలో రిక్షావాలా, చెక్ దేశపు గనిపనిమనిషి , ఐర్లాండ్ లోని ఓడ కళాసి, హాటెస్ టాట్, జూలు, నీగ్రోలాంటి ఖండాంతర నానా జాతుల, అణగారిన ఆర్తుల గీతాలు, రచించాడు. శ్రీశ్రీలోని నవ్య కవిత్వం కార్మిక లోకపు కల్యాణానికి సమర్చన గా నిలిచింది. శ్రామిక లోకపు సౌభాగ్యాన్ని ఆర్తిగాఆకాంక్షించింది. భూరి వృక్షం జారిపడ్డపుడే లేత మొక్క పైకి లేస్తుంది, పసిడి

మేడ పక్క కొరిగినపుడే అడుసు గుడిసె నడుప నేరుస్తుంది.” (సి.నా.రె.) శ్రామికుని పిల్లలను ఇల్లాలును కిళ్ళీ మాగ్నెట్ గా నమిలే మిల్లు మాగ్నెట్ అని, అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం, అనాథుడికి, ఆగర్భ శ్రీమంతుడికి మధ్య (దాశరథి) అని అభ్యుదయ కవులు కార్మికుని పక్షాన గళమెత్తారు. తరువాత సాహిత్యం అనేక పాయలుగా నడచినా ఇప్పుడున్న బహుజన వాదం అన్యాపదేశంగా కార్మిక స్పృహలో భాగమే.

సాహిత్యంలో ప్రతిపాదించే ఆశయాల ప్రభావంతో తెలంగాణ కార్మికులు మరింత చైతన్యం పొందాలని, బంగారు తెలంగాణాలో వాళ్ళ లక్ష్య సాధన జరుగాలని ఆకాంక్షిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com