‘తంగేడు’ రెండవ సంచిక మీ ముందుకు వస్తుంది. మేం అనుకున్న లక్ష్యాలకు, మేం వేస్తున్న అడుగులకు సంకేతం ఈ పత్రిక.

తంగేడు ఒక నిర్దిష్ట లక్ష్యంతో ప్రారంభించాం. యువ సాహితీవేత్తల రచనలు మరింత నిగ్గు దేల్చడం, తెలంగాణ రచయిత సృజనశక్తిని శిఖరస్థాయిలో నిలపడం అనేది మా కర్తవ్యం అనుకొన్నాం. రచనల సృజన శీలత మరింత రాటుదేలాలని ఆశించాం.

కొందరు రచయితలు వాళ్ళ సృజనలు కేవలం సిద్ధాంతాలకే నిబద్ధం చేస్తరు. వాళ్ళ ధోరణి కేవలం ఆ    ప్రతిపాదిత సిద్ధాంతానికే అంకితం అన్నట్లుంటుంది.

నిజమే.. రచయితకు తాత్విక సృజన కచ్చితంగా ఉండవలసిందే. దానికి కళాత్మకమైన అభివ్యక్తి తోడైతే ఆ దృక్కోణం మరింత రాటుదేలుతుంది. అది ప్రజోపయోగ రచనగా వెల్లివిరుస్తుంది.

అయితే కేవలం సిద్ధాంతమే రచనకు ఆలంబన అవుతుందా? ప్రజల కొరకు రాసుడు అంటే కేవలం దుఃఖిస్తే లేక ఆగ్రహిస్తే లేక దూషిస్తే సరిపోతుందా? అట్లా చేసినవాడే రచయితా?

బహుశ ఇటువంటి రచన తాత్కాలికంగా ప్రశంసలు పొందుతే పొందుతుంది. పదుగురు తల తిప్పి చూస్తే చూస్తే చూస్తరు. అంత మాత్రాన ఒక శాశ్వత సత్యాన్ని అది ఆవిష్కరించదు.

సిద్దాంతపు ఇనుప పంజరంలో చిక్కిన కళ,కళా రూపంగా నిలబడదు. ప్రచార వాహికగానే మిగులుతుంది.  సార్వజజనీన సత్యాల దగ్గర ఆ రచన నిర్వీర్యం అవుతుంది.

రచనకు ప్రధానంగా కళాత్మక విలువ ఉండాలె. సృజనకారునికి పాత కొత్త సంవిధానం మీద అవగాహన ఉండాలె. ఇతర భాషలలోని, దేశాలలోని సాహిత్య పరిణామం మీద ఆకళింపు వుండాలె. వెరసి తనదైన ప్రాపంచిక దృక్పథం ఉండాలె. ప్రాదేశిక జీవనం మీద, ప్రజల దైనందిన కడగండ్ల మీద సానుభూతి ఉండాలె. అతని తాత్వికత కళారూపంలో పూసలో దారం తీరుగ ఒదిగిపోవాలె.

ఈ రకమైన సృజన కోసమే మా ప్రయత్నం. సంచికలో సాధ్యమైనంత సమతుల్యత సాధించడానికి ప్రయత్నం చేస్తున్నది‌. విస్తృతంగా సాహిత్య సేవ చేయాలనే సంకల్పాన్ని ఆచరణకు తేవడానికి ప్రయత్నిస్తున్నాం.

నాలుగు వ్యాసాలు, ‌మూడు కథలు, ఎనిమిది కవితలతో పాటు తెలంగాణ సమాజం, చరిత్ర, లలిత కళలు నేపథ్యంగా ఉన్న సాహితీ వ్యాసాలను ప్రచురిస్తున్నాం. ఇంకా వివిధ శీర్షిక లను నిర్వహిస్తున్నాం.

మా కృషి ‌మీ అందరి దృష్టిని ఆకర్షించిందని మొదటి సంచిక చూసి మీరు చూపించిన స్పందన ద్వారా అర్థమైంది.

సాహితీ సృజనకారులందరికీ ఉచిత ప్రతులు అందించాం. ఇక పాఠకలోకం, సాహిత్యాభిమానులు అందరూ మాకు చేదోడు వాదోడుగా ఉండాలి కోరుకుంటున్నాం.

మమ్మల్ని నిరంతరం విమర్శించే వాళ్ళకు కూడా ప్రతులను పంపించాం. కొంతమంది శ్రేయోభిలాషులు ఇచ్చిన సూచనలను, సలహాలను తప్పక‌ పాటిస్తాం.

స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ జాగృతి ఎన్నో సాహితీ కార్యక్రమాలు నిర్వహించింది. సేవ, సాంస్కృతిక రంగాలలో తన కార్యనిరతిని చాటుకొన్నది. పూల సింగిడి, కలల దారుల్లో కాళోజీ యాది‌ లాంటి ఎన్నో కవితా సంకలనాలు ప్రచురించింది. ప్రతి సంవత్సరం కాళోజీ జన్మదినోత్సవం సెప్టెంబర్ 11 న ఒక కవి సమ్మేళనం నిర్వహిస్తున్నది. తెలంగాణ కవుల్ని సన్మానిస్తున్నది. 2016 లో ముఫ్పై‌ ఒక్క జిల్లాల్లో కవి సమ్మేళనం నిర్వహించి, గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కింది. ఇది వరకే చాలా కాలం ఒక‌ సాంస్కృతిక మాసపత్రిక ను నిర్వహించింది. ఇప్పుడు తంగేడు సాహిత్య పక్ష పత్రికను మీ ముందుకు తెస్తున్నది.

ఈ పత్రికలో సురవరం, పాకాల, యశోదారెడ్డి వంటి ఆనాటి రచయితల కథలను పాల్కురికి, పోతన వంటి తెలంగాణ ప్రాచీన కవుల కవితల్ని, నేటి తరానికి పరిచయం చేస్తున్నది.  ఆధునిక సాహితీకర్తల ప్రచురణ విషయంలో అందరికీ అవకాశం కల్పిస్తూ, సమతుల్యత సాధించడానికి ప్రయత్నం చేస్తున్నది.

ఈ ప్రయాణంలో మాతో కలిసి నడవాల్సిందిగా సృజనకారులను, పాఠకులను కోరుతున్నాం.‌ మీరిచ్చే సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి. అదే సమయంలో కువిమర్శలు, ఎగతాళిని అసలు పట్టించుకోకుండా మా ప్రయాణం కొనసాగిస్తాం.

జై తెలంగాణ

జై జాగృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com