దండ కడియమై వచ్చిన తగుళ్ళ గోపాల్

తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటినుండి తెలుగు సాహిత్యం సుసంపన్నంగా కొనసాగుతోంది. రాను రాను ఎవరి అస్తిత్వాన్ని వారు ప్రకటించడం, ఎవరికి వారు ఒక కొత్త గొంతుకతో పలకడం, ఆ క్రమంలో నూతన పద  బంధాలు, పదాలు, కొత్త కొత్త ఆవిష్కరణలకు దారి చూపుతున్నవి. ఈ వాతావరణంలో ఆరోగ్యంగా కనులు తెరచిన నవయుగ కవి తగుళ్ళ గోపాల్.

తగుళ్ళ ఇటీవల వెలువరించిన కవితా సంపుటి దండ కడియం చిత్రమేమిటంటే చాలా రోజులు మాగి మాగి సాధన చేసి చేసి కవులు ఒక పరిణతమైన  అభివ్యక్తిని పొందుతారు. రొటీన్ నుంచి  బయటపడాలని చూస్తారు. తనకంటూ ఒక శైలిని, వ్యక్తిని నిర్మించుకుంటారు.

తగుళ్ళ  గోపాల్ అట్లాంటి ఘర్షణ ఎంత పొందాడు కాని, ఎంత ఒత్తిడిని అనుభవించాడో కాని, ఎకాఎకిన రొటీన్ కి భిన్నమైన కవిత్వంతో సాహితీరంగంలో లో అడుగు పెడుతున్నాడు.

ఎర్రమన్ను కు వోయిన అక్క

నింపుకున్న ఎర్రమన్ను తట్టలో

నిమ్మళంగ కూసొని నవ్వే

తంగేడు పువ్వు పల్లె

వరుసలు గలుపుకుంటూ

గుండెల్ని అల్లుకుపోయే

ప్రతి  మనిషి

నడుస్తున్న మట్టి కుండే.

తంగేడు పూవుకు పల్లెకు అభేదం చెప్పడం, మనిషిని నడుస్తున్న మట్టి కుండే అనడం, ఇట్లా ఈ కవి లో ఇంకిపోయిన ఎందరో పాత, కొత్త కవుల భాష, అలంకారిత సరికొత్తగా పుష్పించడం చూస్తాం.

కూలి తల్లి పొద్దున్నే లేచి వాకిలమ్మకు తానం చేయిస్తుందట, కనుకున్న బిడ్డల కోసం పొద్దున మోసే చుట్ట బట్టౌతుందట.

చుట్ట బట్ట అనేది తలపై బరువును మోయడానికి ఉపయోగ పడే చుట్టన బట్ట. ఈ నాగరిక ప్రపంచానికి తెలియని ఒకానొక  ఉపశమన సాధనం.ఇక్కడ కూలి ఒక చుట్ట బట్ట దేనికౌతుంది? పొద్దును మోయడానికి, పొద్దును మోయడం అనేది ఆమె కాలాన్నంతా తన పిల్లల కోసం ఎట్లా ఉపయోగిస్తుందో బలంగా తెలిపే ఒక సరస్యమైన ప్రతీక. తగుళ్ళ గోపాల్ కవిత్వాన్ని ఇట్లా విశ్లేషించుకుంటూ పోతే ప్రతి పద్యం ఒక వ్యాసమే అవుతుంది.

తగుళ్ళ గోపాల్ దండకదియాన్ని ప్రేమతో స్పృశిద్దాం. అతన్ని మరింత నూతనంగా వికసించమని  కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com