పతనం వైపు వెడుతున్న ప్రపంచం…

ముప్పై ఆరేండ్ల డాక్టర్ ఉషకు చాలా భయంగా, దుఃఖంగా, ఏ భాషకూ అందనంత బాధగా ఉంది.

అప్పుడామె ఆరబ్ మిడిల్ ఈస్ట్ దేశాలలోని గత ఆరేండ్లుగా ఒక సుదీర్ఘకాలం అంతర్యుద్ధంతో కునారిల్లుతున్న ‘ యెమన్ ‘ దేశపు బాధిత నగరం టయాజ్‌లోని అనేకమంది బాలబాలికలు హుతీస్‌కు చెందిన స్నైపర్‌ల విచక్షణా రహిత పాశవిక మెషిన్‌గన్ కాల్పుల్లో మరణించిన దాదాపు పదేళ్ళలోపలి వయసున్న బాలబాలికల శవాల కుప్పదగ్గర ఒక అంతర్జాతీయ మానవహక్కుల కార్యకర్తగా, ఆరబ్ వుమన్ వాయిస్ సభ్యురాలిగా, దోహాలోని కతార్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, ఆ క్షణం అంతర్జాతీయ అనుమతి పొందిన బి బి సి మీడియా సంస్థ ప్రతినిధిగా, పరిశీలకురాలిగా అక్కడ ఉంది. ఆమె భారతదేశ పౌరురాలు. ఈ దేశపు ప్రజల కష్టార్జితమైన డబ్బుతో ఐ ఐ టి వంటి అత్యున్నత విద్యాసంస్థల్లో అందరు విద్యావంతులవలె బాగా చదువుకుని విదేశాలకు ఎగిరిపోయి తమ సౌఖ్యం, తమ సుఖం చూచుకునే వ్యక్తిగా కాకుండా సామాజిక స్పృహతో కొన్ని తరాలుగా ప్రచలితులైన కుంటుంబంనుండి వచ్చినందుకు బాధ్యతగా వసుధైక కుటుంబంలో జీవిస్తోందామె.

ఆమెది ‘ బ్రాడ్ స్పెక్ట్రం ‘ వ్యూయింగ్. సమాజాన్ని తనదైన ఒక ప్రత్యేక కోణంలో చూడ్డంవల్ల ప్రొఫెసర్ ఉష తనను తాను ఒక విలక్షణమైన వ్యక్తిగా రూపొందించుకుంది. ఆ విలక్షణతవల్ల ఆమె ఈ ప్రపంచంలోని అతి దుఃఖిత , అతి పేద, అతి దయనీయ స్థితిలో ఉన్న మెడగాస్కర్, సౌత్ ఆఫ్రికా, అఫ్ఘనిస్తాన్, యెమన్, సూడాన్, మొజాంబిక్, మెక్సికో, నైజీరియా వంటి అనేక దేశాలను సందర్శించి కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలను ఏర్పర్చుకుంది. అవి..’ ఈ ప్రపంచం చాలామంది అనుకుంటున్నట్టు సుఖసంతోషాలతో నిండి లేదు. అనేకానేక కారణాలవల్ల అనేక అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలు నిశ్శబ్ద అంతర్ఘర్షణలతో అగ్నిపర్వతాల్లా బ్రతుకుతున్నారు. ప్రధానంగా పేదరికంతో, రాక్షసప్రవృత్తితో, హింసాకాంక్షతో, యుద్ధాలతో అట్టుడికిపోతున్న దేశాల ప్రజలు ఏండ్లతరబడి హింసాత్మకమైన దాడుల్లో లక్షలు లక్షలుగా అంతమైపోతున్నారు నిస్సహాయంగా. ఇది నిజంగా అమానవీయ దుస్థితి. ఈ పరిస్థితులకు కారణం కొన్ని దేశాల్లో గుప్తంగా దాగిఉన్న దురాక్రమణ తత్వం, చిన్న పిల్లలు చేతికి చిక్కిన బొద్దింకలను చీపురు పుల్లల్తో గుచ్చి గుచ్చి చంపే , తూనీగల్ని రెక్కలూ తోకా తుంచి అది విలవిల్లాడుతూంటే కేరింతలుకొట్టే హింసాప్రవృత్తి, రహస్యంగా లోపల దాగి ఉన్న యుద్ధతృష్ణ, దోపిడీ లక్షణం, ఎదుటి వ్యక్తి బాధపడ్తూ దుఃఖిస్తూంటే పైశాచికానందం పొందే షాడిస్ట్ సైకాలజీ.. స్నైపర్ లక్షణం.

స్నైపర్ అంటే.. బయటికి కనబడకుండా చాటుగా దాగి ఉండి ఆయుధంతో నిరాయుధులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ఆనందాన్ని పొందేవాడు. ఐతే స్నైపర్ ఎప్పుడూ తుపాకీతోనే కాల్పులు జరుపడు.. బాగా తాగివచ్చి అకారణంగా భార్యా పిల్లలను హింసించే కుటుంబ పెద్దకూడా ఒక స్నైపరే.

బి బి సి అధికారిక వాహనం డాక్టర్ ఉషనూ మరో మానవ హక్కుల కార్యకర్త లూయిస్ మెరీనీ యెమన్ నైరుతి భాగంలో ఉన్న టయాజ్ పట్టణంలో దించి వెళ్ళిపోయింది. టయాజ్ పట్టణానికి స్నైపర్ల నగరం అన్న పేరుకూడా ఉంది. వాళ్ళు అక్కడికి చేరుకోకముందే ఒక గంటక్రితం ఒక స్నైపర్ల దళం విచక్షణా రహితంగా ఒక విశాలమైన పెంటకుప్పలు నిండిన మైదానం వంటి ప్రాంతంలో ఆడుకుంటున్న నిరుపేద యెమన్ బాలబాలికలపై అతి కిరాతకంగా కాల్పులు జరిపి నిష్క్రమించారు. నేలంతా మృతులైన పిల్లల వెచ్చని రక్తంతో తడిచి దయనీయంగా ఉంది. ఆ దుర్ఘటనను తెలుసుకుని పగిలిన గుండెలతో ఏడుస్తూ అక్కడికి చేరుకున్న వాళ్ళ తల్లిదండ్రులు తమ తమ పిల్లల్ని మృతులుగా కనుగొని ఒక శవాల దిబ్బగా అందరినీ ఒకచోట చేరుస్తున్న దృశ్యం విదారకంగా, కన్నీళ్ళు తెప్పించేదిగా ఉంది.

” వీళ్ళు పాపం అన్నెం పున్నెం ఎరుగని ఈ పసివాళ్ళను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థంకాదు. ఈ హౌతీస్ టెర్రరిస్ట్‌లు ఎందుకు ఎంతో భవిష్యత్తున్న ఈ పిల్లలను ఎంచుకుంటున్నారో చంపడానికి” అంది ఉష అప్రయత్నంగానే తన ప్రక్కనే ఉన్న సహ కార్యకర్తనుద్దేశించి. వంగి మరణవేదన అనుభవిస్తున్న ఒక ఆరేండ్ల బాలిక కాల్పుల్లో తెగి వ్రేలాడ్తున్న తన చేయిని ఈడ్చుకుపోతూంటే.. మేరీ ఆసరా పడ్తోంది పాపం. పిల్లల చావుకేకలతో అక్కడి వాతావరణమంతా బీభత్సంగా ఉంది.

ఈ ఒక ప్రపంచ విషాదంగా మారిన యెమన్ అంతర్యుద్ధం మొదలైన దగ్గరినుండి దాదాపు లక్షమంది చనిపోయారనీ, మరో లక్ష మందిదాకా తీవ్రంగా గాయపడి వివిధ హాస్పిటల్లలో చికిత్స పొందుతున్నారని, అనేక లక్షలమంది కకావికలై ప్రపంచ నలుమూలలకు ప్రాణాలను అరచేతుల్లో పట్టుకుని పారిపోయారని ఉషకు తెలుసు. రాజధాని సనా నగరంపై హౌతీస్ స్నైపర్లు 4 డిసెంబర్ 2017 న మెరుపుదాడి దాడి చేసి అప్పటి యెమన్ ప్రెసిడెంట్ అలీ అహమ్మద్ సాలెహ్‌ను కాల్చి హత్యచేసిన రోజు మొదలైన భీకర హింసాకాండ అప్రతిహతంగా రావణాసురుని కాష్టంలా కొనసాగుతూనేఉంది.

వీళ్ళను చూస్తూంటే జీవితమంటే కృషిచేస్తే దేన్నైనా సాధించగలిగే తపస్సనిగానీ, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న సిద్ధాంతంగానీ కావనీ.. శత్రుభారినపడకుండా బ్రతుకగలిగడమే ఒక అదృష్టమనీ, నిత్య యుద్ధమనీ, ఒక chance మాత్రమేననీ అనిపిస్తోంది. మనిషిని మనిషి చంపడానికి వ్యక్తిగత శత్రుత్వమేదీ అస్సలు అవసరమే లేదనికూడా అర్థమౌతోంది.

ఎదుట కనీసం ఒక పదిపదిహేను మంది పిల్లల శవాలు అడ్డదిడ్డంగా పడున్నాయి.. ఇంకో ఏడెనిమిది మంది తీవ్రంగా గాయపడి పెడబొబ్బలు పెడ్తున్నారు ఏడుస్తూ. వాళ్ళను వెంటనే ఏదో దవాఖానకు తరలించాలె. కాని ఎలా.?

ఉష తన బి బి సి టీం లీడర్ మైకేల్‌కు ఫోన్ చేద్దామని స్ఫురించి.,

సరిగ్గా ఆ క్షణమే సర్ర్ర్ర్ర్ మని భీకరధ్వనులతో మూడు ఎఫ్- 15 యుద్ధ విమానాలు మెరుపువేగంతో చొచ్చుకొస్తూ వరుస బాంబుల వర్షం కురిపిస్తూ దూసుకుపోయాయి లిప్తకాలంలో. ఉష తన శిక్షణ స్పృహతో చటుక్కున నేలను కరుచుకుని అతుక్కుపోయింది. మేరీకూడా. ప్రక్కనున్న మనుషులూ, శవాలపై కాకుండా ప్రక్కనే ఇదివరకే సగం కూలిపోయి మొండిగోడలుగా మిగిలిఉన్న భవన సముదాయాలను తుత్తునియలు చేసి చెవులు పగిలిపొయే విస్ఫోటనాన్ని సృష్టించాయి. తెలిసింది డాక్టర్ ఉషకు అవి సౌదీ అరేబియా రియాద్‌లో తన మంత్రివర్గంతో సహా తలదాచుకుని యెమన్ ప్రభుత్వాన్ని నడుపుతున్న అబ్ద్రాబ్బుల్ మన్సూర్ హాది అని పిలువబడే యెమన్ అధ్యక్షునికి దన్నుగా పనిచేస్తున్న ‘ సౌదీ కూటమి..అంటే అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్, ఆరబ్ ఎమిరేట్స్, బహ్రాన్, కువైట్, కతార్, ఈజిప్ట్ వంటి అనేక శక్తివంతమైన దేశాల సమూహం ఒక యెమన్ అనబడే బక్కదేశ పేద ప్రజలపై భీషణ దాడి చేస్తూ సాగిస్తున్న ధ్వంసచర్య అని… ఏమిటిది.. ఎందుకిలా.. ఇంత అమానుషంగా.. ఎంతో సంస్కారవంతులైన అగ్రరాజ్య ప్రభుత్వాలు వ్యాపారంకోసం, ఆధిపత్యంకోసం సభ్య ప్రపంచ కోటానుకోట్ల సహమానవుల ముందు ఇంత కర్కశంగా, నిస్సిగ్గుగా హత్యాకాండను కొనసాగిస్తూండడం .. ఎందుకు.?

ఉహూc.. తనదేశంలోని ప్రజలను షియా, సున్నీ మతస్థులుగా విడగొట్టి, యెమన్ దేశస్థులే ఐన హౌతీలు ఇరాన్‌వంటి దేశపు రాజకీయ వ్యూహపు ఉచ్చులో పడి వాళ్ళదగ్గరినుండి కోట్లకొద్ది రూపాయల ఆయుధాలను కొంటూ తమ సోదర సహదేశవాసులను ఈ విధంగా నిశ్శేషం చేస్తూ పోవడం ఏమిటి.

అగ్రదేశాలన్నీ ఈ యెమన్ దీర్ఘకాలిక యుద్ధంలో ఎవరికివారు ఆయుధాలను అమ్ముకుంటూ, పైకి మృతులపట్ల సానుభూతిని ప్రకటిస్తూ జరుగుతున్నదాన్ని ప్రపంచ విషాదంగా అభివర్ణిస్తూ.,

ఈ అపరిశుభ్ర వాతావరణంలో దేశమంతా ఒకవైపు కలరా వంటి మహమ్మారి రోగాలు వేలకు వేలుగా ప్రజలను మృత్యుకుహరంలోకి తరలించుకుపోతూంటే.. ‘ కరోనా ‘ వంటి అంతుచిక్కని భయంకర రోగం వేలకు వేల జనాన్ని భూగర్భంలో పూడ్చిపెడ్తూంటే.. ఏమిటిది.. ఏంజరుగుతోందసలిప్పుడు.. ఇక్కడ.

మనుషులు తరతరాలుగా హావ్స్ అండ్ హావ్ నాట్స్ మధ్య జరుగుతున్న పోరాటంలో బానిస సంకెళ్ళను తెంచుకుంటూ, స్వేచ్ఛకోసం, స్వతంత్రంకోసం పరితపిస్తూనే తమను తాము విముక్తం చేసుకుంటూ.. ఆకాశంలో ఎగిరే పక్షుల్లా రూపొందించుకుంటున్నామనుకుంటున్న తరుణంలో.,

నిజానికి వర్తమాన ప్రపంచంలో ఎక్కడ స్వేచ్ఛ పరిడవిల్లుతున్నదో అర్థంకావడంలేదు. పెద్ద పాములు చిన్న పాములను చంపేస్తూనే ఉన్నయ్. పీతిరి గద్దలు పక్షి పిల్లలను తన్నుకుపొతూనే ఉన్నయ్. ఆయుధాల రూపంలోనో, ఫార్మా మందుల రూపంలోనో వ్యాపార దేశాలు కూటముల పేరుతోనో అనేక పిట్ట దేశాలపై ఆంక్షలు విధిస్తూ, మాఫియాలుగా ఏర్పడ్తూ, ఇంటర్నేషనల్ బాలిస్టిక్ మిస్సైల్స్‌ను చంకల్లో పెట్టుకుని భయపెడ్తూనే ఉన్నయ్. రాక్షస హంతకుడైన నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్ గానీ, చైనా అధ్యక్ష నియంత క్జి జింపింగ్ గానీ ఎవరినైనా భయపెట్టడమే గాని భయపడ్డం అనేది ఉందా. ఎక్కడైనా మానవ హక్కులు.. ధర్మపాలన ఉన్నాయా అసలు ఇంత అభివృద్ధి చెందినామని చెప్పుకుంటున్న వర్తమాన వసుధైక సమాజంలో. ఎవనికీ ఈ ప్రపంచంలో ‘ ప్రేమ ‘ పట్ల విశ్వాసంలేదు. ఉన్నదంతా భయం. భయపెట్టడం..భయపడ్డం మాత్రమే.

ఇప్పుడు ఒక ప్రపంచ విషాదంగా పరిణమిస్తున్న యెమన్ దేశ దుఃఖం వెనుక ఉన్నదంతా కూడా భయమేనా.

డాక్టర్ ఉష మెల్లగా ఆ శవాల దిబ్బనుండి లేచి నిలబడి.. మిల్లగా ప్రక్కనే ఉన్న ఎత్తైన కూలిన గోడలను ఆనుకుని ఆనుకుని నక్కి నక్కి .. నడుస్తూ ఏ శిథిల భవనపు కిటికీ సందులోంచి ఏ స్నైపర్ కాలుస్తాడో అని భయపడ్తూ.,

యెమన్ గతంలోకి తొంగి చూస్తే.. 1999 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అలి అబ్దుల్లా సాలెహ్ 92.6% ప్రజల ఓట్లతో అధ్యక్షుడై, మళ్ళీ 2006 ఎన్నికల్లో 77.2 % శాతం ఓట్లతో రెండవసారి అధ్యక్షుడై.. సనా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించి.. 4 డిసెంబర్, 2017లో.. ఒకప్పటి ప్రజాభిమాన నాయకుడే ప్రజల ఆగ్రహానికి గురై.. దేశాన్ని విడిచి పారిపొతూండగా ఒక హౌతీ స్నైపర్ తుపాకీ బుల్లెట్లకు బలై చనిపోవడం.. విచిత్రమైన విషాదమేకదా. కాలం బలీయమై చరిత్రను శాసిస్తూ మనుషుల భవిష్యత్తును నిర్మిస్తుందా విధికృతంగా అనిపిస్తూంటుంది అప్పుడప్పుడు.

సుదీర్ఘ మానవ చరిత్రలో ఎందరో నియంతలు కాలగర్భంలో కలిపోయారుగాని ఏ ఒక్కరైనా విధిని ఎదిరించి నిలబడి ఋజువు చేసుకున్నారా తమనుతాము శాశ్వతులై.

సుదీర్ఘ మానవ చరిత్రలో ఎందరో నియంతలు కాలగర్భంలో కలిపోయారుగాని ఏ ఒక్కరైనా విధిని ఎదిరించి నిలబడి ఋజువు చేసుకున్నారా తమనుతాము శాశ్వతులై.

‘ ఇప్పుడు యెమన్‌ను అధ్యయనం చేద్ధామని వచ్చిన తను ఒక్కసారి సంలీనమైపోయిన ఒకప్పటి నార్త్ యెమన్, సౌత్ యెమన్ ప్రాంతాలన్నింటినీ పర్యటించి.. ఈ అంతర్యుద్ధ కాలంలో 19000 దాడులకు లోనై.. 29 మిలియన్ల జనాభా 24 మిలియన్ల జనాభాగా మాత్రమే శేషమై మిగిలిన ధ్వంస యెమన్‌ను అర్థం చేసుకోవాలని.,

ఒక అంతర్జాతీయ మీడియా వ్యాన్ కనిపించింది ఉషకు అనూహ్యంగా. వెంటనే ఆమె తమ రక్షిత కోడ్‌ను తెలియజేస్తూ చేతులను విన్యాసపర్చింది. దాంట్లో యెక్కి ‘ హమ్మయ్య ‘ అని ఊపిరి పీల్చుకుని.,

ప్రెసిడెంట్ అబ్ద్రబ్బుల్ మన్సూర్ హాది రాజధాని సనా నగరాన్ని విడిచి అనివార్య పరిస్థితుల్లో ఆడెన్ నగరాన్ని ఆపద్ధర్మ రాజధానిగా ప్రకటించి.. సౌదీ అరేబియా చేతుల్లో కీల్కుబొమ్మగా మారి రియాద్‌కు పారిపోయి.. వర్తమానాన్ని శూన్యం చేసిన తర్వాత.,

ఉష ” వ్యాన్‌ను ఆడెన్ దిక్కు పోనీయండి ” అని అభ్యర్థించింది డ్రైవర్‌ను.

ఏడెన్ తీరప్రాంత నగరంవైపు ప్రయాణిస్తున్న ఉష మధ్యలో అనేక పట్టణాల్లో ఆగి ఎందరినో సాధారణ పౌరులను కలిసి మాట్లాడింది. ఎవరిని కదిపినా కన్నీళ్ళే పొంగుతున్నాయి అందరిలోనూ. పిల్లల, వృద్ధుల శవాలకు కొదువే లేనట్టు చెల్లాచెదురు మృతదేహాలు అంతటా. అసలు ఎందుకు ఈ మారణకాండ అని లోతుగా గమనిస్తే.. చాలా స్పష్టంగా అర్థమైన విషయమేమిటంటే ఇది రెండు శక్తివంతమైన.. సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు. రెండు ఎద్దులు కుమ్ముకుంటూన్నపుడు మధ్య లేగదూడల కాళ్ళు విరిగిపోతై. యుద్ధాలెప్పుడూ వ్యూహాత్మకమై బలహీనుణ్ణి బలిచేసి ముగిసిపోతై. హాడి ప్రాణభయంతో సౌదీ నగరం రియాద్‌కు పారిపోయిన తర్వాత రెండు శిబిరాలుగా విడిపోయి తలపడి సమసిపోని సంక్షోభాన్ని సృష్టించి మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి సౌదీ మరియు ఇరాన్ తమ తమ రాజకీయ స్నేహితుల్ని కూటములుగా ఏర్పర్చుకుని. లక్షలమంది అమాయకులను హననం చేసిన ఈ దుష్కార్యం చరిత్ర క్షమించని ఉద్దేశ్యపూరిత నేరం.

రియాద్‌లో ఉన్న ప్రెసిడెంట్ హాడి ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసి మొత్తం మంత్రులను ఒక ప్రత్యేక విమానంలో 30 డిసెంబర్, 2020 న ఏడెన్ నగరానికి పంపాడు. విమానం ఏర్‌పోర్ట్‌లో ల్యాండ్ ఔతూండగా అకస్మాత్తుగా ఒక మిసైల్ దాడి జరిగింది. తదాదిగా వరుసగా మూడు క్షిపణులు వచ్చి పడి 30 మందిని హతమార్చి, దాదాపు వందమందిని తీవ్రంగా గాయపర్చాయి. ఈ ఘటన మళ్ళీ ఆరిపోతున్నట్టనిపించిన పరిస్థితిని అగ్నిగుండంగా మార్చింది. ఇది ఇప్పట్లో ఆరిపోయే నిప్పు కాదు.

రాజకీయాలు చాలా నిర్దయగా, వ్యూహాత్మకంగా, స్వార్థపూరితంగా మాత్రమే ఉంటూ నిశ్శబ్దంగా నిర్వహించబడ్తాయని డాక్టర్ ఉష మళ్లీ ఒకసారి రూఢి పర్చుకుంది.

మానవ హక్కులు, పౌరభాద్యతలు.. ఇవన్నీ వింటానికి మాత్రమే పనికొచ్చే పుస్తకాల్లోని అందమైన మాటలు.

ప్రతి యుద్ధంలోనూ అంతిమంగా బలైపోయేది ఆ యుద్ధానికి సంబంధమే లేని అమాయకులు మాత్రమే.

చరిత్రలో ప్రతి రాజకీయవేత్తా తను అధికారంలో ఉండేందుకు ఏ దుష్కార్యాన్నైనా చేస్తాడు. రాజకీయాల్లో ఆధిపత్యమూ, అధికారమే అంతిమ పరమావధి.

ఐతే.. ఈ రాజకీయ దుర్మార్గాలు దీర్ఘకాలిక ప్రాతిపదికపై మాత్రమే తమ ప్రభావాన్ని చూపిస్తూ సమాజాలను భ్రష్టు పట్టిస్తాయి.

డాక్టర్ ఉష తన యెమన్ పర్యటనలో అనేకానేక వందల శవాల వీక్షణతో చాలా దుఃఖితయై.. భారమైన హృదయంతో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు చేరి.. డైరెక్ట్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుతూ.,

మాతృభూమి.

మాతృభూమిపై ఎవరికైనా కన్నతల్లిమీదికంటే అమితమైన ప్రేమే ఉంటుంది.

ఉష విమానం దిగి.. బయటికొచ్చి ఉబెర్ ట్యాక్సీలో కూర్చుని.. గాజు పలకపై జారిపోతున్న గాజుగోళీలా వెళ్తున్న కారులోనుండి రోడ్డుకు ఇరువైపులా వేలాదిగా కనబడ్తున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల బాపతు ఫ్లెక్సీల హంగామాను చూస్తూ అనుకుంది ఒక విశ్లేషకురాలిగా.,

‘ మన దేశంలో ఎవరు ఎవరిగురించైనా ఏ సంకోచమూ లేకుండా ఏ అశ్లీల భాషలోనైనా బహిరంగంగా మాట్లాడవచ్చు. ఏ వ్యక్తయినా తనకు నచ్చిన పనిని నిరభ్యంతరంగా ఏ భయమూ లేకుండా చేయవచ్చు. ఇక్కడ స్వేచ్ఛ అనేది విశృంఖలత్వంగా మారి ప్రస్తుతం విచ్చలవిడితనంగా వర్థిల్లుతోంది.

మన భారత సమాజంలో రాజకీయాలు పూర్తిగా పతనమై అన్ని పార్టీలు మన ప్రియమైన ఓటర్లకు సంక్షేమ పథకాల పేరులో లంచాలను డైరెక్ట్‌గా వాళ్ల వాళ్ళ అకౌంట్‌లలో నగదు రూపంలో జమచేసే వెసులుబాటును లీగలైజ్ చేసుకుని వర్థిల్లుతున్నారు.

ఎవరైనా ఉద్యోగాలు చేయవలసిన పనిలేకుండా నిరుద్యోగ భృతితోపాటు అనేక సంక్షేమ పథకాలతో సంతుష్టులై జీవిస్తున్నారు. ఒక కవి అన్నట్టు.. ” నలభై ఐదు ఏండ్లదాకా వస్తుంది నాకు నిరుద్యోగ భృతి.. ఆ తర్వాత చచ్చేదాకా పెన్షన్ “

యెమన్‌లూ, యుద్ధ వ్యూహాలూ, హత్యలూ, ఆక్రమణలూ అన్నీ బలాదూర్ ఇక.

భారతదేశమా ‘సంక్షేమ’ పథకాలతో’ సోమరిపోతు పౌరులను తయారుచేస్తూ వర్థిల్లు.

వ్యవస్థల పతనాలు బహువిధాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com