-నాంపల్లి సుజాత

నక్షత్రాలను పొదుముకొని

మెరిసిపోయే ఆకాశమే..నాకు చీరంటే

సప్తవర్ణాల సోయగాలతో నను

చుట్టుకున్న ఇంద్రధనుస్సే..చీరంటే

అలనాటి..

సంచారి సేకరించిన నారపోగుల

జలతారు సెలయేరే.. చీరంటే

భూమాత ఒడిలోంచి పచ్చ పచ్చగా విచ్చుకున్న వరి నారే నాకు చీరంటే..

రైతన్న చెమట చుక్కలు

నేతన్న ఒడుపుగా వడికిన అల్లిబిల్లి పొగులే

నాకు చీరంటే..

నను బుట్టబొమ్మలా దిద్దిన

మొట్టమొదటి

పట్టంచు పసుపు చీరె..

నా పుట్టింటికి నను చుట్టం చేసిన మహతల్లి

చీరలను

పోగేసుకునేందుకు యెన్ని సందర్భాలో!!

పెట్టిపోతలూ పుట్టినరోజులూ

పుట్టింటి కానుకలూ

కంటికి నచ్చినవీ కానుకలిచ్చినవీ

ఇప్పుడు అలమారీ నిండా

కదిపితే రాలిపడేన్ని గుట్టలు గుట్టలుగా

సమయానికేదీ నచ్చదు

కాలానికి తగినట్లు లేవనో..పూలూ లతలూ

వన్నె తగ్గాయనీ ఎన్ని వంకలో..!

ఒక్కోచీర..ఓ అమూల్య జ్ఞాపకాల నిధి

దేన్నీ త్యజించ మనసొప్పదు..!

అవునూ ఏమాటకామాటే..!

ఆమె ఆధునిక మహిళ

నూరు చేతులతో తీగె మీద కదా

తన పరుగులు

అందంగాదిద్దుకున్న నిండైన కుచ్చిళ్లే

ఆమె వేగానికి అవరోధం మిప్పుడు

అన్నట్టు

ఆనాటి పాంచాలి అపర ధీశాలే..

నిండు సభలో చీర లాగినోడి చెయ్యి విరవకుండా..

చేతులెత్తి వేడుకుంది కాపాడమంటూ..!

అదీ చీరతో వచ్చిన అణకువే నేమో..!

నిజమే

ఇప్పుడిది ఓ కొండవీటి చాంతాడే..

నేటి సాధికారపు సర్కస్ పిల్లకి

మూడు మూరల నిలువూ

ముప్పైమూరల పొడవూ..

దేహానికి చుట్టుకుంటే ఒక్కజంగన్నా బలంగా

వెయ్యలేని స్వీయబందీలు..

ఆర్మీ నుంచి..అంతరిక్షం దాకా..

ఆమె సేవలు విస్తృతం

సాంప్రదాయం కన్నా సౌకర్యమయితేనే మేలు

అయినా

దీని సరిజంట పంచాదోతీ

ఎప్పుడో కనుమరుగై కంఫర్ట్ జోన్ కెళ్లింది

ఈ చీరే..

ఇంకా తడబడుతూ పెనుగులాడుతోంది

ఇంకెవరి ఆదేశాల కోసమో చోస్తూ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com