
(భార్యభర్తల సంవాదము)
ఇంతకు ఱేపే మీ ప్రయాణము నిశ్చయపఱచినారా? ఱేపటిదినముండి యెల్లుండి పోవుటకు వీలులేదా?
ఇంక నీవు నీ పిచ్చి బలవంతములు మాను. నేను ఱేపే వెళ్ళవలసిన యావశ్యము కలదు.
<ఇంక నేను మిమ్ముల నుండుమని యననుగాని మీరు పోయినది మొదలు మూడు నాలుగు దినములకొకసారి తప్పక తమ క్షేమముఁ దెలుపుటకైనను మఱువకుండుటకు వేడెదను. తమ కుశల వార్త తెలియకుండిననిట నాకెంత మాత్రమును దోఁచదు./p>
మంచిది నీ యిష్ట ప్రకారమే వ్రాసెదను. గాని నీవు నీ కుశలమును నాకెటులఁ దెలుపుదువు. నా క్షేమమును దెలిసికొనవలెనన్న నిచ్చ నీ కుండునటులనే నీ స్థితిని దెలిసికొనవలెనన్న కోర్కె నాకును నుండును గదా?
ఇందుకు నేనేమి చేయను? నాకు మీ వలె చదువు వచ్చియుండినను నిత్యమును సంతోషముగా నుత్తరములు వ్రాసియుందును. ఇప్పుడయినను నేనప్పుడప్పుడూ నా తమ్మునిచేత వ్రాయించి పంపెదను.
నీకే చదువు వచ్చి యుండిన నీ తమ్ముని నాశ్రయింపవలసిన యావశ్యకము లేకయే నీవు నీ మనోగతమును నాకు వ్రాయగలిగి యుదువు గదా? నేను నీకు నుత్తరము వ్రాయ దలచినను దానిని జదువుటకు నీవు సమర్ధురాలవయి నందువలన నా మనసునందలి సంగతులను బూర్తిగా వ్రాయజాలను. నేను వ్రాసిన జాబులోని సంగతలు నీకుఁ దెలియవలెననిన నీ వితరుల నాశ్రయింప వలసినదానవే కదా? వివాహమైన దినము నుండియు విద్య నేర్చుకొనుమని నీకెన్ని విధముల బోధించినను నీవు వినిన దానవు కావు. మొదట చిన్న పిల్లయని యనుకొంటిని కాని నీవు బుద్ధి తెలిసిన పిదప సహితము బాల్యపు బుద్ధులను విడువవైతివి. ఇకనైనను విద్య నేర్చెదవా? నీ ముష్కరత్వమునే ధృడపడునటుల జేసెదవా?
మీరిట్లు కోపము తెచ్చుకొనిన నేనేమి చేయుదును? నాకును లోకములోని స్త్రీలవలె విద్యనభ్యసింపవలెనన్న యాస యప్పుడప్పుడు కలుగుచుండును. గాని మా నాయనమ్మ యాడువారు చదువు నేర్చుకొనగూడదనియు జదివిన స్త్రీలు తమ భర్తల ఆయువును హరింతురనియు ఇది శాస్త్రములలో నున్ననదనియు జెప్పుచుండును.
ఇంతేకద వెనుకటి వారి మనసులలో లేనిపోని కల్పనలు పుట్టుచుండును. విద్య నేర్చినచో స్త్రీలు భర్తలను గోలుపోవుదురన్న భయం కలుగుచున్నది. ఈ మాటలు ముసలమ్మల వాక్కులలోనివేకాని శాస్త్రములలోనివి కావు. శాస్త్రములలో నాడవారు చదువుకొనవలెననియే యున్నది. చెన్నపురి కేగిన వెనుక నీకొఱకొక మంచి పుస్తకము పంపెదను. ఇంతలో నీవు నీ తమ్ముని దగ్గిర చదువు నేర్చు చుండుము.
ఈ మాట మరీ బాగున్నది! నాకు జదువుకొనుటకంటేను వేఱే పనిలేదా?
నీవు వేఱుపనులు మానుమని నేననలేదు. గృహకృత్యముల నాడువారు చేయక తప్పదు. నీవు నీపనియైన పిదప నిరుగు పొరుగులతో వ్యర్థ ప్రసంగములు చేయు కాలమునందే విద్యనభ్యసింపుచుండిన నెంత బాగుండును? విద్య నేర్చినందున గలుగు లాభములును నదిరానందువలన గలుగు నష్టములును నీకు కొన్ని దెలియును. అయినను నీకింకను జదువునందాసక్తి కలుగకుండుట వింతగానున్నది.
ఎందులకా చదువు? భర్తకు నుత్తరములు వ్రాయుటకేనా? మేము మీ వలె కబీర్లకు బోయి యుద్యోగములు చేతుమా? చదువు ముక్కలు నాలుగు నేర్చినతోడనే యిరుగు పొరుగు వారలు నవ్వుదురు. నిందింతురు. తిరస్కరించుటకైనను వెనకదీయరు. స్వల్పలాభముల కాశపడి యిన్నికష్టములకేల లోబడవలెను? మనమైనను నెల్లకాలము విడివిడిగా నుందుమా? చాలా దినములుందు మనుకునినను రెండు సంవత్సరముల కంటె నుండము తదనంతరము నాకీ చదువు వలని లాభమేమి?
ఇట్లనుట నీకు సహజమే. విద్యవలని యుపయోగమును, దానివలన గలుగు లాభములును పూర్తిగా నీ వెఱుగవు. ఇట్టి నీ యజ్ఞానమునకు విచార పడవలయునే గాని నవ్వరాదు. ఇంచుకయినను విద్యామృతపానము నీకిదివఱకు లభించియుండిన నిట్టి పిచ్చి విచారములకు నీమనసున చోటు కలుగునా విద్య నేర్చినచో కచీర్లకుంబోయి యుద్యోగములు చేయుట, నుత్తరములు వ్రాయుటకు వేఱు ప్రయోజనమేమిగలదని నీకు దోచుటయుక్తమే కాని నీవు….. నాలోచించి చూచిన దీనియందలి దోషము నీకే తెలియును. అక్షరములను వ్రాయను జదువను నేర్చునంతమాత్రమున నరులు విద్యావంతులు కాజాలరు. అనేకులు వ్రాసిన ఉధ్రంథములను జదివి వాని
తాత్పర్యమును గ్రహింపగల వారలే విద్యాయుతులనబడదురు. ఇట్టి విద్యవలన బుద్ధి వికసించుట. అనేక సధ్గ్రంథములలోని యమూల్యంబులగు నుపదేశ వాక్యంబులు మనసున నాటి మనుజుల నుదాత్త వంతులను గాజేయును. వారి యందలి దుర్గుణపుంజములు పోయి సద్గుణపరంపర లాస్థానమునలంకరించును. లోకానుభవమును గనుటకు వారలు విశేష యోగ్యులగుదురు. అనేక లోకవార్తలు నెఱుగ గలిగిన వారలగుదురు. కొన్ని పుస్తకముల పఠనమువలన మనమునుకాహ్లాదము కలుగును. ఇందువలన సంసారమునందలి యసంఖ్యాతములగు దుఃఖముల నొక్కింత మఱచి జనులానందింపగలరు. విద్యవలన నిట్టి లాభము లింకను బెక్కుకలవు. నీవు పట్టుదలతో జదువు నేర్చి కొంత చదువుకొనిన పిదప భోజన శయనాదులనైన నొల్లక చదువునందే యభిరుచి కలిగియుందువని నేను దృఢముగా జెప్పగలను. అన్ని యానందములలో విద్యానందమే శ్రేష్ఠమనిన వాక్యము నిజమని నీవే తెలిసికొనెదవు. ఇది యిటుండనిమ్ము ప్రపంచమునందెల్లప్పుడును పత్నిపతికి సహాయురాలై యుండవలయును. గాన భర్తకు సహాయురాలగు పత్ని విద్యనేర్చినంగాని తన కర్తవ్యమును పూర్తిగా నిర్వహింపజాలదు. పెనిమిటి దినమంతయు శ్రమపడి యింటికి వచ్చిన పిదప నింటి యందలి యనేక లెక్కలను నాతడు వ్రాయనక్కర లేకయే విద్యావతియగు సతి తానే వ్రాయును. అందువలన భర్తకు గొంతయైనను విశ్రాంతి కలుగును.
“చదువు రాకున్న… లెక్కలను జ్ఞాపకముంచుకొనలేదూ?”
అవును మీరింటి లెక్కలను గొన్నిటిని జ్ఞాపకముంచుకొనెదరు. గాని వాని ననేక పర్యాయములు తప్పుచుందురు. విద్య వచ్చినవారట్లు తప్పుట సంభవించదు. చాకలివాడు బట్టలుతుక దీసికొని పోయినచో మీరు వాని సంఖ్యను రెండు పదులు నాలుగని జ్ఞాపకముంచుకొనెదరు. వాడుతికి తీసికొని వచ్చిన బట్టలను మీ
జ్ఞాపక ప్రకారము లెక్కించి తీసికొనెదరు. గాని వాడొక కోటు బదులింకొక తలగడ సంచి నధికముగా దెచ్చినచో తెలుసుకొనజాలరు గదా? ఇట్లే పాలవాడు పాలిచ్చిపోయినచో నిత్యము మీరు గోడమీద నొక గీటు గీయుదురు. ఆ గీతల నడుమ మరెవరయిన నింకను గీతలు గీచిన నాకేమి తెలియగలదు? ఇదే కదా మీ గణితము మీరు విద్యావంతులయినచో నిట్టి యిబ్బందులును వ్యత్యాసములును నేలకలుగును?
ఇదంతయు నిజమే కాని యాడువారలు చదువుకొనగూడదని శాస్త్రములో బూర్వులేల వ్రాసియుంచిరి?
ఇట్లయిన విద్యరానందువలన గలుగు నష్టములనింకను జెప్పెదను విను, నీకే చదువు వచ్చి యుండిన శాస్త్రములో నేమి వ్రాసియున్నది నీవే చదివి తెలిసి కొనజాలి యుందువు. నేనిదివఱకు జదివిన శాస్త్రములలో ఎక్కడను స్త్రీలు చదువగూడదనిన మాట లేదు. బహుశా యే శాస్త్రములోను నిట్టి సంగతి యుండదని నా తాత్పర్యము. మీ నాయనమ్మతోటి కొందఱు పిచ్చి నమ్మకము కలవారలు తాము విన్న మాటలు నితరులకు జెప్పుచుందురు. వీరి మాటలను విను మీవంటి వారలు శాస్త్రములను జూడబోరుగాన నీయంధపరంపర వలననే మన దేశము నందనేక నింద్యములగు నాచారములు శాస్త్ర సమ్మతములను తలపున జేయబడుచున్నవి. కాని మా మాటలు శాస్త్రములలో నున్నవా లేవాయని చూచు దిక్కులేదు. ఈ సంగతుల వాస్తవము నెఱుగదలచువారి సంఖ్యయత్యల్ప మైనదిగానున్నను శాస్త్రములో నున్నదని పామరులను భ్రమియింపజేసి వారిచేననేక దుష్కర్మలను జేయించు పండితోత్తములును మనదేశము నందనేకులు కలరు. ఇందువలన దమరు చేయుకార్యము మంచిదా చెడ్డదాయని విచారించి తమకు పరమేశ్వరుడిచ్చిన సదసద్వివేకముల వలన దాని నెఱిగి దాని ప్రకారమే నడుచు వారిచట నంతగా గానరారు. ఇట్టి స్థితిజ్ఞానులయిన పురుషులయి యుండగా నజ్ఞానాంధకారములో నున్న స్త్రీలు మీరు మూఢత్వమును విడవకుండుట యొక వింతకాదు. అయినను మీరిక ముందు జ్ఞానాంధకూపము నుండి వెలువడి జ్ఞాన ప్రకాశమును సంచరింప బ్రయత్నింపవలెను. ప్రస్తుతము పురుషులకంటెను స్త్రీలు విశేష జ్ఞానసంపన్నులగుట యధిక యావశ్యము ఏలన నికముందు పుట్టబోవు వారి నున్నతపదవికి తెచ్చుట స్త్రీల యధీనములోనిదై యున్నది. తల్లి విద్యాహీనయు దుర్గుణమయినయిన నామె సంతానమంతయు నటులనే యగుటయు తల్లి విద్యావతియు సద్గుణవతియు నైనచో నామె సంతానము మిక్కిలి యోగ్యతను గాంచగల్గుటయు సహజము. తండ్రి గుణములకంటెను దల్లి గుణములే పిల్లలకు విశేషముగా నలవడుట యుక్తి యుక్తము. నీ స్థితియే చూడుము మీ తల్లియు ముత్తవ తల్లియు విద్య నెఱగని వారలయినందువలననే కదా నీవిపుడు వారి పిచ్చి యుపదేశములను విని విద్య నేర్చుకొనుటకు మనసొప్పక యున్నదానవు? ఇక ముందు నీకు బుట్టు పిల్లలును జదువుకొన విసుగు కలవారే యగుదురు.
పిల్లలెపుడు నేయే సంగతులను ఉత్తమురాలగు నొక్క తల్లి తన పిల్లలకు కలుగు సద్గుణములు పదిమంది వుత్తమ గురువుల వలన గలుగ లేరని యొకానొక విద్వాంసుడు వ్రాసెను. గాన తమను నుత్తమవారి లీలను జేయుట కైనను దల్లులు విద్యావంతులగుట నావశ్యకము.
“నేను మీ యాశయములకు విరుద్ధముగా న డుతునా? నేను విద్యావతి యగుట మీకిష్టమే యనిన ఱేపటి నుండియే నేర్చుకొనెదను నాకు విద్య రాకుండి నేను మూర్ఖురాలిగా నుండినను నాకు పతి కంటె నన్య దైవము లేదనియు బతి యాజ్ఞను శిరసావహించి చేయుట నా ముఖ్య కర్తవ్యములలో నిదనియును గట్టిగా దెలియును. నాయనమ్మ కోపగించినను నిరుగు పొరుగు వారలు నన్నాక్షేపించి నవ్వినను నేను భయపడను. తమ యాజ్ఞ ప్రకారము చదువుకొని తమను సంతసింపజేయును.”
“ఈ మాటలు నిజములేనా”
“అందులకు సందేహమేమి? తమ సద్బోధ వినినప్పటి నుండియు నేను పుస్తకముల నెప్పుడు చదువుదునాయని నాకు దొందరగానున్నది. ఇక నేనేనా చేతి యక్షరములతో దమకునుత్తరములు వ్రాసెదను. మీరు చెన్నపురికి బోయిన వెంటనే నాకొక మంచి పుస్తకము మఱచిపోక పంపవలెను. వ్రాసెదను గాని నేను వ్రాసే యుత్తరమును జాచి మీరు నవ్వెదరేమోయని భయముగా నున్నది.
“నీవు చదువు నేర్చుకొన మొదలు పెట్టిన వెంటనే నేననేక పుస్తకముల నధిక యుల్లాసముతో బంపెదను. నీవు మాత్రము పట్టుదల విడువక చదువు నేర్చుకొనుము. చదువుకొని నీవెన్ని దినములకు నుత్తరము వ్రాయ నేర్చెదవు?”
“ఆ మాట గట్టిగా నేడేనేనెట్టు చెప్పగలను? నీవు వ్రాసిన యుత్తరము పోస్టులో నుండి వచ్చి నాకందిన దినమెంత సుదినము! నాటి నాయానందమిట్టిదని నీ వెఱుగ జాలవు. ఇన్ని దినముల నుండి బోధించినబోధకు ఫలముగా జదువు నేర్చుకొనెదవని నీ వన్న మాత్రమున నాకపరిమితానందము కలిగెను. ఈ సమయమునందు నాకొక కల గానుపించుచున్నది.
నీవిచటనే యా యఱలో కాగితము కలము సిరాబుడ్డి తీసికొని నాకుత్తరము వ్రాయుటకు గూర్చుంటివి. నీచేతి కలము భయముచే వణకుచున్నది. నీ ముఖము భయము చేతను సిగ్గు చేతను మిక్కిలి వెలవెల బారి యున్నది. వ్రాయు నక్షరములు చిన్నవిగాను పెద్దవిగాను వచ్చుచున్నవి. వాని మధ్యమధ్య కొన్ని సిరాచుక్కలును గానుపించుచున్నవి. నాకు వ్రాయు నీ మొదటి యుత్తరము మంచిగా నుండవలెనని నీకెంత యుండినను నది వంకరటింకర పంక్తులలో నుండి నీకసహ్యముగానే కనుపించుచుండెను. దీనిని బంపుటకు నీవు సమ్మతింపక రెండవ కాగితముమీద దానినధిక శ్రద్ధతో వ్రాసియు విఫల మనోరథవైతివి. తుదకు విసిగి దాని నే లకోటాలో వేసి నీ తమ్ముని చేత పై చిరునామా వ్రాయించి పోస్టులో వేయించితివి. నీ స్వహస్త లిఖితముగాని నప్పటి నా సంతోష సూచకమగు ముఖావలోకనమువలన నది నీ యుత్తరమైయుండునని తెలిసికొని చెంతనున్న నా మిత్రులు కొందఱు నన్ను పరియాచకము చేయుచుండిరి. వారి హాస్య వచనములను నేను వారించునటుల మాటలాడినను లోపల నాకు వారి మాటలానందకజనకములైయే యుండెను. నా ప్రియపత్ని చేతి పత్రికను నేను మఱలమఱల జదివియు దనవి చెందక పలుమారు చదువు చుంటిని. నా ప్రియ లేఖ నాకు జదివినప్పుడెల్ల క్రొత్త యానందము కలుగజేయు చుండెను. ఆహా! అది యెట్టియానంద సమయము? ఇదిగాక నేను మఱియొఖ కలను సహితము గనుచున్నాను.
నేను సుమతియను మన కొమారుని దీసికొని పడక గదిలో నొక కుర్చీమీద విశ్రమించితిని. నీ వచటి రెండవ కుర్చీమీద కూర్చుండి యొక మాసపత్రికలోని వ్యాసము చదివినాకు వినుపించుచుంటివి. నీవు మంజుల స్వరముతో జదువు దానాని వినియు, నీ ముఖమునందలి యానందమును గనియు నేను స్వర్గసుఖమునందున్నటుల నుంటిని. యిదికాక కలసహితము గనుచున్నాను.
నీవు సుమతిని సావిత్రిని దగ్గిరనుంచుకుని మిగుల వాత్సల్యతతో సాభిమానముగా వారికి జదువు నేర్పుచుంటివి. ఆహా! మన పిల్లలెంత సుస్వభావులు! వారి నమ్రతను సాష్టాధారకత్వమును గనిన వారందఱును వారిని దగ్గిరకు దీసికొని ముద్దు పెట్టుకొని మాటలాడించి పోవుచుందురు. వారిని గొనియాడని వారు లేనేలేరు. పుత్రపుత్రికల సద్గుణముల నితరులు పొగడగా విని నీకు నాకును గలిగిన యనిర్వచనీయమగు నానందము వేయి జన్మముల యందపరిమితి పుణ్యమును గణించిన వారలకు గాని కలుగనేరదు. అప్పుడు మనసుగనిన వారెల్లరును వీరలు మానవ రూపములు దాల్చిన దేవతలని ప్రశసింపుచుండిరి.
” మీ మాటలన్నియు విచిత్రములే? మెలకువతో నున్నపుడే మీకి కలలన్నియు గానుపించుచున్న వాయేమి?”
“ఇవి నవ్వుమాటలు గావు. ఇప్పుడు నీకు నేనే జెప్పిన యీ స్వప్నములలోని సంగతులెన్నడయిన వాస్తవములగునా? లేక స్వప్నములోగని యానందింప వలసినదేనా?”
“నా గృహదేవతయన దగిననీవు నిజముగా సరస్వతివే. ఇట్టి నీ యాశీర్వాదము కలుగుటవలన నా స్వప్నములు నిజములగుట యొకవింత కాదు.
ఆఱు నెలలలోపల నీవు నాకుత్తరము వ్రాసెదవా?”
“ఏమిది! నీయుత్తరమును జూచినేను నవ్వుదునా? నీకింకను దెలియదు. పరస్పరానురాగముగల మనబోటి భార్యభర్తలొండొరులు ప్రేమపూర్వకముగా జేసియే కార్యమేని నితరుల కదియల్పముగా దోచినను వారిలో వారికది యొక యమూల్యముగా దోచక మానదు.”
“అయిదు నెలలయిన పిదప నేనుత్తరము వ్రాయమొదలు పెట్టెదను. మీరు మాత్రము చేరిన దినము మొదలు రెండు దినముల కొక తూరి తమ క్షేమ సమాచారము వ్రాయుట మఱువకుండవలెను. మీరు వ్రాయుత్తరములు గొలుసుకట్టుగా వ్రాయక విడివిడి యక్షరములతో వ్రాసిన నేను వానిని జదువ ప్రయత్నించెదను. సరేగాని మీరు త్వరగా రావలెను.”
“పరీక్ష దినములు సమీపించినందున గట్టిగా రవలెనని చెప్పుటకు వీలులేదు.”
“తప్పక రాగలను.”
“నేను మీరు చెప్పిన మాటలన్నింటిని ఇక మీరు నేను జెప్పునది యొక మాట వినవలెను.”
“అదేదో కొంచెము విననిమ్ము.”
“దీపావళి పండుగకు దప్పక రావలెను.”
“ఇదే కదా? అట్లే వచ్చెదను.”
హిందూ సుందరి, 1902