సినిమాల్లో ప్రక్రియా రూపాంతరీకరణ తెలియజేసే వ్యాసం…

మనిషి సృజన రంగంలో అనేక పాయలున్నాయి. అనేక రూపాలున్నాయి. ఇంకా అనేక దారులు విస్తరించాయి. అన్ని సృజనాత్మక రూపాలూ సొంత వ్యక్తిత్వం కలవే కాదు, అత్యంత విలక్షణమయినవి కూడా. ఆట, పాట, రాత, గీత, ఇట్లా ఒకటేమిటి రంగుల్లో రాళ్ళల్లో రససృష్టి చేసిన సృజన శీలి మనిషి తనను తాను వ్యక్తం చేసుకోవటానికి తన శక్తి ఆసక్తుల మేరకు భిన్న మయిన రూపాలలో అనేక స్థాయిల్లో ఎంచుకుని సృజన చేసిన చరిత్ర మనిషిది. అలాంటి మనిషి తన లోపల అంతర్లీనంగా దాగి వున్న ఆలోచనల్ని, తాను అనుభవిస్తూ వచ్చిన అనుభవసారాన్ని ఉద్వేగాల్ని వ్యక్తం చేసే క్రమంలో అనాదిగా అనేక కళల్ని కళారూపాల్ని ఆవిష్కరిస్తూ వచ్చాడు. అలా సృజించబడిన రూపాల్లో సాహిత్యం వేలాది సంవత్సరాలది. ఆ సాహిత్యంలో కథా కథన రీతులు భిన్నంగా ఉండడటమే కాకుండా ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సంతరించుకుంటూ వచ్చాయి. సాహిత్యంతో పాటు లలిత కళలు, దృశ్య కళలు, ప్రదర్శనా కళలు ఇలా భావ వ్యక్తీకరణ మాధ్యమాలు అనేక మయిన రూపాల్లో ఆవిష్కృత మవుతూ వచ్చాయి. అట్లా మనిషి తన సృజనాత్మకతతో రూపొందించుకున్న కళారూపాల నడుమ విడదీయరాని బంధమూ అనుబంధమూ వున్నాయి. అవి అన్నీ పరస్పర అధారితాలూ, ప్రభావితాలూ కూడా.

ఆయా కళారూపాల్ని పరిశీలించినప్పుడు అత్యంత ప్రాచీనమయిన సాహిత్యా నికీ ఆధునిక దృశ్య మాధ్యమయిన సినిమాకూ నడుమ గొప్ప అనుబంధముంది. గత శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక పరిణామ క్రమంలో రూపొందిన సినిమా విలక్షణమయింది వినూత్నమయింది కూడా. అదికూడా కాలక్రమేణ అనేక మార్పులను ఎదుగుదలను సంతరించుకొని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమయిన కళా రూపంగా నిలబడింది. సమస్త కళల్ని తనలో ఇముడ్చుకొని 24 క్రాఫ్ట్ సినిమా ఎదిగింది. కదిలే బొమ్మల రూపంగా సినిమా, కనిపెట్టబడిన అతి స్వల్ప కాలంలోనే భారత దేశానికి వచ్చింది. తొలి రోజుల్లో సినిమా ప్రధానంగా ఫోటోగ్రఫీ పెయింటింగ్లు చెందినదిగా భావించారు. కానీ కాలక్రమేనా కథ, కథనం కథనరీతుల విషయంలో సినిమా సాహిత్యానికి దగ్గరయింది. సాహిత్యంలో మాటలు కాగితం మీద పలికితే సినిమాలో దృశ్యాలు తెరపైన పలికాయి. ఇక సినిమా నాటక రంగ కొనసాగింపు అని కూడా కొంత కాలం భావించారు. నిజానికి సర్వకళా సమ్మిశ్రితమయింది సినిమా. అది కవిత్వం నుండి ఉపమానాల్ని, ప్రతీకల్నీ స్వీకరించి మనిషి అంతర్ బహిర్ లోకాలకు చేరే శక్తిని సంపాదించుకుంది. సంగీతం నుండి దృశ్యలయని, పెయింటింగ్ నుండి సున్నితత్వాన్నీ, రంగుల్నీ, దృశ్య రూపాల అల్లికల్నీ స్వీకరించింది. ఇవన్నీ ఉన్నప్పటికీ సినిమాకూ సాహిత్యానికీ అవినాభావ సంబంధం విడదీయరానిదిగా వుంది. సాహిత్యం భాషను తన మాధ్యమంగా చేసుకుంటే సినిమా దృశ్యాల్ని వాహకంగా తీసుకుంది. నిర్మాణ పరంగా పదం, వాక్యం, పారాగ్రాఫ్, చాప్టర్ లు కథా నవలా సాహిత్యంలో ముఖ్యమయితే, సినిమాల్లో ఫ్రేం, సీన్, సీక్వెను ప్రమాణా లవుతాయి. సినిమాల్లో మాటలు, పాటలు, కథా కథనం అన్నీ సాహిత్య రూపాలే. అంతేకాకుండా అనేక సినిమాలు కథల్నీ, నవలల్నీ రూపాంతరీకరించుకున్నవే కావడం గమనించాల్సిన అంశమే.

ఇలా సాహిత్యానికీ సినిమాకీ వున్న అనుబంధం ఏ ఒక్క భాషకో పరిమితం కాదు. 1913 భారతదేశంలో నిర్మితమయిన మొట్టమొదటి మూకీ సినిమా ‘రాజా హరిశ్చంద్ర’ సాహిత్య రూపంతారీకరణమే. ‘ఆలం ఆరా’ తో మాటలు నేర్చిన మన సినిమా దేశంలోని అన్ని భాషల్లోకి చేరింది. అట్లే తెలుగులోకీ వచ్చింది.

కానీ దశాబ్దాల తెలుగు సినిమా తెలంగాణాకు, తెలంగాణ కళాకారులకు అంతగా అందుబాటులోకి రాలేదు. తెలంగాణాలో సినిమా లేదు అనే స్థాయికి వెళ్లిపోయింది

నిజానికి తెలంగాణ తెలుగు సాహిత్యా నికి పుట్టిల్లు. ఉత్తమ రచనలకు గొప్ప సాహిత్య విలువలకు నిలయం. అంతే కాదు ఉత్తమ నవలలను, కథలను కొన్నింటిని రూపాంతరీకరించిన సినిమాలుగా మలచిన చరిత్ర తెలంగాణాది. సినిమా రంగంలో అరకొర ప్రాతినిధ్యం వున్నప్పటికీ తెలంగాణ నేపధ్యంలో గొప్ప రచనలను సినిమాలుగా మలిచి జాతీయ అంతర్జాతీయ గుర్తింపునూ గౌరవాన్ని సాధించింది.

నిజానికి తెలంగాణాలో వ్యాపార సినిమా లేదు కానీ అర్థవంతమయిన, కళాత్మకమయిన సినిమాకు మాత్రం తెలంగాణ దశాబ్దాలుగా నెలవుగానే వుంది. బి.నరసింగ రావు, బి.ఎస్. నారాయణ లాంటి దర్శకులు తెలంగాణ సినిమా కీర్తి కిరీటాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లారు. అంతేకాకుండా తెలంగాణ జనజీవితం నుండి ప్రేరణ పొందిన శ్యామ్ బెనెగల్, మృణాల్ సేన్ లాంటి వాళ్ళు తమ సినిమాలతో తెలంగాణ సినిమాను పరిపుష్టం చేశారు.

అంతే కాదు తెలంగాణ సినిమా సాహిత్య రూపాంతీకరణలో ముందుండి ఉత్తమ సాహిత్య విలువలు సామాజిక నేపథ్యమూ వున్న నవలల్ని కథల్ని దృశ్య రూపంలోకి తర్జుమా చేసి విజవంత మయిన సినిమాలు తీశారు. ఉత్తమ సాహిత్యమూ సినిమాల మధ్య రూప భేధమే తప్ప భావ బేధం లేదని నిరూపించారు. సాహిత్యంలో భావలయ, అర్థవంతమయిన సినిమాల్లో దృశ్యలయ రెండూ సమాంతరమేనని నిరూపించారు. ఆ క్రమంలో తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ దర్శకులు, కొందరు తెలంగానే తర దర్శకులు రూపొందించిన అనేక సినిమాలు సాహిత్య నేపథ్యాన్ని కలిగి వుండడం గమనార్హం. తెలంగాణ సాహిత్యం తెలంగాణ సినిమా పరస్పర ఆధారితాలే కాకుండా పరస్పర ప్రభావితాలు కూడా.

ఆ క్రమంలో 1960లోనే వచ్చిన “చివరకు మిగిలేది” బెంగాలీ రచయిత ఆశుతోష్ ముఖర్జీ రచించిన ‘నర్స్ మిత్రా’ కథ ఆధారంగా నిర్మించబడింది. దర్శకుడు జి.రామినీడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉప్పునూతల పురుషోత్తమ్ రెడ్డి నిర్మాత కాగా ఆయన మిత్రులు ఏం. సత్యనారాయణ రావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, జి. విద్యాసాగర్ రెడ్డి, మండలెడ్డి కొండల్ రెడ్డి సహ నిర్మాతలుగా సహకరించారు. ఈ సినిమాను మంజీర ఫిల్మ్ బానర్ మీద 22 రోజుల్లో 2,20,000/- రూపాయల బడ్జెట్ తో తీశారు. తర్వాత 1977లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ భారతీయ మహా రచయిత ప్రేంచంద్ రచన “కఫన్” ఆధారంగా “ఒక వూరి కథ” తీశారు. 1988లో శ్యామ్ బెనెగల్ మరాఠీ రచయిత చింతామణి ఖానోల్కర్ నవల ఆధారంగా “అనుగ్రహం” నిర్మించారు. ఇక తెలంగాణ సినిమాల్లో విశిష్టమయిన విజయవంతమయిన సినిమాగా నిలిచిన “మా భూమి” కిషన్ చందర్ రాసిన “జబ్ ఖేత్ జాగే” నవలను రూపాంతరీకరించింది. రజాకార్లకు (నిజాంకు) వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని వాస్తవిక దృక్పథంతో తీసిన సినిమా మాభూమి. గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో బి.నరసింగ రావు, రవీంద్రనాలు నిర్మించారు. మా భూమి తెలంగాణ సినిమాకు ఓ లాండ్ మార్క్. హైదరాబాద్ చుట్టూ పక్కల వుండిన వేశ్యావాటికల సామాజిక ఆర్థిక నేపథ్యంతో గులాం అబ్బాస్ రాసిన చిన్న నవల ఆధారంగా శ్యామ్ బెనెగల్ “మండి” సినిమా రూపొందింది.

1977లోనే తెలుగు సినిమా రంగంలో ఆదుర్తి సుబ్బారావు లాంటి వాళ్ళ దగ్గర పనిచేసి ‘తాళిబొట్టు’ లాంటి విజయవంతమయిన సినిమాలు తీయడంతో పాటు పలు హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించిన మాధవరావు “చిల్లరదేవుళ్లు’ సినిమాను వరంగల్‌కు చెందిన కొంతమంది మిత్రులతో కలిసి తీశాడు. ‘ఏటి కేతం బట్టి ఎయ్యి పుట్లు పండించి ఎన్నడూ

మెతుకెరుగరన్నా’, ‘కలువకు చెంద్రుడు ఎంతో దూరం’, ‘పాడాలనీ వున్నది’ లాంటి మంచి పాటలతో ఆత్రేయ, కె.వి మహాదేవన్ లాంటి వాళ్ళతో కలిసి నిర్మించిన ఆ సినిమా తెలంగాణ అంశం మీద వచ్చిన తొలి సినిమాగా చెప్పుకోవచ్చు.

‘చిల్లర దేవుళ్లు’ కథాకాలం 1936-42 ప్రాంతంలోనిది. సాయుధ పోరాటానికి ముందున్న తెలంగాణ జీవితాన్ని చిత్రించే పనిని నవలలో తెలంగాణలో విశిష్ట నవలా రచయిత దాశరథి రంగాచార్య ఎంతగా విజయవంతంగా చేశారో సినిమాలో కూడా టి. మాధవరావు అంతే విజయవంతంగా చేశారు. దాదాపుగా అదే కాలంలో బి.ఎస్. నారాయణ తన “ఊరుమ్మడి బతుకులు’ సినిమాని సి.ఎస్. రావు రచన ఆధారంగా తీశారు. ఆ సినిమా జాతీయ అవార్డును అందుకోవడంతో పాటు పలు దేశాల్లో చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. 1983లో ప్రస్తుత ఏం.ఎల్.సి. నారాదాసు లక్ష్మణ్ రావు తన మిత్రులతో కలిసి ఉదయ కుమార్ దర్శకత్వంలో నిర్మించిన “విముక్తి కోసం” భూషణం రాసిన గొప్ప కథ ఆధారంగా నిర్మించబడింది.

ఒక తరాన్ని ప్రభావితం చేసిన నవీన్ నవల ‘అంపశయ్య’ను కాంపస్ అంపశయ్య పేర వరంగల్ కు చెందిన రచయిత ప్రభాకార్ జైనీ సినిమాగా మలిచారు. ఇట్లా తెలంగాణ నుంచి ఉత్తమ సాహితీ సామాజిక విలువలున్న సాహిత్య రూపాలు సినిమాలుగా రూపాంతరం చెందాయి.

వాటన్నింటిలో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల జీవన రీతులు మానవ సంబంధాలూ అన్నీ దృశ్య రూపంలోకి అనువదించబడి అర్థవంతమయిన ప్రయత్నాలుగా నిలిచాయి. ఇట్లా మంచి సాహిత్యానికి మంచి సినిమాకు తెలంగాణలో పెద్దపీట వేశారు. సాహిత్యం ఎంతగా ప్రజల్ని సంస్కృతినీ పట్టించుకున్నదో వున్న కొద్దిపాటి

తెలంగాణ సినిమా కూడా ప్రజలనీ సంస్కృతినీ పట్టించుకుంది. తెలంగాణాలో సాహిత్యమూ సినిమా కళాత్మకతతో కూడి ప్రశంసలు అందుకున్నాయి.

నిజానికి సినిమా సాహిత్యం రెండూ భిన్నమయిన మాధ్యమాలుగా కనిపించినప్పటికీ, సాహిత్యం వ్యక్తిగత సృష్టి అయితే సినిమా దర్శకుడి మేధో మధనం నుండి ఉత్పన్నమయినదే అయినప్పటికి సామూహికంగా పలువురు కళాకారులు సాంకేతిక నిపుణులు కలిసి రూపొందించాల్సి వుంటుంది. రెండింటి మధ్య భిన్నత్వం వున్నప్పటికీ సామాజిక దర్పణాలుగా ఏకత్వాన్ని కలిగి వున్నాయి. అంటే రెండింటి మధ్య సాధారణంగా కనిపించే భిన్నత్వమూ అసాధారణంగా కనిపించే ఏకత్వమూ వున్నాయి. సాహిత్య పఠనం వ్యక్తిగత అనుభవమయితే సినిమా వీక్షణం సామూహిక అనుభవం. పాఠకుడికి ప్రేక్షకుడికీ ఆయా సందర్భాల్లో మిగిలే అనుభూతి భిన్నమయింది. రచనల్లో జీవిత దృశ్యాలు పదాలుగా నిర్మిత మయితే సినిమాల్లో దృశ్యాలుగా రూపొందుతాయి. సాహిత్య రచన మొదట పాఠకుడి ఆలోచనా సహజాతం పై ముద్రవేసి క్రమంగా అక్కడి నుండి భావోద్వేగాన్ని కలిగింప చేస్తుంది. కానీ సినిమా మొదటి భావోద్వేగాల్ని ప్రభావితం చేసి ఆ తర్వాత సినిమా స్థాయిని బట్టి ప్రేక్షకుడి ఆలోచనల పై ప్రభావాన్ని కలిగిస్తుంది.

అట్లో ఆ రెండింటి మధ్య వున్న అనుబంధాన్ని, భేదాల్ని తెలంగాణ చలన చిత్రకారులు అర్థం చేసుకొని కొన్ని గొప్ప నవలల్నీ, కథల్నీ దృశ్యీకరించారు. ఇక ముందు కూడా తెలంగాణా సినిమా స్వీయ వ్యక్తిత్వాన్ని రూపొందించుకుని సాహిత్య రూపంతారీకరణలతో పాటు ఇంకా అనేక వైవిధ్యభరిత సినిమాలకు వేదిక కావాలని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com