అన్ని వాదాలను తనలో సమీకరించుకున్న ప్రజాకవి, అభ్యుదయవాది అమ్మంగి….

తంగేడు: అమ్మంగి వేణుగోపాల్ గారు, నమస్కారం!

అమ్మంగి: నమస్కారం. ముందుగా మీకు, ‘తంగేడు’ పాఠకులకు దీపావళి అభినందనలు.

తంగేడు: ధన్యవాదాలు. ‘ముఖాముఖి’ మొదలు పెడదామంటారా?

అమ్మంగి: అడగండి

తంగేడు: ముందుగా మీ ఊరిని గూర్చి మీ బాల్యం గూర్చి చెప్పండి.

అమ్మంగి: ‘సొంత వూరి మీది ప్రేమ దేశ భక్తి కన్నా గొప్పది’ అన్నానొక కవితలో. మా ఊరు వికారాబాదు జిల్లా కేంద్రానికి మైలు దూరంలో ఉన్మ ఆలంపల్లి. తెలంగాణ ఊటీగా పేరుపొందిన అనంతగిరి అడవులకు నాలుగు కిలోమీటర్లే మా ఊరు. నా బాల్యం కొంత ఆలంపల్లిలో గడిచింది. ఇక్కడ మామిడితోటలు ఎక్కువ. దుస్తులతో కలిసి మామిడి కాయలు రాలగొట్టి తినేవాళ్ళం. ‘Heard melodies are sweet, unheard are sweeter’ అని జాన్ కీట్స్ అన్నట్టు, కొని తెచ్చిన కాయల కన్నా దొంగతనంగా తెచ్చుకున్న కాయలు తియ్యగా ఉండేవి.

భట్టు రామరాజు గారి భానిగి బడిలో నా చదువుకు పునాది పడింది. ఆ రోజుల్లో కోదండం వేయడం వంటి కటినమైన శిక్షలు ఉండేవి. ఆ భయానికి ‘పెద్దబాలశిక్ష ‘ కొంతవరకు కంఠస్థం అయింది. పెద్ద బాలశిక్ష అంటే చిన్నపాటి విజ్ఞాన సర్వస్వం ‌కదా. ఎర్రనేల కావటం వల్ల పంటలు బాగానే పండుతాయి. నిజాం కాలం ‌నుండి రైలు మార్గం ఉన్నందు వల్ల వ్యాపారానికి లోటు లేదు.

తంగేడు : అనంతగిరి గూర్చి చెప్పండి.

అమ్మంగి: అనంతగిరి అనంత పద్మనాభస్వామి ఆలయం మొదటి పూజారులు మా వంశం వారే. విశిష్టాద్వైత మత ప్రవక్త రామానుజుల వారి తొలి తరం శిష్యపరంపరలో మా అమ్మంగి వారున్నారు. ‘నరుల జన్మంబు, నదుల జన్మంబు’ ఎరుకజెప్పటం కష్టమని అంటుంది భారతం. నదుల జన్మ ఏమోగాని, ‘మూసీ’ నది మాత్రం మా అనంతగిరి కొండల్లో పుట్టింది. ‘పారినంతమేర పగడాలు పండిస్తూ/చెరుకు పానకము చెరువుగా నిలిచింది’ అన్నాను. సర్ విశ్వేశ్వరయ్య గారు మూసీ నది మీద కట్టిన ఆనకట్ట మూలంగా ఏర్పడిందే చెరుకుపానకపు గండిపేట చెరువు. ఇప్పటికీ ఎవరైనా ఎక్కువ తెలివి తేటలు ప్రదర్శిస్తుంటే ‘వీనికి గండిపేట నీళ్ళు ఇంకినై’ అంటుంటారు. గండిపేట ‌నీళ్ళంటే మూసీ నీళ్ళే.

తంగేడు: మీరు ‌మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ లో కూడా ఉన్నట్టున్నారు. అక్కడి అనుభవాలు కూడా చెప్పండి.

అమ్మంగి: మా నాయిన నిజాం ప్రభుత్వం రెవెన్యూ శాఖలో పనిచేశాడు. సర్కారు ఎక్కడికి బదిలీ చేస్తే అక్కడికి వెళ్లాం. అట్లా ఉద్గీర్, నీలంగా, భాల్కీలలో పనిచేశాడు. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో నారాయణ ఖేడ్ బదిలీ అయింది. నేను ‌నాలుగవ తరగతిలో చేరిన. 1963 లో Hsc పాసై హైదరాబాద్ నిజాం కాలేజీ లో పియుసి చదివిన. నారాయణ ఖేడ్ లో తెలుగు పండితులు నందగిరి అనంత రాజశర్మ గారు ఛందస్సు నేర్పించారు. నా పద్య కవితలలో మొదటిది సంక్రాంతి. పతంగుల మీద రాసిన కవిత్వమిది. అయితే ఆధునిక సాహిత్యం నా చేత చదివించిన వారు మాత్రం హిందీ పండితులు రుక్మయ్య గారు. వీరు ప్రస్తుతం మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఉంటున్నారు. వీరు ప్రేమ్ చంద్, శరత్, ఠాగూర్, గోర్కీ, టాల్ స్టాయ్, విక్టర్ హ్యూగో వంటి హేమాహేమీల అనువాద సాహిత్యం చదివించారు. నిజాం కాలేజీలో నాకు అంధ విద్యార్థులతో స్నేహం ఏర్పడింది. ఇది ‘చీకటిలో బతుకు నీడ’ అన్న కవిత రాయటానికి ప్రేరణ అయింది. ‘సృజన’ పత్రిక వాళ్ళు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలు ప్రథమ బహుమతి వచ్చింది ఈ కవితకే. ఇప్పటికీ నాకు అంధ విద్యార్థులతో సంబంధాలు ఉన్నాయి. వారి వార్షిక సభలకు మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి గారు ముఖ్యఅతిథిగా, నేను అధ్యక్షునిగా పాల్గొంటూ వచ్చాను.

తంగేడు: మీ సాహిత్య కృషి గూర్చి చెప్పండి.

అమ్మంగి: నేను నేను ఇప్పటిదాకా ఐదు కవితా సంపుటాలను ప్రచురించాను. అవి మిణుగురు, పచ్చబొట్టు- పటంచెరు, భరోసా, గంధం చెట్టు, తోటంత పువ్వు. ‘గంధం చెట్టు’ తెలంగాణ ఉద్యమ కవిత్వం కాగా, ‘భరోసా’కు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ గ్రంథంగా ఎంపిక చేసి పురస్కారం ఇచ్చారు. 1993 ఆకాశవాణి జాతీయ కవి సమ్మేళనం లో తెలుగు కవిగా పాల్గొన్నాను. నేను కవిత్వం ప్రారంభించిన 1967 లోనే సాహిత్య విమర్శకు కూడా బీజం పడింది. ఎదిరె చెన్నకేశవులు రాసిన కథా సంపుటి మీద రాసిన సమీక్ష వ్యాసం ‘ఆంధ్ర జనత’ లో అచ్చయింది. ఆ తర్వాత గురజాడ అప్పారావు ‘సంస్కర్త హృదయం’ మీద రాసిన పరిశోధనా వ్యాసం ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అది సంపాదకులకు నచ్చడంతో ఆయన ప్రోత్సాహంతో ఐదారు వ్యాసాలు రాశాను. అవన్నీ ‘అవినాభావం’ పేరిట ప్రచురితమయ్యాయి. సీనియర్ పాత్రికేయులు ‘నిజం’ గారి ప్రోత్సాహంతో ‘దస్తూరి’ సాహిత్య కాలమ్ లో వందదాకా వ్యాసాలు రాశాను. ఇవన్నీ ‘సాహిత్య సందర్భం- సమకాలీన స్పందన’ పేరుతో గ్రంథస్థం అయ్యాయి. అ తర్వాత రాసిన ‘ వట్టికోట ఆళ్వారుస్వామి రచనలు – ఒక పరిశీలన’ అన్న గ్రంథాన్ని డా. గంటా జలంధర్ రెడ్డి ప్రచురించాడు. నేను డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గా రిటైరయిన తర్వాత ‘ప్రాచ్యలిఖిత గ్రంథాలయం – పరిశోధనాలయం’ లో కొంతకాలం పనిచేసినప్పుడు, 35 అరుదైన గ్రంథాలు వెలుగుచూడటానికి కృషి చేశాను. నా సాహిత్యం మీద డా|| రామారావు సూర్యప్రకాశరావు చేసిన పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం 1915 లో డాక్టరేట్ పట్టా ప్రధానం చేసింది.

తంగేడు: మీరు అనువాదం చేసిన గ్రంథాలను, సంపాదకత్వం వహించిన గ్రంథాల గూర్చి చెప్పండి.

అమ్మంగి: ఇంగ్లీషు లోని ‘Telugu script- origin and evolution’ గ్రంథాన్ని ‘తెలుగు లిపి- ఆవిర్భావ వికాసాలు’ పేరుతో అనువదించాను. ‘ ముఖ్దూం మొహియుద్దీన్’ అన్న ఇంగ్లీష్ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ కి అనువదించి ఇచ్చాను. ఇక సంపాదకత్వం వహించిన వాటిలో ముఖ్యమైనవి- కేంద్ర సాహిత్య అకాడమీ వారి ‘వట్టికోట ఆళ్వారుస్వామి పరిశోధన పత్రాల సంపుటి’ కి సంపాదకత్వం వహించాను. 400 సంవత్సరాల హైదరాబాద్ సందర్భంగా ‘మరో కొత్త వంతెన/ ఎక్ ఔర్ నయాపూల్’ తెలుగు-ఉర్దూ, ఉర్దూ-తెలుగు ద్వి భాషా సంపుటికి, మజహర్ మెహిదీ ఉర్దూ కవితల అనువాదం ‘మరో ప్రపంచం’ సంకలనానికి సంపాదకత్వం వహించాను.

తంగేడు: మీకు లభించిన పురస్కారాల గూర్చి చెప్పండి.

అమ్మంగి: తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతిభా పురస్కారం తో గౌరవించారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం నా సాహిత్య కృషిని గుర్తించి 2015లో కాళోజీ నారాయణరావు తొలి పురస్కారాన్ని ప్రధానం చేసింది. ఇది నాకు జీవన సాఫల్య పురస్కారం లాంటిది.

సాహిత్య రంగంలోకి అడుగు పెట్టడానికి, ముందుకు సాగటానికి మీమీద ఎవరి ప్రభావాలున్నాయి.

అమ్మంగి: 1966 దాకా నేను పద్య కవిత్వం రాస్తూ వచ్చాను‌. లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆకస్మిక మరణవార్తకు స్పందిస్తూ రాసిన స్మృతి పద్యాలు చివరివి. నా సహాధ్యాయి ప్రొ.జి. చెన్నకేశవ రెడ్డి దాశరథి, కాళోజీ, తిలక్, సినారె, వంటి కవుల ఆధునిక కవిత్వం చదువమని సలహా ఇచ్చాడు. అప్పుడు తిలక్- నువ్వు నేను నీ‌ పాట వుంది, అమృతం కురిసిన రాత్రి, తపాలా బంట్రోతు వంటి కవితల శైలీ విన్యాసం నన్ను ఆకర్షించింది. నేను ఆ శైలిని అనుసరించాను. అంధ విద్యార్థుల స్నేహ ప్రభావం కూడా వుంది. ఎం.ఏ చదువుతున్నప్పుడు పోటీలలో బహుమతులు సంపాదించటమే ధ్యేయంగా ఉండేది. ఈ బలహీనతను గమనించిన నా సహాధ్యాయి, కథకుడు కన్నసామి ‘జీవితం పోటీ కాదు, ప్రయాణం’ అని అన్నాడు. ఆ మాట నా మీద బాగా పనిచేసింది. నాతో దేశదేశాల నవలలు చదివించిన హిందీ సార్ రుక్మయ్య గారు ‘పడతే జావ్, పడితే జావ్’ అన్న సలహా ఇచ్చాడు. ఇది నాలో పఠనాసక్తిని బాగా పెంచింది. ఇప్పటికీ నేను పుస్తకాల పురుగునే. ఆంగ్ల సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడటానికి మిత్రుడు, ఆంగ్ల ప్రొఫెసర్ పి.లక్ష్మీ నారాయణ కారకుడు.

యువ రచయిత లకు మీరిచ్చే సలహా?

అమ్మంగి: ఇప్పుడు తెలంగాణ యువతీ యువకులు కవిత్వం విరివిగా రాస్తున్నారు. ఇది నిజంగా అభినందనీయమే. వీరు వందల సంఖ్యలో రాస్తున్న కవిత లను ప్రచురించేటన్ని పత్రికలు లేవు కనుక, చాలావరకు వాళ్ళు సామాజిక మాధ్యమాలను- ఫేస్ బుక్, వాట్సాప్ లను ఆశ్రయిస్తున్నారు. అవి నలుగురి దృష్టి లో పడుతున్నాయి. అయితే వాటి మంచి చెడ్డలను విమర్శించే మాధ్యమం లేదు. ఎవరైనా ‘మీ కవిత బాగా లేదు’ అని వ్యాఖ్యానిస్తే దాన్ని మంచిమనసుతో స్వీకరించాలె. యువ కవులు, కవయిత్రులు, విస్తృతంగా అధ్యయనం చేయవలసి వుంది. తాము రాస్తున్నది సాధన దశకు సంబంధించిన కవిత్వమేనని‌ కూడా గ్రహించటం మంచిది. ‘వస్తువు’ చుట్టూ పదిపాదాలు అల్లినంత మాత్రాన అది కవిత్వమైపోదు. అనువైన శిల్పంతో కళాత్మకంగా తీర్చిదిద్దినప్పుడే అది పది కాలాల పాటు నిలుస్తుంది. కవిత్వానికే పరిమితం కాకుండా, తెలంగాణ జీవితం ప్రతిఫలించే కథలు కూడా రాయటం తమ బాధ్యతగా యువ రచయితలు, రచయిత్రిలు భావించాలె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com