బహుజన జీవన ప్రతిబింబం యక్షగాన కథా సంపుటం…

గడిచిన ఏడు దశాబ్దాలలో ఎన్నో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలు మనిషిని అతలాకుతలం చేశాయి. కాలం బతుకు పొడుగూత వేసిన ముద్రలెన్నింటినో ఒడిసి పట్టుకొని ఎంతో మంది కథకులు కథలుగా మలిచారు. అవన్నీ మనిషి కళా చరిత్రగా మిగిలిపోయాయి. జీవితం అడుగు నుండి సారవంతమైన మట్టిని తీసుకొచ్చి మానవుని బతుకు పయనాన్ని సజీవ చిత్రాలుగా అక్షరీకరించిన రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి. దానికి నికషోపలం అనదగ్గ రచన ‘యక్షగానం’ కథా సంపుటి.

ఇందులోని రెండు పదుల కథలు ఒక్కోటి ఒక్కో గుయెర్నికా చిత్రం. జీవితం లోలోపలికి వెళ్లి మనిషి అడుగు జాడల్ని అక్షరాల్లోకి తర్జుమా చేసిన కథలు. అందుకే ఏ కథలోనైనా మట్టి మనుషులు తాకుతారు. వారి జీవిత సంక్షోభం, సంఘర్షణ, సంక్లిష్టత, దు:ఖాగ్ని పాఠకుల్ని కథలో ఉండనీయక ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసేలా చేస్తాయి. అప్పుడు రచయిత చిత్రించిన ముడి జీవితం యొక్క ‘సెగ’ మన గుండెల్ని ఆవరిస్తుంది. ఏ కథా ఏదో ఒక జీవిత శకలం చుట్టూ అల్లిన ఏక వర్ణ చిత్రం కాదు. ఒక జీవితాన్ని సాంతం కథలో ఇమిడ్చి చెప్పిన సింగిడి. వాస్తవ జీవితం నుండి ఎన్నో అనుభవ శకలాల్ని తెంపుకొచ్చి వాటిని యధాతథంగా అంతే వైవిధ్యంతో, వైరుధ్యంతో కాగితం మీద పరిచిన కథలు. సమాజ చలన సూత్రాలను, మనుషులను ఎంతో లోతుగా చదివిన అనుభవం ప్రతి కథలో తొంగి చూస్తుంది.

నిజ జీవితానికి ఏ మాత్రం రంగులు పూయకుండా, నిరలంకారంగా కథలు రాసిన వారు చాలా అరుదు. ఎందుకంటే ఒట్టి కంకర రాయి శిల్పం కాదని మన అపోహ. కాని ఎన్నో రూప రహిత రాళ్లను ఒక్క దగ్గర పోసి వాటిలో కళాత్మకతను వెతుక్కునేలా రాశాడు దేవులపల్లి కృష్ణమూర్తి. జీవితమంత విశాలత, విస్తృతి అన్ని కథల్లో కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న, మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులే కథల్లో పాత్రలుగా ఒదిగిపోయారు. సన్నివేశ కల్పన కోసమో, సంభాషణల
కోసమో, అనవసరపు మలుపుల కోసమో, కల్పనల కోసమో రచయిత ప్రాకులాడడు. జీవితాన్ని సాదాసీదాగా చెప్పుకుంటూ పోతాడు. కథాంగాలన్నీ వాటికవే అమరిపోతాయి. జీవితం చాలా తడితడిగా మన మనసును ఒరుసుకుంటూ పయనిస్తుంది. ఏడు దశాబ్దాల పాటు అనేక జీవితాల్ని చాలా దగ్గరగా పరిశీలించి పరిశీలించి గుండె లోతుల్లోకి ఇంకించుకొని, విశేషమైన అనుభవాన్ని రంగరించి రాసిన కథలు కాబట్టి వీటికి జవజీవాలు, రక్త మాంసాలు సహజంగా అంటుకున్నట్టున్నాయి. చాలా మంది రచయితలు జీవితాన్ని పొడిపొడిగా వ్యాఖ్యానిస్తూ పోతుంటారు. ఏదో కృత్రిమత్వం, ఏదో అసహజత్వం , ఏదో అంటిముట్టనితనం వాళ్ల వాక్యాల్లో పొడసూపుతుంది. కాని దేవులపల్లి కృష్ణమూర్తి కథల్లో మనకు దివిటీ పెట్టి వెతికినా జీవితాన్ని విడిచి ఒక్క వాక్యం కూడా దొర్లినట్టు కనిపించదు. ప్రతి కథ తాను అనుభవించి, పలవరించి రాసిందే. నల్గొండ జిల్లా కేంద్రంగా జీవితాల్లో, పరిస్థితుల్లో, ఘర్షణల్లో వచ్చిన మార్పులను చాలా లోతుగా పరిశీలించి రాసిన కథలివి. ఎక్కువ కథల్లో బహుజన జీవితాలే చిత్రింపబడ్డాయి.

“మా వూరికి వాస్తు పిచ్చిపట్టింది. ఇండ్లను మార్పు చేయబట్టిండ్రు. దానితో మా ఇంటి ముందున్న ఇంటోల్లు దర్వాజను వెనుక బజారుకు మార్చిండ్రు. మా పక్కున్న ఇల్లు బాగలేదని పశువుల కొట్టంగ మార్చిండ్రు. దీనితో తలుపు తీస్తే మనిషే కనిపించకుంటయ్యిండు. బొగ్గు వ్యాపారం ఊపందుకుంది. చెట్లను కొట్టి బొగ్గు బట్టీలు పెడుతుండ్రు. ఉర్లుగొండ గుట్టకున్న చెట్లన్నీ ఒక్కటొక్కటిగా అన్ని మాయమైపోయినయి. గత పదేండ్ల నుండి జర్గుతుందీ తంతు.” అని ఊరు ఎలా మార్పుకు గురవుతూ పోతుందో చెప్పిండు.

ఈ సంపుటిలోని చాలా కథలు భూమి చుట్టు, వ్యవసాయం చుట్టే తిరుగుతాయి. ఊరు తెర్లయిన తీరు, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నత, నమ్మకంగా మోసం చేయడం, నాగార్జునసాగర్ నీళ్లు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పు, కుల వృత్తుల విధ్వంసం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, పండు టాకును కొడుకులు వంతు లేసుకొని సాకటం, పల్లె మర్యాదలు, ఆశల వెంట పరుగులు పెట్టే పురుగులు, చిత్రకళ మీది మమకారం, భారమైన బతుకుపోరు, బాధ్యతలేని యువత, మమ్మల్ని తీసుకు పోవడాన్ని దేవుడు మర్చిపోయిండేమోనని బాధ పడే వృద్ధులు, నిరుద్యోగం కారణంగా ప్రేమించిన యువతిని వదులుకోవడం, మోడును కూడా చిగురింపజేసే శ్రీశైలం, ఆయకట్టు భూముల్ని అగ్గువకు కొని తెలంగాణ మీద చాపకింది నీరులా పెత్తనం చెలాయించే ఆంధ్రుల తీరు, కొడుకును కాపాడుకోలేకపోయన మోతీబాయి, తోడులేని వృద్ధురాలి కథ, జాతర నేపథ్యంలో గ్రామీణ జీవితం, పుస్తకాల మీది మక్కువ.. ఇలా ఎన్నో వస్తువులు ఈ కథలకు ఆలంబనగా నిలిచాయి.

గడిచిపోయిన జీవితాన్ని కాలానుగుణంగా తిరిగి పేర్చుకుంటూ పోవడం అంత సులభం కాదు. సమాజంతో పాటు సామూహికంగా జీవిస్తూనే మనసులో ఒక మూలలో రికార్డు చేస్తూ పోవాలి. మళ్లీ అవసర మున్నపుడు ఆయా సన్నివేశాలను, పాత్రలను ముందటేసుకోవాలి. సజీవంగా ప్రాణం పోయాలి. సాధారణంగా కవిగాని, రచయితగాని తన సమకాలీన సమాజం కంటే ఒక్కడుగు ముందుంటాడు. కాని దేవులపల్లి కృష్ణమూర్తి కథలు అలా ఉండవు. మనతో పాటు కలిసి నడుస్తూ, మనతో కలిసి జీవిస్తూ, మనలో ఒకడిగానే ఉంటూ కథ చెప్తాడు. చాలా కథలు మౌఖిక కథలుగానే తోస్తాయి తప్ప లిఖిత కథలుగా కనిపించవు.

జీవితం ఎన్ని పొరలు పొరలుగా ఉంటుందో, ఎన్ని అలలు అలలుగా ఉంటుందో అంతే మౌలికంగా చిత్రిస్తారు ప్రతి కథను. కథ చెప్పటంలో కూడా ఏ తిరకాసూ ఉండదు. నీటి కాలువ పొలంలో కల్సిపోయినంత మామూలుగా, చాలా సరళ శిల్పంలో నిరాడంబరంగా చెప్పిన కథలు. కథనం, సంభాషణలు రెండూ స్వచ్చమైన తెలంగాణ తెలుగులో సాగడం వలన కథ నేల విడిచి సాము చేయకుండా చాలా సహజంగా సాగిపోతుంది.

సందర్భానుసారంగా చెప్పిన సామెతలు, జాతీయాలు, నుడికారాలు కూడా మరింత సహజత్వాన్ని కలిగించాయి.

ఏ కథలోనైనా రచయిత ఎక్కడా కనిపించడు. జీవితం మారుమూలల్లో దాగిన మార్మికతనో, మానవీయతనో చెప్పుకుంటూ పోతాడు రచయిత. కథ చదువుతున్నట్టు కాకుండా ఆ జీవితాన్ని మనమే అనుభవిస్తున్నట్టుగా అనుభూతి చెందుతాం. ఈ శైలి వల్లనే ప్రతి కథను విడవకుండా చదివేస్తాం. ఎవరి కోసమో, శైలి, శిల్పాల కోసమో కథ రాయడు రచయిత, తాను చెప్పాలనుకున్న పాయంట్ చుట్టూ కథను కూర్చుకుంటూ పోతాడు. ఈ క్రమంలో ఎంతో జీవితం పొందుపరచబడుతుంది. ముఖ్యంగా రచయిత రెవెన్యూ ఆఫీసర్ కావడం మూలంగా కథ ఎవరూ చెప్పని కోణంలో తీర్చిదిద్దబడుతుంది. చాలా వరకు నోస్టాల్జియా విశేషాలే అయినప్పటికి మనకు ఒక విషాదాంత షాక్ ట్రీట్మెంట్ మిగులుస్తాయి.

ప్రతి కథ ఒక సత్యజిత్ రే సినిమాను తలపిస్తుంది. నిశ్శబ్దంగా లోలోపల కుమిలిపోతున్న ఊరు, గాయాలపాలై తనలో తాను మదనపడుతున్న పాత్రలు, ఎంతో నొప్పితో మాట్లాడే మాటలు, గొంతు దాటి బయట పడని దు:ఖం…అన్నీ మనల్ని ఎంతో గాఢంగా కదిలిస్తాయి. దేవులపల్లి కృష్ణమూర్తి కథల్లోని స్త్రీ పాత్రల్ని ప్రత్యేకించి పేర్కొనాలి. మనోరమ, పార్వతమ్మ, ముదుసలి అవ్వ, సుజాత, మోతీబాయి, వదిన పాత్ర, రచయిత భార్య పాత్ర, విమల, కాదంబరి… అన్నీ మోసగింపబడ్డ పాత్రలు. జీవితాన్ని నలుపు, తెలుపు ఫ్రేముల్లో చూపించిన పాత్రలు.

ఈ కథా సంపుటిలో పేర్కొనాల్సిన కథలు, లేదా తళతళ మెరిసే కథలు ‘వలసపక్షులు’, ‘మృత్యుంజయుడు’, ‘గోడకున్న బొమ్మ’, ‘బాల్కని’. తెలంగాణ, ఆంధ్రరాష్ట్రం కలిసి ‘ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు తెలంగాణకు వలస వచ్చి ఎలా ఇక్కడి సారవంతమైన భూములను కైవశం చేసుకున్నదీ వివరించే కథ ‘వలసపక్షులు’. ‘మృత్యుంజయుడు’, గోడకున్న బొమ్మ’ కథలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చిత్రించిన కథలు. ‘బాల్కని’ కథ శిల్ప పరంగా చాలా మంచి కథ. మిగిలిన కథలన్నీ సాధారణ వస్తువుతో ఉన్నా వాటిలో కూడా ఎన్నో జీవిత కోణాలు ఆవిష్కరిపంబడ్డాయి. ‘బాల్కని’ కథలో మినహా అన్ని కథల్లో నేపథ్యంలో గ్రామీణ జీవిత సంగీతం వినిపిస్తూ ఉంటుంది.

ప్రతి కథ నిస్సంకోచమైన ఎత్తుగడతో మొదలై, నది, సముద్రంలో కలిసేటప్పటి నెమ్మదితనంతో కొనసాగి, పూవు నేల రాలినంత సహజంగా ముగిసిపోతుంది.

గ్రామంలోని అన్ని లేయర్లను కథలోకి తీసుకొచ్చి ఒక సజీవ కావ్యంలా తీర్చిదిద్దుతాడు రచయిత. పాత్రల మధ్య అనురాగం, కోపతాపాలు, తడిగుడ్డతో గొంతు కోసే లక్షణం అన్నీ చాలా సహజంగా చిత్రింపబడ్డాయి. ప్రతి కథ ఎంతో జీవిత గాంభీర్యతను, విలువలను తనలో దాచుకున్న కథే.

రచయితకున్న విశేషమైన లోకానుభవం, చిత్రలేఖన కళ మీది ఇష్టం, జానపద కళల మీది సాధికారికత అన్ని ఇందులో చిత్రింపబడ్డాయి. కథల శీర్షికలన్నింటినీ తొలగిస్తే ఈ సంకలనం ఒక పెద్ద సాంఘిక నవలగా తోస్తుంది. పాత్రలు, సన్నివేశాలు, సందర్భాలు వేరువేరే కావొచ్చు కాని సారాంశంలో రచయిత చెప్పే కథంతా ఒక్కటేననిపిస్తుంది. ఎందుకంటే అన్ని కథల్లో మానవ సంబంధాల డొల్లతనం, మోసకారితనం, జీవిత ఘర్షణ సమానంగానే కనిపిస్తాయి. ఒకప్పటి గ్రామాలు క్లోనింగ్ చేసినట్లుగా కథల్లో మళ్లీ జీవం పోసుకున్నాయి.

“ఆటన్నా, పాటన్నా అంతా బొమ్మలాటన్నా ఆడి పాడి, అలసి సొలసి అవని వీడి పోయాడన్నా!”

అని ఎంతో తాత్త్యికతను కూడా బోధిస్తాయి. సాహిత్యం మనిషిలో మార్పును తీసుకొస్తుందో లేదో కాని ఇందులోని కథలు మాత్రం కాస్తంత జాగరూకత వైపు, నాణ్యమైన జీవితం వైపు అడుగులు వేయిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com