ఆడపిల్లల్ని మాట్లాడనివ్వండి

అలలు అలలుగా ఎగిసిపడనివ్వండి

సంకోచాలు లేకుండా

సందేహాలు లేకుండా. సంభాషణా పరిమళాలు వెదజల్లనివ్వండి

అది ఇష్టాగోష్టి సన్నివేశం కావచ్చు

వక్తృత్వ ప్రతభ పోటీ కావచ్చు

ఊసుపోక కబుర్లే కావచ్చు

ఊకదంపుడు ఉపన్యాసమే కావచ్చు

సందర్భం ఏమిటన్నది కానేకాదు ప్రాతిపదిక

వాళ్ళను వాళ్ళు వ్యక్తీకరించుకోనివ్వండి

ఒక పద్దతి ప్రకారం మాట్లాడలేదంటారా?

అసలిప్పుడే కదా వాళ్లు నోరు తెరిచింది

తిట్లూ శాపనార్థాలూ పెడుతున్నారంటారా?

ఆగ్రహానికి అక్షరాలు తొడుగుతున్నారేమో!

ఆవేశానికి భాషనిస్తున్నారేమో!

మిత్రులారా!

వాళ్ళ మాటలు ప్రవాహానికి అడ్డుకట్టలు వేయొద్దు

ఆటంక పరచొద్దు

మాట్లాడనివ్వండి

శతాబ్దాలుగా కోల్పోయిన అవకాశాల కోసమే కాదు

ఇప్పుడిక కూలిపోతున్న విశ్వాసాల కోసమైనా

వాళ్ళను మాట్లాడనివ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com