స్వాతంత్ర్యానంతరం బహుముఖాలుగా కదిలిన కవయిత్రుల కవిత్వం గురించి…

20వ శతాబ్దం ప్రజా ఉద్యమాలది. విముక్తి పోరాటంలో పదునెక్కినది. స్వాతంత్ర్యోద్యమాలతో ప్రజ్వలించినది. అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతికోద్యమాలతో సుసంపన్నమైనది. సహజంగానే ఆయా ఉద్యమాల ప్రభావం సాహిత్యంపై కనబడుతుంది. అలాగే ఆయా ఉద్యమాలకు సాహిత్యం ఊపును కల్పించింది. కందుకూరి ‘సంఘ సంస్కరణోద్యమం’, గురజాడ వారి ‘సాహిత్య సంస్కరణోద్యమం’, గిడుగు వారి ‘భాషా సంస్కరణోద్యమం’ తెలుగునాట ఉదయించిన అన్ని సాహిత్యోద్యమాలకు కావలసిన పూర్వరంగాన్ని ఏర్పాటు చేశాయి.

తెలుగునాట సంఘ సంస్కరణోద్యమాల ప్రభావంతో, జాతీయోద్యమ ప్రభావంతో శ్రీమతి తల్లా ప్రగడ విశ్వ సుందరమ్మ, పి. సీతారామమ్మ, దేవులపల్లి సత్యవతమ్మ, వెలువోలు వసంతాదేవి, దేశిరాజు భారతీదేవి, జె. కామేశ్వరి, ఇనగంటి రత్నమ్మ, పరుచూరి భువనేశ్వరి, ఓలేటి నిత్య కళ్యాణమ్మ, కనపర్తి వరలక్ష్మమ్మ మొదలైన కవయిత్రులు తమ కవితల్లో సామాజిక రుగ్మతలను నిరసించారు. భారత స్వాతంత్ర్యాన్ని ఆకాంక్షించారు. కొందరు ప్రత్యక్షంగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మరికొందరు తమ రచనల ద్వారా ఉద్యమానికి ఊపిరులూదారు.

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో వట్టికొండ విశాలాక్షి, మోటూరి ఉదయం ఫాసిస్టు వ్యతిరేక గీతాలను రచించారు. సోషలిస్టు శక్తుల విజయాన్ని ఆహ్వానించారు. వీరి ఉద్యమ సాహిత్య వారసత్వాన్ని కొనసాగించిన అభ్యుదయ రచయిత్రులు తమ సమకాలీన సామాజిక సమస్యలపై స్పందిస్తున్నారు. సమ సమాజ నిర్మాణాన్ని ఆకాంక్షిస్తూ రచనలు చేస్తున్నారు.

1934 నాటికి ‘కమ్యూనిస్టు ఉద్యమం’ ఆంధ్ర ప్రాంతానికి విస్తరించింది. 1934 సెప్టెంబర్ లో విజయవాడలోని పటమటలో కాట్రగడ్డ నారాయణరావు గారి తోటలో ‘కమ్యూనిస్టు పార్టీ’ సమావేశం జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య కార్యదర్శిగా, ఏడుగురు సభ్యులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతంలోని వివిధ జిల్లాల్లో పార్టీ శాఖల్నినిర్మించాలనీ, రాష్ట్ర వ్యాపితంగా అతివాద భావాలు గల యువజన విద్యార్థుల్ని సమీకరించాలనీ, రాష్ట్ర వ్యాపితంగా కూలి రక్షణ సమితుల్ని ఏర్పరిచి కార్మికుల్లో పనిచేయాలనీ నిర్ణియించారు. అలాగే క్రమంగా వివిధ ప్రజా శ్రేణుల్ని ఉద్యమోన్ముఖం చేయడానికి వీలుగా ‘ప్రజాసంఘాల’ నిర్మాణానికి వామపక్ష ఉద్యమం పూనుకున్నది. బ్రటిష్ సామ్రాజ్యవాద పాలన నుండి విముక్తి తక్షణ కర్తవ్యంగానూ, వర్గరహిత సామ్యవాద సమాజ నిర్మాణం అంతిమ లక్ష్యంగానూ కలిగిన ‘వామపక్ష ఉద్యమం వివిధ ప్రజా సమూహాలను సమీకరించసాగింది. ఇందులో భాగంగానే 1987 నాటికి కృష్ణా జిల్లా మహిళా సంఘం ఏర్పడింది.

స్త్రీల సమస్యలపై పాటలను కోరుతూ కాట్రగడ్డ హనుమాయమ్మ విజ్ఞప్తి చేశారు. మంచి పాటకు పది రూపాయలు బహుమతిని ప్రకటించారు. దండమూడి సత్యనారాయణ గారి గీతానికి ప్రథమ బహుమతి (పది రూపాయలు), పోలెంరెడ్డి బుజ్జమ్మ గారి గీతానికి ద్వితీయ బహుమతి (అయిదు రూపాయలు) లభించాయి. ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి స్త్రీలు కదిలిరావాలని ప్రభోదించిన వట్టికొండ విశాలాక్షి గారి ‘ప్రభోధము’ గీతం విశేష ప్రచారాన్ని పొందింది.

1943 జనవరి – ఫిబ్రవరి మాసాల్లో బెజవాడలో 30 రోజుల పాటు రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యాన మొట్ట మొదటి రాష్ట్ర మహిళా రాజకీయ పాఠశాల’ నిర్వహింపబడింది. 5 జిల్లాల నుండి 22 మంది మహిళా ప్రతినిధులు హాజరయిన ఈ పాఠశాలలో భారత దేశ చరిత్ర, రాజకీయ భూగోళం, జాతీయ – అంతర్జాతీయ రాజకీయాలు, ప్రసూతి, శిశుపోషణ, ఆరోగ్యం – పారిశుధ్య విధులు – మొదలైన అంశాలను బోధించారు. డ్రిల్లు, కర్రసాము వంటి ఆత్మ రక్షణోపాయాలు నేర్పించారు. ఆ తరువాత జిల్లాస్థాయి ‘మహిళా శిక్షణా తరగతులు’ అనేక జిల్లాల్లో జరిగాయి.

ఈ అనుభవాలతో ఏర్పడిన ‘ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య’ నాటి నుండి నేటిదాకా అఖిల భారత మహిళా సమాఖ్య’కు అనుబంధంగా పనిచేస్తూ స్త్రీల హక్కులకోసం నిరంతర పోరాటాలు నిర్వహిస్తున్నది. వామపక్ష ఉద్యమంలో భాగంగానే తెలుగు నేలపై 1940 దశకం నుండి అభ్యుదయ సాహిత్యోద్యమం, ప్రజానాట్యమండలి సాంస్కృతికోద్యమం ఒకవైపు లిఖిత సాహిత్య రూపాలను, మరోవైపు ఆశుసాహిత్య లను ప్రభావితం చేస్తూ, ప్రజల జీవితాలను చిత్రిస్తున్నాయి.

ఆధునిక సాహిత్యంలో రూపంలోనూ, వస్తువులోనూ, భాషలోనూ, భావ ప్రకటనలోనూ అనేక నూతన ధోరణులు వికసించడానికీ, సంకోచాలు లేకుండా వివిధ ప్రజాశ్రేణులు స్వేచ్చగా తమ అనుభూతులనూ, అనుభవాలనూ ప్రకటించడానికి మార్గ నిర్దేశం చేస్తూ విస్తరిస్తున్న మహోద్యమం అభ్యుదయ సాహిత్యం .

భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో వలస పాలనకు వ్యతిరేకంగా రచనలు చేసిన అభ్యుదయ రచయిత్రులు, స్వాతంత్ర్యానంతరం సమకాలీన సమాజ సమస్యలపై తమ కవితాస్త్రాలను సంధిస్తున్నారు.

1947 ఆగష్టు 15న దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటికీ, నిజామాంధ్ర ప్రాంతం మాత్రం నిరంకుశ నైజాం పరిపాలన క్రింద మగ్గింది. ప్రజలు విముక్తి కోసం పోరాటాన్ని కొనసాగించారు. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో వీరోచిత తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ప్రజ్వరిల్లింది. ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సిహెచ్. కమల, తన భర్త అప్పన్నతో కలిసి రాసి, పాడిన గీతంలో

‘రండ దొరల రజాకార్ల జూసారూ

ప్రజలు నడుంకట్టి రణమందు దూకారూ

ముసలమ్మలు ముసలయ్యలు లేచారు

వారి చేతికందిన కర్ర బడితెలే బట్టారూ అంటూ పోరాట చిత్రాన్ని చిత్రించారు.

అలాగే నకిరేకల్లు ప్రాంతంలో స్త్రీలు నాట్లు వేస్తూ. . .

‘అమ్మ కలువబోదాము వస్తారమ్మా

అమ్మ కలికి రారో మనలను కాపాడే రష్యా !

అమ్మ దూరము శానున్నదమ్మా

వోపి నడిచేటి వారైతే రండూ మాయమ్మ’ అంటూ దీర్ఘకాలిక పోరాటాలకు

వోపి నడిచేటి వారైతే రండూ మాయమ్మ’ అంటూ దీర్ఘకాలిక పోరాటాలకు
సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పోరాటంలో అసువులు బాసిన అమర వీరులను స్మరిస్తూ స్మృతిగీతాలు పాడారు. ‘ఉయ్యాల పాట’ బాణీలో బి. స్వరాజ్యం (1946) రాసిన గీతాన్ని “వీర మట్టారెడ్డి ఉయ్యాలో. . . ధీర అనంతారెడ్డి ఉయ్యా లో. . . మరువమెన్నటికైన ఉయ్యాలో . . .. అంటూ ప్రారంభించి

పాత సూర్యాపేట ఉయ్యాలో – పోరాటమును జూడు ఉయ్యాలో

పురుషులూ లేనపుడు ఉయ్యాలో – పల్లెలో స్త్రీలంత ఉయ్యాలో

పరువు కాపాడుకొన ఉయ్యాలో – బయలుదేరీనారు ఉయ్యాలో

శీల రక్షణ కొరకు ఉయ్యాలో – స్ర్తీలంతా కూడారు ఉయ్యాలో

లారీల చుట్టేసి ఉయ్యాలో -లడాయి జేశారు ఉయ్యాలో

ప్రజల బలమూజూసి ఉయ్యాలో – పారిపోయిరి వాళ్లు ఉయ్యాలో

పౌర హక్కుల కొరకు ఉయ్యాలో – పోరాటమిది యమ్మ ఉయ్యాలో

ఝాన్సీ లక్ష్మీ చరిత ఉయ్యాలో – చాటి చూపాలమ్మ ఉయ్యాలో

మన ప్రజల రాజ్యమును ఉయ్యాలో – పొంది తీరాలమ్మ ఉయ్యాలో

అనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

నా నులి వెచ్చని రక్తముతో

కల్పి

చల్లిన అన్నము

బలిముద్దా?

నీ తొలిముద్దా.?

అంటూ బలివితర్ది పై కవితలల్లారు రాజేశ్వరీ రాణి.

ప్రజల పోరాటాలతో నిజాం సంస్థానం విముక్తమయ్యింది. ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యింది. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం ‘ నినాదంతో తెలుగు ప్రజలు ఉద్యమించారు. 1956 నవంబర్ ఒకటిన దేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్’ ఏర్పడింది.

‘రమ్య గౌతమి కృష్ణాతరంగిణుల వి

నూత్న సలిల సుస్నాత మనోజ్ఞమూర్తి

పచ్చపైరుల క్రొంబట్టు వలవ గట్టి ‘

కీర్తి తిలకంబు దిద్దిన గేస్తురాలు

మందహాస రుచుల్మొగ మందు దోప

జయపతాకము జివురు హస్తముల బట్టి

విజయ గర్వము మానససీమ వింతగొలుప

నిలిచియున్నది యొక మహనీయురాలు’ అంటూ ప్రారంభించిన కవితాంతంలో…

అమ్మ, మా యవనీమాత, యాంధ్రమాత

తల్లి, భాషామతల్లి మా తల్లి, యామె

రాజ్యలక్ష్మి స్వరూపిణీ, రత్నగర్భ

కీర్తి బాడెద సతము కెంగెలు మోడ్చి

అంటూ ఆంధ్రావతరణానికి కైమోడ్పులర్పించారు. అలాగే శ్రీమతి తల్లాప్రగడ విశ్వసందరమ్మ…

పెంచి పెద్దను జేసిన ప్రేమమూర్తి

తల్లితో సమమైనదీ ధరణి మనకు

ఆంధ్ర రాష్ట్రమె బలమిచ్చునందరకును

ఆంధ్ర భాషాభివృద్ధికి నదియె త్రోవ అనే ప్రబోధాన్ని ప్రకటించారు

దేశం స్వాతంత్ర్యాన్ని సంపాదించింది. తెలంగాణా విముక్తిని సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయినా ప్రజల సమస్యలు తీరలేదు. ప్రజారాజ్యం ఏర్పడలేదు.

ఈ పరిస్థితిని నిరసిస్తూ. . .

ఈ దేశం రత్నగర్భ – ఈ దేశం ధన్యచరిత

దొరతనం నేడు నల్లవారి పాలైనది

డేగరెక్క నీడ చేరి కోటగోడ కూల్చారని

హూంకరించు ఈ దేశం – డేగముందు కోడిపిల్ల

పట్టపగలు పడతి పరువు నడి బజారున తీయగలదు

బట్టబయలు మార్కెట్లో నల్ల సరుకు అమ్మగలదు

ఈ దేశపు యంత్రాంగం ఈ దేశం సోషలిజం

ఈ దేశం మాన్యచరిత – ఈ దేశం పుణ్యచరిత

అంటూ సవిమర్శక వాస్తవికతా గీతమాలపించారు. శ్రీమతి టి. వాణీ రంగారావు.

ఈ దేశంలో ఎవ్వడైనా ఏమైనా చేసుకోవచ్చు

ఎందుకంటే, ఇది ప్రజాస్వామ్య దేశం కదా !

ఊపిరి పీల్చనూ వచ్చు విడవనూ వచ్చు |

చివరికి తీయనూవచ్చు

అనే పంక్తుల్లో బూర్జువా ప్రజాస్వామ్యం ముసుగును తొలగించి చూపుతున్న కవయిత్రి సువర్ణ.

స్వతంత్ర భారతంలో స్త్రీల స్థితిగతులను వర్ణిస్తూ శ్రీమతి వట్టికొండ విశాలాక్షి

పేరుగాంచిన యట్టి – భారతావనిలోని

స్త్రీ సమాజము మిగుల – చెరవడుటలు గాంచి

కన్నీరు గార్చకుము ఓ సోదరీ ! కరిగినీరైపోకుమా సోదరీ. . .

నిస్సహాయ స్థితిని – నిస్తబ్దురాలివై ,

నీ స్థితిని ఒకమారు – నిండారు తలచుకొని

కళ్ళ నీళ్ళకు ఫలము ఓ సోదరీ – కలకాలమేడ్చుటే !

మాతృకాలము నాటి – మానవుని చరితమ్ము

తరిచి తరిచీ నీవు – పరికించి చూచితే

హక్కులన్నింటిని ఓ సోదరీ – అనుభవించినదెవరు?

వృత్తి విభజన జేసి – ఊడిగము మనకిచ్చి

పురుష వర్గము వారు – బులిపించి వేసారు

ఆర్థికముగా స్త్రీల ఓ సోదరీ ! అణగ దొక్కేశారు !

మీ మంచి చెడ్డలకు – మాదె పెత్తనమంటు

అన్నింట మేమెయని – అడ్డువస్తూ వుండి

వ్యక్తి స్వతంత్రత ఓ సోదరీ ! యుక్తితో లాగారు !

సూర్యరశ్మేమాకు – సోకకుండా చేసి

సుకుమారివని యెంతో – చోద్యమ్ముగా పొగడి

పరదాల చాటునను ఓ సోదరీ ! చెరసాలనుంచారు !

బయటికెడితే నీదు – పరువు మరియాదలకు

భంగమొదవు నటంచు – పలుమారు వంచించి

బాహ్య ప్రపంచమున ఓ సోదరీ ! భయము కల్పించారు ! అనడంతో పాటు

‘బానిసత్వమ్మనెడి – బ్రహ్మ రాక్షసి నోట

పడిపోవుటో లేక – బయటపడి గెలుచుటో

నిజమైన మార్గాన ఓ సోదరీ ! నిలిచిమరి తేల్చుకో ! అంటూ

చైతన్యయుతమయిన పిలుపునిచ్చారు.

‘మహిళా సమాఖ్య నాయకురాలు కీ.శే. గుజ్జుల సరళాదేవి మహిళలను చైతన్య పరిచే గీతాలు కొన్ని రచించారు.

మేలుకో మేలుకో చెల్లెలా – మేలుకోవే చిట్టి చెల్లెలా !

ఉన్నవాళ్ళ ఇళ్ళలోనా – ఊడిగములూ చేసుకుంటూ

పరులకోసం సొంత సుఖముల – మరిచిపోయిన చెల్లెలా !

అనే వర్గ చైతన్యంతో పాటు…

అమ్మగారీ కాను పైనా – అయ్యగారీ పానుపైనా

అన్ని పనులూ నెత్తినేసుక – అణగిపోయిన చెల్లెలా

అనే పంక్తుల్లో శ్రామిక స్త్రీల లైంగిక దోపిడిని వర్ణించారు.

కులం కులం అనీ – కుత్సితాలు పెంచుకోకూ కూటికి లేని వాడా

మతం మతం అనీ – మాత్సర్యం పెంచుకోకూ దరిద్ర నారాయణుడా

అనే ప్రఖ్యాత గీతం రచించిన కీ.శే. విజయలక్ష్మి తన కవితల్లో. .అనురాగం అంబరమై నవరాజ్యం ప్రభవించును – సమతా సురసౌరభాలు జగమంతా నిండిపోవుననే చారిత్రక ఆశావాదాన్ని ధ్వనింపజేస్తున్నారు.

పరుగులిడుతున్న కాలాన్ని చూస్తూ

కరిగి పోతున్న ఓ అసమర్థజీవీ !

లానికి కళ్ళెం లేదు

ఆలోచనలకు ఆనకట్ట లేదు

ఆశలకు అంతులేదు

‘అభ్యుదయ జ్వాలల్లో ఆలోచనలను పుటం వెయ్యి

మెరుగు పెట్టిన ఆశయాలను

మెలిపెట్టి సరికొత్త నగలాంటి

మరొక యుగాన్ని సృష్టించు నంటూ శ్రీమతి ఎన్. జ్యోతిర్మయి ‘కొత్త యుగానికి స్వాగతం పలుకుతున్నారు.

చుట్టూరా నెలకొని ఉన్న అసమ సమాజంలో. .

మాకుముక్తి లేదాయని – మానవాళి ఆక్రందన

దీనులైన నరుల గాంచి – దేవునిదీ ఆక్రందన అంటున్నారు వింజమూరి రాధారాణి.

సోవియట్ కవయిత్రుల కవితలను అనువదించి, ప్రకటించిన డా|| పి. చిరంజీవినీ కుమారి తమ కవితల్లో సోషలిస్టు చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. విప్లవాన్ని ఆహ్వానించమంటున్న కి.శే. యలమంచిలి తాయారమ్మ గారి కవితల్లో సమకాలీన సామాజిక సమస్యలు, వాటికి పరిష్కారంగా వర్గపోరాట ప్రబోధం ప్రస్ఫుటమౌతున్నాయి. తొలితరం ప్రజానాట్యమండలి కళాకారిణి శ్రీమతి తాపీ రాజమ్మ తమ కవితల ద్వారా గీతాల ద్వారా ప్రజా సమస్యల పై నిరంతరం ప్రతిస్పందిస్తూనే ఉన్నారు. సమాజంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న కన్స్యూమరిజంపై తమ నిరసన గళాన్ని వినిపిస్తున్న శ్రీమతి అంగలూరి అంజనీదేవి కవితా సంపుటి ‘గుండెలోంచి అరుణోదయంలో ఈతరం అభ్యుదయ కవుల నుండి గుండె ఘోషలు వినబడుతున్నాయి.

కుల నిరసన, మతోన్మాద ఖండన, అసమ సమాజం పై ఆగ్రహం, పాలకవర్గం పై అధిక్షేపం, అమరవీరుల స్మృతి, స్త్రీల అణచివేత పై ప్రతిఘటన, వర్గరహిత సమసమాజ నిర్మాణాకాంక్ష మొదలైన అంశాలను తమ కవితా వస్తువులుగా తీసుకుని స్వాతంత్ర్యానంతర అభ్యుదయ రచయిత్రులు కవిత్వాన్ని ప్రకటిస్తున్నారు. శ్రీమతి యలమంచిలి తాయారమ్మ,తాపీ రాజమ్మ, డా|| నాయని కృష్ణకుమారి, వాణీరంగారావు, పి. చిరంజీవినీ కుమారి, దాసరి విజయకుమారి, కొలకలూరి స్వరూప రాణి, డా|| పి. సంజీవమ్మ, సిహెచ్. సుశీల, బండారు సుజాతాశేఖర్, పి.సరళ, ఎస్. శరత్ జ్యోత్నారాణి మొదలైన అభ్యుదయ కవియిత్రులు సామాజిక స్పృహతో కూడిన స్త్రీల కవిత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో ముఖ్యులుగా పరిగణింపవచ్చును.

‘నా దేశం బూర్జువాలని భుజాల మీద మోస్తూ అన్నమెరుగని వెర్రి జనాన్నికాళ్లకింద కసాబిసా తొక్కేస్తూ – ప్రగతి ప్రగతంటూ పొలికేకలు పెడుతోందంటున్న (శ్రీమతి అత్తలూరి రాజ్యలక్ష్మి) వర్గ చైతన్యాన్ని ఈ తరం అభ్యుదయ కవయిత్రులు ప్రదర్శిస్తున్నారు. అలాగే…

పుట్టాక తల్లి దండ్రుల పిడికిట్లో పెరుగుతుంది

పెళ్ళి అయ్యాక భర్త అడుగుల్లో కాపురం చేస్తుంది

ముసలనాన సంతానం చిగురుల్లో తనువు చాలిస్తుంది

ఆమె స్వేచ్ఛగా తిరిగేది – ఒక్క తల్లి కడుపులోనే

(శ్రీమతి కొనకంచి శారదాదేవి)- అంటూ స్త్రీవాద చైతన్యాన్ని కూడా అభ్యుదయ రచయిత్రులు తమ రచనల్లో ప్రదర్శిస్తున్నారు. .

శ్రీమతి అడవికొలను పార్వతి, అయినవోలు అరుణాదేవి, డా|| అల్లూరి రాజకుమారి, కోకా విమలకుమారి, చల్లపల్లి స్వరూపరాణి, ఐ.ఎస్. రమాదేవి, ఐ.కుసుమకుమారి, మాడభూషి వరలక్ష్మి, ఎం. ఉదయ, పచ్చిగోళ్ల సుధ, డా|| దివాకర్ల రాజేశ్వరి, శ్రీమతి అంబికా అనంత్, వి. రామలక్ష్మి, ఆచంట హైమవతి మొదలైన అభ్యుదయ కవయిత్రులు తమ రచనల్లో పీడితవర్గ చైతన్యాన్ని, సమసమాజ నిర్మాణా ఆంక్షనూ, స్త్రీల అణచివేతపై నిరసన ప్రతిఘటనలనూ వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com