చింతపట్ల సుదర్శన్

సూర్య తేజ అపార్ట్ మెంట్స్, సెకండ్ ఫ్లోర్. నూటనాలుగవ ఫ్లాట్ లో హాలు. హాల్లో సోఫా. సోఫా మీద సావిత్రమ్మ. ఆరుపదుల వయసును తాకుతున్న సావిత్రమ్మ. కళ్ళు కళ్ళ జోడులో నుంచి దినపత్రిక అక్షరాల మీద సంచరిస్తున్నాయి. ఎదురుగ్గా ఉన్న ప్లాట్ డోర్ తెర్చుకుంటున్న చప్పుడుకు సావిత్రమ్మ కళ్ళు దినపత్రిక లో నుంచి గోడమీద ఉన్న గడియారం మీదకు చూపులు విసిరేయి. టైమ్ తొమ్మిదిన్నర అవుతున్నది. సూర్యుడి కిరణాలు బాల్కనీ గోడ దూకి వరండాలోకి జొరబడుతున్నవి.

తన ఫ్లాట్ తలుపు తెరచుకుని బయటకు వచ్చింది ఓ అమ్మాయి. సన్నగా పొడుగ్గా వుంది. రంగు తక్కువైనా ఆకర్షణీయంగా ఉంది. అయితేనేం పాతికేళ్ళ వయసులో ఉండాల్సినంత హుషారుగా మాత్రం కనిపించదు అనుకుంది సావిత్రమ్మ. అటువైపు చూసీ చూడనట్టు చూస్తూ.

రోజూ సరిగ్గా ఇదే టైంకి బయటకు వస్తుంది. ఫ్లాట్ కి తాళం వేసుకుని వెళ్ళిపోతుంది. కనీసం ఈ వైపు చూడనైనా చూడదు అనుకుంటున్న సావిత్రమ్మకు ఆశ్చర్యపడాల్సిన దృశ్యం కనిపించింది. ఎప్పటిలాగే అటు తిరిగి వెళ్ళిపోవాల్సిన ఆమె ఇటు తిరిగి తమ ఇంటి వైపే వస్తున్నది.

తలుపు ఎదురుగ్గా వచ్చి నిలబడ్డ అమ్మాయి వైపు విస్మయంగా చూస్తూ ‘రామ్మా! లోపలికి రా! ‘ అంది.

‘అదీ..అంటే..నేను నీహారిక..అక్కయ్య మధ్యాహ్నం వస్తున్నది. నేను ఆఫీసులో ఉంటా కదా. ‘కీ’ యిచ్చి వెళ్దామని’ అన్నది నీహారిక ఒక్కో మాటనూ కొలిచినట్టు వాడుతూ.

అమ్మాయి పేరు ‌నిహారిక అన్నమాట. ఇన్నాళ్ళకు తెలిసింది అనుకున్నది సావిత్రమ్మ.

అమ్మాయి పేరు ‌నిహారిక అన్నమాట. ఇన్నాళ్ళకు తెలిసింది అనుకున్నది సావిత్రమ్మ.

‘నాకిచ్చి వెళ్ళమ్మా! నేను ఇంట్లోనే ఉంటాను కదా!’ అన్నది సావిత్రమ్మ. ప్రతి మాటనూ మెత్తగా పలుకుతూ. ఆ అమ్మాయి లోపలికి వస్తే మరి కాసేపు మాట్లాడవచ్చని ఆశపడ్డది.

నీహారిక నాలుగు అడుగులు లోపలికి వేసి ఒక‌ నిమిషం కంటే తక్కువ సమయంలోనే కీ ని టీపాయ్ మీద పెట్టి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ‘థాంక్స్’ అనడం వినిపించింది సావిత్రమ్మకు.

మధ్యాహ్నం మూడు దాటింది. లంచ్ టైం తర్వాత డీలా పడిపోయే ఆఫీసు ఉద్యోగిలా నీరసంగా ఉన్నాయి సూర్యకిరణాలు.

తలుపు తెరిచే ఉంచింది సావిత్రమ్మ. నీహారిక అక్కయ్య వస్తే ‘కీ’ యిద్దామని. లిఫ్ట్ చప్పుడయ్యింది. ‘ప్లీజ్ క్లోజ్‌ ద డోర్’ అన్న మాటలు వినిపించేయి. ఆ అమ్మాయేనేమో ననుకుంది సావిత్రమ్మ. పుస్తకం చదవడం ఆపి వినపడుతున్న అడుగులు కనపడ్డం కోసం చూసింది.

చేతిలో బ్యాగ్ తో వచ్చిన ఆమె తలుపుకి ఎదురుగ్గా బ్యాగ్ పెట్టి కర్చీఫ్ తో ముఖం తుడుచుకుంటూ ‘నేను నీహారిక సిస్టర్ ని. నా పేరు హేమ. నీహారిక ‘కీ’ యిచ్చానని చెప్పింది అందామె తటపటాయిస్తూ.

‘రామ్మా లోపలికి రా !’ అని ఆప్యాయంగా ఆహ్వానించింది సావిత్రమ్మ.

‘టైర్ అయిపోయాను అంటే సాయంత్రం వస్తాను’ అంటూ లోపలికి వచ్చి చేయి చాచింది.

నీహారిక పోలికలు ఉన్నాయి కాకపోతే ఈ అమ్మాయి కొంచెం లావు అనుకుంది, సావిత్రమ్మ నీహారిక ఇచ్చిన ‘కీ’ ని అందిస్తూ…

చెల్లెలు లాగానే అక్క కూడా పెద్దగా మట్లాడేట్టు కనిపించదు అనుకున్న సావిత్రమ్మ అంచనా తప్పయ్యింది.

ఆ సాయంత్రం హేమ రానే వచ్చింది. తమ ఫ్యామిలీ గురించి, నీహారిక గురించీ చాలా విషయాలు చెప్పింది. కొత్తగా వచ్చింది కనక సావిత్రమ్మతో సరిగ్గా మాట్లాడలేక పోతుందని తను పరిచయం చేసి పోతాను అనీ అన్నది. తను అక్కడ ఉన్న నాలుగు రోజుల్లో సావిత్రమ్మతో బాగా కల్సిపోయింది. ఆమె మాటల వల్ల తెలిసింది సావిత్రమ్మకి‌.

నీహారిక పెళ్ళయి మూడేళ్ళయింది. తనకు ఓ కూతురు కూడా వుంది. అది తమ తల్లి దగ్గర ఉంది. నీహారిక కూ భర్తకూ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోవాలని అనుకున్నారని, విడాకుల కేసు కోర్టులో ఉందని చెప్పింది హేమ.

ఇందుకా అమ్మాయి ఒక్కతే ఉంటున్నది. ముభావంగా ఉండటానికి, ఎవరితోనూ కలవపీవడానికి కారణం ఉందన్న మాట అనుకుంది సావిత్రమ్మ.

హేమ తిరిగి వెళ్ళిపోతూ నీహారికను బలవంతంగా తీసుకు వచ్చి సావిత్రమ్మతో మాట్లాడించింది. ఎదురు ఫ్లాట్లో పెద్దావిడ ఉండటం కొండంత అండ అని ఆమె తో మాట్లాడుతూ ఉండమని చెప్పింది.

సావిత్రమ్మ అంత చదువుకున్నదని అనుకోలేదు నీహారిక గవర్నమెంట్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పని చేసిందని తెల్సి ఆశ్చర్యపోయింది. ఆమెతో మాట్లాడుతుంటే ఎంతో ‘రిలీఫ్’ గా వుండేది. క్రమంగా ఆమెతో మనసు విప్పి మాట్లాడ్డం మొదలు పెట్టింది.

ఓ సాయంత్రం అడగకూడదనుకుంటూనే అడిగేసింది సావిత్రమ్మ నీహారిక ఒంటరిగా ఉండటాన్ని గురించి.

తామిద్దరం హైదరాబాద్ లోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తుండే వాళ్ళమని ఎడాది కిందట చైతన్యకు బెంగుళూరు లో ఓ కంపనీ నుంచి మంచి ఆఫర్ రావడంతో వెళ్ళిపోయాడని తనను ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చెయ్యమనడంతో మాటా మాటా పెరిగి విషయం విడాకుల దాకా వెళ్ళిందని చెప్పింది నీహారిక.

ఇంతమాత్రానికేనా అన్న ఎక్స్‌ప్రెషన్ సావిత్రమ్మ ముఖంలో కనిపించి ‘మీరే చెప్పండి ఆంటీ ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఆర్థికంగా నిలబడ్డం ఎంత అవసరం. ఇక్కడ ఉద్యోగం వదిలేస్తే అక్కడ దొరుకుతుందా? అంది నీహారిక. తన జవాబు సావిత్రమ్మను పూర్తిగా కన్విన్సు చెయ్యలేదనుకున్న నీహారిక ‘కొన్ని విషయాల్లో మా అభిప్రాయాలు అసలు కలవనే కలవ్వు ‘ అంది తన తప్పేమీ లేదన్న భావాన్ని మొహం లో కనిపించేట్టు చేస్తూ.

అదేంటమ్మా! వివాహ బంధానికి ప్రేమా నమ్మకమే కదా పునాదులు. అభిప్రాయాల్లో తేడాలు ఉంటేనేం. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తే సరి. ధర్నేచ, అర్థేచ, కామేచ నాతిచరితత్య, నాతి చరామి అని పెళ్ళి నాడు ప్రమాణాలు చేస్తారు కదా. ఒకరి మాటను ఒకరు గౌరవిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిని విడిచి ఒకరం ఉండమని కదా ఆ మాటలకు అర్థం. ఒకరి బలహీనతలు ఒకరు అర్థం చేసుకోవడం ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవడమే కదా వివాహ బంధం’ అన్నది సావిత్రమ్మ.

‘నాకు నిద్ర వస్తున్నది ఆంటీ’ అంటూ లేచి వెళ్ళిపోయింది నీహారిక.

నీహారిక కు తన మాటలు నచ్చలేదని అర్థం అయింది సావిత్రమ్మకు.

సావిత్రమ్మ అనవసరంగా తనకు క్లాస్ తీసుకుంది అనుకుంది ‌నీహారిక. తర్వాత నాలుగైదు రోజులు ఆమె దగ్గరికి రాలేదు. పెళ్ళి గురించి, ప్రేమ గురించి లెక్చరు దంచుతున్నది. ఈమె భర్త యేమయ్యాడు? ఒక్కనాడూ కనిపించడేం అనుకుంది.

ఓ రోజు ఆఫీసులో పనేమీ లేకపోవడంతో ఐదింటికే ఇంటికి వచ్చింది నీహారిక. ఎదుటి ఫ్లాట్ తలుపు మూసి వుంది. తన డోర్ తెరవబోతుంటే ఎవరో మూల్గినట్టు వినిపించింది. ఎక్కడ్నించి ఈ మూల్గు అనుకుంటూ మళ్ళీ విన్నది. అది సావిత్రమ్మ ఫ్లాట్ నుంచే వస్తున్నది. ఆ వైపు ఎప్పుడూ మూసి ఉంటే కిటికీలోపల్నించి వస్తున్నది. వెళ్ళి కిటికీని బలంగా తోసింది. బోల్టు ఊడి అది తెరచుకుంది.

లోపల దృశ్యం చూసి ‘షాక్’ అయింది నీహారిక. అది బెడ్రూం. మంచం మీది నుంచి కింద పడ్డట్టున్నాడు ఓ వ్యక్తి. బాధలో మూలుగుతున్నాడు. తను సావిత్రమ్మతో హాల్లో కూచుని మాట్లడింది కానీ లోపలికి వెళ్ళలేదు.

ఏం చేద్దాం? ఈయన ఎవరు? సావిత్రమ్మ లోపల లేదా అని నీహారిక అనుకుంటుండగానే సావిత్రమ్మ వచ్చింది. బయటికి వెళ్ళినట్టుంది. తలుపు తీసి లోపలికి వెళ్ళిన ఆమెను అనుసరించింది నీహారిక.

స్టూల్ మీద వాటర్ బాటిల్ అందుకోడానికి జరిగాడేమో ఆ మనిషి మంచం మీది నుంచి జారి పడ్డాడు. సావిత్రమ్మ నీహారిక కలిసి ఆయనను మంచం మీద పడుకోబెట్టారు. చెమటపట్టిన ఆయన ముఖాన్ని చీర చెంగుతో అద్దుతున్న సావిత్రమ్మను చూస్తూ నిలబడిపోయింది నీహారిక.

ఆయన సావిత్రమ్మ భర్త! ఐదేళ్ళ కిందట ఆక్సిడెంట్ లో వెన్నెముక దెబ్బ తినడం వల్ల మంచాన పడ్డాడు. ఉన్న ఒక్క కొడుకూ అమెరికాలో సెటిలవడం వల్ల వస్తాడనే ఆశ లేదు. తను చేస్తున్న బిజినెస్ మూల పడి, అన్నింటికీ అర్థాంగి మీద ఆధారపడి ఉన్న ఆయన కోసం తను వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుని ఆయనను పసిపాపలా కాపాడుకుంటున్నది సావిత్రమ్మ. ఆయన కోసమే బ్రతుకుతున్నది.

అంకుల్ ను చూసి వచ్చినప్పట్నించీ నీహారిక కు నిద్ర పట్టడం లేదు. కన్నుమూసినా తెరిచినా నిస్సహాయుడైన ఆయన ముఖమే గుర్తుకు వచ్చి కళ్ళు నీటి చెలమలవుతున్నాయి.

‘నువ్వు తెలివైన దానివి నీహారికా. ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ వుంది. కాస్త ఆలస్యమైనా బెంగుళూరులో నీకూ ఉద్యోగం దొరుకుతుంది. అనవసరమైన పంతానికి పోయి కూతుర్ని ‌కూడా దూరంగా ఉంచావు. జీవితం అంటే పోరాటమే కాని పారిపోవడం కాదు. నీ సమస్యకి డైవర్సు పరిష్కారం కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా వివాహ బంధం ముందు దాంపత్య బంధం ముందు అవన్నీ మబ్బుల్లా తేలిపోతయి అని సావిత్రమ్మ తనతో అన్న మాటలు ఆమె చెవులకు పదే పదే వినిపించసాగాయి.

ఎం.జి.బి.ఎస్ బస్సు డిపోలో బెంగుళూరు బస్సు ఎక్కుతూ, ఆవేశపడకూడదు అతనితో మనసు విప్పి మాట్లాడాలి అనుకుంది ఓ పాతికేళ్ళ అమ్మాయి.

ఆ అమ్మాయి.. నీహారిక !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com