“వారెవ్వా! ఇయ్యాల అయ్యగారి మొఖం పున్నమి చందమామ లెక్క వెలిగిపోతుంది, ఎందుకో? మన పల్లవి పుట్టిన రోజు సంబరమా? “ భర్త చేతులున్న పాకెట్ అందకుంటుంటే మాధవి కళ్లల్లో నూతన కాంతి తొంగి చూసింది. సతీశ్ ను కింది నుంచి మీద్దాకా చూపులతో తడిమింది.

“ మన వరాల మూట పుట్టిన రోజు పండగ పొద్దున్నే చేసినం గదా! ఇది మొదటి పుట్టిన రోజు…వార్షికోత్సవమాయె. ఇంకో శుభవార్త గూడా వుంది మాధవీ! అదో..వస్తుంది బుడి బుడి నడకల పల్లవి. ఇది నా జీవన రాగానికి పల్లవి లాంటిది..నా బంగారు కొండా! “ మురిసిపోతూ కూతురు నెత్తుకుని లేత చెంపలు ముద్దాడిండు సతీశ్.

“అమ్మా..నాన్న… !” పాప కేరింతలు.

“ నువు ఇయ్యాల్ల మా రాజు లెక్కున్నవయ్యా!” మాధవి తృప్తి.

“నువు దేవ కన్యలాగున్నవ్ మాధవీ! ఆ కళ్లు, పొట్లకాయ ముక్కు, ఎర్రని కుంకుమ బొట్టు..” చెంపలందుకోబోయి మానుకున్నడు.

సిగ్గుల బుగ్గల్ని అరచేతుల్లో దాచుకుంది. కళ్లు కమ్మగా తిప్పింది. “చాల్చాలు. మునగ చెట్టు ఎక్కియ్యొద్దు. మీ బట్టల దుకాండ్ల గుమాస్తాలకు డబుల్ బోనసిచ్చిండ్రా..?” కను రెప్పలు టపటపలాడినై. కూతురునందుకుని కిందికి దింపింది. ఆ రోజు ఉదయమే పల్లవికి కొత్త గౌను వేసి, గుడికెళ్లి అర్చన చేయించిండ్రు.

చిన్నారి పల్లవి కీ యిచ్చిన బొమ్మలా వెళ్లి బొమ్మలతో ఆడుకుంది. సతీష్ సంతోషాన్నాపుకోలేక భార్య సన్నని నడుం చుట్టూ చేతులు బిగించిండు. మాధవి కపోలాలు సిగ్గులు సింగారించుకున్నై. “అయ్యో! యాల్లగాని యాల్ల గిదేం పనీ..?” కౌగిలి ఇష్టంగానే వున్నా, ఎవరన్నా చూస్తారు బాబూ! సందెవేళ సరసాలేందీ.. ? ముందా శుభవార్త ఏందో చెప్పాలె గదా.. ! ” విడిపించుకుంది. చెరో కుర్చీలో కూర్చున్నరు.

“నేను బట్టల షాపుల ఉద్యోగం మానేసిన“ చిరునవ్వు. ముక్కు మీద వేలేసుకుంది. శుభం పలుకరా పెళ్లి కొడుకా అంటే పెళ్లి కూతురు ఎక్కడుందని అడిగిందట. అదేమన్నా ఘన కార్యమా..? ఉద్యోగం మానేస్తే బతుకుబాట సంగతేందీ..? మాధవి అయోమయం.

భార్య చేతుల్ని అందుకుని నాజూగ్గా చెంపలద్దుకుంటూ “ నాకు కిరణ్ క్లాత్ షాపింగ్ మాల్ ల సేల్సుమేన్ ఉద్యోగం దొరికింది. అదే షాపింగ్ మాల్లో నీకో చీరకొందామని వెళ్లిన. అక్కడి మానేజర్ నా బాల్య స్నేహితుడు. చీరకొని అతని ముందు కెళ్లిన. నవ్వుతూ పిలిచి కూచోబెట్టుకున్నడు. ఆ మాట, ఈ మాట మాట్లాడి గాచిన్న బట్టల దుకాండ్ల జీతం నీకేం సరిపోతుంది..? మా షాపింగ్ మాల్ ల సేల్స్ మేన్ ఉద్యోగం ఖాళీ వుంది. చేరిపో. ఇక్కడ జీతమెక్కువ. పి.యఫ్.సౌకర్యము, రోజుకెనిమిది గంటల వరకే డ్యూటీ. నీకిష్టమైతే ఇప్పుడు దరఖాస్తు ఇచ్చి రేపట్నుంచి డ్యూటికి రా. నేను మా యాజమాన్యంతో మాట్లాడ్తా. సొంత సోదరుడిలా అడిగిండు.

వెంటనే దరఖాస్తు రాసిచ్చిన. రేపుదయం పదింటికి డ్యూటీకి రా. మందహాసం చిందించిండు. నాకు తిరుపతి లడ్డూ తిన్నంత సంతోషమైంది. థాంక్స్ చెప్పిన. మా బట్టల దుకాణం కెళ్లి సెటుకీ సంగతి చెప్పిన. నాకు రావాల్సిన జీతమిచ్చి ఆయన అభినందనలు చెప్పిండు.”

మొదటి నెల జీతం తీసుకుంటూంటే కొత్తగా విమానమెక్కినంత ఖుషీ అయింది. పాప కాళ్లకు మువ్వల పట్టీలు కొన్నడు.

సతీశ్ తల్లిదండ్రులు అతని పసిప్రాయములోనే స్వర్గవాసముకెళ్లిండ్రు. దూరబ్బందువొకాయన పట్నం తీసుకొచ్చి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ల, బడిల చేర్పించిండు. తల్లి లాంటి హాస్టల్ బడిలో ఒడిదుడుకులను దాటవేస్తూ డిగ్రీ వరకు చదువు పూర్తి చేసిండు. లోకం పోకడ బయటకు రాగానే తెలిసొచ్చింది. హాస్టల్లుండి చదివినా ప్రభుత్వోద్యగమేదీ దొరకలేదు. బట్టల దుకాణముల గుమాస్తాగా చేరిండు. మాధవి వాళ్ల ఊరిలోనే పుట్టి పెరిగి పదో తరగతి పాసైంది. పై చదువులకు పట్నం వెళ్లే తాహతు లేదు. రెండేళ్ల తర్వాత ఆమె తండ్రిక సతీశ్ గుర్తుకొచ్చిండు. సతీశ్ తో మాట్లాడి తల్లిలేని మాధవినిచ్చి పెళ్లి చేసిండు. బాధ్యత బరువు దించుకుని పైలోకానికెళ్లొపోయిండు.

పట్నం అంచుల్లో రెండు గదుల చిన్న పోర్షన్ ల అద్దింట్లో కాలం నడిపిస్తుంది. రెండేళ్ల తర్వాత పల్లవి జన్మించి మురిపాల మూట అందించింది.

పనిభారమెంతున్నా సతీశ్ వెనకా ముందాడడు. నల్లని మీసం కట్టు కింది ముత్యాల్లాంటి చిరునవ్వుతో మాట్లాడ్డం, ఆత్మీయంగా మెదుల్తూ శిరాకులను సంతృప్తి పరచడం అలవాటైంది. పల్లవికి మూడేళ్ల వయసు దాటింది. మాధవి మళ్లీ తల్లి కాబోతుంది. వాళ్ల కదో తీయ్యని అనుభూతి. కిరణ్ షాపింగ్ మాల్ జీతంలోంచి కూడబెట్టిందేమీ లేదు గాని అంతకుముందు తలకు అందితే పాదానికందదు., పాదానికందితే కాలుకందని దుప్పటి లాగున్న పరిస్థితి మెరుగైంది. చేబదుళ్ళు, చిన్న చిన్న అప్పులు తీరిపోయినై.

వచ్చే నెల జీతంలోంచి కొంత పొదుపు చేయాలనుకున్నరు. తనకుద్యోగమిచ్చిన మానేజర్, ప్రమోషన్ మీద హద్రాబాదుకెళ్లిండు. కొత్తగా వచ్చిన మానేజర్ చిర్రు బుర్రులకు చిరునామా. అయినా సతీశ్ అతనికేమీ అవకాశమివ్వలేదు. అందుకే అతనంటే మానేజర్ కు సదభిప్రాయముంది.

కలలో కూడా ఊహించని విధంగా కరోనా రోగం వైరస్ చైనాలో ఊపిరిపోసుకుని ప్రపంచదేశాలకు వ్యాపిస్తోంది. అదో గాలి పురుగు. కనబడదు, వినబడదు. సోకిందంటే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెర్ల నీరు తాగస్తుందని, ప్రాణాలను తీస్తుందని పత్రికలో చదివిండు సతీశ్. ఆ కొత్త రోగానికి సరియైన విరుగుడు మందు లేదట. అది సోకకుండనే జాగ్రత్త పడాలి. అనుమానమొస్తే వెంటనే హాస్పిటల్ కెళ్లాలి. ప్రాథమిక పరీక్ష చేసింతర్వాత క్యారంటైన్ లో పద్నాలుగు రోజులుండాలి. ముక్కు, నోటి సాంద్రాల పరీక్షలో అది కరోనా రోగమేనని తేలితే హైద్రాబాదు పెద్ద హాస్పిటల్ కు పంపి వైద్యం చేయిస్తరు. అది కరోనా కాదని తేలితే హాస్పిటల్ లేదా ఇంటి క్వారంటైన్ లో పద్నాలుగు రోజులుండాలి. అయినా రోగ తీవ్రత సవారి చేసి కొందరు ప్రాణాలను మింగేస్తూనే వుంది.

భారత్ లోకి చొచ్చుకొచ్చిన కరోనా వైరస్ ఇంకా విస్తరించకుండానే కేంద్ర ప్రభుత్వం ఓ రోజు జనతా కర్ఫ్యూ విధించింది. రవాణా సౌకర్యాలు, దుకాణాలు..అన్నీ బంద్. అందరూ ఇంట్లనే ఉండాలి. జనాల స్వీయ నియంత్రణలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. మర్నాటి నుండే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి లాక్ డౌన్ విధించింది. అదో పరీక్షా కాలమవుతుందని ఎవరూ ఊహించలేదు.

లాక్ డౌన్ అంటే పొద్దంతా బజార్లు బంద్. మెడికల్ తప్ప మిగితా షాపులేవీ తెరువరాదు. కూరగాయలు, అత్యవసర వస్తువులు కొనుక్కునేందుకు రోజూ ఉదయం రెండు గంటల సమయమిచ్చింది. రాత్రంతా పూర్తి కర్ఫ్యూ. ఇళ్లల్లోనే జనాలుండాలి. బయటికి రారాదు. పొద్దున బయటికెళ్లినా నోటికి మాస్క్ ధరించడం తప్పనిసరి. అనవసరంగా బయటికెళ్లిన వారిని పోలీసులు అటకాయించడం. వాహనాల మీద వెల్తూంటే ఆపి జరిమానా విధించడం లేదా వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించడం. బస్సులు, లారీలు, రైళ్లు, విమానాలకు విశ్రాంతి విధించిండ్రు. బడులు, గుడులు మూతి ముడుచుకున్నై. ఫంక్షన్ హాళ్లు బోసిబోయినై. ఉత్సవాలు, పండుగ పబ్బాలు ఇళ్లకే పరిమితం. స్వయం నియంత్రణ పాటించాలని ప్రభుత్వ ప్రచారం. రాత్రి కర్ఫ్యూలో చీమ చిటుక్కుమన్నా పోలీసులు లటుక్కున పట్టుకుంటుండ్రు.

రెక్కాడితే గాని డొక్క కదలని శ్రమ జీవులు, రోజు కూలీలు, వలస కూలీలు, దుకాణాల గుమస్తాలు, షాపింగ్ మాల్, సిన్మా థియేటర్ల సిబ్బందికి నెత్తి మీద గొడ్డలి దెబ్బ పడ్డట్లైంది. ఇదో రకమైన హౌజ్ అరెస్టు. జనాలు చేతులు కట్టుకొని ఇంట్లోనే గడపాలి.

సతీశ్ – మాధవి కడుపుల డప్పులు కొట్టినై. పని లేకుంటే జీతం లేదు. జీతం లేకపపోతే కడుపు నిండదు. కరోనా వైరస్ మాత్రం స్వేచ్చగా విహరిస్తోంది. వేరే పనులేవీ చేసుకునే అవకాశం లేదు. పెద్ద హాస్పిటల్లన్నీ కరోనా పరీక్షల కేంద్రాలైనై. చాలా మంది రోగులను హైద్రాబాదు పెద్దాసుపత్రికి తరలిస్తూంటే, విధిలేక కొందరిని కాటికి పంపాల్సి వస్తుంది.

ఆయోమయంలో అల్లాడుతూ, సతీశ్ షాపింగ్ మాల్ సూపర్వైజర్ కు ఫోన్ చేసిండు. ఆయనది గూడా తన పరిస్థితే ఉన్నట్టుంది. “సతీశ్ భాయ్! రాష్ట్రంల మాల్స్ అన్నీ నోరు మూసుకుంటే మన క్లాత్ మాల్ నోరు తెరుస్తదా..? ఇంట్లనే వుండు రాజాలాగే” తోచినది చెప్పిండు. ఈ లాక్ డౌను ఎప్పుడు పూర్తవుతుందో .? దుకాండ్లు ఎప్పుడు తెరుస్తరో.? ఎన్ని రోజులు పని, జీతం లేకుండా వుండాలె.? మాధవి గర్భవతి. పల్లవి చిన్న పిల్ల. నా అన్న వాళ్లెవ్వరూ లేరు. ముందు ముందు ఎట్లా గడుస్తదో.? ఈ కరోనా మహమ్మారి ఎన్ని ప్రాణాలు మింగేస్తుందో.? ..ఆలోచనలు ప్రశ్నాబాణాలై గుచ్చుకుంటున్నై.

“ ఏందయ్యా! గట్ల బీరిపొయ్యి కూచున్నవు.? దునియాల అందరితోని మనం. మాధవి భుజమ్మీద చెయ్యేసింది. పల్లవీ! నువు నాన్నతోని ఆడుకో..కూతురును తండ్రి మీద కూచోబెట్టి లోపలి కెళ్లి పోయింది.

రోజూ కష్టం చెయ్యడమలవాటైన మనిషి ఏ పనీ లేకుండా వుంటే మెదడులో పురుగులు రెక్కులు విప్పుతై. రామచిలుకను పంచరముల బంధించినట్టవుతది. మూన్నాల్గు రోజులకోకసారి కూరగాయల కోసం ఉదయమే మాస్క్ తోని మార్కెట్ కెల్తున్నడు.

వరుసగా వారం రోజులు చేతులు ముడుచుకుని ఇంట్లో ఉండేసరికి పిచ్చెక్కినట్టైంది. మరో రెండ్రోజులు గడిచే సరికి జైల్లో గడుపుతున్నట్టుంది. పనిచేసిన రోజులు జీతమిచ్చినా, మాధవికి మందులు, ఇంట్లోకి కొన్ని సరుకులు, కరంటు బిల్లు కట్టే సరికి చేతులో పైసల్లేవు. పాల వాడికి డబ్బులివ్వలేదు. కూరగాయల కెళ్లినప్పుడో కో వర్కర్ కలిసిండు. అతని పరిస్థితి గూడా అధ్వాన్నంగా ఉందట. వచ్చిన కొద్దిపాటి జీతం డబ్బుల్లోంచి తల్లితండ్రులకు మందులు కొన్నడట.

“గిట్లైతే ఎట్ల మిత్రమా..సతీశ్ దీనవదనం..?”

“ అంతా దైవాధీనం మిత్రమా! గీ కరోనాను బొందవెట్ట. మనసొంటోల్ల ఉసురువోసుకుంటుంది. ఏం జెయ్యాల్నె

సమఝైతలేదు

“ నేనైతే మన షాపింగ్ మాల్ తెరవగానే కొంత జీతవం అడ్వాన్సు ఇవ్వమని అడుగుత. మనమంతా కలిసి అడుగుదాం. కొద్ది రోజులు ఓర్చుకోక తప్పదు. ఫికరు పడకు” మని తానే ధైర్యం చెప్పిండు.

బోడిగుండు మీద తాటికాయ పడ్డట్టు ప్రభుత్వం లాక్ డౌన్ పొడగించింది. డ్యూటీల వుండంగ వేయించిన సెల్ ఫోను బాలెన్సు సున్నాకొచ్చింది. షాపింగ్ మాల్ మానేజరు హైద్రాబాదులున్నడు. సెల్ ఫోన్ అమ్మాలన్నా కొనేవారు లేరు. ఇంటి యజమాని అద్దె ఇవ్వుమన్నడు. తన పరిస్థితి అంతా చెప్పి, భార్యభర్తలు కలిసి బతిమాలి పండించిండ్రు. పాలవాడు డబ్బులివ్వమని ఒత్తిడి చేస్తున్నడు.

ఇంట్లోని సరుకులన్నీ ఎప్పుడో నిండుకున్నై. ఎప్పుడూ ఊహించని విధంగా ఉపవాస పర్వం ప్రారంభమైంది. తెల్లరేషన్ కార్డు ఉన్న వాళ్లకు ప్రభుత్వం ఉచితంగా బియ్యమిస్తామన్నా అదింకా అమలుకు రాలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదొందల రూపాయలు బాంకు కాతాలో పడ్డట్టుగా మెసేజ్ వచ్చింది. అప్పటికే ఓ రోజు ఉపవాసంతో గడిచింది. మరో రోజు ఎవరో అన్నదానం చేస్తుంటే అక్కడికెళ్లి కడుపు నింపుకున్నరు. తెల్లారి మళ్లీ ఉపవాసం. నాల్గో రోజు మెసేజ్ చూసి వెళ్లి బాంకు లైన్లో నుంచున్నడు. ఉదయం నుంచుంటే సాయంత్రం డబ్బులు చేతికొచ్చినై.

వెంటనే మాధవికి మందులు, ఓ కిలో బియ్యం, కొన్నొ సరుకులు కొన్నడు. మర్నాడు రేషన్ బియ్యమిస్తున్నరు. కార్డులో పల్లవి పేరు చేర్చలేదు. ఆ రోజంతా కాళ్ల నొప్పులు భరించి లైన్లో నుంచుండి ఉచిత బియ్యం తీసుకున్నక ఉచ్ఛ్వాస, నిశ్వాసలు సరియైనవి. అంతకు ముందే పక్కింట్లో చేబదులు తెచ్చిన రెండు శేర్ల బియ్యం తిరిగి ఇచ్చేసిండ్రు.

సెల్ ఫోన్లో పది రూపాయల బాలెన్సు వేయించుకోంగనే మాల్ మేనేజర్ కళ్లల్లో మెరిసిండు. ఆయనను ఫోన్లో సంప్రదించిండు. “గీ లాక్ డౌన్ పొడగింపు మాకు దిన దిన గండమైంది సార్. తినేతందుకేమీ లేదు. ఉపవాసముంటున్నం. దయచేసి ఓ నెల జీతం ఇప్పించండి సార్” దీనంగా బతిమాలిండు.

“వారెవ్వా సతీశూ! మన షాపింగ్ మాలేమన్నా ధర్మ సత్రమా? మాల్ బంద్ అయింది. ముందొచ్చిన లాభం గూబల కొచ్చిందంటా. పని చేయనప్పుడు పైసలెట్లయిస్తరు?చదువుకున్నోనివి, ఆ మాత్రం తెల్వదా? గుర్రుమన్నడు.

“దుకాణం బందున్నా గవర్నమెంటు మాకు జీతాలివ్వమంది గదా మెమెట్లా బతకాలె సార్..?”

“అదంతా మన యాజమాన్యానికెరుక. యాజమాన్యం మాత్రం ఎట్లిస్తుంది.. ? అదేదో గవర్నమెంటే ఇవ్వొచ్చు గదా!”

“మానేజర్లకు జీతమిచ్చిండ్రట కదా సారూ.. ? ”

“మీరు, మానేజరు ఒకటేనా.. ? గుర్రం, గాడిద రెండూ ఒకటేనా.. ? పెట్టెయ్ ఫోన్..కట్…

తలకొట్టేసినట్టైంది. బియ్యం కొద్దిగా వున్నా కూరగాయలకు పైసల్లేవ్. తెలిసిన వాళ్ల దగ్గర చేబదుల్లు చేస్తున్నడు.కారం తోని గడపాల్సి వస్తుంది. సాయంత్రం చాయగూడా బందయింది. డ్యూటీల వున్నప్పుడు మాల్ మానేజర్ చాయ తెప్పించే వాడు.

కాల చక్రంతో పోటీ పడుతూ కరోనా వైరస్ వేగం పెంచింది. రోగులు, మృతులు పెరుగుతున్నరు. ఎంతో మంది క్వారంటైన్లో ఉంటున్నరు. వలస కార్మికుల పరిస్థితి హృదయ విదారకంగా వుంది. పనిలేదు, తిండిలేదు. తమ రాష్ట్రాలకు పంపించుమని ప్రభుత్వాన్ని బతిమాలుతున్నరు. ఉద్యమాలు చేసి దెబ్బలు తింటున్నరు. వందల మంది మరొక దారి లేక కాలినడకన మూటా ముల్లె, భార్యా పిల్లలతో బయలుదేరిండ్రు. వాళ్ల బాధలు వర్ణనాతీతం.

మందులు సరిగగా వాడని కారణంగా మాధవిని బలహీనత ఆవహించింది. ఓ రోజు గడప కాలుకు తట్టుకుని పడిపోయింది. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లిండు. మాధవి అవస్త పడుతూనే వుంది. నొప్పి భరించలేకపోతుందట. ప్రభుత్వాసుపత్రిలో అలస్యమనేది సర్వ సామాన్యము. మాధవి కేకల్ని భరించలేక పోతున్నడు. డాక్టర్ వచ్చి చూసి ఆమెకు అబార్షనైందన్నది. నర్సుకేవో సూచనలిచ్చి వెళ్లిపోయింది.

సతీశ్ గర్భకూహరంలోంచి తీసుకొచ్చిన దుఃఖం కట్టలు తెంచుకుంది. కూతురు నెత్తుకొని వెక్కివెక్కి ఏడ్చిండు. భార్య బాధ అంతా ఇంతా కాదు. ఈసారి కొడుకు పుడితే ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుందామనుకున్న. “మన మీద దేవుడు పగబట్టిండు” గోడు గోడుమంది.

“మాధవీ! మనం మానవ మాత్రులం. ఎప్పుడేది జరగాలెనో అదే జరుగుతుంది. నువ్వు ఏడ్వకు..పల్లవి గుండె వల్గుతది. కాలకూట విషాన్ని గొంతులో అదిమిపెట్టిన పరమ శివుడిలా దుఃఖాన్ని అదిమి పెట్టిండు. భార్యను సముదాయించిండు.

మందులకు, దవాఖాన ఖర్చులకు వెయ్యి రూపాయలు అప్పు చేయక తప్పలేదు. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం బాంకు అకౌంట్ల డబ్బులు వేసింది. ఓ రోజంతా బాంకు లైన్లో నుంచుండి డ్రా చేసిండు. ముందు పాలవాడికి పైసలిచ్చిండు. వెయ్యి అప్పుల నుండి ఐదొందలు తీర్చేసిండు. ప్రభుత్వం వేసిన పదిహేను వందల రూపాయలు అడుగంటినై.

మాధవి వారం రోజుల్లో మామూలు మనిషైంది. పేపర్ చదవాలంటే పక్కింటోల్లను అడగాల్సి వస్తుంది.

ఇంకొక్క రోజైతే రెండవ లాక్ డౌను ముగుస్తుందనుకుంటే కరోనా ధాటికి తట్టుకోలేక సర్కారు మూడో లాక్ డౌను విధించింది. ఇంకెన్నిసార్లు పొడగిస్తారో తెలీదు. అది శ్రమ జీవుల్ని పగబట్టిన పాములా వెంటాడుతుంది. దరిలేని బావిలో పడి కాళ్లూ చేతులు కొట్టుకుంటున్నట్టుంది సతీశ్ కు. ఇంట్ల సరుకులైపోయినై. పస్తుల పర్వం మళ్లీ షురువైంది. ఓ రోజు భారంగా గడిచింది. బాలింత లాంటి మాధవికేమవుతుందోనని సతీశ్ భయం.

“నాకేమీ కాదు. నువ్వేమీ ఫికర్ పడకు”.ఆమెనే ధైర్యం చెప్పింది.

ఓ సేవా సంస్థ పుణ్యాత్ములు గరీబుల ఇంటింటికి రెండు కిలోల బియ్యం, చింతపండు, మిరపకాయలు ఉచితంగా పంచి పెట్టిండ్రు. కష్టాల బాటలున్నప్పుడు కాలం నత్తనడకన నడుస్తుంది. అతి జాగ్రత్తగా వాడుకుంటే అది నాలుగైదు రోజుల ఆకలి మంటల్ని చల్లార్చినై.ఓ సేవా సంస్థ పుణ్యాత్ములు గరీబుల ఇంటింటికి రెండు కిలోల బియ్యం, చింతపండు, మిరపకాయలు ఉచితంగా పంచి పెట్టిండ్రు. కష్టాల బాటలున్నప్పుడు కాలం నత్తనడకన నడుస్తుంది. అతి జాగ్రత్తగా వాడుకుంటే అది నాలుగైదు రోజుల ఆకలి మంటల్ని చల్లార్చినై.ఓ సేవా సంస్థ పుణ్యాత్ములు గరీబుల ఇంటింటికి రెండు కిలోల బియ్యం, చింతపండు, మిరపకాయలు ఉచితంగా పంచి పెట్టిండ్రు. కష్టాల బాటలున్నప్పుడు కాలం నత్తనడకన నడుస్తుంది. అతి జాగ్రత్తగా వాడుకుంటే అది నాలుగైదు రోజుల ఆకలి మంటల్ని చల్లార్చినై.

ఓ సేవా సంస్థ పుణ్యాత్ములు గరీబుల ఇంటింటికి రెండు కిలోల బియ్యం, చింతపండు, మిరపకాయలు ఉచితంగా పంచి పెట్టిండ్రు. కష్టాల బాటలున్నప్పుడు కాలం నత్తనడకన నడుస్తుంది. అతి జాగ్రత్తగా వాడుకుంటే అది నాలుగైదు రోజుల ఆకలి మంటల్ని చల్లార్చినై.

మళ్లీ సుడిగుండముల చిక్కుకున్నట్లైంది. ఇహ ఎవరినడగాలి..?ఎట్లా ఎల్లదియ్యాలె..? మాధవి కంటతడి పెట్టింది. అయినా ఉపవాసం తప్పలేదు. “అమ్మా! ఆకలైతుందే!” అంటూ పల్లవి దీనంగా చూస్తుంటే తల్లిదండ్రుల కడుపులు తరుక్కుపోయినై. ఎవరో పుణ్యాత్ముడు పిల్లలకు బిస్కెట్లు పంచిండు. అదే ఆసరా అయింది చిన్నారి పల్లవికి.

“మాధవీ! మనం బిచ్చగాళ్ల లెక్క ఐపోయినం.” ఎదురుగా నేల మీద కూచున్న భార్య ముందు విచారం వెలిబుచ్చిండు. ఏం జవాబివ్వాలో తోచలేదు మాధవికి.

“సతీశ్! వెంకటేశ్వర్ల గురించి వాసవి క్లబ్ వాళ్లు మనసొంటోళ్లకు ఏవో పంచుతున్నరట. పదా! ” సతీశ్ తోటి సేల్స్ మాన్ వచ్చి తీసెకెళ్లిండు.

మాధవి మనసులో ఆశాదీపం మిణుకు మిణుకుమంది. ఆరిపోకుండా ఆదెన్ని రోజులుంటుందో తెలియదు. శ్రమ జీవి స్వేద బిందువులకు ఖరీదు కట్టే షరాబులెవరో అంతకంటే తెలియదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com