డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి

కథ, నవల, సాహిత్య చరిత్ర, పరిశోధన, విమర్శ, కవిత్వం, ఆత్మకథ, జీవిత చరిత్ర, మోనోగ్రఫ్, సంపాదకత్వం, యాత్రా రచన, పదకోశ నిర్మాణం- ఇన్ని ప్రక్రియలు చేపట్టి అన్ని ప్రక్రియలో విజయం సాధించిన రచయిత్రి ఎవరైనా ఉన్నారా? తెలంగాణ లో గాని, ఉమ్మడి రాష్ట్రంలో గానీ? నాకు తెలిసి ఎవరూ లేరు. ముదిగంటి సుజాతా రెడ్డి తప్ప.

ఈ ప్రక్రియలో ‌ఒకటైన విమర్శ ముఖ్యంగా ప్రాంతీయ అస్తిత్వ వాద విమర్శ ప్రక్రియలో ఆమె ఏమిటో చెప్పమన్నడు జలంధర్ రెడ్డి.

తెలంగాణ అస్తిత్వ దృక్కోణంలో విస్తృతంగా సాహిత్య విమర్శ చేసిన వారు కొద్ది మందే. కె.శ్రీనివాస్, గుడిపాటి సురేంద్ర రాజు, నందిని సిధారెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి- ఇలాంటి వారిలో ముదిగంటి సుజాతారెడ్డి ఒకరు. వీరంతా మలిదశ ఉద్యమ ప్రారంభం నుండీ కృషి చేస్తూ వచ్చినారు. ఈ కృషి సాహిత్య రంగంలో, భావజాల రంగంలో తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదం బలపడటానికి దోహదం చేసింది. ఈ దోహదకారి పాత్రలో భాగంగా, వివిధ విమర్శనా గ్రంథాల ద్వారా అప్పటికే ప్రసిద్ధురాలైన ముదిగంటి సుజాతా రెడ్డి గారు సంపాదకులుగా “ముద్దెర” అనే విమర్శనా గ్రంథాన్ని వెలువరించింది. ఆ దశలో వెలువడిన ‘మత్తడి’, ‘పొక్కిలి’, ‘తెలంగాణ తోవలు’ మాదిరిగా మొత్తం తెలంగాణకు ప్రాతినిధ్య గ్రంథంగా రూపుదిద్దుకోలేకపోయింది. ఆ దశ నాటి ఎన్నో వ్యాసాలను – ఉదాహరణకు ‘పొక్కిలి’ ముందుమాటను చేర్చి , ‘మత్తడి’ ముందు మాటను చేర్చలేదు- ఇందులో చేర్చలేదు. అందువల్ల ఇది ప్రాతినిధ్య గ్రంథంగా రూపొందలేదు. అయినప్పటికీ ఈ కృషి ప్రశంసనీయం.

తెలంగాణ గురించి ఆమె రాసిన వ్యాసాలు ఇంకా ఉన్నవి. కాని అవి అందుబాటులో లేవు. అందువల్ల ఈ ‘ముద్దెర’ పుస్తకంలోని వ్యాసాల ఆధారంగానే ఆమె తెలంగాణ ప్రాంతీయ విమర్శను అంచనా కట్టాలే. ఒక వ్యాసం తెలంగాణా కథ గురించి, ఒకటి తెలంగాణ విమర్శ గురించి, మూడు తెలంగాణ ఉద్యమ నేపథ్యం గురించి.

“అస్తిత్వ వాదం – ఒక ఉపోద్ఘాతం” అనే వ్యాసంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రాంతీయ అస్తిత్వ వాదంగా నిర్ధారించే పని సమర్థవంతంగా చేసింది. ముందు ‘వాదం’ అనే శబ్దాన్నికున్న విస్తృతమైన అర్థాల గురించి, పరిమితమైన గురించి చర్చించింది. తర్వాత ఒక క్రమంలో ఒకే పరిధుల తో వ్యక్తమయ్యే నిర్దిష్ట భావజాలాన్ని కూడా వాదం అని పిలువ వచ్చును.‌ “ఆ నిర్దిష్ట పరిధుల తో అధిక సంఖ్యలో సాహిత్య సృష్టి జరిగినప్పుడు సాహిత్య చరిత్రలో దాన్నొక వాదంగా చెప్పుకోవడంలో ఏం తప్పు లేదు” అని తెలంగాణ ఉద్యమ సాహిత్యాన్ని ఒక వాదంగా Establish చేసింది. తర్వాత దీనికి తెలంగాణ అస్తిత్వ వేదనను జోడించి తెలంగాణ ఉద్యమ సాహిత్యాన్ని “ప్రాంతీయ అస్తిత్వ వాదం” గా ఇలా నిర్ధారించింది.

” చారిత్రక, రాజకీయ, సామాజిక పరిస్థితుల మధ్య పుట్టిన అస్తిత్వ వేదనను అస్తిత్వ వాదంగా పేర్కొనడం లో తప్పులేదు”. సొంత అనుభవాల అనుభూతులు గల భావజాలంతో చారిత్రక సామాజిక పరిస్థితుల నుంచి ఉద్భవించి నిర్దిష్టమైన మార్గంలోనే సాగుతున్నది కాబట్టి దాన్ని సాహిత్యంలో ఒక వాదంగా అస్తిత్వం కోసం ఆవేదన ఆవేశాలతో సాగే వ్యక్తీకరణ కాబట్టి దాన్ని “అస్తిత్వ వాదం” పేరుతో పిలవడంలో అనౌచిత్యమేమీ లేదు. ప్రపంచీకరణను సామ్రాజ్యవాద వ్యతిరేకతల ఈ నేపథ్యంలో దాన్నించి ప్రేరణ ను పొంది ప్రాంతీయ అస్తిత్వ వేదన వ్యక్తమవుతున్నది. కాబట్టి దాన్ని ప్రాంతీయ అస్తిత్వ వాదంగానూ పిలవవచ్చు.

తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమ సాహిత్యాన్ని ఇలా ఒక వాదంగా, ఒక అస్తిత్వ వాదంగా ఆమె ఎందుకు నిర్వచించాల్సి వచ్చింది?

1952 తెలంగాణ ఉద్యమాన్ని, 1969 ఉద్యమాన్ని ఒక చిన్న అలగా, ఒక చిన్న ధోరణిగా చూపించి పక్కకు నూకేసినట్టు 1990 నుంచి సాగిన ఉద్యమాన్ని కూడా కింద బెట్టె కుమెత్తను ఎదుర్కునేందుకే తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఒక “ద్వీప” ఉద్యమ స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న వివిధ అస్తిత్వ ఉద్యమాలతో అనుసంధానించడానికే . దానిని ఉద్వేగ స్థాయి నుంచి తాత్విక స్థాయికి కొంచబోవడానికే. అది అభినందనీయం.

ఈ ఉద్యమం ఎగియడానికి గల క్షేత్ర కారణాలతో పాటు అంతర్జాతీయ కారణాలను పేర్కొని ఈ ఉద్యమాన్ని స్థానిక పరిధిలో ఉంచుతూనే అంతర్జాతీయ పరిణామాలతో అనుసంధానం చేయడం ద్వారా దాని ద్వీపా పరిధిని బద్దలు చేసింది. అభినందనీయమే కదా…!

తెలంగాణ ఉద్యమానికి నేపథ్యంగా స్థానిక కారణాలకు తోడుగా అంతర్జాతీయ కారణాలు కూడా ఎలా ఉన్నవో ఇలా సమర్థవంతంగా విశ్లేషించింది. ” ప్రపంచీకరణతో సామ్రాజ్యవాదులు మార్కెట్ సంస్కృతితో అనేక దేశాల జాతుల భాషలకు, సంస్కృతులకు ముప్పు ప్రారంభమైంది. తమ భాష సంస్కృతులను, ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం మేల్కొంది. ప్రపంచీకరణ వల్ల కలిగే వేదన నేపథ్యంలో ఈ ప్రాంతీయ వివక్ష, ఉపేక్షలు, దోపిడీలు, అన్యాయాలు బాగా అర్థమయ్యే పరిస్థితి ఏర్పడింది.

దీనినే మరింత వివరంగా “ప్రపంచీకరణ -వ్యాపార యుగం+ అత్యాధునిక ధోరణులు” అనే వ్యాసం ఇలా విశ్లేషించింది. తమ అస్తిత్వం సామ్రాజ్యాధిపతుల సంస్కృతిలో విలీనమై లుప్తమైపోతుందన్న వేదన ,బాధ, భయం ఆవరిస్తున్నాయి. ఆ ఆవేదన నుంచే తమ అస్తిత్వాన్ని అస్మిత ప్రకటించే సాహిత్యం వస్తున్నది. ప్రాంతీయ చైతన్యం జాగృతమవుతున్నది. ప్రతి ప్రాంతం దేశం తమ భాష యాసల్లో సంస్కృతి ఈ నేపథ్యంలో తమ మూలాలను, ఉనికిని, బాధలను, వేదనలను చాటుకుంటున్నాయి. అనుభవంలోని జీవితాన్ని రాయాలా అనేసరికి రచయితల్లో ప్రాంతీయతా ముద్ర తప్పనిసరి అయింది.

ఈ అభిప్రాయాన్నే ఇంకో రకంగా ఇలా వ్యక్తం చేసింది.

ఇదే వ్యాసంలో “1952, 1956, 1969 లోని నిరసనలు సాహిత్యంలో అలజడిని సృష్టించలేదు” అన్నది ఒక మేరకు సరైన అబ్జర్వేషన్. మలిదశ చైతన్య స్థాయి నుండి చేసిన ఈ విమర్శలో గుర్తించదగిన అంశం బలంగానే ఉంది. పోస్ట్ మాడర్నిజం ప్రభావంతో తెలంగాణ ఉద్యమంలో విద్యావంతుల మీద పోస్ట్ మాడర్నిజం ప్రభావం లేదని కొందరంటారు. అలాంటి పుస్తకాలేవీ వీరు చదవలేదని, చదవనప్పుడు ప్రభావమెలా ఉంటుందన్నది ఈ కొందరి ప్రశ్న. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరిగిన స్త్రీవాద, ప్రకృతి పరిరక్షణ లాంటి వర్గేతర పోస్ట్ మోడర్నిస్టు ఉద్యమాలు తెలుగు సమాజం మీద సాహిత్యం మీద ప్రభావం చూపించిన అని ఇక్కడ గుర్తుంచుకోవాలె. తెలంగాణ ప్రగతిశీల సాహితీవేత్తలు మలిదశ ఉద్యమం వెంట ఉన్నరు. ఇలాంటి పరిస్థితి పైన పేర్కొన్న ఉద్యమాల కాలం నాడు లేదు అనేది గమనించవలసిన అంశం.

” సామ్రాజ్య వ్యతిరేకత లో భాగమే అస్తిత్వవాదం” అనే వ్యాసంలో కూడా తెలంగాణ అస్తిత్వోద్యమ నేపథ్యం గురించి చర్చించింది. ఎవరూ గుర్తించని ఒక అంశాన్ని ఇలా చెప్పింది. “1990 దశకారంభంలో సోవియట్ యూనియన్ నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ మొదలైన ప్రాంతాలు విడిపోయి స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి. రాజకీయార్థిక సిద్ధాంతాల బలం కన్నా, జాతీయ భావం భాష సంస్కృతుల మీద, ఒక ప్రాంతం ప్రజల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని దీని వల్ల తెలిసింది. ఇలాంటివే తెలంగాణ అస్తిత్వోద్యమం అని ఆమె ఉద్దేశం. ఈ దృక్కోణం నుంచే ఆమె ఈ రెండు వ్యాసాల్లో తెలంగాణ కవిత్వాన్ని విపులంగా వ్యాఖ్యానించింది.

” తెలంగాణ సాహిత్య విమర్శ లో ‘తోవలు’ అనే వ్యాసంలో తెలంగాణ సాహిత్య విమర్శ వికాసాన్ని ప్రాచీన కాలం నుంచి 2005 వరకు విహంగ వీక్షణం చేసింది. కాని పరిశోధన చేసి రాసింది కాదు కాబట్టి సహజంగానే కొన్ని పొరపాట్లు దొర్లినవి. ఒకటి -మల్లియరేచన రచన అయిన ‘కవి జనాశ్రయాన్ని’ వేములవాడ భీమకవిదని చెప్పడం. రెండవది- “ఆధునిక కాలంలో కి వస్తే 1950 దశకం నుంచి తెలంగాణలో సాహిత్య విమర్శ ప్రారంభమై వికసించింది” అనడం. అసలైతే 20 శతాబ్ది తొలి రెండు దశాబ్దాల లోనే తెలంగాణ సాహిత్య విమర్శ ప్రారంభమైంది. సరే ఇలాంటి పరిమితులున్నా, తొలి దశ ప్రయత్నం కనుక ప్రశంసించదగిన వ్యాసం ఇది. ఇది అసలైతే తెలంగాణ తోవలు(2001) తొలి ప్రయత్నం. దీన్ని ప్రస్తావించింది గాని దానిలోని ప్రధాన అంశాల్ని ప్రస్తావిస్తే బాగుండేది.

దానినలా ఉంచితే, అక్కడ్నించి 2005 వరకు గల విమర్శను బాగా ఫోకస్ చేసింది. దానిలో భాగంగా కొలుసు ప్రతాపరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, బి.ఎస్ రాములు గార్ల contribution ను బాగా పట్టుకుంది.

తెలంగాణ కథ మీద బాగా పట్టు ఉన్న విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్, ముదిగంటి సుజాతా రెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, గుడిపాటి, ఆడెపు లక్ష్మీపతి తదితరులు. సుజాతా రెడ్డి గారి ఈ సాధికారతకు “తొలితరం తెలంగాణ పునర్నిర్మాణం” అనే వ్యాసం ప్రబల నిదర్శనం. ఇందులో చాలా విలువైన సమాచారం, ప్రతిపాదనలన్నవి.

కేవలం తెలంగాణ కథలతో వచ్చిన మొదటి సంకలనం ఆమె సంకలనం చేసిన “తెలంగాణ తొలితరం కథలు (2002)”. అదే సంవత్సరంలో ‘మత్తడి’ రావడం యాదృచ్ఛికం కాదు. తెలంగాణ సాహితీవేత్తలందరిలో ఏకకాలంలో మసలుతున్న అస్తిత్వ ప్రకటన ఉద్వేగానికి గుర్తు.

సంగిశెట్టి ” దస్త్రమ్” చూసి చాలా కథలను మిస్ అయినాయని గుర్తించడం, సంగిశెట్టి తో కలిసి “తొలినాటి కథలు” వేయడం ఆమె నిజాయితీకి గుర్తు.

ఈ రెండు సంకలనాల్లోని కథనాధారం చేసుకొని ఆనాటి కథల స్వభావాన్ని ఇలా అద్భుతంగా వ్యక్తం చేసింది. ” కాల్పనిక వాదం చేత ప్రభావితం అయిన కొందరు రచయితలను తప్పిస్తే మిగతా రచయితలందరూ ఉద్యమాలలో ఎదిగిన వాళ్లే. ఉద్యమాల ప్రభావం గల రచయితలు తమ కథలకు ఆధారంగా సత్య సంఘటనలను తీసుకున్నారు. ప్రజల నోళ్లలో ఆడే భాషనూ, నుడికారాలను తీసుకున్నారు. దాని చేత వాళ్ల కథల్లో మౌలికత కన్పిస్తుంది. కొత్తదనం గుబాళిస్తుంది. శిల్పంలో, కథనంలో వైవిద్యం అగుపడుతుంది. వీటన్నిటితో తెలంగాణ కథ ప్రధాన రహదారి నుంచి వైదొలిగిన ఏవాన్ గార్డ్ లక్షణంతో అపురూపంగా, అద్వితీయంగా ఉంటున్నది. తెలంగాణ కథలు వాస్తవికత పేరుతో చేంతాడంత కథనంతో కథలు నడపడం ఉండదు. సుదీర్ఘమైన అనవసరమైన వర్ణనలు ఉండవు. పాఠకుల మెదడుకు పని పెడుతూ ధ్వన్యాత్మకంగా ఉంటాయి. వస్తు ధ్వనిని పాటించారు. కథ అంటే కవిత్వంలో లాగా పాఠకుల ఊహకు పనేది ఉండదనే శిల్పానికి అలవాటుపడే వాళ్ళకు వస్తు ధ్వనితో కూడిన తెలంగాణ కథలు అసంపూర్ణంగా, శిల్పం లోపించినట్లుగా కనబడవచ్చును. కానీ తెలంగాణ కథల్లో జీవకళ ఉట్టిపడ్తుంది. ఆమె దృష్టి నైశిత్యాన్ని వెల్లడి చేసే రెండు మూడాంశాలు దీనిలో ఉన్నవి. కోస్తాంధ్రలో మాదిరిగా వ్యవహారిక భాషోద్యమం అవసరం లేకుండానే, ఆ బాధ ఏది లేకుండానే ఇక్కడి రచయితలు వ్యవహారిక భాష వైపు పయనించారన్నది ఒకటి. ఉద్యమం, రచయిత ఇక్కడి నుంచి పుట్టడం అందుకు కారణం. వాస్తవికత పునాదిగా వచ్చిన కథలకు వర్ణ న వాతావరణ కల్పనకే పరిమితమవుతుంది. కాల్పనికత పునాది ఉన్న కథల్లోనే వర్ణణ అధికంగా ఉంటుందన్నది రెండోది. వస్తు రూపాలు విడదీయలేనంతగా ఐక్యం చెందినప్పుడు శిల్పం ప్రత్యేకంగా కనబడదన్నది మూడోది.

ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం తెలంగాణ కథ మంచం పట్టటానికి హేతుబద్ధమైన కారణాల్ని చెప్పింది.

“1956 తర్వాత తెలంగాణ కథలు మరుగున పడిపోయాయి. తెలంగాణ కథకుల అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రామాణిక భాష పేరుతో ప్రాంతీయ భాషలు, నుడికారాన్ని ఆదరించకపోవడం చేతనే జీవద్భాష ప్రజల భాషలో వ్రాసే తెలంగాణ కథకులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

పరాయీకరణకి తెలంగాణ నుడికారం గురి అయింది. దాంతో తెలంగాణ రచయితలు తమ సృజనాత్మకతను కోల్పోయి మౌనంగా ఉండే పరిస్థితులేర్పడినాయి.

సుజాతా రెడ్డి గారి బహుముఖ ప్రతిభకు ఒకానొక గీటురాయి ఈ “ముద్దెర” పుస్తకమూ ఇందులోని ఆమె వ్యాసపరంపర.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com