పోలీసు పటేలగు రామిరెడ్డి గ్రామ చావడిపై కూర్చొని యుండెను. అతడేదో తొందర పనిచే మనో వైకల్యము గల వాని వలె గన్పట్టు చుండెను. రామిరెడ్డి గ్రామము నందు పలుకుబడిగల రెడ్డి కుటుంబమున జన్మించెను. ఈతనికి సుమారు రెండు వందల ఎకరముల భూమి గలదు. దీనివలన సంవత్సరమునకు ఇంచుమించు యెదారు వందల యాదాయము వచ్చును. మన రెడ్డి గారికి తెనుగు నందును, ఉరుదూ భాష యందును కొంత జ్ఞానము కలదు. ఐనను వాక్పటిమలో నీతని సరిపోలు పోలీసు పటేండ్లు అరుదుగా నుందురు. గ్రామములో ఒకనితో నింకొకనికి కలహములు కలిగించుట యందీతనికి పెట్టినది పేరు. గ్రామములో రెడ్డి గారిని మనసార దూషించని వారు లేరని చెప్పిన తప్పు కాదు. ఐనను వీరికి జంకియో లేక వారితో నేదేని పని గలుగుననియో అందరును వీరిని గౌరవ భక్తులతో జూతురు. రెడ్డి గారితో కించిద్విరోధ మెవరికైన గలగెనా నాతడు అచటి నుండి వేరొక గ్రామమునకు లేచి పోవలసినదే. లేనిచో నాతడు కష్ట నష్టములకు పాలగుటయే గాక కొద్ది దినములలోనే యేదేని నేరము క్రింద న్యాయస్థానమున కీడ్వబడి నేరారోపితుడై శిక్షకు పాత్రుడైన కావలయును. లేదా దుండుగుల పాలై “అన్నమో రామచంద్రా” యను సప్తాక్షరి మంత్రోపాసన నైనను చేయవలయును. ఈ కారణము వలననే చండశాసనుడగు రామిరెడ్డిగా రనిన గ్రామ ప్రజలకు భయము.

రామిరెడ్డి గారి కత్యవసరమైన కార్యముపై మూడామడ దూరముపై నున్న యతని బంధువుని యింటికి యుత్తరము పంపవలసి యుండెను. తలారిని యూరివంతు మాదిగను పిలుచుకొని వచ్చుటకై పంపెను. కాని తలారి రిక్త హస్తములతో వచ్చి వంతు మాదిగవానికీ రోజు ఆవశ్యక కార్యము కలుగుటచే రా జాలననెనని రెడ్డిగారితో నుడివెను. ఇది వినగానే రెడ్డిగారు తోకదొక్కిన కాల భుజంగము వలె క్రుద్దుడై ఏమి! వంతు మాదిగకు ఆవశ్యకమైన పని గలదా! నా పని ఎవ్వరు చేయుదురు. నీ తాతనా లేక నీ ముత్తాతనా? నీకు బుది లేదు. తుచ్చుడగు మాదిగ వానిని పిలుచుకొని రాక యింకను సిగ్గు లేక నాతో చెప్పుచున్నావా? నీ కింతయైనను సత్తువ లేదా యనుచు పాదమున నున్న చెప్పునూడదీసి తలారిని కోపమడుగు వరకు మోది ఐదు నిముషములలో మాదిగవాడు రాకున్న నీ ప్రాణముల తీసెదనని బెదరించెను. తలారియు పటేలు గారి ప్రతాప మెరిగిన వాడగుటచే కిక్కురుమనక మాదిగవాడ దారిబట్టెను. పటేలు గారికి కోదముడుగక యిట్లు తిట్ట నారంభించెను. ఏమి, మాదిగ వాని కావశ్యక కార్యమా! ఇకుడ సర్కారు పని నెవ్వరు చేతురని తలచెనో, నేడు రేపటి కాలమే మారినది. మాదిగలకు గూడ కనులు నెతికెక్కి క్రిందు మీదు కానరాకుండ నైనవి. రేపే వీరిపని పట్టించెదను. ఈ సారి వీరి మాన్యమును చేయించకున్న నేను రామిరెడ్డినే కాను ఇప్పుడదేమి విచిత్ర కాలమో కాని సర్కారనిన అందరికి నిరక్ష్యమే కలిగినది. పాపము వారి నెందుకు కష్టపెట్టవలెనని దయదలచిన వారు నెత్తికెక్కిపోవుచున్నారు. అందుకనే పెద్దలు చెప్పుతో నలుగ రాచవలయునని చెప్పిరి. వెట్టంటే వీరికి కష్టమట. వీరిని ఊళ్ళో ఉండనిచ్చిన దెందుకో, వీరికి రైతులతో బిచ్చము బలిపెట్టించే దెందుకో – ఇంట్లో కూర్చొని దొరల వలె తినుటకు కాబోలు. ఇక నా ప్రతాపమును చూపింతును. వీరల కొంపలు నాశనము చేతును. ఎవ్వరడ్డము వచ్చెదరో చూచెదను కాక.

కార్తీక మాసము ఆరు నెలలు కష్టపడి గింజలు పండించుకొని నాలుగు అయిదు నెలల వరకు కలియో గంజియో త్రాగుదుమని యువ్విళ్ళూరుచు పండించిన ధాన్యపు కుప్పలను కొట్టుకొను సమయము. బొక్కెనలకు తొండము లిచ్చి, వ్యవసాయమునకు కావలసిన యితర పరికరముల నొసగి మీదు మిక్కిలి భూభామందుతో కలిసి రాత్రింబగళ్ళు పనిచేసిన వెట్టి ఫలితమిపుడే తేలగలదు. ఆ దినమున మాదిగ మల్లడు వంతు పోవలసి యుండెను. కాని నాడే అతడు వెట్టిచేసిన భూఖామందు కుప్పలు కొట్టుచుండెను. అందుచే మల్లడు సంకటమున చిక్కెను. ఒకవేళ వెట్టిపనికి పోయినచో గవ్వ లాభముండక పోవుటయే గాక రావలసిన బిచ్చములో తచ్చగును. వెట్టి మానినచో పాషాణ హృదయుడగు పటేలు గారి క్రోధాగ్నికింధనము నగుదునను జంకు – ఇట్లు చింతించుచు పటేలు గారిని బ్రతిమాలు కొని నేటికింకొకరిని తోలుట కొప్పించుటకై పటేలు గారి సన్నిధానమునకు పోవుటకై ప్రయాణమయ్యెను. ఇంతలోనే తలారి కోపఘర్ణిత నయనములతో వచ్చి మల్లనిని తిట్టుచు కొట్టుచు పటేలు గారి కడ కీడ్చుకొని పోజొచ్చెను. అధైర్యుడును, న్యాయశాస్త్రమననేమో నెరుగనట్టియు మన మల్లడు యెవరి ధైర్యము చూచుకొని తలారి నెదిరింపగలదు? పటేలు గారు యితనిని చూచుటయే తడవుగ చేతిలోని కట్టును సవరించుకొని మల్లనిపై బడెను. మల్లడేమైన మరల కొట్టగలడాయను ధైర్యముతో నతడు చేతులు నొప్పి యెత్తువరకు మర్దించెను. ఎంత కొట్టినను మల్లడు నోరైన యెత్తలేదు. తుదకు మల్లడు దెబ్బల కాగలేక స్పృహతప్పి పడిపోయెను. నెత్తి పైన బలమగు గాయము తగిలెను. నెత్తురు వరదలై ప్రవహింప దొడగెను. నెత్తురును కనుల చూచిన తోడనే పటేలు గారి కోపము శాంతించెను. అంత నాతడు తలారితో తన భృత్యుల నిద్దరిని బిలిపించి మల్లనిని యింటివద్ద విడిచి రమ్మనెను. వారును శవాకారముగా నున్న నాతనిని యింటికి కొనిపోయిరి. సుమారైదారు నెలల వరకును మల్లడు వ్యాధిపీడుతుడై కూర్చున్న చోట నుండి లేవలేని వాడై పడియుండెను. ఇన్ని దినములును తిన తిండిలేక, కట్టబట్టలేక ఆలుబిడ్డలు కృశించి యుండిరి. ఇది యంతము కనులార జూచు చుండెడి పటేలుగారొక కాని సహాయమైనను చేయలేదు. రామిరెడ్డి ఎంత కఠినాత్ముడో పాఠకులే గ్రహించవలెను – ఇట్టి పటేండ్లు దేశము నందింకెంత మంది గలరో యూహించుకొనుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com