విషాదం నెమరువేస్తూ

బిల్లా మహేందర్ సంపాదకత్వంలో వెలువడిన వలస దుఃఖం కవితా సంకలనం కరోనా విషాదాన్ని కళ్ళముందుంచింది. నూటా పది మంది దుఖం నెమరువేత ఈ సంకలనం లో చోటు చేసుకొంది.

ఒక అప్రాణి, జృంభణం ప్రపంచపు మనిషిని కుదేలు చేస్తున్నది.

ఏలికలు, పాలితులు, మేధావులు, కవులు ఇట్లా ఏ బేధం లేకుండా కరోనా అందరినీ దురాక్రమిస్తున్నది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వాలు అనివార్యంగా లాక్ డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. దీని వల్ల రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు అర్థాకలితో మాడవలసిన దుస్థితి దాపురించింది. దేశ సంపదను పెంచే వలస కార్మికులు నిర్మాణ రంగం కుదేలు కావడంతో వివరించలేని దైన్యాన్ని ఎదుర్కొన్నారు. భవిష్యత్తు అంధకారమైంది. దేశ జనాభాలో 20 కోట్ల మంది  అంటే జనాభాలో 15 శాతం మంది వలస కార్మికులు సుడిగాలిలో ఎగిరే ఆకుల తీరుగ విలవిల లాడినయి. వలస కార్మికులు తమ స్వేద జలంతో పునాదులు తవ్వి నిర్మించిన ఆకాశ హార్మ్యాలు మౌనంగా ఉండిపోయినవి. చివరికి వలస కార్మికులు చావైనా బతుకైనా తమ ఊరిలోనే అని భావించి సుదీర్ఘమైన నడక మొదలుపెట్టారు. కరోనా సర్ప భయంతో తమ ఇళ్ళకే పరిమితమైన భద్రజీవులు సానుభూతితో తమకు తోచిన సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టారు. టి.వి.తెరలు వలస దుఃఖాని కంటే ఆ సంక్షేమానికే ఎక్కువ ప్రచారం కల్పించారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో వెలువడిన సంకలనం ఇది. ఈ సంకలనంలో మూడు ప్రధానాంశాలు కనిపిస్తాయి.

  • వలస జీవుల దైన్యంపై సానుభూతి
  • కరోనా భయం వల్ల ఒదిగిపోయిన మానవ సమాజంపై సానుభూతి
  • ఒక మనిషి ఆర్థిక సహాయం చేసే స్థితి, మరొకడు అది అబగా అందుకునే స్థతి ఉన్న ఈ వ్యవస్థ బలహీనతని ఆక్షేపించడం.

సంకలనంలో చేయి దిరిగిన కవులున్నారు. ప్రవర్థమాన కవులూ ఉన్నారు. వీళ్ళందరి మేలిక లక్ష్యం కరోనా ప్రభావాన్ని చిత్రించడం, నిరసించడమే.

కవి, కన్న ఊరి సముద్రాన్ని చేరడానికి కదిలి పోతున్న దుఃఖ నదిని చూసి (వేణు గోపాల్ ) విచలిస్తాడు.

అక్కడేమీ విస్తళ్ళలో జీవితం వేడి వేడిగా పొగలు కక్కదు(ప్రసాద మూర్తి) అంటూ ఊరు చేరినాక ఉన్న దైన్య స్థితిన తలచుకొంటాడు.

గుప్పెడు బువ్వ, బుక్కెడు నీళ్ళు  ప్రతినోటటికి ఇవ్వగల దేశంలో, కుప్పలెయ్యడంలో మార్పు రావాలంతే(కట్టా శ్రీనివాసు) అని అభిలాషించాడు. ఈ వలసలు నమ్మకాలను బతుకును పుష్పించే నూతన ప్రపంచపు కొత్త విత్తనాలవుతారని (కొమ్మవరపు విల్సన్ రావు)  అభిలాషించాడు. ఈ దేశ భక్తికి చెమట చుక్కంత మానవత్వం లేదు(వడ్డెబోయిన శ్రీనివాస్) అని నిట్టూర్చాడు.

బొబ్బులు బొబ్బులయిన కూలి బతుకుల ఆకరి శ్వాసలు నిలిచేటట్టు లేవు. నడక..నడక..(పత్తిపాక మోహన్) అని ఆవేదన చెందాడు.

సాహిత్యం సమకాలీన సామాజిక ప్రతిఫలను అనే లక్ష్యాన్ని పూర్తిగా నెరవేర్చింది ఈ సంకలనం. దీనికి గౌరవ సంపాదకులుగా డా.ఏరుకొండ నరసింహుడు వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com