కాళ్ళు జాపుకొని నాత్రి
గుర్రు కొడుతుండగా లేసేది
పచ్చులు లేవకముందే రెక్కలడిస్తూ…
వట్టి చాపల గంప నెత్తుకొని పిల్లబాట తీసేది
నీడలు నిన్నటివి మొన్నటివి
ఏండ్ల కితం నీడలు
అమ్మెంట నడుస్తూ మాట్లాడేవి
బర్లని మేకల్ని అల్లిచ్చిందాయే దుఃఖాన్ని కూడా అల్లిచ్చేది
పెద్దబోయి ఇల్లు అని ఇస్తే పెద్దబాయిల పడేసినట్టు అయింది
దాసింది లేదు తీసింది లేదు
మెడల నల్లపూస లేదు
పతానం నాటి నల్లపోచెక్క తప్ప
చాపలు జెన ఇడిసినట్టు
బాదలు జెన ఇడిసినయి
గుండె సెడని యుద్ధ భూమి
ఆమె అంతరం
అరికాళ్ళ కింద నేల
మాడమీద ఆకాశం
మోస్తూ నడుస్తూ ఆమె
ఆగని తెడ
అమ్మ బాదల్ని
ఎన్ని చాపలు మొసినయె
ఎన్ని చెర్లు అలుగెల్లినయె
ఎంత చీకట్లోనయినా
వెలుగులోనే నడిచేది
ఎట్ల ఈదిందో గాని
సంసారం సాలమ్మ
చెక్కుడు సంచి చేదబాయి
చేతిలోకి పైస రాదు
బొకెండ్లోకి నీళ్ళు రావు
కాగులో ఏమి లేకపోయినా
కరువుని కడుపులో దాసుకుంది
ఊరుమీద ఉరిమై ఉరుముతుంటే
మెఖం మొఖం తిప్పుకొనిపోయేది
చేను, చెరువు ఎంటపడి
పరకకు పరిగకు
పడిగాపులు గాస్తే
కన్నీళ్ళు ఇంకిన నిశబ్దమే
కోయిల పాడుతుంటే
ఋతువు మధురంగా ఉంటదనుకుంది
కన్నీళ్ళు తాగే మాయకాలమనుకోలేదు
ఎన్ని ఊర్శు, ఎన్ని అంగళ్ళు
గుండే మారెసరుముంతై
అమ్మే ఆరబెట్టిన పటువై
కుతకుత ఉడుకుతు వచ్చేది
సాలమ్మొ సముద్రమో
ఎన్ని తుఫాన్లని
తుమిస్కలని చేసింది
ఆమె ఆమెని మాలోనే చూసుకునేది అట్ల అమ్మకు మేము ఏడు నిలువుటద్దాలము
అమ్మ మాలోకి చూసినపుడు చెమటలు పట్టిన ఆమె మొఖం సెంద్రకాంతిలా మెరిసేది
అమ్మ నీడనే సెట్లు సేదతీరేయి
దీపం ఉండేది
కాని అమ్మ వచ్చినంగనే వెలుగొచ్చేది
గొంతు పొరబోయినపుడు
పడమటి గోడపై
అమ్మ మొఖం కనిపిస్తుంది