ఆ బాలభానుడితో పోటీ పడుతూ

ఉషోదయపు రాకకు మునుపే

మేల్కలుపు ఉత్తేజాన్ని ఊపిరి చేసుకొని

ఇల్లు వాకిలి శుభ్రపరిచి

కళ్లాపి రంగవల్లులు ముగించుకొని

వంట వార్పు ఆరంభిస్తుంది!

భర్త పిల్లల బాగోగులు చూస్తూ గబగబా బాక్సులు సర్థుతుంది

ఇంటిల్లపాది ఆకలిని తీర్చే ధ్యాసలో

తన ఆకలినే అంకితమిస్తుంది!

బ్యాగును భుజానికి వేలాడ దీసి

బస్సుకై పరుగులు పెడుతుంది

కిక్కిరిసిన బస్సులో

వెక్కిలి చూపుల మధ్య ఓర్పుగా తీరం చేరుతుంది!

బడిలోని పిల్లలకు తన కన్నపిల్లల్లా

విద్యా బుద్దులు చెప్తుంది!

సహనశీలియను బిరుదును మోస్తుంది కాబట్టి

అదనపు బాధ్యతలను కూడా అతికించుకుంటుంది!

అసమానతలకు గురౌతున్న

అణచివేతలకు పరాకాష్ట అవుతున్నా

పట్టు వదలని కృషితో

విధి నిర్వహణలో జాబిలై తళుకులీనుతుంది!

పునరుత్తేజంతో

మళ్లీ రోజువారీ పనుల బాట పడుతుంది!

అలసటను ఆత్మవిశ్వాసంతో సేదరీరుస్తుంది!

సమస్యల వలయాన్ని సమయస్ఫూర్తితో చేధిస్తుంది!

నిర్విరామ పరిశ్రమతో

నిరంతరం అలుపెరుగని పయనం చేస్తూనే ఉంటుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com