మెల్లమెల్లంగ మాపటేలకాంగనే

వాడకట్టు పిల్లగాండ్లందరికీ

సక్కని సోపతై ముచ్చటవెట్టుతూ

నీడనిచ్చే పొదరిల్లయ్యేది మా పెరటిచెట్టు!

సీకటమ్మ తలుపులు గట్టిగా బిడాయించంగనే

తెల్ల ఎలుగులు తొంగిసూడంగనే

పొద్దుపొడుపు తంగేడుపువ్వై పుయ్యంగనే

మా గడుగ్గాయిలందరికీ

తానాల కొలనయ్యేది!

నేలంతా గరమెక్కే ఏళ

ఎండకాలపు కాలచ్చేపంలో

మా నానమ్మ నోటిలో కథల కుటీరమయ్యేది!

నులకమంచంలో పగటినిద్రకు పానుపయ్యేది!!

ఐతారపు ఆటవిడుపులో

మా బొమ్మరిల్లులకు ఆసరా అయ్యేది!

మా కిలకిల నవ్వులను సూసి తెగ మురిసిపోయేది!!

సలికాలంల

తన చిగురుటాకులతో

మా బగోన్ల పుల్లని పప్పయ్యేది!

ఓనగాయలనిచ్చి కమ్మటిరుచులతో

నాలుకతో దోస్తీకట్టేది!

పచ్చిచింతకాయ మెరుగుపులుసై

నోరూరించేది!

మార్గశిరపు చూపులు ముద్దుగ గిచ్చంగనే

మా జాడీలో తొక్కుగా ఫక్కుననవ్వేది!

సూరీడు

మబ్బులసాటుకు మాయమైతుంటే

పొద్దుగూకినంక

అలసిన పక్షులకు నెలవయ్యేది!

నిద్దురవోక మారాంశేసే చిన్నోళ్లకు

అమ్మచెప్పే దయ్యమై భయపెట్టేది!

నీల్లోసుకున్న మా సుట్టపోళ్లందరికీ

నోరూరే పులిహోరై

కడుపునింపేది!

మా పెరడుకు పెద్ద దిక్కై

మా కుటుంబానికి ఆకలితీర్చే అన్నపూర్ణై

మా బతుకున పున్నమి ఎన్నెలయ్యేది!

మాకు శుభకామనలిచ్చే

పెద్ద ముత్తైదువయ్యేది!

మా గుబురు చింతచెట్టు!!

ఇప్పుడు

ఏడున్నదోగాని కంటికైతే కానరాదు!

సిమెంటుగోడల సమ్మెటపోటుకు

బలైందేమో!

భవంతుల పునాదుల్లో కనుమరుగైందేమో!

ఆ..చెట్టూ లేదూ ఆనాటి ఆప్యాయతలూ లేవు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com