డా. సి. భవానీదేవి

మానవ సంబంధాల్లోని అనివార్యతను చిత్రించే కథ…

“ సుజాతా! సుజాతా!” హడావుడిగా లోపలికి వస్తూనే పిలుస్తున్నాడు శంకరం

వంటింట్లో పనిలో ఉన్న సుజాత భర్త కేకలు విని హాల్లోకి వస్తూ

“ ఏంటండీ అంతా హడావుడి। తిరగమోత మాడిపోతుంటే..” చిరుకోపం ప్రదర్శించింది .

“ అలా అంటే ఎలానోయ్ ! ఇంక నువ్వు సర్దుకోవటం మొదలుపెట్టాలి” హుషారుగా

అన్నాడు.

“ ఎక్కడికి.. ఓ .. టిక్కెట్స్ వస్తున్నాయా!. ఎటూ వీసా వచ్చిందిగా “కొడుకు దగ్గరికి వెళ్లబోతున్నానన్న ఆనందం సుజాత కళ్ళనిండా పొంగిపొరలుతోంది .

“ అదే మరి. అందుకే ఇంత హడావుడి.. ఎదురుచూస్తున్నావుగా.. వచ్చేశాయి. సారధి

“ నీ కొడుకు టిక్కెట్స్ పంపాడు. మన ప్రయాణానికి ఇంకా రెండు నెలలే ఉంది. కొడుక్కి, కోడలికి, మనవాళ్ళకి ఏమేమి తీసుకెళ్లాలో లిస్ట్ చేసుకుని సర్దుకోవటం మొదలుపెట్టు మరి ”

“ ఇంట్లో ఉన్నవి సర్దుకోవటం ఎంతసేపని. సాయంత్రం ఆ పెద్ద సూట్ కేసులు కిందకి దించండి. ఒకసారి జిప్ లు చెక్ చేస్తాను. ఇంకా చాలా షాపింగ్ పనులున్నాయి. “ అన్నది సుజాత మురిసిపోతూ. కొడుకు మీద ప్రేమతో కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి.

“ వాడికీ కోడలికీ ఇష్టమయిన స్వీట్స్.. అవీ వెళ్ళే ముందురోజు కొందాము. అసలే ఆ పిల్ల వట్టిమనిషి కూడా కాదు. రాత్రికి వాడు ఫోన్ చేసినప్పుడు అడుగు. ఇక్కడినుంచి ఏమేమి కావాలో చెప్పమని “

“అదా .. మనకేం కొత్త కాదుగా.. ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్లలేదు.. అన్నీ నేను చూసుకుంటానుగానీ మీరు మనిద్దరికి ఆరు నెలలకు మందులు తీసుకోండి. ఒకసారి ఇద్దరం జనరల్ చెక్ అప్ చేయించుకుందాము. అక్కడికి వెళ్ళి జబ్బు పడితే వాడికి ఇబ్బంది. పైగా మనకి ఇన్షూరెన్స్ సౌకర్యం కూడా ఉండదు. “

ఆలోచనగా అంటున్న సుజాత కేసి సానుభూతిగా చూశాడు శంకరం

కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగంలో ప్రవేశించినప్పటి ఉత్సాహం ఇప్పుడు తమ ఇద్దరిలో తగ్గిపోయిందని ఇద్దరికీ తెలుస్తూనే ఉంది. సారధి అమెరికా వెళ్ళినప్పుడు తొలిరోజుల్లో సుజాత బంధువులందరికీ పార్టీ ఇచ్చి ఎంత సంబరపడిపోయిందో ! ఇప్పటికీ ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి.

“ఎంటే సుజాతా .. ఒకగానొక్క కొడుకునీ అమెరికా పంపిస్తున్నావు. ఒకసారి అక్కడికి వెళితే ఇంక తిరిగి ఇండియాకి తిరిగి రావటానికి ఇష్టపడరు. ఆలోచించుకున్నావా?”

సుగుణ పిన్ని నవ్వుతూనే అడిగినా ఆ మాటల్లోని జీవితసత్యం ఇప్పుడు బాగా అనుభవం లోకి వస్తున్నది సుజాతకి .

“ ఎందుకు రాడు పిన్నీ.. మాకు ఉన్నది వాదొక్కడేగా. అమెరికా వెళ్ళటం వాడి కల. తోటివాళ్ళందరూ వెళ్తున్నారు. వీడికీ అక్కడ ఉండే యోగం పెద్ద జీతంతో వచ్చింది గదా. ఎలా వదులుకుంటాడు. మనదేముంది పిన్నీ. ఇవ్వాళ ఉండి రేపు రాలిపోయేవాళ్ళం . వాళ్ళ కెరియర్ ముఖ్యం కదా. అందుకే వెళ్ళమన్నాను. వాడి చదువుకు తీసుకున్న బ్యాంక్ లోన్ తీర్చి కొంత సంపాదించుకుని తిరిగి వస్తానన్నాడు.”

సుగుణ పిన్నికయితే ఏదో సమాధానం చెప్పింది కానీ సుజాతకు లోలోపల దిగులేసింది . పిన్ని అన్నట్లు సారధి తిరిగి రాకపోతే..?

ఎందుకు రాడు . తల్లిదండ్రులంటే వాడికి ఎంత ప్రాణం. అలా లేనిపోని అనుమానాలు

పెట్టుకుని వాళ్ళ భవిష్యత్ ని పాడుచేసే హక్కు తమకు లేదు. అన్నింటికీ ఆ శ్రీనివాసుడే ఉన్నాడు. మనసును దిటవు చేసుకుంది.

ఏయిర్పోర్ట్ లో సారధి కి వీడ్కోలు చెప్తున్నప్పుడు సుజాత కన్నీటిని దాచుకోలేకపోయింది .

సారధి తల్లిని అక్కున చేర్చుకుని కన్నీరు తుడుస్తూ ధైర్యం చెప్పాడు.

“ ఎందుకమ్మా అంతా దిగులు పడతావు. ఎమ్. ఎస్ . అయిపోగానే వస్తాను. వీడియో కాల్స్ లో మనం చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. ఎదురుగా ఉన్నట్లే ఉంటుంది. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. మామయ్య కొడుకు జగదీష్ కూడా ఉన్నాడని నీకు తెలుసు కదా. ఏమీ భయం లేదు. నువ్వూ నాన్నగారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. సెక్యూరిటీ చెక్ కి పిలుస్తున్నారు. వస్తానమ్మా .. నాన్నగారూ వస్తాను. బై .. “అంటూ హుషారుగా కదిలి వెళ్తున్న సారధికేసి తడికళ్ళతో చూస్తుందిపోయింది సుజాత.

మనసు నిండా సారధి జ్ఞాపకాలు మసురుకుంటుంటే భారంగా ఇల్లు చేరారు ఇద్దరు.

కొన్నాళ్లదాకాకా సుజాత చాలా డల్ గా ఉంటుండేది. శంకరం చాలా అనునయించిన మీదట క్రమంగా ఆజీవితానికి అలవాటు పడింది. సారధి శని ,ఆది వారాలలో చేసే వీడియో కాల్స్ కోసం వారంఅంతా ఎదురు చూసేది . సారధి ఫోన్ చేస్తే ఎన్నెన్ని కబుర్లు చెప్పేది!. అప్పుడు సుజాత మొహం మతాబాలా వెలిగి పోయేది.

ఒక్కగానొక్క కొడుకుని దూరం పంపించేశాననుకుంటూ దిగులు పడుతూనే సరిపెట్టుకుంటూనే సారధి ఎమ్ . ఎస్ పూర్తయింది. ఇక కొడుకు పెళ్లిగురించి ఆలోచించటం మొదలయింది. సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. కానీ తనకే ఏదీ సరిగా నచ్చటం లేదు. సారధిలాంటి బంగారు తండ్రికి భార్య అయ్యే అమ్మాయి ఎలా ఉండాలి మరి.

ఒక ఏడాది గడుస్తున్నది. వచ్చే డిసెంబర్ కి కొడుకు వచ్చేనాటికి ఐదారు

సంబంధాలను రెడీ గా ఉంచింది సుజాత. ఈసారి వాడికి పెళ్లి చేసి పంపాలి. అని గట్టిగా నిర్ణయించుకుంది.

ఒకరోజు సారధి పిడుగులాంటి వార్త చెప్పాడు. అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడుట. ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారుట. అటూ ఇటూ పెద్దలకి చెప్పకుండా చేసుకోటానికి కులాంతరమే కారణం అంటూ తల్లిదండ్రుల్ని క్షమించమని పదే పదే కోరుతూ కోడలు వందనని తెగ పొగిడాడు.

సుజాత హతాశురాలైపోయింది. ఏమనగలదు . అడ్డాలనాడు బిడ్డలు గానీ గడ్డాలు వచ్చాక కాదు అని మరోసారి రుజువైంది అనుకుంది

అలాగని శంకరానికి బాధ లేదని కాదు. తాను బయటపడితే సుజాత ఇంకా డీలా పడుతుందని భార్యకి ఈ తరం ఇంతేనంటూ మాటలు చెప్తూ సమాధాన పరిచాడు.

సుజాత కూడా సారధి చేసిన పనికి బాధపడుతూనే పైకి ఏమి అనటం లేదు. కానీ బంధువులముందు జవాబు చెప్పుకోలేక అవస్థలు పడుతోంది .

ఇంకా సారధి భారతదేశానికి తిరిగి ఎప్పుడు వస్తాడు. వచ్చి పెళ్లి చేసుకుని తమని కూడా మళ్ళీ అమెరికా తీసుకెళ్తానన్నవాడు ఇలా చేయటం శంకరం దంపతులకు ఆశనిపాతం అయింది . భార్య అందుకు ఎలా వప్పుకుంటుంది. వాడు విదేశాలకు వెళ్తుంటే ఎంత గర్వంగా భావించింది. అవును.. వాడికి ఏం కావాలో వాడే చూసుకుంటున్నాడు.

ఇంక వాడి జీవితంలో తమకి చోటు తగ్గిపోతుంటుంది. అవసరాలు తీరాక బయటివాళ్లయినా .. పిల్లలయినా ఒకటేనేమో..

కొడుకు తన కోసం తిరిగి కొన్నాళ్ళకు స్వదేశానికి వస్తాడని నమ్మింది ఆ పిచ్చితల్లి . ఈ సంవత్సరంలో హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ కొన్నాడు సారధి. తల్లి దండ్రుల్ని అద్దె ఇంట్లోంచి అందులోకి చేర్పించాడు. అప్పుడు గృహప్రవేశంలో కొడుకు ప్రయోజకూడయ్యాడని ఎంతో

పొంగి పోయింది. ఈసారి సారధి వచ్చి పెళ్లి చేసుకున్నాక కొడుకు కోడలితో తిరుపతి వస్తానని శ్రీనివాసునితో చెప్పుకుంది కూడా.

“ ఏమిటోయ్ .. నీ కొడుకు గురించి ఆలోచిస్తూ నా గురించి పట్టించుకోవట్లేదు .. రాత్రి తొమ్మిద యింది . ఈ పూట డిన్నర్ ఉన్నదా..” నవ్వుతూ అడిగాడు శంకరం. ఆమె దృష్టి మరల్చాలనే శంకరం అలా అంటున్నాడని సుజాతకీ తెల్సు

“ అయ్యో…రెడీ చేశానండీ .. మాటల్లో పడి టైమే చూడలేదండి. పదండి” అంటూ వంటింట్లోకి దారి తేసింది.

భోజనాలయ్యాక శంకరం కాసేపు న్యూస్ చూశాడు. సుజాత వంటగది సర్దుకొని వచ్చేసరికి శంకరం పడుకుని ఉన్నాడు.

“ ఏమండీ .. నిద్ర పోయారా ? “ మెల్లగా అడిగింది సుజాత నడుమ వాలుస్తూ.

శంకరం ఏమీ మాట్లాడలేదు. అతనికి వినిపించినా విననట్లే ఉన్నాడు. సుజాత మనసులో రేగే ఆలోచనలు తెలుసు కాబట్టే మౌనం వహించాడు

ఆమె మళ్ళీ పిలిచింది

తప్పనిసరిగా ఇటు తిరిగాడు. “ ఏంటి సుజీ.. పడుకో.. ఎక్కువగా ఆలోచించకు . పొద్దుపోయింది “ అతని స్వరం మెత్తగా ప్రేమగా పలికింది.

“ అది కాదండీ.. తల్లిదండ్రులకు చెప్పకుండా వాడు పెళ్లి చేసుకున్నా సరిపెట్టుకున్నాను. కానీ ఎప్పటికీ తలుపులు మూసుకున్నాడు. అక్కడి పిల్లను చేసుకుంటే అంతే కదా! కానీ మొన్న మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసందీ. అక్కడే సెటిల్ అవుతానని ఆ పిల్లకి మాట ఇచ్చాడట ..మనకీ అదేదో గ్రీన్ కార్డ్ తీసుకుంటాడట. మనం కూడా అక్కడే ఉండవచ్చట.

మన దేశం కాదని మన భాష,బంధువులు అన్నీ వదులుకొని మనం ఎందుకు అక్కడ ఉండాలండీ.. “ ఆమె గొంతు రుద్ధమైంది .

“ వాడు మనమీద ప్రేమకొద్దీ అన్నాడుగానీ మనం అక్కడెందుకు ఉంటాం చెప్పు . నువ్వు లేనిపోని ఆలోచనలతో ఆరోగ్యం పాడుచేసుకోకు. పెళ్లి చేసుకున్నాడు. కోడలు కడుపుతో ఉందని కూడా అన్నాడు కదా !. ఒకసారి వెళ్ళి చూసి కొన్ని నెలలుండి వచ్చేస్తాం. అంతే.. రేపు యాంజియోగ్రామ్ చేయించుకోవాలి.. ఇంక పడుకో”

అంటూ అటు తిరిగి పడుకున్న శంకరం కళ్ళనుండి కన్నీటిధార చాలా సేపటివరకు .. అతనికి నిద్ర పట్టేంతవరకు ఆగకపోవటం సుజాతకూ తెలుసు. ఎందుకంటే ఆమెదీ అంతే స్థితి కాబట్టి.

సుజాత అందరిముందు నటిస్తున్నది. కొడుకు దగ్గరికి వెళ్తుంటే మునుపటి ఉత్సాహం లేదు. కొడుకు దూరమైపోయిన బాధ గుండెల్ని పిండేస్తున్నది.. ఎప్పటికో నిద్ర లోకి జారుకున్నా కల్లో సారధి.. పసివాడుగా.. పెద్దవాడుగా..

మర్నాడు ఇద్దరూ జనరల్ చెక్అప్ చేయించుకుని మందులు రాయించుకున్నారు. యాంజియోగ్రామ్ లో శంకరానికి కొంచం తేడాగా ఉందని తెలిసింది. డాక్టర్ మందులు ప్రత్యేకంగా రాశాడు.

విదేశీప్రయాణం గురించి విని “ మీరు వెళ్ళేది మార్చ్ లో కదా. ఈలోపు ఆ ప్రాబ్లమ్ సెట్ అవుతుందిలేండి “ అన్నాడు

ఇద్దరూ కొత్త మందులు మొదలుపెట్టారు. శంకరం ఆరోగ్యం కొంచం కుదుటపడింది.

ఒక నెల గడిచింది.

ఒకరోజు టి. వి. లో వార్తలు చూస్తున్న శంకరం షాక్ తిన్నట్లుగా సుజాతను పిలిచి

చూపించాడు. చైనాలో పుట్టిన కరొనా అనే వైరస్ ప్రపంచం అంతటా వ్యాపిస్తున్నది. అంటూ దాని లక్షణాలను వివరిస్తున్నారు న్యూస్ లో.

మనిషి శ్వాసకోశాలను నిర్వీర్యం చేసి ఆక్సిజన్ ను తగ్గించి ప్రాణాలు హరించే ఆ కోవిడ్ 19 అనే మహమ్మారికి వాక్సిన్ లేదు, మందుకూడా లేదుట . ఇంకా వారంరోజుల్లో అన్నీ దేశాలు లాక్ డౌన్ విధిస్తాయట. ఇంక అన్నీ రవాణా సౌకర్యాలు ఆగిపోతాయట. షాపులు మూసేసి, అత్యవసర వస్తువుల దుకాణాలు మాత్రం రెండు గంటలపాటు తెరిచి ఉంచుతారట . చేతులు సబ్బుతో ప్రతి గంటకూ కడుక్కోవాలనీ, అంతా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉండాలనీ , ముక్కు, నోరు, మాస్క్ తో కవర్ చేసుకోవాలనీ ఇంకా చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. టి. వి. లో .. రేడియో లో.. మొబైల్ లో ఎక్కడ విన్నా.. చూసినా కరోనా గురించిన జాగ్రత్తలే.. మరణాల లెక్కలే.

శంకరం సుజాతలకు పక్కలో బాంబ్ పేలినట్లయింది. ఇంకో రెండు నెలల్లో అమెరికా వెళ్తాము, కొడుకుని చూస్తాము అనుకుంటున్నవాళ్లకు ఈ కరొనా వార్త విషాదంగా అనిపించింది.

మర్నాడు ఇద్దరూ షొపింగ్ వెళ్లాలనుకున్నారు. ఇంతలో ఈ పరిస్థితి ఏమిటో.. అంతా అగమ్యంగా ఉంది.

“ మన ప్రయాణానికి ఇంకా రెండు నెలలు టైమ్ ఉంది కదా. అప్పటికి అన్నీ మామూలుగా అయిపోతాయిలే.. పడుకో ఇంకా.. “ అంటూ ఆవులించి నిద్రకు ఉపక్రమించాడు శంకరం.

అర్ధరాత్రి రెండు గంటలకి సుజాతకి హటాత్తుగా మెళుకువ వచ్చింది. పక్కన చూస్తే శంకరం లేడు . బాత్రూమ్ కి వెళ్ళి ఉంటాడు.. అనుకుంటూనే నిద్రలోకి జారిపోయింది. మళ్ళీ ఐదింటికీగానీ లేవలేకపోయింది .

అప్పటికీ శంకరం పక్కన లేదు. సుజాత కి ఒక్క క్షణం ఏమి అర్ధం కాలేదు

ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. అటాచ్ డ్ బాత్రూమ్ తలుపు బయట గడియ పెట్టి ఉంది. గబగబా బెడ్ రూమ్ లోంచి హాల్లోకి వచ్చించి. అటూ ఇటూ అయోమయంగా చూసింది.

అదేంటి అలా బొక్కబోర్లా నేలమీద పడుకున్నారు ?

ఒక్క ఉదుటున వచ్చి శంకరాన్ని తట్టి లేపబోయింది. ఇదేమిటి ఈయన వళ్ళు ఇలా చల్లగా బిగుసుకుపోయి.. దేవుడా.. ఏదో అర్ధమైనట్లు గట్టిగా అరిచింది.శంకరాన్ని కుదుపుతూ పిలుస్తోంది. గొంతులో ఏడుపు జీర .. చుట్టలు చుట్టలుగా …

“ ఏమండీ.. ఏమండీ.. “ఒక చేదునిజాన్ని జీర్ణించుకోలేక అది ఎప్పటికీ నిజం కాకూడదనుకుంటూ మనసులోనే వంద దేవుళ్ళను వేడుకుంటూ మళ్ళీ మళ్ళీ నిర్జీ వుడయిన శంకరాన్ని తట్టి తట్టి లేపుతున్నది. ఇంతలోనే ఏదో ఆలోచన వచ్చి గబ గబా ఎదురింటికి పరిగెత్తి డాక్టర్ గారిని పిలుచుకువచ్చింది. ఇరుగు పొరుగు సాయంతో భర్తను మంచం మీదికి చేర్చింది.

డాక్టర్ ఏవో ప్రయత్నాలు చేశాడు. లాభం లేదనీ … శంకరం మరణించి నాలుగు గంటలయిందని చెప్పి సానుభూతి తెలియచేసి వెళ్ళిపోయాడు.

సుజాతకి అంతా శూన్యమైపోయింది. కరోనా కాలంలో శంకరం స్వర్గస్తుడు కావటం వల్ల వేరే ప్రాంతాలలో ఉన్న బంధువులు ఎవ్వరూ రాలేని కఠిన విషాదం. ఊళ్ళో ఉన్న సుజాత అక్క , శంకరం తమ్ముడు వాళ్ళ పిల్లలు, కొద్దిమంది స్నేహితులు భయం భయంగా

వచ్చారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు లేనందున సారధి రాలేకపోయాడు. తల కొరివి పెడతాడని, పున్నా మనరకం నుండి కాపాడతాడాని ఎన్నో ఆశలు, ప్రేమతో పెంచిన కొడుకు లేకుండానే శంకరం పార్ధివ దేహానికి అగ్నిసంస్కారం జరిగింది. సుజాత అక్క సుజాతని కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంది. ఆ పదమూడురోజుల కార్యక్రమం కూడా

శంకరం తమ్ముడే పూర్తి చేసి వదినగారి దగ్గర సెలవు తీసుకుని దుఃఖంతో వెళ్ళిపోయాడు. సారధి తల్లితో ఫోన్ లో రోజూ మాట్లాడుతున్నాడు. కోడలు మాత్రం పలకరించలేదు. బంధం లేని బంధుత్వం మరి.

ఫ్లయిట్ టికెట్స్ రద్దయినాయి . సుజాత కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంది. ఎవరెంత ఓదార్చినా ఆమె బాధ తీరేది కాదు. కొడుకు రాలేకపోవటం సుజాతకి మరింత వేదనగా ఉంది.

ఈ ప్రపంచంలో తాను ఒంటరిదయిపోయినట్లు శూన్యమ్ గా ఉంది. ఈ మధ్య సారధి ఫోన్ చేయటం కూడా తగ్గించాడు. ఆఫీస్ పని వత్తిడి అంటున్నాడు.

మరో రెండు నెలలకి సారధి చెప్పిన మాట విని సుజాత కళ్ళల్లో నీళ్ళు కూడా ఇంకిపోయాయి.

భారత ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయులకోసం స్వదేశానికి ప్రత్యేక విమానాలు నడుపుతోంది. భర్త మరణంతో కుమిలిపోతున్న తనను ఓదార్చటానికి సారధి వస్తాడని సుజాత ఎదురుచూస్తోంది. కొడుకుని కౌగిలించుకుని పెద్దగా ఎడవాలని ఉంది.

కానీ సారధి ఏమంటున్నాడు.

“అమ్మా.. నేను వచ్చి ఏం చేయగలను. నువ్వు ఆస్తులు అమ్మేసి ఆ డబ్బు తీసుకుని నా దగ్గరికి వచ్చేయి. ఇంకా అక్కడ ఎవరున్నారని. మీ కోడలికి డెలివరి సమయం కూడా. పుట్టేవాళ్లను చూసుకుంటూ నువ్వు ఇక్కడే ఉంది పోవచ్చు. ప్రత్యేక విమానం టిక్కెట్స్ పంపిస్తున్నాను.” సారధి గొంతులో తల్లి గురించిన ఆదుర్దా కన్నా ఇతర విషయాలు ప్రధానంగా కనిపించాయి.

ఎక్కడో పల్లెలోపుట్టి టౌన్ లో చదువుకుని పెళ్లి పేరుతో హైదరాబాద్ కి భర్తతో కొత్త కాపురానికి వచ్చిన సుజాత జీవితం ఇప్పటివరకు ఎన్నిసార్లు స్థలాలు మారినా బాధ పడింది ఒక ఎత్తు అయితే ఇంక అమెరికాకి శాశ్వతంగా వలస వెళ్ళటం మరోఎత్తు. అది ఆమెకు ఎక్కలేని ఎత్తు.

పుట్టి పెరిగిన ఊరు, జీవిక జరిగినఊరు కాక పరాయి దేశంలో జన్మ ముగించుకుని ఆ మట్టిలో కలిసిపోవటం ఎంత దురదృష్టం. శ్రీరాముడు స్వర్ణమయ లంకలో ఉండమంటే జననీ, జన్మభూమి, స్వర్గం కన్నా ఎక్కువ అని చెప్పలేదా. నేటి భారతీయులు రాముని వారసులు కాదా!

సుజాత ఎక్కవలసిన విమానం ఆమె లేకుండానే అమెరికా వైపు ఎగిరిపోయింది. అమెరికాలో ఉన్న సారధికి తల్లి దగ్గరినుంచి ఒక చివరి మెయిల్ అందింది.

“ బాబూ , సారధీ, నిన్ను నేను తప్పు పట్టను. మీ తరం అంతా ఇలాగే ఉన్నారు. ఇప్పుడు తల్లిదండుల వలస జరగటం నేనూ చూస్తూనే ఉన్నాను. పిల్లలు లేని మేము భోపాల్ లో ఉన్నప్పుడు ఒక అనాధవయిన నిన్ను ఒడి చేర్చుకున్నాము. చివరిదాకా మాకు తోడవుతావని. అందరూ నిన్ను తక్కువగా చూస్తారేమోనని ఈ రహస్యం మా కడుపులోనే దాచుకున్నాము. నా దేశం నుండి నన్ను చివరి వలసకు తీసుకెళ్తావని

అనుకోలేదు. మీ నాన్నగారు కలిసిన మట్టిలోనే నేనూ కలిసిపోతాను. నా నిర్ణయానికి బాధపడకుండా ఆర్ధం చేసుకుంటావనుకుంటాను. నువ్వు ఎక్కడ ఉన్నా మాఇద్దరి ఆశీస్సులు మీకు ఉంటాయి. ఎప్పుడయినా అమ్మనీ, అమ్మలాంటి దేశాన్ని గుర్తు చేసుకుంటే రా నాన్నా . నీకోసం నా కళ్ళవాకిళ్ళు ఎప్పుడు తెరిచేఉంటాయి. మరో మాట. మా గ్రామంలో నాకు మాఅమ్మ ఇచ్చిన పొలం, ఇల్లు ఉన్నాయి కదా . అక్కడికే వెళ్తున్నాను. ఆ ఊరు నాకు అమెరికా కంటే ఎక్కువ. ఆశీస్సులతో అమ్మ. “

సుజాతకి పుట్టిన ఊరు పుట్టిల్లులా స్వాగతం పలికింది.

తర్వాతి సంవత్సరానికి సారధి, కోడలు, మనవడు సుజాత దగ్గరకు గ్రామానికి రావటం పండగ మళ్ళీ వచ్చినట్లయింది.

“ నన్ను మన్నించమ్మా. అనాధనయిన నన్ను మీరు చేరదీసి ఇంత చేస్తే నేను నిన్ను అనాధను చేశాను. కరోనా కాలంలో నాన్న పోవటంవల్ల నాన్నకు కనీసం చివరి రుణం కూడా తీర్చుకోలేని దురదృష్ట వంతుడిని. కోవిడ నా కళ్ళు తెరిపించింది. ఇంక మేము నీతోనే ఉంటామమ్మా “ అంటూ కన్నీళ్లతో కరిగిపోతున్న కొడుకునూ, కోడలినీ దగ్గరికి తీసుకుంది సుజాత.

దూరంనుంచి వరికంకులు చేత్తో పట్టుకుని తప్పటడుగులు వేస్తూ వస్తున్న మనవడిని ఆపేక్షగా చూస్తూ.. చేతులు చాచింది

“ వీడి పేరేమిటిరా సారధీ!”

“ శంకరరావు అత్తయ్యగారూ” కోడలు బదులిచ్చింది తృప్తిగా నవ్వుతూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com