(పత్తిపాక మోహన్)

మన సాహిత్య సాంస్కృతిక చరిత్ర నిర్మాణంలో అన్ని రంగాల్లో లాగానే బాల సాహిత్యం విషయంలోనూ జరిగింది. ఆనాటి నిజాం రాష్ట్రంలోనూ, తరువాత హైదరాబాద్ రాష్ట్రంలోనూ ఎందరో రచయితలు బాల సాహిత్యాన్ని రాసినా చరిత్రలో రెండు మూడు పేర్లు తప్ప ఇతరుల పేర్లు నమోదు కాలేదు. స్వాతంత్ర్యానికి ముందే పొట్లపల్లి రామారావు, ఆదిరాజు వీరభద్రారావు, జి. రాములు వంటి సాహితీవేత్తలు బాలల కోసం రచనలు చేశారు. చాలా పేర్లు నమోదు కాకపోవడంవల్ల మా తరం వాళ్ళం చదవడం, వినడం జరగలేదు. పరిశోధనలవల్ల ఇప్పుడిప్పుడే ఎందరో రచయితల పేర్లు తెలుస్తున్నాయి. ఇంకా చాలా పేర్లు, రచనలు వెలుగులోకి రావాల్సివుంది. నిజాం రాష్ట్ర యుగానంతరం లేదా స్వాతంత్ర్యానంతరం డా. దాశరథి, డా. సి. నారాయణరెడ్డి, బి.ఎన్. శాస్త్రి, ‘బాలబంధు’ ఉత్పల సత్యనారాయణాచార్య, పైడిమర్రి సుబ్బారావు, అమరేశం రాజేశ్వరశర్మ, ‘బాలబంధు’ ఇల్లిందల సరస్వతీదేవి, తిగుళ్ళ వేంకటేశ్వరశర్మ, వేముగంటి నరసింహాచార్యులు, బిరుదురాజు అచ్యుతరాజు, డా. పాకాల యశోదారెడ్డి, వానమామలై వరదాచార్యులు మొదలగు ఎందరో సాహితీమూర్తులు తమ వంతు బాధ్యతగా బాల సాహిత్యం కూడా రాసారు.

అరవై నుండి నుండి ఎనభయ్యవదశకాల మధ్య బాలల కోసం రాసిన డా.సామల సదాశివ, నీలా జంగయ్య, కపిలవాయి లింగమూర్తి, చందమామ కథల బుల్లె నాగేశ్వరరావు, అంపశయ్య నవీన్, బి.ఎస్.

రాములు, డా. భోయ జంగయ్య, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, డా. జె. బాపురెడ్డి, రేగులపాటి కిషన్‌రావు, ఎర్రోజు సత్యం, డా. మలయశ్రీ, డా. వడ్డేపల్లి కృష్ణ, వాసాల నర్సయ్య, డా.వి.ఆర్.శర్మ, డా.అమృతలత, గుర్రాల లక్ష్మారెడ్డి,

రామా చంద్రమౌళి, మేరెడ్డి యాదగిరి రెడ్డి, పుప్పాల కృష్ణమూర్తి, సంగనభట్ల చిన రామకిష్టయ్య, డా.నలిమెల భాస్కర్, గర్భకుర్తి రాజేంద్ర, చెన్నూరి సుదర్శన్, డా.ఎం.రాములు, లక్ష్మారెడ్డి, ఐతా చంద్రయ్య, ఎన్నవల్లి రాజమౌళి, డా.ఆదినారాయణ మొదలగు వందలాది మంది కథలు, కవిత్వం, విమర్శతోపాటు విశేషంగా బాల సాహిత్యం రాసారు. కానీ వీరి కృషి నమోదు కాలేదు. తెలంగాణ ఉమ్మడి

జిల్లాలు నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మంతో పాటు మరికొన్ని ఇతర ప్రాంతాల నుండి సేకరణ ఇంకా పూర్తికాలేదు. అందువల్ల వారందరి పేర్లు ఇక్కడ పేర్కోలేక పోతున్నందుకు మన్నించాలి. ఇంకా తెలంగాణాలో వెలుగు చూడాల్సిన బాల సాహితీవేత్తలు ఎందరున్నారో! వారి పేర్లు, సాహిత్యం చరిత్రలో ఎప్పుడు నమోదవుతాయో! చరిత్రలోని పుటల కింద దాగిన ఎందరో సాహితీ మూర్తుల బాల సాహిత్య కృషిని నమోదు చేసాం. చేస్తున్నాం. ఇంకా చేయాల్సి ఉంది. సాహిత్య చరిత్రలో మనం మరిచిపోయిన రచయితలను, వారి కృషిని నమోదుచేసి భావితరాలకు వారి రచనలను అందించవలసిన బాధ్యత మనది. ఈ నేపథ్యంలో చరిత్రకందిన మరో కథల ‘హీరా’, బాల సాహితీవేత్త డా. గూడూరి రాఘవేంద్ర.

తెలుగువారి సాహిత్య చరిత్రలో, ప్రతి తెలుగువాడి హృదయం పైన శాశ్వతంగా నిలిచిన పేరు ‘హనుమాజీ పేట’. అందుకు కారణం మనకు తెలిసిందే, ‘సినారె’ అనే ఫెనామినాకు జన్మనిచ్చిన ఊరు. ప్రసిద్ధ తెలంగాణా కథకులు గూడూరి సీతారాం, గేయ కవితా విశారదులు కనపర్తి (లక్ష్మీనర్సయ్య), ఒగ్గుకథకు అంతర్జాతీయ ఖ్యాతి కల్పించిన మిద్దె రాములు హనుమాజీపేట వారే కాక సినారె సమకాలీకులు కూడా. 1955-56 ప్రాంతంలో బాలల కోసం రచనలు చేసిన సాహితీవేత్త డా. గూడూరి రాఘవేంద్ర ఈ హనుమాజీపేట లోనే, సినారె పక్కింట్లో పుట్టారు. పాఠశాల దశలో రచనలు చేసిన రచయిత రాఘవేంద్ర. అందుకు ఆనాటి తెలంగాణా వాతావరణం ఒక కారణం. మరో కారణం అప్పటికే కథకులుగా ప్రసిద్ధులైన అన్న గూడూరి సీతారాం, సినారెల రచనలతో పాటు, వేములవాడలో

అప్పటికే ‘ఏథిస్ట్ బాయ్స్ క్లబ్’ ప్రారంభించిన జి. సురమౌళి వంటి వారి స్పూర్తి రాఘవేంద్రపై ఉంది. తొలి రచనలు ఆనాటి సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాల సంచిక ‘తరంగిణి’, వేములవాడ కేంద్రంగా వచ్చిన రాత పత్రిక ‘విద్యుల్లత’లో అచ్చయ్యాయి.

ఇవ్వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా తెలంగాణలో బాల రచయితల రచనల ‘కొత్త విప్లవం’ మనం చూసి ఆనందిస్తున్నాం. ఆశ్చర్యపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే కవి, రచయిత, అనువాదకులు, బూర్గుల రామకృష్ణారావుగారు ముఖ్యమంత్రిగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థిగా రచనలు చేసిన రచయిత గూడూరి రాఘవేంద్ర. 1957-60ల మధ్య కథానికలు రాసిన వీరు 1955 -1957 ప్రాంతంలో ప్రధానంగా పిల్లల కోసం రాసారు. తరువాత చాలా కథలు వివిధ పత్రికల్లో వచ్చినప్పటికీ ఇప్పుడు వాటిలో చాలా కథలు అలభ్యం,

కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి. అందరు తొలితరం తెలంగాణా రచయితల్లాగానే కథలు దాచుకోవాలనే సోయి లేకపోడంతో వీరి చాలా కథలు దొరకలేదు. అనేకసార్లు డా. గూడూరి రాఘవేంద్రను ఇదే విషయం అడిగితే రాసానన్న విషయం, రచనలు ప్రచురించిన కొన్ని పత్రికల పేర్లు, బాలునిగా, యువకునిగా తాను కలిసిన, మాట్లాడిన

సాహితీవేత్తల వివరాలు, సినారెతో గల సాన్నిహిత్యం తప్ప ఇతర వివరాలు చెప్పలేక పోయారు. రచయిత కంటే ఎక్కువగా వీరి చెల్లెలు శ్రీమతి మ్యాన రామలక్ష్మిగారికి జ్ఞాపకం ఉంది. గూడూరి సీతారాంగారి కథల పుస్తకం వచ్చాక డా. రాఘవేంద్ర రచనల గురించి చాలాసార్లు ప్రస్తావించారు.

డా. గూడూరి రాఘవేంద్ర ప్రభుత్వ దంత వైద్యులుగా ఉద్యోగం చేసారు. పదవీ విరమణ చేసాక కూడా సేవలు అందిస్తూనే జగిత్యాలలో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. తెలంగాణా బాల సాహితీవేత్తల గురించి రాస్తున్న క్రమంలో నేను వివిధ గ్రంథాలయాల్లో, పాత పత్రికలలో, సాహితీ మిత్రుల ద్వారా ప్రయత్నించగా స్వాతంత్ర్య

సమరయోధురాలు సూర్యదేవర రాజ్యలక్ష్మి సంపాదకత్వంలో వచ్చిన ఆనాటి ‘తెలుగుదేశం’ పత్రికలో రాఘవేంద్ర రాసిన కొన్ని పిల్లల కథలు లభించాయి.

పిల్లల కథలే కాక రాఘవేంద్ర తెలుగు దేశం పత్రికలో 3-5-1956లో అచ్చయిన ‘ఇంటాయిన-ఇంటావిడ’ కథానిక, 6-12-1956న అచ్చయిన ‘డిటెక్టివ్ సాహిత్యం వ్యర్థం, రచయితలు వ్రాయడం మానాలి’ అనే వ్యాసం, ‘గోల్కోండ పత్రిక’లో 22-4-1956న అచ్చయిన ‘చీకటి బాట’ కథలు లభించాయి. కొన్ని కథల పేర్లు సీతారాంగారి ద్వారా తెలిసినా ఇంకా లభించలేదు. ఇటీవల వీరి మరికొన్ని కథలు తెలంగాణ రచయితల రచనలను ఒక యజ్ఞంగా సేకరిస్తున్న పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాసు దొరికాయి. సంగిశెట్టికి దొరికిన కథలు ‘గోల్కోండ పత్రిక’లో అచ్చయ్యాయి. అవి మొండి ఘటాలు’ 8-7-1956, “దూరపు కొండలు’ 1811-1956, ‘మేడిపళ్లు’ 20-1-1957, ‘గౌరవం’ 16-3-1957, ‘ఆత్మ-అభిమాని’ 18-5-1958.

తెలంగాణ ఏర్పడి తెలంగాణ సోయితో పరిశోధనలు జరుగుతున్న క్రమంలో స్వాతంత్ర్యానికి పూర్వం, ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బాల సాహిత్యం రాసిన ఎందరో తెలంగాణ రచయితలు కనిపిస్తున్నారు. వారిలో 1945 లోనే బాలల కోసం ఆనాటి ‘ఆనందవాణీ’ పత్రికలో ‘ముల్లా కథలు’, ‘ఆచార్యుల కథలు’ వంటి రచనలు చేసిన పొట్లపల్లి రామారావు ప్రాతఃస్మరణీయులు. వీరి సాహిత్యంపై పరిశోధన చేసిన నటులు, బాల

సాహితీవేత్త డా. భూపాల్ ప్రకారం ‘ఆచార్యుల కథలు’ పేరుతో వచ్చిన కథల వంటివి తెలుగులో ఇంతవరకు రాలేదు. సిరిసిల్లలో ఇదే సమయంలో బాలల కోసం ‘గాంధీ సూక్తులు’, ‘శాంతిపథం’ గేయ నాటికలు, ‘బాలబాట’ అర్థ శతకం రాసారు సినారెకు చదువు చెప్పిన కాగౌర్ టీచర్ జి.

రాములు. , పంతొమ్మిది వందల యాభయ్యవ దశకంలో బాల సాహిత్య వికాసం కొరకు పనిచేసిన సంస్థల్లో హైదరాబాద్ లోని ‘బాల సాహిత్య రచనాలయం’ ఒకటి. యాభైయేండ్ల క్రితం ఈ సంస్థ ప్రసిద్ధ రచయిత, మహామనిషి గిడుగు సీతాపతిగారి వంటి వారిని పిలిపించి బాల సాహిత్య రచనా కార్యశాలలు జరిపింది. పుస్తకాలను ప్రచురించింది. బహుశః ఇది అప్పటి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ మాడపాటి హనుమంతారావు మార్గదర్శనంలో నడిచి ఉండొచ్చు. ఉత్పల, బి.ఎన్. శాస్త్రి, ఎం.వి.

రాఘవాచారి, గంగుల శాయిరెడ్డి వంటివారికి రచనాలయంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 1969లోనే బాల సాహిత్వ రచనాలయం బాల సాహితీవేత్తల కార్యశాల నిర్వహించింది. 1959లో ఈ సంస్థ తిగుళ్ళ వేంకటేశ్వరశర్మ రాసిన ‘వానకారు’ బాల గేయ సంపుటిని ప్రచురించింది. అరవైయేండ్ల తరువాత 2017లో డా.వి. ఆర్. శర్మ దీనిని తిరిగి ప్రచురించారు.

గత సభలకు మిన్నగా తెలంగాణా ప్రభుత్వం జరిపిన ప్రపంచ తెలుగు మహాసభలు బాల సాహిత్యానికి, బాలలకు పెద్ద పీట వేసాయి. ‘తెలంగాణా బాల సాహిత్య వికాసం’ పై మహాసభల్లో మాట్లాడేందుకు చదువుతున్నప్పుడు చరిత్ర కెక్కని ఎన్నో పేర్లు కనిపించాయి. పైడిమర్రి రామకృష్ణ తెచ్చిన ‘బాల సాహిత్య శిల్పులు’ మొదలు తెలుగులో వచ్చిన అనేక సాహిత్య చరిత్రలు, బాల సాహిత్య పిహెచ్.డి సిద్ధాంత వ్యాసాలను సంప్రదించాను. కొన్ని ‘బాలబంధు’ ఇల్లిందల సరస్వతీదేవి, ‘బాలబంధు’ ఉత్పల సత్యనారాయణా చార్య, వేముగంటి వారి వంటి లబ్దప్రతిష్టులయిన వారిని, ఎంతోమంది ‘చందమామ’ రచయితల పేర్లను కూడా పేర్కొనక పోవడం చూసాను. ఆ క్రమంలోనే అంతకు ముందే ‘మన సిరిసిల్ల’ పేరుతో సిరిసిల్ల సాహిత్య చరిత్ర రాసిన నేను ‘తెలంగాణా బాల సాహిత్య చరిత్ర’ రచనకు ఆకరాల సేకరణ ప్రారంభించాను. ఈ క్రమంలో విస్మృత రచయితల రచనలనేకం దొరికాయి. ఇంకా లభిస్తున్నాయి. వారిలో ఆదిరాజు వీరభద్రరావు నుండి డా. గూడూరి రాఘవేంద్ర వరకు ఉన్నారు. బాల సాహిత్యంలో కొత్త వెలుగు గూడూరి రాఘవేంద్ర కథలు: పిల్లల కోసం బాల సాహిత్యం , కథానికలు రాసినప్పటికి సాహిత్య చరిత్రలో నమోదుకాని రచయిత డా. గూడూరి రాఘవేంద్ర. బాల్యం నుండే రచనలు చేస్తూ పాఠశాల దశలోనే రచయితగా గుర్తింపు పొందిన గూడూరి రాఘవేంద్ర తన కథలను భద్రపరచలేదు. నేను సాహిత్యం పై ఆసక్తితో గూడూరి సీతారాం కథలు చదువుతున్న క్రమంలో వారి ద్వారా డా. రాఘవేంద్ర రాసిన కథల గురించి తెలిసి ఆసక్తి కలిగింది. ఈ హనుమాజీపేట నుండి మరో రచయిత గూడూరి శంకరం రచనలు కూడా వచ్చాయి. వాటిని సేకరించాల్సిన అవసరం ఉంది. మా మానేరు రచయితల సంఘం అధ్యక్షులు గూడూరి సీతారాం ‘సాహితీ జీవిత స్వర్ణోతవం’ సందర్భంగా తన జ్ఞాపకాలను రాయాల్సిందిగా డా. రాఘవేంద్రను కోరగా తన రచనలు వివరాలు చెప్పడం బాల సాహిత్య సేకరణ చేస్తున్న మరింత ఆసక్తిని కలిగించింది. వారికి తేదీలు పెద్దగా గుర్తుకు లేవు. సీతారాంగారు చెప్పిన ఆనవాళ్ళతో పాత పుస్తకాలు, పత్రికలు తవ్వుతున్న క్రమంలో నాకు వీరు రాసిన నాలుగు పిల్లల కథలు లభించాయి. వాటిలో ఒకటి అసంపూర్తిగా ఉంది. దానిని ఇందులో ప్రచురించడం లేదు. యాభై ఆరేండ్ల కింద యాబైకి పైగా పిల్లల కథలు రాసినా వాటిలో నాలుగైదు మాత్రమే లభించడం దురదృష్టం. ప్రధాన స్రవంతి అయిన బాలల దశాబ్దాల క్రితమే సాహిత్యం రాసిన చరితార్థుడు డా. రాఘవేంద్ర.

తెలుగు దేశం ‘బాలల కొలువు’

నాకు లభించిన నాలుగు బాలల కథలు 1956, 1957లో అచ్చయ్యాయి. ఈ కథలన్నీ నేను పైన పేర్కొన్న ‘తెలుగు దేశం’ పత్రికలో వచ్చాయి. ఇప్పటికీ ఈ పత్రికలు హైదరాబాద్, సుల్తాన్ బజార్‌లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంలో ఉన్నాయి. డా. రాఘవేంద్ర కథలను సంపాదకులు పిల్లల్లారా! విన్నారా మీరీ కథను !!’ అంటూ ‘

బాలల కొలువు’ శీర్షిక కింద ప్రచురించారు.

ఈ సంపుటి లోని తొలికథ “ధైర్యే సాహసే లక్ష్మి.” ఇది సాదాసీదాగా సాగే కథ.

కానీ చదువరులకు మిక్కిలి ఆసక్తి కలిగించడమే కాక ఉత్కంఠను రేకెత్తిస్తుంది. కట్టెలు కొట్టే రంగడు అడవిలో దొంగలను చూసి భయపడి పారిపోతూ చివరకు ఆ దొంగలు దొంగతనం చేసి తెచ్చిన ధనం దాచుకునే గుహలోకి వెళ్ళి దాక్కుంటాడు. తమ తావును చూసిన రంగడిని ఎలాగైనా మట్టు పెట్టాలని దొంగలు మాట్లాడుకునే మాటలు విని భయపడి పోతాడు. ఆ గుహలోని తమ ఇష్టదైవమైన నరసింహస్వామికి దొంగలు పూజచేసి వరమీయమని వేడుకుంటారు. ఎలాగైనా వాళ్ళను పోలీసులకు పట్టించాలని నిశ్చయించుకున్న రంగడు ఆకాశవాణి రూపంలో మాట్లాడుతూ “ఏమి కావాలో కోరుకొండి” అంటూ దొంగలకు అభయమిస్తాడు. తమకు నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడని భావించిన దొంగలు ‘మేం దొంగతనం చేస్తున్నప్పుడు ఎవరికి పట్టుబడకుండా వరం ఇవ్వ”మని వేడకుంటారు. ఈ దొంగల రోగం కుదుర్చాలని

భావించిన రంగడు “సరే! మీరు ‘సర్దూం ‘ అని అనగానే ఎవరి కంటికి కనబడరు” అంటూ ఆకాశవాణి రూపంలో వరమిస్తాడు.

దానిని నమ్మి దొంగతనానికి వెళ్ళిన దొంగలు ఒకరింట్లో దొంగతనంచేస్తూ తమకేమీ కాదని నవ్వుకుంటూ, పారిపోయే ప్రయత్నం చేయకపోగా అదృశ్యం అవుతామని “సర్ ధూం” అంటూ గట్టిగా అరుస్తారు. వాళ్ళు అదృశ్యం కాకపోగా అప్పటికే ఇంటివారి ఫిర్యాదుతో వచ్చిన పోలీసులు దొంగలను పట్టుకుపోతారు. ధైర్యం, సమయస్ఫూర్తి వల్ల ఆపదల నుండి ఎలా గట్టెక్కవచ్చన్నది ఈ కథ తెలియ జేస్తుంది.

మరోకథ ‘సహన పరీక్ష’, ఇది 24-5-1957న తెలుగుదేశంలో వచ్చింది. ఇది ముగ్గురు పిల్లలకు సంబంధించిన కథ. వేసవి సెలవుల్లో రాము, అతని బావలు సోము, భీములు రాము వాళ్ళ గ్రామానికి వస్తారు. సోము, భీములు ఇద్దరూ కొద్దిగ కోతలరాయుళ్ళు. ఎప్పుడూ తామే గొప్ప అంటూ బడాయిలూ చెప్పుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆటలో పిల్లలు గొడవ పడుతుంటే వాళ్ళను ఆపేందుకు “ఎవరు ముందు తింటారో వారికి మంచి బహుమతి ఇస్తాను” అని ప్రకటిస్తుంది అమ్మ. ముగ్గురు పిల్లలు వచ్చి భోజనానికి కంచాల ముందు కూర్చుంటారు. అన్నం, చేపలకూర వడ్డిస్తుంది అమ్మ. సోము, భీములు తాము తొందరగా తిని బహుమతిని పొందాలన్న తొందరలో అదరబాదరగా ముద్ద మింగుతారు. ముళ్ళు తీయకపోవడంతో చేపముళ్ళు సోము, భీము నాలుకకు గుచ్చుకుంటాయి. రాము మాత్రం నిదానంగా చేపలముళ్ళను తీసి తింటాడు. మరునాడు పిల్లలంతా “నిన్న ప్రకటించిన బహుమతి ఎవరికి దక్కింది. ఎవరికి సహనం ఎక్కువగా ఉంద”ని అడగగా. “అది రాము”నే అని చెబుతుంది అమ్మ.

పిల్లల మనస్తత్వం, వారి స్పర్థలు, వాళ్ళ వాళ్ళ మానసిక ప్రవృత్తులను ఒక సైకాలజిస్టుగా చెబుతారు రాఘవేంద్ర ఈ కథలో. ఇది పిల్లల మానసిక స్థితుల్ని చక్కగా వ్యాఖ్యానించే కథ.

మూడవ కథ, ‘బాల కథ’ శీర్షికతో అచ్చయిన ‘నిజం నిలకడ మీద తెలుస్తుంది’ కథ. ఇందులో పైన పేర్కొన్న మూడు కథలకంటే కూడా ఒకింత ఎక్కువ నాటకీయతను చొప్పించాడు రచయిత. ఒకసారి ఒక దుకాణం యజమాని జేబులోంచి కొంత నగదు మాయమయ్యిందని గుర్తిస్తాడు. ఆ దొంగతనం దుకాణంలోని నౌకరు చేశాడని భావించి యజమాని కొడుకు, పోలీసులు నౌకరు క్రిష్ణయ్యను చిత్రహింసలు పెడతారు. బాధలకు ఓర్చుకోలేక దొంగతనం చేసానని ఒప్పుకుంటాడు క్రిష్ణయ్య. మరునాడు దుకాణం యజమాని తిరిగి వచ్చాక విషయం తెలుసుకున్న యజమాని తిరిగి నోట్లను లెక్కించగా నగదు మొత్తం సరీగానే ఉంటుంది. తన పొరపాటు తెలుసుకున్న యజమాని కొడుకు క్రిష్ణయ్య మంచితనం, నిజాయితీలను తెలుసుకుని క్షమాపణలు కోరుతాడు. ఇందులోని సంభాషణలు మరియు నాటకీయ శైలి కథకు అందాన్ని ఇవ్వడమేకాక కథను చక్కగా నడిపించాయి. పైన పేర్కొన్నట్టు ఇవి అచ్చంగా యాబై ఆరేండ్ల క్రితం రాయబడిన కథలు. పాఠకులు కథలు ప్రచురింపబడిన కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కథలను చూడాలి. కథలను యథాతథంగా ప్రచురించాం. ఇందులోని భాష ఇతర విషయాలలో ఎలాంటి మార్పులు చేయలేదు. పాఠకులకు ముఖ్యంగా పిల్లలకు తెలిసేందుకు నాటి పత్రికల నకళ్ళను కూడా ఇందులో అచ్చువేయడం జరిగింది.

తొలినాళ్ళలో గూడూరి రాఘవేంద్ర పిల్లల కథలు, కథానికలతో పాటు వ్యాసాలు, కొన్ని కవితలూ, గేయాలను రాసారు. సందర్భం కాకున్నా ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. డా. రాఘవేంద్ర అన్న గూడూరి సీతారాం ప్రసిద్ధ కథకులుగా తెలుసు. కథలతో పాటు ఆయన రెండు నవలలు, మరెన్నో వ్యాసాలు రాసారు. కరీంనగర్ కేంద్రంగా తెలంగాణా గాంధీ బోయినపల్లి వెంకట రామారావు సారథ్యంలో వచ్చిన ‘సారస్వత జ్యోతి’లో 1953,

ఫిబ్రవరి సంచికలో ‘ప్రజాకవి’ అని కాళోజీని ఎందుకు పిలవచ్చో తెలుపుతూ వ్యాసాన్ని రాసారు సీతారాం, అందులో –

“…. కాళోజీగారు అచ్చంగా ప్రజాకవి. ప్రజాకవి అని శ్రీశ్రీని అనలేం. ఎందుకనగా ఆయన ‘ఇలా తలంలో హేమం పండగ’ అంటే సామాన్య ప్రజానికానికి ఏమర్ధమౌతుంది. అందుకే శ్రీశ్రీ అంటాడు కవిత్వం రెండు విధాలుగా ఉంటుందని, ఒకటి సామాన్య ప్రజలకు అర్థమౌతుంది. రెండవది కవిత్వం ధారాళంగా సాగేది. అయితే కాళోజీగారు

మొదటి తెగకు చెందినవాడు. నేడు తెలంగాణములో మహా ఏకైక ప్రజాకవి ఒక్క కాళోజీగారు మాత్రమే” అంటారు. అన్న గూడూరి సీతారాం గారిలాగే డా. రాఘవేంద్రగారు కూడా ఇటువంటి చక్కని వ్యాసాలు, కవితలు రాసారు. వాటిలో 6-12-1956 న రాసిన ‘డిటెక్టివ్ సాహిత్యం వ్యర్థం : రచయితలు వ్రాయడం మానాలి’ వ్యాసం ఈ పుస్తకం చివరన చూడొచ్చు. ‘అనాదిగా సాహిత్యం ప్రజల్లో చైతన్యం కలిగించిందని, సాహిత్యం ప్రజల జీవితానికి సంబంధించకపోతే అది ప్రజల హృదయాలలో నాటుకోదు’ అంటారు రాఘవేంద్ర. అలోచింపజేసే వ్యాసమిది.

డా. రాఘవేంద్ర గారివి ఇప్పటికి కేవలం నాలుగు పిల్లల కథలు, ఆరు కథానికలు, రెండు వ్యాసాలు మాత్రమే దొరికాయి. దొరకాల్సినవి చాలా ఉన్నాయి. ఇవి నాలుగు కథలే కావచ్చు,

కానీ ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన పటిష్టమైన వచన సాహిత్య వికాసాన్ని, నిఖార్సయిన తెలంగాణ భాషని, బాల సాహిత్యం పట్ల ఆనాటి పత్రికలు, రచయితలు చూపించిన శ్రద్ధను తెలియజేస్తున్నాయి.

ఇంత చక్కని కథలు రాసిన గూడూరి రాఘవేంద్ర స్వాతంత్ర్యానంతర తెలంగాణా తొలితరం కథకుల్లో అగ్రగణ్యులైన తన అన్న స్వర్గీయ గూడూరి సీతారాం లాగే ‘కథకు రాం రాం’ అన్నారు. పాఠశాల విద్యార్థి దశ నుండే ఎంతో ఉత్సాహంతో రచనలు చేసిన గూడూరి రాఘవేంద్ర వాడ వాడలా చక్కని సాహిత్య, సాంస్కృతిక వాతావరణం విలసిల్లిన ఆనాటి అద్భుతమైన

జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉన్నారు. రాశిలోనూ, వాసిలోనూ మిక్కిలి విలువైన మేలిమి బంగారు కథలను అందించిన డా. గూడూరి రాఘవేంద్ర స్వాతంత్ర్యానంతర తెలంగాణా తొలితరం బాల సాహితీవేత్తల్లో కథా రచనా పరుసవేది తెలిసిన రసవేది. ప్రభుత్వ దంత వైద్యులుగా పనిచేసిన డా. గూడూరి రాఘవేంద్ర ఉద్యమాల పురిటిగడ్డ జగిత్యాలలో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు.

– పత్తిపాక మోహన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com